సార్వత్రిక టీకా కార్యక్రమానికి డిజిటల్ దన్ను
వ్యాధులను నివారించడంలో టీకాలు గణనీయ పాత్ర పోషిస్తాయని 1796 నుంచి రుజువవుతూనే ఉంది. భయంకరమైన మశూచి వ్యాధి నివారణకు ఆ సంవత్సరంలో మొదటిసారి టీకాలు వేశారు. గత 50 సంవత్సరాల్లోనే టీకాలు ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది ప్రాణాలను కాపాడాయి. అంటే నిమిషానికి ఆరు ప్రాణాలను టీకాలు కాపాడాయన్నమాట. భారత్ సార్వత్రిక టీకా కార్యక్రమం (యూఐపీ) ప్రధాన లక్ష్యం ప్రాణాలను కాపాడటం. ప్రతిఏటా 2.6 కోట్ల మంది నవజాత శిశువులకు యూఐపీ కింద పొంగు, పోలియో, కోరింత దగ్గు వంటి 12 నివారించ తగిన వ్యాధుల కోసం టీకాలు వేస్తున్నారు. ఈ వ్యాధులు పిల్లల ప్రాణాలకు ముప్పు కలిగించడంతోపాటు వారి ఆరోగ్యం, సంక్షేమాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ కార్యక్రమం 1985లోనే ప్రారంభమైనప్పటికీ గత పదేళ్ళ కాలంలో ఇది శరవేగంగా విస్తరించింది. మిషన్ ఇంద్రధనస్సు వంటి విస్తృతమైన కార్యక్రమాలు టీకా కవరేజీని 90 శాతానికి పైగా పెంచాయి. నూటికి నూరు శాతం కవరేజి సాధించే విషయంలో మనం ఇంకా సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నాం.
కొన్ని ప్రాంతాల్లో టీకాలు అంటే భయాలు, సందేహాలు, ప్రజలు వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం వంటి రకరకాల ఇబ్బందులు వీటిలో ఉన్నాయి. కొంతమంది పిల్లలకు టీకాలు సగమే వేయడం, అసలు వేయకపోవడం వంటివి జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మహిళలు, పిల్లల ఆరోగ్యానికి, పోషకాహారానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. దేశంలో ప్రతి ఒక్క బిడ్డకు, గర్భిణీ స్త్రీకి టీకాలు వేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఈ లక్ష్యసాధన కోసం కేంద్ర ఆరోగ్య కుటుంబ, సంక్షేమ శాఖ టీకా కవరేజీని పెంచేందుకు సార్వత్రిక టీకా కార్యక్రమం (యు-విన్) రూపంలో ఒక సాంకేతిక పరిష్కారాన్ని ఆవిష్కరించింది. యు-విన్ అనేది ఒక డిజిటల్ వేదిక (ప్లాట్ ఫార్మ్). ఇది దేశవ్యాప్తంగా గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు వేసే టీకాలను నమోదు చేసి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది. యు-విన్ అనేది ప్రధానంగా పేరు ఆధారంగా నడిచే రిజిస్ట్రీ. ఇది ఎక్కడైనా, ఎప్పుడైనా వ్యాక్సిన్లు పొందేందుకు వీలు కనిపిస్తుంది. ప్రజల అవసరాలే ఆధారంగా రూపొందించిన ఈ వేదిక టీకా ప్రక్రియను సరళీకృతం చేసే అనేక లక్షణాలను కలిగి ఉంటుంది. గర్భిణీ స్త్రీలు తమ పేర్లను యు-విన్ యాప్ లో లేదా పోర్టల్ లో తామే స్వయంగా నమోదు చేసుకోవచ్చు. లేదా తమ దగ్గరలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి పేర్లు నమోదు చేసుకోవచ్చు. వారు ఒకసారి పేరు నమోదు చేసుకున్న తర్వాత ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు గర్భిణీ స్త్రీలకు ఇవ్వాల్సిన ముఖ్యమైన వ్యాక్సిన్ లను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి ప్రసవం ఎలా జరిగింది? బిడ్డ పరిస్థితి ఎలా ఉంది? వంటి విషయాలన్నీ పర్యవేక్షిస్తూ ఉంటారు. అలాగే శిశువు పేరుని కూడా నమోదు చేసి వారికి కూడా టీకాల కాలపట్టికను రూపొందిస్తారు. బిడ్డకు 16 సంవత్సరాలు వచ్చే వరకు వారికి వేయాల్సిన టీకాలు అన్ని వేస్తున్నారా? లేదా? అని ఈ కార్యక్రమ నిర్వాహకులు గమనిస్తూ ఉంటారు. యు-విన్ తల్లిదండ్రులకు, బిడ్డల సంరక్షకులకు గణనీయమైన ప్రయోజనాలు కల్పిస్తూ వారు దేశంలో ఎక్కడైనా తమ పిల్లలకు వ్యాక్సిన్లు వేయించడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ వేదికలో అపాయింట్మెంట్ బుకింగ్ అవకాశం కూడా ఉంటుంది. ఇది ముఖ్యంగా వలస కార్మికులకు ఉపయోగకరం. యు-విన్ పదకొండు భాషల్లో లభ్యమవుతున్నందున ఈ వేదిక విభిన్న భాషా వర్గాల వారికి సులభంగా అందుబాటులో ఉంటుంది.
మరొక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే రికార్డుల డిజిటలీకరణ. ఒక లబ్ధిదారు ఒక టీకా వేయించుకున్నప్పుడల్లా అతను లేదా ఆమె పేరు మీద డిజిటల్ వ్యాక్సినేషన్ రికార్డు సృష్టించబడుతుంది. లబ్ధిదారులు కూడా ఒక డిజిటల్ సందేశం అందుకుంటారు. అలాగే ఒక క్యూఆర్ కోడ్ రూపంలో సర్టిఫికెట్ కూడా వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుని మొబైల్లో ఉంచుకుంటే ఎప్పుడైనా, ఎక్కడైనా దాన్ని అవసరమైన సందర్భాల్లో చూపించవచ్చు. ముఖ్యంగా పిల్లలను బడిలో చేర్పించేటప్పుడు, ప్రయాణ సమయంలోను ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది కాక ఈ వేదిక ఎప్పటికప్పుడు పిల్లలకు లేదా గర్భిణీలకు వేయించాల్సిన టీకాల గురించి ఎస్ఎంఎస్ సందేశాలు పంపుతుంది. తద్వారా తల్లిదండ్రులు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు డోసుకి డోసుకి మధ్య నిర్దేశిత గడువును పాటించేటట్లు చూస్తుంది. యు-విన్ తల్లిదండ్రులు, సంరక్షకులు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఒక వేదిక మీదకు తెచ్చే సాధనం. కవరేజి ఎంతవరకు ఉన్నదీ నిర్ధారించడంతో సహా ఈ వేదిక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పురోగతిని సమర్థంగా పర్యవేక్షిస్తుంది. లబ్ధిదారులు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా (ఏబీహెచ్ఏ)ను ఏర్పాటు చేసుకోవడానికి, పిల్లలకు ఏబీహెచ్ఏ గుర్తింపులను సృష్టించడానికి వ్యక్తుల సమ్మతితో ఆరోగ్య రికార్డులను వైద్య నిపుణులతోనూ ఇతర సేవా సంస్థలతోనూ పంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.
వైద్య నిపుణులు ఒక వ్యక్తి ఆరోగ్య చరిత్రను సమగ్రంగా తెలుసుకోవడానికి అవకాశం కల్పించడం ద్వారా యూ-విన్ పేషెంట్ల చికిత్సను సులభతరం చేస్తుంది. అలాగే ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఎవరెవరికి టీకాలు ఇవ్వాలో జాబితాలు తయారు చేయడంలోనూ, లబ్ధిదారులకు సకాలంలో టీకాలు వేయడానికి మానవ వనరులను, ఇతర సహాయ సంపత్తిని సమీకరించడంలోనూ సహాయపడుతుంది. గత పదేళ్ళ కాలంలో భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన ఆరోగ్య వ్యవస్థలతో ఆరోగ్య రంగంలో విప్లవం సృష్టించింది. ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ (ఈవిన్)ను 2014లో ప్రారంభించారు. ఇది వ్యాక్సిన్ ల స్వీకరణ, నిల్వ, అట్టడుగు స్థాయి వరకు పంపిణీ చేసే విధానాన్ని సమూలంగా మార్చి వేసింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కో-విన్ విజయాన్ని ప్రపంచం కళ్ళారా వీక్షించింది. ఈ సాంకేతిక పరిజ్ఞానం భారత్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమానికి వెన్నెముకగా నిలిచింది. 18 నెలల కంటే తక్కువ సమయంలో దేశవ్యాప్తంగా 220 కోట్ల డోసుల టీకాలు వేయడానికి ఇది సహాయపడింది. అదే తరహాలో ఇప్పుడు యు-విన్ టీకా కవరేజీని గణనీయంగా విస్తరించడం ద్వారా దేశంలో టీకా పర్యావరణ వ్యవస్థనే మార్చి వేయబోతోంది. స్వతంత్ర దేశంగా భారత్ శతాబ్ది ఉత్సవాల వైపు ముందడుగు వేస్తున్న సమయంలో పటిష్టమైన టీకా కార్యక్రమానికి దాని నిబద్ధత కేవలం ఒక ఆరోగ్య కార్యక్రమం మాత్రమే కాదు, అది మన భవిష్యత్తుకు వేసే పునాదిపై పెట్టే పెట్టుబడి కూడా.
అధునాతన డిజిటల్ మౌలిక సదుపాయాలు, సమగ్ర ప్రజా ఆరోగ్య వ్యూహాల ద్వారా తన బుల్లి పౌరుల రోగనిరోధక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భారత్ నివారించదగిన వ్యాధులపై పోరాడటమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి, ఆర్థిక సౌభాగ్యానికి దోహదం చేస్తోంది. దేశంలో ఏ మూల నివసిస్తున్నా ప్రాణాలు కాపాడే టీకాలు వేయించుకొన్ని బిడ్డ ఒక్కరు కూడా ఉండకూడదు అన్న భారత్ దృఢ సంకల్పానికి ఈ ప్రయత్నాలు నిదర్శనం.
జగత్ ప్రకాష్ నడ్డా,
బిజెపి జాతీయ అధ్యక్షుడు,
కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల శాఖల మంత్రి