టెక్స్టైల్ రంగంలో బంగ్లాదేశ్, వియత్నాం మనకు పోటీయే కాదు
2030 నాటికి భారత టెక్స్టైల్స్ మార్కెట్ పరిమాణాన్ని 176 బిలియన్ డాలర్ల నుంచి 350 బిలియన్ డాలర్లకు విస్తరించాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారత టెక్స్టైల్ పరిశ్రమకు బంగ్లాదేశ్, వియత్నాంల నుంచి ఎదురవుతున్న సవాలును కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఒక ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొట్టిపారేశారు. వీటివల్ల భారత్‌కు వచ్చిన ముప్పేమీ లేదన్నారు. ఇంటర్వ్యూ లోని ముఖ్యాంశాలు:
ప్రశ్న: దేశీయ టెక్స్టైల్ మార్కెట్ పరిమాణాన్ని ఎలా పెంచాలనుకుంటున్నారు?
జ: 2025-26 బడ్జెట్లో మంత్రిత్వ శాఖకు మొత్తం రూ. 5,272 కోట్లు కేటాయించారు. ఇది 2024-25 కంటే 19 శాతం ఎక్కువ. దీనివల్ల టెక్స్టైల్స్ రంగం నుంచి ఉద్యోగాల కల్పన, ఎగుమతులు పెరుగుతాయి. భారతదేశం వస్త్రాలలో చాలా వైవిధ్యాన్ని కలిగి ఉంది: జనపనార, సహజ ఫైబర్, మల్బరీ, టస్సర్ ఇలా వివిధ రకాల వస్త్రాలు చేస్తాం. ప్రపంచ మార్కెట్ లో లభించే పట్టు అంతా భారత్‌లోనే ఉత్పత్తి చేస్తున్నారు. ఈ వైవిధ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. జనపనార రంగాన్ని ప్రభుత్వం పునరుద్ధరిస్తుంది. ఇందుకు రూ.12 వేల కోట్లు కేటాయించింది. చేనేత, హస్తకళల రంగంలో కోటి మంది హస్తకళల కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. భారత పర్యాటక ప్రాంతాల్లో క్రాఫ్ట్ విలేజ్ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్ర: భారత పత్తి ఉత్పత్తులను అంతర్జాతీయంగా పోటీపడేలా ఎలా అభివృద్ధి చేస్తున్నారు ?
జ: హెక్టారుకు దిగుబడిని పెంచడానికి ప్రపంచ ఉత్తమ పద్ధతులను అవలంబించడం ద్వారా పత్తి ఉత్పాదకతను పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. బ్రెజిల్, చైనా, ఆస్ట్రేలియా, రష్యా వంటి దేశాలు హెక్టారుకు 2,000 నుంచి 2,200 కిలోలు ఉత్పత్తి చేస్తుండగా, భారత్ సగటు ఉత్పత్తి 450-500 కిలోలు మాత్రమే. మేం అకోలా మోడల్ ను అవలంబించాలనుకున్నాం. పత్తి ఉత్పాదకత ప్రయోగాలు నిర్వహించడానికి ప్రతి రాష్ట్రంలో ఒక జిల్లాను గుర్తించే బాధ్యతను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అప్పగించాం. 2025-26 బడ్జెట్లో పత్తి ఉత్పాదకతను పెంచడానికి, ముఖ్యంగా అదనపు-పొడుగు పింజ వంగడాల కోసం ఐదేళ్ల కాటన్ మిషన్ (పత్తి కార్యక్రమాన్ని) ప్రతిపాదించారు. జాతీయ పత్తి సాంకేతిక పరిజ్ఞాన కార్యక్రమానికి బడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించారు.
ప్ర: అకోలా మోడల్ గురించి వివరించగలరా?
జ: మహారాష్ట్రలోని అకోలాలో ఉత్పాదకతను పెంచడానికి 3,500 హెక్టార్లలో అధిక సాంద్రత కలిగిన మొక్కల నాట్ల విధానాన్ని విజయవంతంగా అమలు చేశాం. ప్రపంచ ప్రధాన ఉత్పత్తిదారులతో దిగుబడి అంతరాన్ని పూడ్చడానికి ప్రభుత్వం ఇప్పుడు ఈ నమూనాను అమలు చేయాలని యోచిస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకతో సహా 11 ప్రధాన పత్తి ఉత్పత్తి రాష్ట్రాల్లో హెక్టారుకు 1,000 కిలోల దిగుబడి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
ప్రశ్న: టెక్నికల్ టెక్స్టైల్స్ రంగంలో భారత్ ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
జ: టెక్నికల్ టెక్స్టైల్స్ అనేది మనదేశంలో ఇప్పుడిపుడే అభివృద్ధి చెందుతున్న రంగం. రోడ్లు, రైల్వేలు, నిర్మాణం, వ్యవసాయం, వైద్య పరిశ్రమ, పరిశుభ్రత పరిశ్రమ, ఆటోమొబైల్స్, రక్షణ, అంతరిక్షం, పారిశ్రామిక భద్రత వంటి వివిధ రంగాలలో ఉపయోగించే సాంప్రదాయ ముడి పదార్థాలకు ఇది ప్రత్యామ్నాయాలను అందిస్తుంది. టెక్నికల్ టెక్స్‌టైల్‌లో దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి, జాతీయ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్‌ను 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించారు. పరిశోధన, నవకల్పనల కోసం, ముఖ్యంగా టెక్నికల్ ఫైబర్స్ కోసం రూ.1,480 కోట్ల ఆర్థిక వ్యయంతో 2026 మార్చి 31 వరకు దీన్ని పొడిగించారు.
ప్రశ్న: టెక్నికల్ టెక్స్టైల్ లక్ష్యాలు ఏమిటి?
జ: 2030 నాటికి 10 బిలియన్ డాలర్ల టెక్నికల్ టెక్స్టైల్స్ ఎగుమతి లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. క్షిపణులు, డ్రోన్లు మొదలైనవాటిలో ఉపయోగించే కార్బన్ ఫైబర్ అనే సాంకేతిక వస్త్రం 2026 నాటికి భారతదేశంలో ఉత్పత్తి అవుతుందని నేను విశ్వసిస్తున్నాను. ప్రస్తుతం భారత్ ఎలాంటి కార్బన్ ఫైబర్‌ను ఉత్పత్తి చేయడం లేదు. అమెరికా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ వంటి దేశాల నుంచి దిగుమతులపై మనం పూర్తిగా ఆధారపడుతున్నాం.
ప్రశ్న: బంగ్లాదేశ్, వియత్నాం నుంచి భారత టెక్స్టైల్ పరిశ్రమ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో టెక్స్టైల్ పరిశ్రమలు భారత్‌కు తరలివస్తాయా?
జ: బంగ్లాదేశ్ గానీ, వియత్నాం గానీ భారత్‌కు పోటీ ఇవ్వడం లేదు. ఇది కొన్ని స్వార్థశక్తులు పనిగట్టుకుని ప్రచారం చేసిన అతిశయోక్తి. సంప్రదాయ టెక్స్టైల్ కేంద్రాలు కాకుండా ఇతర ప్రదేశాల్లో పరిశ్రమలు తమ యూనిట్లను ఏర్పాటు చేసేటట్టు ప్రోత్సహించేందుకు మా మంత్రిత్వ శాఖ రాష్ట్రాలతో కలిసి పని చేస్తోంది. భారతదేశం ఎల్లప్పుడూ సరసమైన వేతనాలతో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని, పరిశ్రమలకు అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని కల్పించింది. పెరుగుతున్న దేశీయ డిమాండ్ కు అనుగుణంగా టెక్స్టైల్స్ రంగంలో మేకిన్ ఇండియాను ప్రోత్సహిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 350కి పైగా బ్రాండ్లు భారత్ నుంచి దుస్తులను కొనుగోలు చేస్తున్నాయి. 2030 నాటికి టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ 100 బిలియన్ డాలర్లను లక్ష్యంగా పెట్టుకుంది.
జ: టెక్స్టైల్ రంగంలో ఉద్యోగాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను వివరించగలరా?
జ: వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నది టెక్స్టైల్ రంగం. ఈ రంగంలో ప్రస్తుతమున్న 4.5 కోట్ల ఉద్యోగాలను 2030 నాటికి 6 కోట్లకు పెంచాలన్నది లక్ష్యం. రూ.70,000 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న పీఎం-మిత్ర పార్కుల వల్ల 21 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. 2021-22 నుంచి 2027-28 మధ్య రూ.4,445 కోట్లతో ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలతో సహా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కొత్త ప్రాంతాల్లో 9 (గ్రీన్‌ఫీల్డ్)/ ఇప్పటికే పరిశ్రమలు ఉన్న ప్రాంతాలలో (బ్రౌన్‌ఫీల్డ్) 7 పీఎం-మిత్ర పార్కులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తమిళనాడు (విరుధ్ నగర్), గుజరాత్ (నవ్సారి), కర్ణాటక (కలబుర్గి), మధ్యప్రదేశ్ (థార్), ఉత్తరప్రదేశ్ (లక్నో), మహారాష్ట్ర (అమరావతి), తెలంగాణలో (వరంగల్) పీఎం-మిత్ర పార్కులను ప్రభుత్వం ఖరారు చేసింది. అంతేగాక ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) పథకం పెద్దయెత్తున తయారీని ప్రోత్సహించడం, పోటీతత్వాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ‘సమర్థ్’ పథకం కింద టెక్స్టైల్ డిమాండ్, ప్లేస్ మెంట్ ఆధారిత సామర్థ్యాల పెంపు కార్యక్రమాన్ని అందిస్తున్నాం.

