కుటుంబ నియంత్రణలో సంక్షేమానికి ప్రాధాన్యం
ఈ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా, కుటుంబ నియంత్రణలో భారతదేశం ప్రయాణాన్ని గురించి సమీక్షించుకుని రాబోయే సవాళ్లను పరిష్కరించే విషయంలో మన నిబద్ధతను పునరుద్ఘాటించుకుందాం. ఈ ఏడాది మేలో ఐక్యరాజ్యసమితి జనాభా అభివృద్ధి అంతర్జాతీయ సదస్సు (ఐసిపిడి) తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా భారతదేశం ఐసిపి ఎజెండా అమలులో నాయకత్వ పాత్ర పోషించడమే కాకుండా మెరుగైన కుటుంబ నియంత్రణ, ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడం, ముఖ్యంగా తల్లీపిల్లల ఆరోగ్యం విషయంలో పురోగతిని ప్రదర్శించింది.
భారత్ లో ప్రజలు చిన్న కుటుంబాలను ఎంచుకుంటున్నారు, సగటున ఇద్దరు పిల్లలకు పరిమితమవుతున్నారు. ఈ ధోరణి గత దశాబ్దంలో చోటుచేసుకున్న గణనీయమైన మార్పును ప్రతిబింబిస్తుంది. ఈ కాలంలో సగం కంటే ఎక్కువ మంది మహిళలు (57 శాతం) వారి పునరుత్పత్తి వయస్సులో (15 నుంచి 49 సంవత్సరాలు) ఆధునిక గర్భనిరోధకాలను చురుకుగా ఉపయోగించారు. గర్భనిరోధక సాధనాల విస్తృత వినియోగం భారత్ కుటుంబ నియంత్రణ కార్యక్రమం విజయంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అయితే, కుటుంబ నియంత్రణ పాత్ర మరింత విస్తృతమైనది. ఇది ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి చాలా ముఖ్యం. మహిళలకు హక్కులను, పిల్లలను కనే విషయంలో మహిళల అభీష్టానికి అవకాశం కల్పించడం ద్వారా వారిని సాధికారీకరిస్తుంది. 10-24 సంవత్సరాల వయస్సు గల 36.9 కోట్ల మంది యువతతో భారతదేశం పరివర్తనాత్మక జనాభా మార్పు అంచున ఉంది. అంతేకాకుండా దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణ కార్యక్రమం గణనీయమైన మార్పులకు గురైంది. ఆస్పత్రి ఆధారిత పద్దతుల నుంచి లక్ష్యఆధారిత పద్ధతుల వరకు కుటుంబ నియంత్రణకు వివిధ విధానాలను అవలంబిస్తున్నారు. అలాగే కుటుంబ నియంత్రణ విధానాలను స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. ఈ వైవిధ్యం ప్రజల మారుతున్న అవసరాలకు అనుగుణంగా విధానాల అనుసరణను సూచిస్తుంది.
జాతీయ జనాభా, ఆరోగ్య విధానాలు కుటుంబ నియంత్రణలో ఇప్పటివరకు పరిష్కరించని కొన్ని సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతాయి. వీటిలో ఒకటి పిల్లలు వద్దనుకునే వారు లేదా ఆలస్యంగా కనాలనుకున్నప్పటికీ గర్భనిరోధక సాధనాలను వాడని స్త్రీల అంశం ఒకటి. 2012లో ‘పునరుత్పత్తి, ప్రసూతి, నవజాత, శిశు, కౌమార ఆరోగ్య (ఆర్ఎంఎన్ సిహెచ్ +ఏ) విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు, కుటుంబ నియంత్రణ 2020, ఇప్పుడు కుటుంబ నియంత్రణ 2030 ద్వారా కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వడంతో కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఒక కీలకమైన మైలురాయిని చేరుకుంది. ఇది క్రమంగా ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, సమాచారం, సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, గర్భనిరోధక ఎంపికల పరిధిని విస్తరించడం, అట్టడుగు స్థాయిలో నాణ్యమైన సేవలను అందించడం, అధిక సంతానోత్పత్తి ఉన్న ప్రాంతాల్లో వినూత్న వ్యూహాలను అమలు చేయడంపై దృష్టి సారించింది.
ఒక దేశం వృద్ధి, అభివృద్ధి జనాభా మార్పులతో ముడిపడి ఉంటుంది. జాతీయ స్థాయిలోను, ప్రాంతీయంగాను మరణాల కారణంగా జనాభాలో ఏర్పడే లోటును తగిన స్థాయిలో భర్తీ చేయడం జనాభా విధానాల లక్ష్యం. జాతీయ కుటుంబ సర్వే-5 (2019-21) ప్రకారం భారత్ ఇప్పటికే జాతీయ స్థాయిలో (టీఎఫ్ఆర్ 2.0) లోటు భర్తీ సంతానోత్పత్తి స్థాయిని సాధించింది. అలాగే 31 రాష్ట్రాలు/యుటీలు కూడా ఇప్పటికే ఈ మైలురాయిని చేరుకున్నాయి. కుటుంబ నియంత్రణ మాతాశిశు అనారోగ్యాలు, మరణాలను తగ్గిస్తుందని కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. తల్లీ పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం ఈ కార్యక్రమంలో ప్రధానమైన భాగం. కుటుంబ నియంత్రణ వ్యూహాలు భారతదేశ జనాభా వైవిధ్యానికి అనుగుణంగా ఉండాలి కనుక కొన్ని మార్పులు అవసరం. వివాహ వయస్సు, మొదటి కాన్పు సమయంలో వయస్సు, విద్య వంటి సామాజిక సమస్యలకు కూడా కుటుంబ నియంత్రణ వ్యూహం ప్రాధాన్యమిస్తుంది. దేశం విభిన్న అవసరాలను తీర్చే సమగ్ర కుటుంబ నియంత్రణకు ఈ అంశాలు కీలకం.
ప్రభుత్వ ప్రధాన కుటుంబ నియంత్రణ కార్యక్రమాలలో ఒకటైన మిషన్ పరివార్ వికాస్ (ఎంపివి) 2016ను ఏడు రాష్ట్రాల్లోని (మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అస్సాం) 146 అధిక సంతానోత్పత్తి జిల్లాల్లో గర్భనిరోధకాలు, కుటుంబ నియంత్రణ సేవలను పెంచడం కోసం ప్రారంభించారు. ఈ విధానంలో భాగంగా యువతులకు గర్భనిరోధక సాధనాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఈ విషయంలో సామాజిక అడ్డంకులను పరిష్కరించి, బాధ్యతాయుతమైన మాతృత్వ, పితృత్వ పద్ధతుల గురించి వారికి అవగాహన కల్పించడానికి కొత్తగా పెళ్లయిన జంటలకు నయీ పహెల్ కిట్లను అందించేందుకు సారథి వాహన్లు (చక్రాలపై అవగాహన), కుటుంబ సదస్సులు వంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంపివి జిల్లాల్లో ఆధునిక గర్భనిరోధక సాధనాల వినియోగం పెరగడంతో 2021లో ఏడు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలు, ఆరు ఈశాన్య రాష్ట్రాల్లోకూడా ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా నిరోధ్ లు, గర్భాశయ గర్భనిరోధక పరికరాలు, నోటి ద్వారా తీసుకునే మాత్రలు, ఎంపిఎ ఇంజెక్షన్లు మొదలైన వివిధ రకాల ఆధునిక గర్భనిరోధకాలను అందిస్తున్నారు. వీటి వాడకాన్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నిలిపివేయవచ్చు. ఒక్కొక్క రాష్ట్రంలో రెండేసి జిల్లాలలో చర్మం కింద వాడే ఇంప్లాంట్లు, ఇంజెక్షన్ల రూపంలో గర్భనిరోధకాల పంపిణీని పది రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. వీటిని తర్వాత ఇతర జిల్లాలకు విస్తరించే ఆలోచన ఉంది. “తల్లి, బిడ్డ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం గర్భధారణకు సరైన సమయం, అంతరం” ఈ సంవత్సరం జనాభా దినోత్సవ అంశం. ఈ ఉత్సవాన్ని జరుపుకునేటప్పుడు మనం ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో సహా రాష్ట్రాల్లో నిరంతరం సేవలు అందిస్తున్న క్షేత్ర స్థాయి ఆరోగ్య సిబ్బంది శ్రమను, అంకిత భావాన్ని గుర్తిస్తున్నాం.
గర్భనిరోధక సాధనాలను పొందడంలో ఎదురయ్యే అవరోధాలు, వాటి గురించిన అపోహలు, అవగాహనా రాహిత్యాలను తొలగించేందుకు, భౌగోళిక, ఆర్థిక సవాళ్లు, నిర్బంధ సామాజిక, సాంస్కృతిక ఆంక్షలను అధిగమించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. కుటుంబ నియంత్రణ సేవలను మెరుగుపరచడానికి గణనీయమైన పెట్టుబడులు పెడుతున్నాం. తాత్కాలిక, దీర్ఘకాలిక గర్భనిరోధక సాధనాలు అందించడం, తగిన బడ్జెట్ కేటాయింపులు, ఆరోగ్య కేంద్రాలు, సామాజిక కార్యకర్తల ద్వారా నిరంతర సరఫరాల వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. ఇవిగాక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా కుటుంబ నియంత్రణ సేవలు చివరి మైలు వరకు విస్తరిస్తున్నాం. భారతదేశం జనాభా ప్రయోజనాలను అందుకోవాలంటే తప్పనిసరిగా స్థిరమైన అభివృద్ధి, పట్టణీకరణ, వలసల సమస్యలనే సవాళ్ళను అధిగమించాలి. ఈ అంశాలకు పరిష్కారాలను మా విధానాలతో అంతర్భాగం చేయడం ద్వారా జనాభా వృద్ధిని స్థిరమైన భవిష్యత్తుకు, సర్వజన సంక్షేమానికి ఒక సాధనంగా ఉపయోగిస్తాం. నిర్దిష్ట వ్యూహాల ద్వారా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుని జనాభా వృద్ధి ద్వారా ప్రయోజనాలను సాధిస్తుంది.
ఈ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా, భారతదేశం అంతటా అట్టడుగు, బలహీన వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి, అందరికీ ఉజ్వలమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించాలని ప్రతిజ్ఞ చేద్దాం. జనాభా ప్రయోజనాలను పూర్తిగా పొందగలిగే, ప్రతి పౌరుడు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను కలిగిన, మన ప్రజల ఆరోగ్యం, సంక్షేమం, మన దేశం ప్రగతి, శ్రేయస్సుకు పునాది అయిన భవిష్యత్తు కోసం మనం కృషి చేద్దాం.
జేపీ నడ్డా,
బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి