gst

భారత్ పన్నుల వ్యవస్థను సరళతరం చేసిన జీఎస్టీ

జూలై 1, 2017న భారత్ లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది దేశ పన్నుల వ్యవస్థలో సమూలమైన మార్పును తెచ్చింది. జీఎస్టీకి ముందు దేశంలో పన్నుల వ్యవస్థ సంక్లిష్టంగా ఉండేది, ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే అనేక రకాల పరోక్ష పన్నులు ఉండేవి. ఇందులో ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను, విలువ ఆధారిత పన్ను (వ్యాట్), సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ (సీఎస్టీ), ఇతర సెస్సులు, సర్చార్జీలు ఉండేవి. జీఎస్టీ ఈ బహుళ పన్నుల స్థానంలో ఏకీకృత పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టింది. బహుళ పన్నుల వల్ల ప్రజలపై పడే అధిక పన్నుల భారాన్ని తగ్గించడం, అమలును సులభతరం చేయడం లక్ష్యంగా జీఎస్టీని ప్రవేశపెట్టారు. ఏదేమైనా ఈ పరివర్తన వ్యాపారాలు, వినియోగదారుల మీద పన్ను భారానికి సంబంధించి మిశ్రమ ప్రభావాలను ప్రసరించింది. 

జీఎస్టీకి ముందు దేశంలో బహుళ అంచెల పరోక్ష పన్నుల వ్యవస్థ ఉండేది. ఉత్పత్తి, పంపిణీ, వినియోగం వివిధ దశలలో పన్నులు విధించారు, ఇది అసమర్థత, అధిక పన్ను భారానికి దారితీసింది. 

జీఎస్టీ పూర్వ పన్ను విధానంలోని కొన్ని ముఖ్య లక్షణాలు:

  1. బహుళ పన్నులు – వ్యాపార సంస్థలు ఎక్సైజ్ సుంకం (తయారీపై విధించేవి), సేవా పన్ను (సేవలపై), వ్యాట్ (వస్తువుల అమ్మకంపై), సీఎస్టీ (అంతర్రాష్ట్ర అమ్మకాలపై) వంటి వివిధ రకాల పరోక్ష పన్నులను చెల్లించాల్సి వచ్చేది. ఇది పరిపాలనా సంక్లిష్టతను పెంచింది.
  2. పన్నులపై పన్ను (కాస్కేడింగ్ ప్రభావం) – పన్ను విధానం పన్నుపై పన్ను విధించే (కాస్కేడింగ్) నమూనాను అనుసరించింది. ఉదాహరణకు, ఒక ఉత్పత్తి ధరపై వ్యాట్ వసూలు చేస్తారు. ఇందులో ఇప్పటికే ఎక్సైజ్ సుంకం కూడా ఉంటుంది. దీంతో వ్యాపారాలకు, వినియోగదారులకు ఖర్చులు పెరిగాయి.
  3. అంతర్రాష్ట్ర పన్ను అవరోధాలు – సీఎస్టీ, ప్రవేశ పన్నులు అంతర్రాష్ట్ర వాణిజ్యానికి అడ్డంకులను సృష్టించాయి. రాష్ట్ర సరిహద్దుల వెలుపల వస్తువులను విక్రయించినప్పుడు అవి మరింత ఖరీదైనవిగా మారాయి. వ్యాపారాలు వివిధ రాష్ట్రాల్లో బహుళ రిజిస్ట్రేషన్లను నిర్వహించాల్సి వచ్చింది, ఇది లాజిస్టిక్ (బట్వాడా) ఇబ్బందులకు దారితీసింది.
  4. ఏకరూపత లేకపోవడం – వివిధ రాష్ట్రాలు వేర్వేరు వ్యాట్ (విలువ జోడింపు పన్ను) రేట్లను కలిగి ఉండేవి. కేంద్ర ప్రభుత్వం దాని సొంత పరోక్ష పన్నులను విధించేది. ఇది ధరల్లో వ్యత్యాసాలకు దారితీసింది. ఒకటికి మించి రాష్ట్రాల్లో పనిచేసే వ్యాపారాలు పన్ను నిబంధనలను పాటించడం కష్టతరమైంది.
  5. అధిక పన్ను రేట్లు – ఎక్సైజ్, వ్యాట్, ఇతర పన్నుల సంచిత ప్రభావం తరచుగా వస్తువులు, సేవలపై అధిక పన్ను రేట్లకు దారితీసింది. వ్యాపారాలు, వినియోగదారులపై వ్యయ భారాన్ని పెంచింది.

 జీఎస్టీని ప్రవేశపెట్టడం ద్వారా బహుళ పన్నుల స్థానంలో దేశవ్యాప్తంగా వర్తించే ఒకే పన్నుతో పరోక్ష పన్ను నిర్మాణాన్ని ప్రభుత్వం సులభతరం చేసింది. 

జీఎస్టీ ప్రధాన లక్షణాలు:

  1. ఒకే పన్ను విధానం – జీఎస్టీ వివిధ పరోక్ష పన్నుల స్థానంలో ఒకే పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇందులో అంతర్రాష్ట్ర లావాదేవీలకు కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ), రాష్ట్ర జీఎస్టీ (ఎస్జీఎస్టీ), అంతర్రాష్ట్ర లావాదేవీలకు సమీకృత జీఎస్టీ (ఐజీఎస్టీ) ఉన్నాయి.
  2. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) – సరఫరా చైన్ అంతటా ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ సౌలభ్యం జీఎస్టీ అతిపెద్ద ప్రయోజనాలలో ఒకటి. ఇన్‌పుట్స్ (వ్యాపారానికి వాడిన వస్తువులు, సేవలపై ) చెల్లించిన పన్నులకు, పన్నులపై పన్నుల (కాస్కేడింగ్) ప్రభావాన్ని తగ్గించడానికి, ఖర్చులను తగ్గించడానికి వ్యాపారాలు క్రెడిట్ పొందవచ్చు.
  3. ఏకరీతి పన్ను రేట్లు – రాష్ట్రాలలో పన్ను రేట్లను జీఎస్టీ ప్రామాణికీకరించింది. ధరలో ఏకరూపత ఉండేటట్లు చూసింది. మార్కెట్లో పన్ను సంబంధిత వక్రీకరణలను తగ్గించింది.
  4. వాణిజ్య సౌలభ్యం- జీఎస్టీతో వ్యాపారాలు ఇకపై వివిధ రాష్ట్రాల్లో బహుళ పన్ను చట్టాలను పాటించాల్సిన అవసరం లేదు. ఏకీకృత పన్ను విధానం ఒకే రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ ఫైలింగ్ వ్యవస్థ ద్వారా పన్నుల చెల్లింపును సులభతరం చేసింది.
  5. లాజిస్టిక్స్ ఖర్చుల తగ్గింపు – అంతర్రాష్ట్ర పన్నుల తొలగింపు సరుకులను సమర్థవంతంగా తరలించడానికి దారితీసింది. ఇంతకుముందు వ్యాపారాలు సీఎస్టీ, ప్రవేశ పన్నుల భారాన్ని భరించాల్సి వచ్చేది. కానీ జీఎస్టీ ఈ ఖర్చులను తొలగించింది. ఇది లాజిస్టిక్ ఖర్చులను తగ్గించడానికి దోహదం చేసింది.

జీఎస్టీ ప్రవేశపెట్టిన తరువాత పన్ను భారం తగ్గింది 

వ్యాపారాలకు లాభాలు

  1. తగ్గిన పన్ను నిబంధనల పాటింపు వ్యయాలు – జీఎస్టీకి ముందు వ్యాపారాలు వివిధ రాష్ట్రాల్లో రకరకాల పన్నుల కోసం బహుళ పన్ను రిటర్నులను దాఖలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు, జీఎస్టీకి ఒకే రిటర్న్ ఫైలింగ్ వ్యవస్థ అవసరం, ఇది పనిని తగ్గించి, పన్ను చెల్లింపు ప్రక్రియను, ఖర్చులను తగ్గిస్తుంది.
  2. తక్కువ ఉత్పత్తి వ్యయం – ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ యంత్రాంగంతో వ్యాపారాలు ఇకపై పన్నులపై పన్ను చెల్లించవలసిన అవసరం ఉండదు. ఇది ఉత్పత్తి వ్యయాలను తగ్గించింది, తయారీదారులకు, సేవాదారులకు లబ్ధి చేకూరింది. 
  3. చిన్న వ్యాపారాలపై ప్రభావం – పన్ను మినహాయింపు కోసం జీఎస్టీ పరిమితి మునుపటి పన్ను విధానంతో పోలిస్తే ఎక్కువ. వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలు (వస్తువులకు), రూ.20 లక్షలు (సేవలకు) ఉన్న చిన్న వ్యాపారాలకు మినహాయింపు ఇవ్వడంతో చిన్న సంస్థలకు పన్ను భారం తగ్గుతుంది. అదనంగా కాంపోజిషన్ స్కీమ్ రూ.1.5 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న వ్యాపారాలు తక్కువ రేటుకు పన్ను చెల్లించడానికి అనుమతిస్తుంది.
  4. భిన్న రంగాలపై ప్రభావం- జీఎస్టీ వల్ల చాలా పరిశ్రమలు లాభపడగా, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్స్ వంటి కొన్ని రంగాలు అధిక పన్ను రేట్లు, కఠినమైన పన్ను చెల్లింపు ప్రక్రియ కారణంగా మొదట్లో ఎక్కువ ఖర్చులు భరించాల్సి వచ్చింది.

వినియోగదారులకు ప్రయోజనాలు

  1. కొన్ని వస్తువులపై తక్కువ ధరలు – పన్నులపై పన్నులు, హేతుబద్ధీకరించిన పన్ను రేట్లను తొలగించడం వల్ల ఎఫ్ఎంసీజీ (త్వరగా అమ్ముడయ్యే వినియోగ) ఉత్పత్తులు, నిత్యావసర వస్తువులు వంటి కొన్ని వస్తువులు, సేవల ధరలు తగ్గాయి.
  2. సేవలపై అధిక పన్ను – పాత పన్ను విధానంలో సేవా పన్ను 15 శాతం ఉండగా, జీఎస్టీ దానిని 18 శాతానికి పెంచింది. టెలికాం, బీమా, బ్యాంకింగ్ వంటి సేవలను కొంచెం ఖరీదైనదిగా చేసింది. ఏదేమైనా, వ్యాపారాలు ఇప్పుడు ఐటీసీని (ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్) క్లెయిమ్ చేయవచ్చు, ఇది మొత్తం ఖర్చులను తగ్గించడానికి దోహదం చేసింది. 
  3. విలాస వస్తువులు – లగ్జరీ కార్లు, పొగాకు, ఏరేటెడ్ డ్రింక్ లతో సహా విలాస, అధిక దరల ఉత్పత్తులపై అధిక జీఎస్టీ రేట్లు (28 శాతం వరకు), సెస్సు వసూలు చేస్తారు. దీనివల్ల వాటి ధరలు పెరుగుతాయి. సామాజిక సమానత్వాన్ని కాపాడటానికి, హానికరమైన ఉత్పత్తుల వినియోగాన్ని నిరుత్సాహపరచడానికి ఈ విధానం అనుసరిస్తున్నారు.
  4. పెరిగిన పారదర్శకత – పన్నుల వ్యవస్థలో జీఎస్టీ మరింత పారదర్శకతను తీసుకువచ్చింది. పన్నులో ఏయే భాగాలు ఉన్నాయో స్పష్టంగా వివరించడంతో వినియోగదారులు వస్తువులు, సేవలపై చెల్లించే కచ్చితమైన పన్నును చూడవచ్చు, మునుపటిలా కాకుండా, కనిపించని పన్నులు ధరలో ఉండవు.

మొత్తంగా జీఎస్టీ ప్రభావం 

ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహం – జీఎస్టీ పన్నుల చెల్లింపును మెరుగుపరిచింది. పన్నుల పునాదిని విస్తరించింది. ఎగవేతను తగ్గించింది. ఇది ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచింది. 

మెరుగైన వాణిజ్య సౌలభ్యం – సరళీకృత పన్ను నిర్మాణం మరింత వ్యాపారాలను తమ కార్యకలాపాలను క్రమబద్దీకరించేటట్టు చేసి, అనియంత్రిత లావాదేవీల భారాన్ని తగ్గించింది.

మెరుగైన పన్ను పరిపాలన – ఆన్‌లైన్ జీఎస్టీ పోర్టల్ పన్ను ఫైలింగ్‌ను సులభతరం చేసింది. పన్ను వసూళ్లలో మానవ జోక్యాన్ని, అవినీతిని తగ్గించింది.

అనేక పరిశ్రమలకు తగ్గిన ఖర్చులు – తయారీ, లాజిస్టిక్స్, రిటైల్ వంటి రంగాల్లో అంతర్రాష్ట్ర పన్ను అడ్డంకుల తొలగింపు, ఐటీసీ (ఇన్పుట్ పన్ను మినహాయింపు) కారణంగా ఖర్చులు తగ్గాయి.

పన్నుల వ్యవస్థను సరళతరం చేయడం, పన్నులను తగ్గించడం, చెల్లింపును మెరుగుపరచడం ద్వారా జీఎస్టీ భారతదేశ పన్నుల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చింది. ఇది అనేక పరిశ్రమలపై పన్ను భారాన్ని తగ్గించినప్పటికీ, కొన్ని రంగాలు, సేవలపై ఖర్చులు పెరిగాయి. కాలక్రమంలో జీఎస్టీ పన్నుల వసూళ్ళను క్రమబద్ధీకరించింది. వ్యాపారాల సమర్థతను పెంచింది, ఆర్థిక వృద్ధికి దోహదం చేసింది.

అశ్వనీ రాణా