BJP Sankalp Patr

సంకల్ప్ పత్ర 2024: సాధికారతకు బిజెపి హామీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించారు. ఇతర పార్టీల మాదిరిగా కాకుండా పార్టీ దీనికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. మిగతా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలోనే ప్రణాళికల గురించి మాట్లాడతాయి. కానీ బిజెపి ఎన్నికల తర్వాత కూడా నిరంతర నిబద్ధతతో మేనిఫెస్టో అమలుకు కృషి చేస్తుంది. ఇది పార్టీ పాలనా తత్వాన్ని వివరించడమే కాకుండా దేశ భవిష్యత్తుకు సంబంధించిన వ్యూహాత్మక దార్శనికతను కూడా అందిస్తుంది. ఇవి కేవలం ఎన్నికల హామీలు కాదు, జాతీయ పునరుజ్జీవనం, సైద్ధాంతిక స్థిరత్వం, నాగరికత పునరుజ్జీవనం పట్ల గాఢమైన నిబద్ధతకు ప్రతిబింబాలు. పార్టీ మేనిఫెస్టోయే అందుకు నిదర్శనం. 

బిజెపి దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా లేని సమయంలోనే పార్టీ భారతదేశాన్ని అణుశక్తి దేశంగా మార్చడం, అధికరణం 370 రద్దు, ట్రిపుల్ తలాక్ నిషేధం, రామమందిర నిర్మాణం వంటి హామీలు ఇచ్చింది. చివరికి వాటన్నిటినీ నెరవేర్చింది కూడా. ‘సంకల్ప్ పత్ర 2024’ పార్టీ అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న స్వల్పకాలిక విధాన చర్యలను, పథకాలను వివరిస్తుంది. దేశం సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం నిర్దేశించుకున్న విస్తృత లక్ష్యాలతో వీటిని సాఫీగా అనుసంధానిస్తుంది. ఇది పరివర్తనాత్మక పాలన, మెరుగైన సంక్షేమ నమూనాల పట్ల పార్టీ నిబద్ధతను ప్రతిబింబించడమే కాకుండా, భారతదేశ భవిష్యత్తు కోసం ఒక పొందికైన మార్గాన్ని సూచిస్తూ, ప్రస్తుత ప్రణాళికలు, దీర్ఘకాల దార్శనికతల మధ్య సమన్వయాన్ని కూడా వివరిస్తుంది.

ఇది ప్రతిపక్ష కూటమి సంక్షేమం గురించి చెప్పే డొల్ల మాటలు, వాగ్గానాలకు పూర్తిగా భిన్నం. భారత రాజకీయాలు, సామాజిక-ఆర్థిక సవాళ్లకు సంబంధించి బిజెపి విభిన్న వైఖరిని ఇది నొక్కి చెబుతుంది. ప్రతిపక్ష కూటమి కాలం చెల్లిన సామ్యవాద సంక్షేమ నమూనాను పునరుద్ధరించడానికి కట్టుబడి ఉంది. అది దానిలో చిన్నచిన్న మార్పులు చేసి ప్రత్యక్ష నగదు బదిలీ హామీలతో అలవికాని, నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేసి ఆర్థిక వ్యవస్థపై పెనుభారం మోపుతోంది. ప్రతిపక్షాల తాయిలాల నమూనా కాకుండా, మానవ మూలధనంలో పెట్టుబడులు పెట్టడం, ప్రజలకు అవకాశాల పరిధిని విస్తరించడం బిజెపి విధానం. ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపే బాధ్యతారహితమైన హామీలు కాకుండా, సామర్థ్య నిర్మాణానికి చేయూతనివ్వడం ద్వారా పేదలకు సాధికారత కల్పించడాన్ని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

బిజెపి విధానాలు నిర్దిష్ట ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. వీటికి తగిన నిధుల కేటాయింపుల ద్వారా ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పేదలకు చౌకధరలో గృహాలకు హామీ ఇస్తుంది. ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన గృహాలకు విద్యుత్తు అందిస్తుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన వంటగ్యాస్ సిలిండర్లను అందిస్తుంది. హర్ ఘర్ జల్ యోజన గృహాలకు పైపుల ద్వారా తాగునీటిని అందిస్తుంది. స్వచ్ఛ భారత్ అభియాన్ పారిశుధ్యాన్ని అందిస్తుంది. ప్రైవేట్ వస్తువులను, సేవలను అణగారిన వర్గాల ప్రాథమిక అవసరాలను తీర్చడానికి అందించి వారు మెరుగైన భవిష్యత్తు కోసం పాటు పడేటట్టు చేయడమే వీటన్నిటి లక్ష్యం. 

ఎల్ఫీజి సిలిండర్లు, మరుగుదొడ్లు, సురక్షితమైన నల్లా నీటిని అందించడం వల్ల వ్యాధుల భారం గణనీయంగా తగ్గుతుంది. దీనివల్ల సహజంగానే అనారోగ్యాల వల్ల వ్యక్తులపై, కుటుంబాలపై పడే ఆర్థిక భారం తగ్గుతుంది. ఇవి మహిళలను కష్టాల నుంచి విముక్తి చేసి వారు ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొని మహిళా వ్యవస్థాపకత, స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల నుంచి లబ్ధి పొందేందుకు వీలు కలుగుతుంది. 

ప్రతి మహిళకు లక్ష రూపాలు నగదు బదిలీ వంటి అమలుకు సాధ్యం గాని వాగ్దానాలు చేయడానికి బదులుగా సంకల్ప్ పత్ర మహిళల స్వావలంబన కోసం ఇప్పటికే చేస్తున్న ప్రయత్నాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తుంది. మూడు కోట్ల మంది లఖ్‌పతి దీదీలను అంటే కుటుంబ వార్షిక ఆదాయం రూ.1 లక్ష ఆర్జించే స్వయం సహాయక గ్రూపు సభ్యులుగా, తీర్చిదిద్దుతామని వాగ్దానం చేసింది. ఇప్పటికే ఆజీవిక యోజన కింద తొమ్మిది కోట్ల మంది మహిళలను 83 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలుగా సంఘటితం చేశారు. గత మూడేళ్లలో 2.78 కోట్లకు పైగా మహిళలు (34 శాతం) సంఘటితమయ్యారు. తొమ్మిది కోట్ల మందికి పైగా గ్రామీణ మహిళలు ఇప్పటికే లఖ్‌పతి దీదీలుగా మారారు.

ఉచిత విద్యుత్తు హామీ ఆకర్షణకు లొంగిపోకుండా, సంకల్ప్ పత్ర 2024 ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ ద్వారా పరివర్తనాత్మక విధానాన్ని వాగ్దానం చేస్తుంది. ఇది పైకప్పు సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటును సులభతరం చేస్తుంది. ఈ కార్యక్రమం గృహ విద్యుత్ ఖర్చులను తగ్గించడమే కాకుండా, మిగులు విద్యుత్‌ను తిరిగి గ్రిడ్‌కు అమ్మడానికి కుటుంబాలను అనుమతించడం ద్వారా ఆదాయం పొందడానికి అవకాశాలను కూడా కల్పిస్తుంది. ఇటువంటి వ్యూహం మొత్తం సౌరశక్తి రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా ఈ యూనిట్ల సర్వీసు, మరమ్మతుల రూపంలో చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ప్రజాకర్షక తాయిలాల రాజకీయాల ద్వారా విద్యుత్ సంస్థలు, ప్రభుత్వ బడ్జెట్‌లపై భరించలేని ఆర్థిక ఆర్థిక భారం మోపే పద్దతికి ఇది పూర్తిగా భిన్నం. 

ఈ చర్యలు ప్రజల ఉత్పాదకతను మెరుగుపరుస్తాయి, వారికి గౌరవాన్ని, సురక్షితమైన భవిష్యత్తును అందిస్తాయి. దీర్ఘకాలిక సాధికారత కంటే స్వల్పకాలిక ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆప్ ప్రోత్సహిస్తున్న ఉచితాల సంస్కృతికి బిజెపి విధానం పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ప్రతిపక్షాల మేనిఫెస్టో ప్రజలు ప్రభుత్వంపై, రాజకీయ నాయకులపై శాశ్వతంగా ఆధారపడేటట్టు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ సంకల్ప్ పత్ర 2024 స్వావలంబన (ఆత్మనిర్భర్తత), సంపద సృష్టికి ప్రాధాన్యమిస్తుంది. ఉదాహరణకు వ్యవసాయ రంగాన్నే తీసుకుంటే ప్రతిపక్షాలు కేవలం కనీస మద్దతు ధరలకు హామీ ఇవ్వడానికే పరిమితం అయ్యాయి. కానీ రైతులు, వ్యవసాయ కార్మికుల ఆదాయాన్ని పెంచడానికి ఈ రంగాన్ని ఆధునికీకరించడం, వైవిధ్యపరచడం లక్ష్యంగా బిజెపి సమగ్ర వ్యూహాన్ని అవలంబిస్తుంది. అంతేకాకుండా, పర్యావరణ రక్షణ, కార్మికుల సంక్షేమం మధ్య సున్నితమైన సమతుల్యతను కొనసాగించడం ద్వారా భారతదేశాన్ని ఒక బలమైన ఉత్పత్తి కేంద్రంగా మార్చాలని బిజెపి భావిస్తోంది. భారతదేశాన్ని పారిశ్రామికీకరించి, సామూహిక సౌభాగ్యాన్ని సృష్టించడం ద్వారా పాలనలోను, స్వాతంత్ర్యానంతరం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరించిన సామ్యవాద విధానాల వల్ల దేశంలో చోటు చేసుకున్న పారిశ్రామిక క్షీణత, కోల్పోయిన అవకాశాలను తిరిగి అందుకోవాలని బిజెపి ఆశిస్తోంది. 

ఉన్నతమైన, స్థిరమైన, విశాల ప్రాతిపదిక గల, స్థిరమైన ఆర్థిక వృద్ధి వలస అవశేషాల నిర్మూలన ప్రక్రియకు ఒక ముఖ్యమైన మూలస్తంభం. ఇది భారత్ అమృత్ కాలంలో బిజెపి నిర్వహిస్తున్న చారిత్రక పాత్ర. ‘సంకల్ప్ పత్ర 2024’, ఉచితాలు, స్వల్పకాలిక ప్రయోజనాల పైపై ఆకర్షణలకు లొంగని ఓటర్ల విజ్ఞత పట్ల బిజెపి ప్రగాఢ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. సామాజిక, భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాల దీర్ఘకాలిక వ్యవస్థాగత మార్పులు, వాటిపై గణనీయమైన పెట్టుబడులపై ఈ మేనిఫెస్టో దృష్టి పెట్టడంలోనే ఈ విశ్వాసం ప్రతిఫలిస్తుంది. ఉమ్మడి పౌర స్మృతి అమలు, ‘ఒక దేశం-ఒక ఎన్నిక’తో పాటు సౌర, అణు శక్తి ద్వారా ఇంధన రంగంలో స్వాతంత్ర్యం సాధించడం, హై-స్పీడ్ రైలు వ్యవస్థను విస్తరించడం, హరిత ఉదజని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం, మానవసహిత చంద్రయాన్ కార్యక్రమాలను కొనసాగించడం, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను ముమ్మరం చేయడమనే లక్ష్యాలను ఈ పత్రం వివరిస్తుంది. ఇవి, ఇంకా ఇతర సంకల్పాలు 2047 నాటికి వికసిత్ భారత్‌ (అభివృద్ధి చెందిన భారత్) కు పునాది వేసే ఆకాంక్షభరిత, పరివర్తనాత్మక దార్శనికతను ప్రజలముందు ఉంచుతున్నాయి.

– అభినవ్ ప్రకాష్, బిజెపి యువమోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు