Hamara Sankalp Vikasit Bharat
Phone Tapping

రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులపైనే కాకుండా సొంత మంత్రులపై, పార్టీ నేతలపై, చివరకు ప్రైవేట్ వ్యక్తుల ఆర్థిక లావాదేవీలపైనా తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు వెల్లడవుతోంది. హుజురాబాద్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడవుతోంది. తమ సామాజిక వర్గానికి చెందిన అధికారులతో ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ అధిపతులు తమ స్వప్రయోజనాలకు ఈ వ్యవస్థను సృష్టిస్తే, అధికారులు ప్రైవేట్ వ్యక్తుల నుండి కోట్లాది రూపాయలను కొల్లగొట్టేందుకు, లైంగిక వేధింపులకు పాల్పడేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది.కేంద్రం నుండి ముందస్తు అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం తీవ్రమైన నేరం. ఇందులో దేశ భద్రతకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాల కట్టడి కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక నిఘా విభాగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసినట్టు స్పష్టం అవుతుంది. సీబీఐ చేత విచారణ జరిపిస్తే గాని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. అప్పుడే అసలైన నిందితులను చట్టం ముందు నిలబెట్టే అవకాశం ఉంటుంది. విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కీలక సూత్రధారిగా పోలీసులు నిర్ధారించారు. ప్రభాకరరావు ఉద్యోగ విరమణ చేసిన అనంతరం ఈ కీలక పోస్టులో దీర్ఘకాలం కొనసాగించడం గమనార్హం. ప్రస్తుత కాంగ్రెస్ హయాంలోనూ వైద్య చికిత్స కోసం ప్రభుత్వ వ్యయంతో ఆయన అమెరికాకు వెళ్లారని చెబుతున్నారు. 

ఫోన్ ట్యాపింగ్ తో సొంత ఎమ్యెల్యేలను బ్లాక్ మెయిల్ చేసి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బిజెపిని బద్నాం చేసేందుకు ఎమ్యెల్యేల కొనుగోలు ఎపిసోడ్ సృష్టించినట్టు స్పష్టమవుతోంది. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమి చేయబోతోందనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. అసలైన నిందితులను చట్టం ముందు తీసుకు రావాలనే చిత్తశుద్ధి ఉంటే సీబీఐకి అప్పగించేవారు. కానీ అటువంటి ప్రయత్నం చేయడం లేదు. బీఆర్ఎస్ నేతలను ‘‘బ్లాక్ మెయిల్’’ చేసేందుకు దీనిని ఉపయోగించుకుంటారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇందులో నిందితులైన పలువురు అధికారులను అప్రూవర్లుగా మార్చుకుని, వారికి ఎటువంటి శిక్ష పడకుండా వదిలివేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కేసు బలపడేందుకు తగిన సాక్ష్యాధారాల కోసమే అప్రూవర్లుగా కొందరిని మారుస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. మరోవంక, బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎంఎల్‌ఎలు, ఇద్దరు ఎంఎల్‌సిల ప్రమేయంపై ఆధారాలు లభించినట్లు చెబుతున్నారు. ఇవన్నీ లోక్ సభ ఎన్నికల ముందు నోరుమెదపకుండా బీఆర్ఎస్ నేతలను కట్టడి చేసే వ్యూహమా? అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇప్పటివరకు నాలుగు నెలల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చర్యలను ఎండగట్టే విషయంలో మాటలు తప్ప కార్యాచరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రదర్శించిన సందర్భం లేదు. అందుకనే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సైతం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందనే అభిప్రాయం బలపడుతుంది.

కృష్ణ చైతన్య