Aawas Yojna

మోదీ 3.0: అభివృద్ధి, సంక్షేమాలకు మరింత ఊపు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్ పరివర్తనా పథంలో చైతన్యవంతమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా ఆయన ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన మొదటి 15 రోజులలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్థిక వ్యవస్థలోని విభిన్న రంగాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సంక్షేమ చర్యలను పటిష్టం చేయడం కోసం ఈ రెండు వారాల్లో ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రతిష్టాత్మక గృహనిర్మాణ కార్యక్రమాలు మొదలుకుని ఓడరేవులు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో కీలకమైన పురోగతి వరకు, సమ్మిళిత వృద్ధి, స్థిరమైన అభివృద్ధిని కొనసాగించే విషయంలో మోదీ ప్రభుత్వం తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకుని మున్ముందు అభివృద్ధి మరింత వేగం అందుకుంటుందన్న సంకేతాన్ని ఇచ్చింది.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన విస్తరణ

3 కోట్ల అదనపు గ్రామీణ, పట్టణ గృహాలను నిర్మించడం ద్వారా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పిఎంఏవై)ని మరింత విస్తరించాలన్న మంత్రివర్గ నిర్ణయం దేశ గృహ అవసరాలను తీర్చడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రతి పౌరుడి జీవన నాణ్యతను పెంచాలన్న ప్రభుత్వ తపనను ప్రతిబింబిస్తుంది. సరసమైన, స్థిరమైన గృహ వసతిని అందించడం ద్వారా పిఎంఏవై విస్తరణ గృహవసతి కొరతను తగ్గించడం, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడం, దేశవ్యాప్తంగా కోట్ల కుటుంబాల జీవన ప్రమాణాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చర్య ఆర్థికాభివృద్ధిని పెంపొందించడమే కాకుండా దేశ సామాజిక వ్యవస్థను బలోపేతం చేసి ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వం అంకితభావాన్ని నొక్కి చెబుతుంది.

రాష్ట్రాలకు పన్ను రాబడి పంపిణీ

కేంద్ర ప్రభుత్వం తన పన్ను రాబడి పంపిణీలో భాగంగా జూన్ 2024లో రాష్ట్రాలకు రూ.1.39 లక్షల కోట్లను కేటాయించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మొత్తంలో సాధారణ నెలవారీ బదిలీకి మించిన అదనపు వాయిదా, ప్రస్తుత నెలకు కలిపి మొత్తం రూ.1,39,750 కోట్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభివృద్ధి, మూలధన వ్యయాన్ని మరింత పెంచేందుకు ఈ పెద్ద మొత్తాన్ని విడుదల చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2025 కోసం మధ్యంతర బడ్జెట్ రాష్ట్రాలకు పన్నుల పంపిణీ కింద రూ.12.19 లక్షల కోట్లు కేటాయించింది. ఈ తాజా విడుదలతో జూన్ 10 వరకు 2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు పంపిణీ చేసిన మొత్తం ఇప్పుడు రూ.2.8 లక్షల కోట్లకు చేరుకుంది. ఆర్థిక సంఘం సూత్రం ప్రకారం కేంద్రం పన్ను రాబడిలో 41 శాతం రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయిస్తుంది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తన మొదటి వారణాసి పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం-కిసాన్ పథకం 17వ విడత నిధులను విడుదల చేశారు. 9.26 కోట్ల మంది రైతులకు ఈ మొత్తం రూ.20,000 కోట్లకు పైగా విడుదల చేశారు. ఈ తాజా పంపిణీతో పిఎం-కిసాన్ పథకం కింద అందించిన మొత్తం ప్రయోజనాలు రూ.3.04 లక్షల కోట్లను దాటాయి. 2019లో పథకం ప్రారంభించినప్పటి నుంచి 11 కోట్లకు పైగా అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఈ ప్రయోజనాలు అందాయి.

నలంద పునరుద్ధరణ: విద్యలో భారత్ పునరుజ్జీవనం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే బీహార్‌లోని రాజ్‌గిర్‌లో నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్‌ను ప్రారంభించారు. ఇది భారతదేశ విద్యా వారసత్వం, సాంస్కృతిక సంబంధాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ప్రధాన మంత్రి తన ప్రసంగంలో, నలంద కేవలం ఒక పేరు మాత్రమే కాదని, అంతకంటే ఎక్కువని ఉద్ఘాటించారు. ఈ విశ్వవిద్యాలయం ఒక గుర్తింపు, ఒక గౌరవం, ఒక విలువ, ఒక మంత్రం, ఒక గర్వకారణం, ఒక ప్రస్థానానికి చిహ్నం అన్నారు. ఈ పునరుజ్జీవనం భారత్ స్వర్ణయుగాన్ని తెలియజేస్తుందని, ఈ చారిత్రాత్మక విద్యాసంస్థతో అనేక దేశాల, ముఖ్యంగా ఆసియాలోని దేశాల వారసత్వాన్ని అనుసంధానం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధిని సమతుల్యం చేస్తూ సుస్థిర ప్రగతి సాధనకు భారత్ దీర్ఘకాలంగా అనుసరిస్తున్న నమూనాను ప్రధాని మోదీ ప్రత్యేకంగా నొక్కిచెప్పారు. విద్య, విజ్ఞానానికి ప్రపంచ కేంద్రంగా భారతదేశంమారాలనే తన దృక్పథాన్ని, ప్రపంచంలోనే అగ్రగామి విద్యాకేంద్రంగా దేశాన్ని తిరిగి ప్రతిష్టించాలన్న ఆకాంక్షను ఉద్ఘాటించారు. అత్యంత సమగ్రమైన అధునాతన నైపుణ్యం, పరిశోధన-ఆధారిత ఉన్నత విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడంలో భారత్ నిబద్ధతను కూడా ఆయన నొక్కిచెప్పారు. నలంద విశ్వవిద్యాలయం ప్రపంచ లక్ష్యాల సాధనకు ఒక ముఖ్యమైన కేంద్రంగా ఆవిర్భవిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 17 దేశాల నుంచి ప్రముఖులు హాజరైన ప్రారంభోత్సవం, భారతదేశం, తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు (ఇఏఎస్) దేశాల మధ్య సహకారానికి, అభివృద్ధి, భవిష్యత్తు అవకాశాలకు ప్రతీకగా ప్రధాన మంత్రి ఒక మొక్కను నాటారు.

ఖరీఫ్ పంటలకు గణనీయంగా ఎంఎస్‌పి పెంపు

2024-25 సీజన్‌లో మొత్తం 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల (ఎంఎస్‌పి) పెంపునకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పెంపు ఫలితంగా రైతులు దాదాపు రూ.2 లక్షల కోట్లు ఎంఎస్‌పిగా అందుకుంటారు. గత సీజన్‌తో పోలిస్తే ఇది రూ.35,000 కోట్లు అదనం. రైతులను ఆదుకోవడం, వారి ఆదాయాన్ని పెంపొందించడమనే ప్రధానమంత్రి మోదీ లక్ష్యాల సాధనకు అనుగుణంగా ఈ పెంపు జరిగింది. ముఖ్యంగా, నూనెగింజలైన నైజర్‌సీడ్, నువ్వుల ధరను క్వింటాల్‌కు రూ.983, రూ.632 నుంచి వరుసగా రూ. 8,717, రూ. 9,267కు అత్యధిక స్థాయిలో ఎఎస్పీ పెంచారు. కందిపప్పు వంటి పప్పులకు రూ.550 చొప్పున పెంచి రూ.7,550 వరకు మద్దతుధర ఇస్తున్నారు . వరి ఎంఎస్‌పి క్వింటాల్‌కు రూ.117 పెరిగి ‘కామన్’ గ్రేడ్ రకానికి రూ.2,300కి చేరుకుంది. జొన్నలు, బజ్రా, రాగులు, మొక్కజొన్న వంటి ఇతర తృణధాన్యాల ధరలు కూడా వివిధ స్థాయిల్లో పెరిగాయి. పత్తి ఎమ్‌ఎస్‌పి మధ్యశ్రేణి పింజకు రూ.7,121, పొడుగు పింజ రకాలకు రూ.501 చొప్పున పెంచి రూ.7,521గా నిర్ణయించారు. ఈ ఎఎస్పీ పెరుగుదల ఎఎస్పీని సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్లు నిర్ణయించాలని కేంద్ర బడ్జెట్ 2018-19లో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఉంది. ఉత్పాదక వ్యయం ప్రకారం చూస్తే రైతుకు మిగులు బజ్రాకు అత్యధికంగా 77 శాతం, కందికి 59 శాతం, మొక్కజొన్న కు 54 శాతం, మినులుములకు 52 శాతం, ఇతర పంటలు 50 శాతంగా ఉంటుంది.

మహారాష్ట్రలోని వధావన్‌లో ప్రధాన రేవుకు ఆమోదం

మహారాష్ట్రలోని దహను సమీపంలోని వధావన్ వద్ద ఓడరేవు ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్ వరుసగా 74 శాతం, 26 శాతం వాటాతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ వధవన్ పోర్ట్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తుంది. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితులలో పని చేసే పెద్ద ఓడరేవు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.76,220 కోట్లు. ఇందులో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా భూసేకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతాయి. రేవులు తొమ్మిది కంటైనర్ టెర్మినల్స్, మల్టీపర్పస్ బెర్త్‌లు, లిక్విడ్ కార్గో బెర్త్‌లు, రో-రో బెర్త్, తీరరక్షక దళ బెర్త్‌లతో సహా విస్తృతమైన సౌకర్యాలు ఉంటాయి. ఇవి ఏటా 29.8 కోట్ల మెట్రిక్ టన్నుల సరకుల రవాణాను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం

వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సమగ్ర ప్రాజెక్ట్‌లో కొత్త టెర్మినల్ భవనాన్ని నిర్మించడం, ఆప్రాన్, రన్‌వేలను విస్తరించడం, ఇతర అనుబంధ పనులతో పాటు సమాంతర టాక్సీ ట్రాక్‌ను జోడించడం వంటివి ఉన్నాయి. రూ.2869.65 కోట్ల పెట్టుబడితో, విమానాశ్రయ ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యాన్ని సంవత్సరానికి 39 లక్షల నుంచి 99 లక్షల ప్రయాణికులకు పెంచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ఆఫ్‌షోర్ పవన విద్యుత్తు కోసం రూ.7,453 కోట్ల పథకం

రూ.7,453 కోట్లతో ఆఫ్‌షోర్ పవన విద్యుత్తు ప్రాజెక్టుల కోసం గిట్టుబాటు సహాయం (వీజీఎఫ్) పథకాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ఇందులో గుజరాత్, తమిళనాడు తీరాలలో 1 గిగావాట్ ఆఫ్‌షోర్ పవన విద్యుత్తు వ్యవస్థాపన, ప్రారంభానికి రూ.6853 కోట్లు, ఈ ప్రాజెక్టులకు మద్దతుగా రెండు రేవులను ఆధునికీకరించేందుకు రూ.600 కోట్లు ఖర్చు చేస్తారు. దేశానికి గల విస్తృతమైన సముద్ర పవన విద్యుత్తు సామర్థ్యాన్ని ఉపయోగించుకునే లక్ష్యంతో 2015 నేషనల్ ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ పాలసీని అమలు చేయడంలో ఈ పథకం ఒక ముఖ్యమైన ముందడుగు. విజిఎఫ్ పథకం ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం ద్వారా డిస్కమ్‌లకు ఆఫ్‌షోర్ పవన విద్యుత్తును ఆర్థికంగా లాభదాయకంగా చేస్తుంది.

హిందూ పుణ్యక్షేత్రాల్లో రద్దీని తగ్గించేందుకు రూ.500 కోట్లు

ఒరిస్సాలోని ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం జగన్నాథ ఆలయంలో ఒకే ద్వారం ద్వారా ప్రవేశాన్ని పరిమితం చేయడం వల్ల భక్తులు చాలా కాలంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంలోని రద్దీని తగ్గించడానికి, సులభతరం చేయడానికి నాలుగు ద్వారాలను తెరవాలనే డిమాండ్లు వచ్చాయి. వీటికి స్పందించిన మాఝీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఒక ముఖ్యమైన ముందడుగు వేసింది. ఈ నిధిని తక్షణ అవసరాలను తీర్చడానికి, ఆలయం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు భక్తులకు మరిన్ని సౌకర్యాలను కల్పిస్తారు.

ఇస్రో పునర్వినియోగ వాహనం ‘పుష్పక్’ విజయం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ‘పుష్పక్’ పేరుతో పునర్వినియోగ ప్రయోగ వాహనం (ఆర్ఎల్వి) ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేయడంతో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఈ విజయం పునర్వినియోగ అంతరిక్ష రవాణా సాంకేతికతలో భారత్ కీలకమైన ముందడుగును సూచిస్తుంది. అంతరిక్షంలోకి ఉపగ్రహాలు మొదలైన వాటిని చౌకగా ప్రయోగించేందుకు ఈ పునర్వినియోగ ప్రయోగవాహనాలను అభివృద్ధి చేస్తున్నాం. పుష్పక్ విజయం పెరుగుతున్న ఇస్రో నైపుణ్యానికి, అంతరిక్ష పరిశోధన సామర్థ్యాలకు అద్దం పడుతుంది.

పబ్లిక్ పరీక్షలు (అక్రమాల నిరోధక ) చట్టం, 2024

‘పబ్లిక్ పరీక్షలు (అక్రమ మార్గాల నిరోధక) చట్టం, 2024’ జూన్ 21, 2024 నుంచి అమలులోకి వచ్చింది. మొదట 9 ఫిబ్రవరి 2024న దీన్ని పార్లమెంటు ఆమోదించింది. ఆపై 12 ఫిబ్రవరి 2024న రాష్ట్రపతి ఆమోదం పొందింది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఇటీవలి నోటిఫికేషన్ జారీ చేసే వరకు చట్టం నిద్రాణంగా ఉంది. ప్రశ్నపత్రం లీక్‌లు, అభ్యర్థులకు అనధికార సహాయం, పబ్లిక్ పరీక్షల సమయంలో కంప్యూటర్ సిస్టమ్‌లను ట్యాంపరింగ్ చేయడం వంటి అక్రమాలపై కఠిన చర్యలకు ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. అటువంటి అక్రమాలకూ పాల్పడిన వ్యక్తులు, సంస్థలు ఈ కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటారు.

భూగర్భ బొగ్గు వాయుకరణ పైలట్ ప్రాజెక్ట్‌

బొగ్గు మంత్రిత్వ శాఖ జార్ఖండ్‌లో భూగర్భ బొగ్గు వాయుకరణ (యుజిసి) కోసం దేశంలో తొలి ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఇది దేశ బొగ్గు రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ మార్గదర్శక ప్రాజెక్టు క్షేత్రస్థాయి బొగ్గు వాయుకరణ సాంకేతికను ఉపయోగించడం ద్వారా బొగ్గు పరిశ్రమను మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ ద్వారా బొగ్గు మీథేన్, హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్ , కార్బన్ డయాక్సైడ్ వంటి విలువైన వాయువులుగా మార్చుతారు. ఈ వాయువులు వివిధ పారిశ్రామిక అవసరాలను తీరుస్తాయి. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. పైలట్ ప్రాజెక్ట్ ఇంధన ఉత్పత్తి, సుస్థిర వనరుల వినియోగంలో భారత్ నిబద్ధతను నొక్కి చెబుతుంది. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన మొదటి 15 రోజుల్లో మౌలిక సదుపాయాలు, సంక్షేమంలో ధైర్యమైన, పరివర్తనాత్మక కార్యక్రమాలు చేపట్టారు. గృహనిర్మాణ ప్రాజెక్టులను విస్తరించడం, ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను పెంచడం మొదలుకుని చారిత్రక విద్యాసంస్థలను పునరుద్ధరించడం, పునరుత్పాదక ఇంధనాన్ని అభివృద్ధి చేయడం వరకు సమ్మిళిత వృద్ధి, స్థిరమైన అభివృద్ధి పట్ల తన అచంచల నిబద్ధతను మోదీ ప్రభుత్వం ప్రదర్శించింది.

కిషోర్ ఉపాధ్యాయ