కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
లోక్‌సభకు త్వరలో జరగబోయే ఎన్నికల్లో బిజెపి ఓట్లు మరో 10 శాతం పైగా పెరిగేందుకు నేతలంతా కృషి చేయాలని, ఆ విజయం మరెవరికీ అందనంత ఎత్తున ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నవ ఓటర్లకు చేరువై కేంద్ర సర్కారు విజయాలను వివరించాలని చెప్పారు. విపక్షాలు చేస్తున్న వ్యతిరేక ప్రచారంపై దృష్టి పెట్టడం కంటే దీనికి ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. మొత్తంమీద 50 శాతం ఓట్లను బిజెపి సాధించేలా చూడాలన్నారు. గత ఎన్నికల్లో 303 సీట్లు సాధించామని, కంకణబద్ధులై పని చేయడం ద్వారా 2024లో ఈ సంఖ్యను మరింతగా పెంచుకునే అవకాశం ఉందని చెప్పారు. డిసెంబర్ 22, 23న రెండ్రోజుల పాటు దిల్లీలో జరిగిన బిజెపి జాతీయ పదాధికారులు, రాష్ట్ర అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని ప్రసంగిస్తూ దేశ ప్రయోజనాల పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను, పథకాలను విస్తృత జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు స్వల్ప వ్యవధి మాత్రమే ఉన్నందున దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించాలని నిర్దేశించారు. మహిళలు, యువత, రైతులు, పేదలకు పార్టీ మరింత చేరువ కావాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న వికసిత్ భారత సంకల్ప యాత్ర ద్వారా వీరిలో వీలైనంత ఎక్కువ మందికి చేరువ కావాలని, వారికి ప్రభుత్వ పథకాలు గరిష్ఠస్థాయిలో అందేలా చూడాలని సూచించారు. సామాజిక మాధ్యమాల ద్వారా అభిప్రాయాలను పెద్దఎత్తున పంచుకోవాలని, విపక్షాలు చేసే వ్యతిరేక ప్రచారంపై వాస్తవాలతో కూడిన సానుకూల సమాధానాలు ఇవ్వాలని చెప్పారు.
50 శాతం పైగా ఓట్లే లక్ష్యం: అమిత్ షా
విపక్షం నిర్ఘాంతపోయే రీతిలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశంలో పిలుపునిచ్చారు. 2014లో కేంద్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాసనసభ ఎన్నికల్లో 50 శాతం పైగా ఓట్లను బిజెపి లక్ష్యంగా నిర్దేశించుకుని అనేక రాష్ట్రాల్లో దానిని సాధించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇలాంటి ఆధిక్యాన్ని సాధిస్తే తమకు సవాళ్లు విసరడానికి విపక్షాలు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలోకి వెళ్తాయని అమిత్ షా చెప్పారు.
మూడోసారీ మోదీ ప్రభుత్వమే: నడ్డా
దేశానికి మూలస్తంభాలైన యువత, మహిళలు, రైతులు, పేదలకు సాధికారత కల్పించడంతో పాటు అభివృద్ధి చెందిన భారత్‌ను సాధించేందుకు ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో బిజెపి ముందుకు సాగుతుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా పేర్కొన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన 303 స్థానాలకు మించి భారీ విజయాన్ని సాధించాలని నొక్కిచెప్పారు. ప్రజలు మోదీని కేంద్రంలో మూడోసారి అధికారంలోకి తీసుకువస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. మరింతమంది ప్రజలకు దిగువశ్రేణి నాయకులు చేరువయ్యేలా బూత్ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ శ్రేణుల సన్నద్ధత తదితర అంశాలపై చర్చించారు. అయోధ్యలో జనవరి 22న జరిగే రామాలయం ప్రారంభోత్సవం కార్యక్రమం ద్వారా రాష్ట్రాల్లో సానుకూల వాతావరణం నెలకొంటుందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. అయిదు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలపైనా చర్చించారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ఇంచార్జీలు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, మోర్చాల అధ్యక్షులు కూడా పాల్గొన్నారు.
– జనసందేశ్ ప్రతినిధి
ఆయుష్మాన్ పథకంలో తల్లిదండ్రులను చేర్పించడం ఎలా?
ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) పరిధి విస్తరణతో ఆదాయంతో నిమిత్తం లేకుండా 70 సంవత్సరాలు అంతకుమించి వయసు గలవారు ఇప్పుడు ప్రయోజనం పొందవచ్చు....
మహారాష్ట్ర ప్రజలకు మా హామీ ఒక్కటే… అభివృద్ధి
ముంబైలో మహా వికాస్ అఘాది (ఎంవీఏ)కి రెండంకెల సీట్లు రావడం కూడా కష్టమని బిజెపి ముంబై అధ్యక్షుడు, మాజీ మంత్రి ఆశీష్ సెలార్ అన్నారు. ఒక ఆంగ్ల...
ప్రతిచోటా ఎంఎస్‌పీ అవసరం అనేది అపోహే
శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జాతీయ వ్యవసాయ రంగ వృద్ధిరేటు 3.7 శాతం కాగా మధ్యప్రదేశ్ వృద్ధిరేటు 6.5 శాతం ఉంది. మధ్యప్రదేశ్‌లో...