లగచర్ల నుండే రేవంత్ ప్రభుత్వంపై తిరుగుబాటు
ఒక వంక ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు-2024 పేరిట తాను అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా పెద్దఎత్తున సంబరాలు జరుపుకొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధపడుతుండగా, మరోవంక ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం నుండే రైతులు, గిరిజనులు బలవంతంగా ఫార్మా విలేజి కోసం భూసేకరణకు జరుపుతున్న ప్రయత్నాలపై తిరుగుబాటు జరుపుతున్నారు. పేద ప్రజలు, రైతులను ఏడిపించిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించిన సందర్భాలు లేవు. తన నియోజకవర్గ ప్రజలను ఒప్పించి, వారి అభ్యంతరాలను కనుగొని, వారిని నచ్చచెప్పే ప్రయత్నం చేయకుండా ఉగ్రవాదులపై దాడులు జరిపినట్లు అర్ధరాత్రి పోలీసులను గ్రామాలపైకి పంపి, గోడలు దూకి, తలుపులు బద్దలుకొట్టి, మహిళలను నెట్టివేసి, కొట్టుకుంటూ మగవారిని పోలీసు స్టేషన్ కు తరలించిన దురాగతం దేశమంతా నివ్వెరపోయేటట్లు చేసింది. పైగా, ఫార్మా విలేజ్ కోసం తామేమీ లక్ష ఎకరాలు సేకరించడం లేదని, తొండలు కూడా గుడ్లు పెట్టని 1100 ఎకరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ముఖ్యమంత్రి బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పరిశ్రమలు పెడితే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని ప్రయత్నం చేస్తుంటే కొందరు గూండాలు, రౌడీమూకలను తయారుచేసి, పైసలు ఇచ్చి కలెక్టర్, ఆర్డీవోలు, అధికారులపై ఇష్టం వచ్చినట్టు దాడిచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓట్లేసి గెలిపించి సీఎంను చేస్తే ఇప్పుడు ఏకంగా తొండలు గుడ్లు పెట్టని భూములే సేకరిస్తున్నారని వేములవాడ సాక్షిగా అబద్దాలు పలకడం ఆయనకే చెల్లుబాటయింది. అక్కడకు ఎవరైనా వెళ్లి చూస్తే ప్రతి అంగుళం పచ్చటి పొలాలతో ఉండటం కనిపిస్తుంది. మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలను ఆనుకొని ఉన్న దుద్యాల మండలంలో ఫార్మా క్లస్టర్ కోసం ప్రభుత్వం గుంభనంగా భూసేకరణ ప్రయత్నాలు చేస్తున్నది.
రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నమ్మి బ్యాంకుకు పాసుబుక్కు తీసుకెళ్తే రైతన్నకు గుండె పగిలే ఈ చేదు నిజం బయటపడింది. ‘మీ భూములన్నీ సర్కారు తీసుకుంటుంది. సర్వే నెంబర్లన్నీ బ్లాక్ చేశాం’ అని బ్యాంక్ అధికారులు చెప్పడంతో కంగుతిన్నారు. దానితో 9 నెలలుగా ఆ ప్రాంత రైతులు నిద్రాహారాలు మాని ఆందోళన బాట పట్టారు. తనపై రైతులు దాడి చేయలేదని స్వయంగా కలెక్టర్ చెబుతున్నారు. అయితే, జమ్మూ కాశ్మీర్ లోనో, మరో తీవ్రవాద ప్రాంతంలోనే చేసినట్లు ఇంటర్ నెట్ కనెక్షన్లు ఆపివేసి, విద్యుత్ సరఫరాను నిలిపివేసి, అర్ధరాత్రి పూట గోడలు దూకి, తలుపులు బద్దలు కొట్టి, ఆడవారిని వేధించి, వారి ఛాతీపై చేతులు వేసి భయభ్రాంతులకు గురిచేసి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? రైతులను కరడు గట్టిన తీవ్రవాదులకన్నా దారుణంగా చూడటం విస్మయం కలిగిస్తుంది. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను అమలు పరచడం లేదని ఎక్కడికక్కడ నిలదీస్తున్న రైతుల పట్ల తమ ఆగ్రహావేశాలను ఈ విధంగా వ్యక్తం పరిచారా? తమ వారికి ఫార్మా కంపెనీ కోసం సాగుభూమిని స్వాధీనం చేసుకొని అప్పచెప్పుదామంటే వెళ్లాడని ఎదురు తిరుగుతున్నారని వారి పట్ల కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారా? అర్ధం కావడం లేదు.
రేవంత్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కోసం గిరిజనుల భూమి మాత్రమే ఉందా? ఈ విషయమై ప్రజాభిప్రాయ సేకరణకు ఒక కలెక్టర్, ఇతర అధికారులు వెడితే తగు పోలీస్ బందోబస్తు లేకుండా, ఒక్క పోలీస్ అధికారి కూడా లేకుండా వెళ్లడం ఏమిటి? రైతులు అక్కడ అకస్మాత్తుగా నిరసనలు తెలపలేదు. కొన్ని రోజులుగా భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? ఇటువంటి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భూములను ఇవ్వకూడదనే నిర్ణయంతోనే తాము భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వెళ్ళలేదని, కానీ అధికారులే తమ నిర్ణయానికి వ్యతిరేకంగా గ్రామంలోకి రావడంతో అనుకోని పరిస్థితులలో దాడి జరిగిందని జాతీయ ఎస్‌టి కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ నిజనిర్ధారణకు వచ్చిన సందర్భంగా బాధితులు వాపోయారు. కానీ ఆ అర్ధరాత్రి పోలీసులు తమ గ్రామాలపై పడి విధ్వంసం సృష్టించారని వారు ఆరోపించారు. మగ వారిని ఇష్టం వచ్చినట్లు కొట్టారన్నారు, మహిళలు అని చూడకుండా తమను ఇష్టం వచ్చినట్లు కొట్టారని, తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారని పోలీసుల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీవనాధారమైన భూములను కంపెనీలను ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు గర్హనీయమన్నారు.
నిత్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంగా తీసుకు వస్తుందని రేవంత్ రెడ్డి చెబుతూ ఉంటారు. ఆ పేరుతో ప్రజల ప్రాథమిక హక్కులను అణిచివేసి, వ్యతిరేకించిన వారందరిని జైళ్లలో నింపు నిరంకుశంగా పాలించిన నాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నేడు రాష్ట్రంలో మళ్లీ తీసుకు వస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే తమది ‘ప్రజా పాలన’ అంటూ చెప్పుకొచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పోలీసులతో రాజ్యమేలే ప్రయత్నం చేస్తున్నారు. ఇందిరమ్మపాలన ముసుగులో దళితులు, గిరిజనుల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల భూములు గుంజుకోవడమే ఇందిరమ్మ పాలనా? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. బీఆర్‌ఎఎస్ పాలనలో హైదరాబాద్‌లో ఫార్మాసిటీ కోసం కేసీఆర్ 14 వేల ఎకరాలు సేకరించారు. ఆ భూముల్లో ఫార్మాసిటీ పెట్టకుండా కొడంగల్‌లో రైతుల భూములు సేకరించడం ఎందుకో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫార్మాసిటీ కట్టడం ద్వారా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిన ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేయాలన్న కుట్ర ముఖ్యమంత్రి జరుపుతున్నట్లు స్పష్టం అవుతుంది. పచ్చటి పొలాల్లో రేవంత్‌రెడ్డి పెడుతున్న చిచ్చు చివరకు ఆయననే కాటేస్తుందని గ్రహించాలి. రేవంత్ పాలన కేవలం అదానీ, తన తమ్ముళ్లు, అల్లుళ్లు, బడాబాబుల కోసమేనని స్పష్టం చేసినట్లు అయింది. సొంత నియోజకవర్గం నుండే రేవంత్ రెడ్డిపై ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఇప్పటికైనా దౌర్జన్యాలను, అణచివేత విధానాలను ఆపివేసి, సామరస్యంగా ప్రజలకు నచ్చచెప్పడం ద్వారా పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో ఈ తిరుగుబాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తోందని, మొత్తం ప్రభుత్వ ఉనికికే ముప్పుగా మారుతుందని గ్రహించాలి.
కృష్ణ చైతన్య