Hamara Sankalp Vikasit Bharat

ముస్లిం లీగ్, నక్సల్స్ ఎజెండా, దగాకోరు వాగ్దానాలతో కాంగ్రెస్ మ్యానిఫెస్టో

2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో జరిగిన కుంభకోణాలు, బాంబుదాడులు, అస్తవ్యస్థమైన ఆర్థిక విధానాలు, మహిళలపై దారుణాలతో విసిగిన యావత్ దేశ ప్రజానీకం 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఘనవిజయం ఇచ్చింది. అప్పటి నుంచి దశాబ్ద కాలంగా యావత్ ప్రపంచం మెచ్చుకునేలా జరిగిన అభివృద్ధి, సంక్షేమ, సురక్ష, పారదర్శక పాలనతో ఇప్పుడు జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ 400 పైగా స్థానాలను అందులో బిజెపి 370 పైగా స్థానాలు ఆశిస్తున్న సందర్భంలో నిరాశ నిస్పృహతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ నాయకత్వలేమి, విభేదాలతో సతమతమవుతున్న ఇండీ కూటమి దేశ ప్రజలను మభ్య పెట్టడానికి ఎన్నో ఎత్తులను, జిత్తులను, కుట్రలను, కుతంత్రాలను ఎంచుకుంది. అందులో ఒకటి అత్యంత ప్రమాదకరమైన కాంగ్రెస్ మ్యానిఫెస్టో.

అధికారం కాదు కదా, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్న భయంతో మతోన్మాద, జిహాదీ, హింసోన్మాద నక్సల్స్ ఎజెండాలతో అరచేతిలో స్వర్గం చూపిస్తున్నట్టు అసాధ్యమైన ఆర్థిక హామీలతో దేశ ప్రజలను దగా చేసేందుకే కాంగ్రెస్ ఈ మ్యానిఫెస్టో తీసుకొచ్చింది. పేరుకు న్యాయపత్రం అని చెప్పుకున్నా 1929లో ముస్లిం లీగ్ మత ప్రాతిపదిక రిజర్వేషన్ డిమాండ్ ను, సమున్నత భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44కు వ్యతిరేకంగా మతప్రాతిపదిక ప్రత్యేక పౌర చట్టాలను, ప్రపంచంలో అత్యధిక జీడీపీ వృద్ధి రేటుతో భారత్ అభివృద్ధి చెందుతున్న సమయంలో దేశ ఆర్థిక మూలాలను చిన్నాభిన్నం చేసే కుట్రలతో పరోక్షంగా ‘సంపద పంచుతాం’ అన్న హామీలను గుప్పిస్తోంది. భారతీయులు కష్టపడి సంపాదించిన సంపాదనను రోహింగ్యాలు, బంగ్లాదేశ్ ముస్లింల వంటి మతోన్మాద చొరబాటుదారులకు పంచుతామన్న నర్మగర్భ హామీలు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దేశ సంపదను పెంచుతాం, దేశాన్ని అభివృద్ధి చేస్తాం, కష్టపడి పని చేసే వారందరికి అవకాశం కల్పిస్తామన్న విధానాలు కాకుండా ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న జెరూసలెంకు రూ.60వేలు, మక్కా యాత్రకు రూ.30వేలు, పాస్టర్ లు, మాల్వీలకు నెలకు రూ.10వేలు లాంటి హామీలతో ఎన్నికలకు వెళ్లడం కాంగ్రెస్ హిందూ వ్యతిరేకతకు నిదర్శనం.

గత 10 సంవత్సరాల అభివృద్ధి, సంక్షేమం మరింత వేగంగా కొనసాగిం వచ్చే 5 సంవత్సరాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో స్థానంగా, 2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాలతో బిజెపి సంకల్ప పత్రం విడుదల చేసింది. ఇల్లు లేని ప్రతి పేదకు పక్కా ఇల్లు, పేదలతో సహా 70 ఏళ్లు పైబడ్డ వారందరికీ ఆరోగ్య బీమా, మరిన్ని ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ లతో ప్రజలకు అందుబాటులో నాణ్యమైన విద్య, వైద్యం, ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనతో ప్రతి ఇంటికి పర్యావరణహిత సోలార్ ఎనర్జీ లాంటి లక్ష్యాలు బిజెపి సంకల్ప పత్రంలో ఉన్నాయి. కులమత చిచ్చులు, ప్రాంతీయ విభేదాలు, కమ్యూనిస్టు తరహా వర్గపోరు సమస్యలు, దేశద్రోహ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోనే ఉంటాయి కానీ, బిజెపి మ్యానిఫెస్టోలో ఉండవు.

మన సమర్థ ప్రధాని, బిజెపి సర్వోన్నత నేత మోదీతో సహా బిజెపి నాయకులు అందరూ దేశ విచ్ఛిన్నకర మతోన్మాద హింసోన్మాద కాంగ్రెస్ మ్యానిఫెస్టోను దేశ ప్రజల ముందు బట్టబయలు చేయడంలో సఫలమవుతున్నారు. యావత్ దేశం ఇప్పుడు మోదీ గ్యారెంటీలను విశ్వసిస్తున్నది. కాంగ్రెస్ లాంటి మతోన్మాద మ్యానిఫెస్టోలను తిరస్కరిస్తున్నది.

తెలంగాణలో బిజెపికి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెసేతర పార్టీలైన బీఆర్ఎస్, ఎంఐఎంలది కూడా ఇదే మతోన్మాద ఎజెండా. ఈ మూడు పార్టీలు- కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం  అంతర్గత పొత్తులతో బూటకపు వాగ్దానాలతో కేవలం బిజెపిని ఓడించే లక్ష్యంతో ఈ ఎన్నికల్లో పని చేస్తున్నాయి. తెలంగాణ బిజెపితో సహా జాతీయ నాయకత్వం కూడా వచ్చే 15 రోజుల్లో తెలంగాణ ప్రజల ముందు కాంగ్రెస్ నిజ రూపాన్ని స్పష్టంగా ఉంచబోతుంది. యావత్ దేశంతో సహా తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమ లక్ష్యం గల బిజెపి ఒకవైపు, మతోన్మాద హింసోన్మాద కులచిచ్చు గల ఇతర పార్టీలు మరోవైపు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల్లో బిజెపి సమర్థ అభ్యర్థులను 15 రోజుల ముందే ప్రకటించి విజయ సంకల్పంతో ప్రజల ముందుకు వచ్చింది. బిజెపిపై పోరాడేందుకు టికెట్ల పంపకంలో తలమునకలైన కాంగ్రెస్, ప్రజలను ఎలా ఓట్లడగాలన్న పరేషాన్ తో బీఆర్ఎస్… ఎంఐఎంతో కలిసి పని చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కొట్లాట డ్రామాలు ముందుముందు కూడా కొనసాగనున్నాయి. తెలంగాణ ప్రజలకు 17 లోక్ సభ స్థానాల్లో బిజెపి అభ్యర్థులు ఏకైక చాయిస్ గా కనిపిస్తూ ఉండడంతో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అత్యధిక స్థానాలు గెలుస్తుందనడంలో సందేహం లేదు.