Skill Divelopment

వికసిత్ భారత్ కు వనరులు సమీకరించే బడ్జెట్

ర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఏడవ బడ్జెట్ ఈ అనిశ్చిత ప్రపంచంలో భారత దేశపు వేగవంతమైన వృద్ధిని కొనసాగించడానికి ఒక సాహసోపేతమైన, సమూలమైన దార్శనికతను అందిస్తుంది. భారత్ జనాభా ప్రయోజనాన్ని గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోవడం బడ్జెట్ లో ప్రధానాంశం. స్వాతంత్య్ర శతాబ్ది అయిన అమృత కాలంలో ప్రభుత్వం దీనిపైనే దృష్టి కేంద్రీకరిస్తోంది. జనాభా ప్రయోజనాన్ని ఉపయోగించుకునే లక్ష్యంతో సంఘటిత రంగంలో ఉపాధిని ప్రోత్సహించడానికి బడ్జెట్‌లో వివిధ కార్యక్రమాలు ప్రకటించారు. శ్రామిక ఉత్పాదకతను పెంచడానికి ఇది అత్యంత విశ్వసనీయ మార్గం.

ప్రైవేట్ రంగం పోషించాల్సిన పాత్రను ఈ బడ్జెట్ లో పునర్నిర్వచించారు. రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, (ఎంఎస్ఎంఈలు), స్వయం సహాయక బృందాలు, భారీ కార్పొరేట్ రంగం, విదేశీ బహుళ-జాతి సంస్థలు ఇవన్నీ ప్రయివేటు రంగానికి ప్రతినిధులే. కార్మిక మార్కెట్ డిమాండ్ కు ప్రాతినిధ్యం వహించే ఈ రంగాలన్నీ ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. భారత్ శ్రామిక శక్తి పరిమాణం, వైవిధ్యం కారణంగా డిమాండ్, సరఫరాకు సరిపోయే కొత్త వ్యవస్థలు కూడా రూపొందుతున్నాయి. భారత దేశం 1991లో సంస్కరణలను అమలు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి మూడు దశాబ్దాలుగా 6 శాతం దీర్ఘకాలిక సగటు వృద్ధి రేటును కొనసాగించింది. జనాభా పెరుగుదల మందగించడంతో, తలసరి వృద్ధి మరింత బలంగా ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా ఈ స్థిరమైన వృద్ధి రేటు వ్యవస్థలు, నిర్ణయాత్మక విధానాలు తీసుకునే ప్రభుత్వాల సానుకూల ప్రభావానికి అద్దం పడుతుంది. ఇవి ఉత్పాదకత పెరుగుదల రూపంలో ఫలితాలనిస్తాయి. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం 2023 నాటికి భారతదేశ స్థూల జాతీయ ఆదాయం (జిఎన్ఐ) తలసరి 2,540 డాలర్లు. ఇది భారత్ ను దిగువ మధ్య-ఆదాయ వర్గంలో స్థిరంగా ఉంచుతుంది. ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన అధిక ఆదాయ పరిమితి 14,005 డాలర్ల కంటే కొంచెం ఎగువన ఉన్న దేశం చిలీ. దాని తలసరి స్థూల జాతీయ ఆదాయం 15,820 డాలర్లు. మధ్య-ఆదాయ స్థితికి (ప్రపంచ బ్యాంకు ప్రమాణాల ప్రకారం 4,516 వేల డాలర్లు) మారడం కోసం గతంలో చైనా, కొరియాల మాదిరిగా వేగంగా అభివృద్ధి చెందడం భారత్ ముందున్న సవాలు. ఇది చాలా భారీ లక్ష్యం. రాబోయే 25 సంవత్సరాలకు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం చాలా కష్టం. ఎన్నో అనిశ్చితులు ఉంటాయి. అయినప్పటికీ దేశీయ, విదేశీ ప్రైవేట్ పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక మార్గదర్శకత్వం అవసరం. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రస్తుతం ఉన్న పార్లమెంటు మున్ముందు రాబోయే పార్లమెంటులు ఎలా వ్యవహరించాలో నిర్దేశించలేదు. చేయగలిగేది ఏమిటంటే విధానానికి సంబంధించిన ఒక స్థూలమైన దిశానిర్దేశం చేయడం, దాన్ని చట్టంలో పొందుపరచడం. వాటి అమలుకు మార్గం సుగమం చేస్తూ చిన్న చిన్న విజయాలు సాధించడం.

ఉపాధి ప్రోత్సాహకాలు, నైపుణ్యాల పెంపునకు బడ్జెట్‌లో పెద్దపీట వేయడం ప్రశంసనీయం. ఉపాధి కల్పన కోసం మూడు పథకాలు ఒక ప్యాకేజీగా ప్రకటించారు. ఇందులో మొదటిసారిగా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి వేతన రాయితీ కల్పించారు. మహిళల సారథ్యంలో అభివృద్ధి అనే ఎజెండాను మరింత ముందుకు వెళ్లేందుకు, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి, వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల ఏర్పాటు, శిశు సంరక్షణ కేంద్రాల (క్రెష్ లు) ఏర్పాటు, మహిళలకు ప్రత్యేక నైపుణ్య కార్యక్రమాలను నిర్వహించడం, మహిళల నేతృత్వంలోని ఎస్‌హెచ్‌జిలు/సంస్థలకు మార్కెట్ సదుపాయాలను పెంచడం వంటి అనేక ముఖ్యమైన కార్యక్రమాలను బడ్జెట్‌ ప్రతిపాదించింది. శ్రామికశక్తిని మరింత ఉత్పాదకంగా ఉండేలా సిద్ధం చేయడం ప్రైవేట్ రంగం సుముఖంగా లేనిదే సాధ్యంకాదు. బడ్జెట్‌లో ప్రైవేట్ రంగం పాత్రను అన్ని కోణాల్లోనూ నిర్వచించారు. పెద్ద కార్పొరేట్‌ కంపెనీలే కాకుండా స్టార్టప్‌లు, రైతులు, ఎంఎస్ఎంఇలను కూడా ప్రయివేటు రంగంలో భాగంగా పరిగణించారు.

ఈ క్రమంలో వ్యవసాయ రంగం, ఎంఎస్ఎంఇల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి బడ్జెట్ అవసరమైన చర్యలను ప్రకటించింది. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్ పిఓలు), సహకార సంస్థలు, స్టార్టప్‌ల పాత్రను గుర్తించడం ద్వారా నూనె గింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడం, ప్రధాన వినియోగ కేంద్రాలకు సమీపంలో కూరగాయల ఉత్పత్తి కోసం పెద్ద ఎత్తున క్లస్టర్‌లను ఏర్పాటు చేయడం వంటి వ్యూహాలు ఇందుకు నిదర్శనం. ప్రత్యక్ష పన్నుల నియమావళిని సమీక్షించాలన్న నిర్ణయం వ్యాపారాలను సులభతరం చేయడానికి ఇతోధికంగా దోహదం చేస్తుంది. ఈ విధానాలలో రెండు లోతైన మార్పులు ఇమిడి ఉన్నాయి. మొదటిది, పెట్టుబడులు పెట్టడంలో ప్రభుత్వం బదులు ప్రయివేటు రంగం కీలకపాత్ర పోషిస్తుంది. ప్రభుత్వం కేవలం ప్రయివేటు రంగానికి సదుపాయాలు కల్పించడానికే పరిమితమవుతుంది. ఈ బడ్జెట్‌లో ఇందుకు ఒక ముఖ్యమైన ఉదాహరణ అణు విద్యుత్ రంగంలోకి ప్రైవేట్ రంగాన్ని అనుమతించడం. అలాగే స్వచ్ఛ ఇంధన రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పిస్తూ వర్గీకరణను మార్చారు. భారతదేశ పెట్టుబడి అవసరాల కోసం దీర్ఘకాలిక వనరులను సమీకరించగల ఆర్థిక రంగ వ్యూహాన్ని రూపొందించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, భారతదేశం అనివార్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పటిష్టమైన సంబంధాలను కలిగి ఉంటుంది. మన దేశానికి ఉన్న ప్రధాన అనుకూలాంశం మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం. ఇప్పటివరకు పూర్తిగా ఉపయోగించని దేశీయ వనరులు, సామర్థ్యాలను ఉపయోగించి అధిక ఉత్పత్తి, ఎక్కువ పొదుపు, చౌక మూలధనం అనే ఆరోగ్యవంతమైన వలయాన్ని సృష్టించేందుకు బడ్జెట్ బాటలు వేస్తుంది. వివిధ విధాన పత్రాలు ఖరారైనందున ఈ వ్యూహంపై ఈ సంవత్సరం మరింత స్పష్టత రావచ్చు. అయితే మార్పు దిశ స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ముమ్మరంగా కల్పించే వృద్ధి వ్యూహం అన్ని వర్గాలను కలుపుకొని పోవడానికి వినూత్న ఆలోచనలు చేయాలి. కానీ చారిత్రక, భౌగోళిక, సామాజిక పరిస్థితులు కొంత కాలం పాటు కొనసాగుతాయి. ఆకాంక్ష భరిత జిల్లాలు, బ్లాకుల వంటి విజయవంతమైన కార్యక్రమాలు ఇకముందు కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తూనే ఉంటాయి. ఈ కొత్త నైపుణ్య పెంపు పథకాల పాఠాలను తగిన సమయంలో ఈ పథకాలలో భాగం చేయగలిగితే మరింత సత్ఫాలితాలు ఉంటాయి.

సుమన్ బెరీ,
నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు