Modi Hatrick

ఎన్డీఏ హ్యాట్రిక్… మళ్లీ మోదీకే పగ్గాలు

కాంగ్రెస్ సహా ఇండీ కూటమి కుట్రలు, కుతంత్రాలకు చెక్ పెడుతూ… ఫేక్ వీడియోలతో బిజెపిపై, మోదీపై చేసిన విష ప్రచారాన్ని దీటుగా ఎదుర్కొని.. రిజర్వేషన్లు తొలగిస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారన్న అబద్ధపు ప్రచారంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసినా, అలవికాని హామీలతో మభ్య పెట్టాలని చూసినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారం నిలబెట్టుకుంది. విపక్ష ఇండీ కూటమి కలలను కల్లలుగా మారుస్తూ.. 293 సీట్లు సొంతం చేసుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ భాగస్వామ్య పక్షాలతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరో ఐదేళ్ల పాటు దేశాన్ని పాలించనుంది. వరుసగా మూడుసార్లు గెలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యాట్రిక్ సాధించారు. దేశ స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో జవహర్ లాల్ నెహ్రూ హ్యాట్రిక్ సాధిస్తే… ఆ తర్వాత హ్యాట్రిక్ విక్టరీస్ కొట్టిన ఏకైక ప్రధానిగా నరేంద్ర మోదీ ఘనత వహించారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 30 వరకు 7 దశల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడ్డాయి.

యావత్‌ భారతావనిని ఉత్కంఠతో ఊపేసిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి బిజెపిదే పైచేయి అయింది.  వరుసగా రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీగా సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి, పైగా ప్రభుత్వ సానుకూలతతో బిజెపి 240 సీట్లను సాధించింది. ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా అవతరించింది. విరోధులంతా ఒక్కటైనా ఇండీ కూటమి ఈ ఎన్నికల్లో బిజెపికి వచ్చినన్ని సీట్లు కూడా గెలవలేకపోయారు. కేవలం 233 స్థానాలకే పరిమితమైంది. బిజెపి గెలిచిన దాన్లో సగం కన్నా చాలా తక్కువగా 99 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. 37 స్థానాలతో సమాజ్ వాది పార్టీ, 29 స్థానాలతో తృణమూల్ కాంగ్రెస్, 22 స్థానాలతో డీఎంకే ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఎన్డీఏ పక్షాల్లో  టీడీపీ 16, జేడీ(యూ) 12, శివసేన శిండే వర్గం 7, ఎల్జేపీ 5, జేడీ(ఎస్), రాష్ట్రీయ లోక్ దళ్, జనసేన 2 సీట్ల చొప్పున, హిందూస్థానీ అవామీ మోర్చా, ఆర్ఎస్పీ, ఎన్సీపీ, సిక్కిం క్రాంతికారి మోర్చా, ఏజేఎస్యూ, అసోం గణపరిషత్ ఒక్క సీటు చొప్పున గెలుచుకున్నాయి.

ఎప్పట్లాగే మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో బిజెపి పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మధ్యప్రదేశ్‌లోని 29 స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేసింది. గుజరాత్‌లో 25 చోట్ల జయభేరి మోగించింది. ఒడిశాలో ఏకంగా 20 స్థానాలను తన ఖాతాలో వేసుకొని ఔరా అనిపించింది. దేశ రాజధాని దిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో అన్నింటిని బిజెపి గెలుచుకొని హ్యాట్రిక్‌ కొట్టింది. హిమాచల్‌ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్‌ కూడా ఆ పార్టీకే జైకొట్టాయి. బిహార్‌లో బిజెపి 12 సీట్లతో సత్తాచాటింది. దక్షిణాదిలో 28 స్థానాలున్న కర్నాటకలో 17 సీట్లలో విజయం సాధించింది. తెలంగాణలో 4 నుంచి 8 ఎంపీలకు బలం పెంచుకుంది. కాంగ్రెస్, వామపక్షాలకు కంచుకోటలాంటి కేరళలో తొలిసారి బిజెపి ఖాతా తెరిచింది.

అయితే దేశంలోకెల్లా అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో, తనకు పట్టున్న రాజస్థాన్‌లో మాత్రం సీట్ల సంఖ్య తగ్గింది. 2019లో 62 సీట్లు గెల్చుకున్న యూపీలో ఈసారి 33 స్థానాలకు పరిమితమైంది. రాజస్థాన్‌లో మొత్తం 25 సీట్లు ఉండగా.. 14 చోట్ల గెలిచింది. పశ్చిమ బెంగాల్ లో ఈ ఎన్నికల్లో బిజెపి 12 సీట్లకే పరిమితమైంది. గతంలో గెలిచిన 18 కంటే 6 స్థానాలను తక్కువగా గెలిచింది. గత ఎన్నికల్లో హర్యానాలో క్లీన్ స్వీప్ చేసిన బిజెపి ఈసారి సగం స్థానాలు 5 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహారాష్ట్రలో ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం), శివసేన (శిందే వర్గం)లతో జట్టు కట్టిన బిజెపికి ఆశించిన ఫలితాలు దక్కలేదు. బిజెపికి గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లను రద్దుచేస్తారని ప్రతిపక్షాలు చేసిన ప్రచార ప్రభావం ఎస్సీ, ఓబీసీలు అధికంగా ఉండే ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌లపై పడినట్టు కనిపిస్తోంది.

కొత్త ప్రాంతాలకు కమలం

Modi NDA meetingఈసారి మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు బిజెపిను ఎక్కువ ఆదరించి, క్రితంసారి కంటే ఎక్కువ సీట్లను కట్టబెట్టాయి. మధ్యప్రదేశ్‌లో గత రెండు ఎన్నికల్లో సాధ్యంకాని 100% ఫలితాలను ఈసారి సాధించి ఆ రాష్ట్రంపై కాషాయదళం మరోసారి పట్టు సాధించింది. దిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపురల్లో క్రితంసారి ఉన్న సీట్లను చేజిక్కించుకొని అక్కడి రాజకీయాలపై పట్టును నిలుపుకొంది. కేరళలో బోణీకొట్టి అసాధ్యం అనుకున్న చోట అడుగుపెట్టగలిగింది. ఎస్టీలు అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో క్రితంసారి కంటే ఒకసీటు అధికంగా గెలుచుకొని పైచేయి సాధించింది.

1962 తర్వాత ఒకే కూటమికి వరుసగా మూడోదఫా అధికారం అప్పగించడం ఇదే తొలిసారి. ప్రజలు బిజెపి, ఎన్డీయేలపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. పదేళ్ల క్రితం మార్పు కోసం దేశం తీర్పు ఇచ్చింది. ప్రజలు అప్పగించిన పనిని బాధ్యతాయుతంగా నిర్వర్తించడంతో రెండోసారి గెలిపించారు. గత అయిదేళ్ల కృషిని వివరించడంతో 2024లోనూ మరోసారి ఎన్డీయేను ఆశీర్వదించారు. మూడోదఫా ప్రభుత్వం భారీ నిర్ణయాలతో దేశంలో సరికొత్త అధ్యాయాన్ని రచిస్తుంది. సమాజంలోని ప్రతి వర్గాన్ని అభివృద్ధి చేయడమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యం. ప్రపంచంలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు పూర్తి శక్తితో పని చేయనుంది. అవినీతిని కూకటివేళ్లతో సహా పెకిలించివేయడమే ప్రాధాన్యంగా పని చేయనుంది.

Blurbవిశ్వాసం కోల్పోతున్న కాంగ్రెస్

తాజా సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి 36.6 శాతం ఓట్లు సాధించింది. 2019లో నమోదైన 37.3 శాతంతో పోలిస్తే తగ్గింది 0.7 శాతం మాత్రమే. కాంగ్రెస్‌ క్రితం ఎన్నికల్లో 19.5 శాతం ఓట్లు సాధిస్తే, ఈసారి 21.2 శాతం ఓట్లను కైవసం చేసుకుంది. అంటే 1.7 శాతం ఓట్లు పెరిగాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోనూ ఎన్డీయేకు ఘన విజయం దక్కింది. అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కింలలో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయింది. ఒడిశాలో తొలిసారి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గడ్, దిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో బిజెపి దాదాపు క్లీన్‌స్వీప్‌ చేసింది. కర్నాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీల హామీలతో ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినా, వాటి అమలులో జరిగిన వైఫల్యం వల్ల ప్రజలు మెల్లమెల్లగా కాంగ్రెస్ ను దూరం పెడుతున్నారు. ఆప్‌ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లయింది. విపక్ష ‘ఇండియా’ కూటమిలో పక్షంగా మొత్తం 22 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం మూడు స్థానాలే దక్కించుకుంది. ఆ మూడూ పంజాబ్‌(13)లోనే కావడం గమనార్హం. మిగతా రాష్ట్రాలైన దిల్లీలో 4, గుజరాత్‌లో 2, అస్సాంలో 2, హరియాణాలో ఒకచోట పోటీ చేసినా.. ఖాతా మాత్రం తెరవలేకపోయింది.

తటస్థ పార్టీలకు షాక్‌

లోక్‌సభ ఎన్నికలు ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య సాగడంతో తటస్థ పార్టీలకు షాక్‌ తగిలింది. ఏ కూటమిలోనూ చేరకుండా ఒంటరిగా పోటీ చేసిన పార్టీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇందులో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బీఎస్పీ, తెలంగాణలోని బీఆర్ఎస్, ఒడిశాలోని బిజూ జనతాదళ్, ఆంధ్రప్రదేశ్‌లోని వైకాపా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా అత్యధికంగా 488 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ ఒక్క సీటూ గెలవలేదు. 2019లో సమాజ్‌వాదీతో పొత్తు పెట్టుకుని 10 సీట్లను సాధించింది. ఒడిశాలో 21 సీట్లలో పోటీ చేసిన బిజూ జనతాదళ్‌ ఒక్క చోటా విజయం సాధించలేదు. 2019లో ఆ పార్టీ 12 సీట్లలో గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా కేవలం నాలుగు సీట్లలోనే విజయం సాధించింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ 22 చోట్ల గెలిచింది. తెలంగాణలోని 17 సీట్లలో పోటీ చేసిన బీఆర్ఎస్ ఒక్క సీటూ గెలవలేదు. 2019లో ఆ పార్టీ 9 చోట్ల విజయం సాధించింది.