wtf

తెలుగు భాషను మనమే కాపాడుకోవాలి

తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనంందరిపై ఉందని, ఆ ఉద్యమం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. జనవరి 4న హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహా సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ‘‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ అంటూ పాడుకునే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఒకే వేదికపైకి రావడం తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు కళలు, తెలుగు సంప్రదాయాల కోసం పాటు పడటం చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలోని ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా, సంస్కృతం ప్రాచీన భాషలుగా కేంద్ర ప్రభుత్వం  గుర్తించింది. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ఊరికే అనలేదు. తెలుగు భాష ప్రపంచంలోనే అత్యంత అందమైన భాష. తెలుగు పదాలు శ్రావ్యంగా వినేవారికి సంగీతాన్ని విన్నట్టు అనిపిస్తుంది. ప్రస్తుతం చాలామంది తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారు. తెలుగు మాతృభాష అయి ఉండి తెలుగులో రాయలేకపోతున్నారు… సోషల్ మీడియాలో కానీ… లెటర్లు కానీ.. తెలుగు పదాలను కూడా ఇంగ్లీషులో రాస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఇంట్లో కూడా మనం మాట్లాడే భాషలో 30 శాతం మాత్రమే తెలుగులో మాట్లాడుతున్నాం. మిగిలినదంతా ఇంగ్లిష్ లోనే మాట్లాడుతున్నాం. ఒకప్పుడు అందరూ తెలుగులోనే మాట్లాడే వారు. కానీ మనమే ఇలా ఇంగ్లిష్ లో మాట్లాడి తెలుగును నిర్వీర్యం చేస్తున్నాం. అందుకే ఇప్పటి నుంచి తెలుగులోనే మాట్లాడుకుందాం.’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

నిజాం కాలంలో తెలుగుపై వివక్ష

‘‘నిజాం కాలంలో తెలుగు భాషపై అణచివేత కొనసాగింది. ఉర్దూ మీడియం స్కూల్సే ఉండేవి. తెలుగు వాళ్లు అక్కడే చదువుకోవాల్సి వచ్చేది. నిర్బంధంలోనూ నాడు గ్రంథాలయోద్యమం, ‘ఆంధ్ర మహాసభ’ పేరిట తెలుగు భాషను పరిరక్షించుకునేందుకు అనేక పోరాటాలు సాగాయి. ఇక, యక్షగానం, భాగవతం, నాటకం వంటివి తెలుగు భాషకే ప్రత్యేకమైన కళా రూపాలు… ప్రపంచంలో అవధానం అనేది తెలుగు, సంస్కృతంలో తప్పిస్తే మరే భాషలోనూ కనపడదు. చైనా, దక్షిణ కొరియా, జపాన్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, తైవాన్, వంటి దేశాల్లో మాతృభాషలోనే విద్య కొనసాగుతోంది. ఆయా దేశాలు ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందలేదా? వారు తమ మాతృభాషను అంతరిక్షంలోకి వెళ్లడానికి కూడా ఉపయోగించుకుంటున్నారు.. కానీ మనం ప్రాథమిక విద్యకు కూడా మాతృభాష ఉపయోగించుకోవడం లేదు. తెలుగు భాష ప్రేమికుడిగా ఇది చాలా బాధ కలిగిస్తోంది. ఇంగ్లీషు నేర్చుకుంటేనే ఉద్యోగం, అభివృద్ధి అనేది గత వలస పాలకులు అందించిన చీకటి వారసత్వం.. దీన్ని మనం వదిలించుకోవాలి. ఒక జాతి చరిత్ర, సంస్కృతుల వికాస పరిరక్షణలో ఆ జాతీయులు మాట్లాడే భాషలదే కీలక పాత్ర.. అందుకే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానంలో మాతృభాషకు పెద్దపేట వేశారు. మన భారతీయ భాషల్లో పాఠ్య పుస్తకాలు తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. మానవమేధ మాతృభాషలోనే వికసిస్తుంది. తల్లి కడుపులో శిశువు పెరుగుతున్న క్రమంలోనే ఈ వికాసం ప్రారంభమవుతుంది.. పరభాషలో ఎంత అధ్యయనం చేసినా, నైపుణ్యం అలవడినా ఆ స్థాయిలో మేధస్సు అలవడదు’’  అని మంత్రి వివరించారు.