Narendra Modi

అసాధ్యాలను సుసాధ్యం చేసిన మోదీ ప్రభుత్వం

Narendra Modi2025 ఫిబ్రవరి 8 చరిత్రాత్మకమైన రోజు. 26 ఏళ్ల తర్వాత దేశ రాజధాని ప్రాంతమైన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రగతిశీల, సమ్మిళిత, సుపరిపాలన నమూనా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ని ఓడించడమే కాకుండా ఆప్ కు ముందు 15 సంవత్సరాలు దిల్లీని పాలించిన కాంగ్రెస్ కూడా 70 అసెంబ్లీ సీట్లలో 67 సీట్లలో డిపాజిట్లు కోల్పోయేటట్టు చేసింది. అర్ధ శతాబ్దానికి పైగా దేశాన్ని పాలించిన అత్యంత శక్తిమంతమైన, దిగ్గజ రాజకీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతోంది. భారతదేశ స్వాతంత్య్ర సమరంలోను, స్వాతంత్య్రం అనంతరం తొలి దశాబ్దాల్లో దేశపాలనలోను కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్‌కు మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ వంటి శిఖర సమానులైన నాయకుల సారథ్యాన్ని పొందే అదృష్టం దక్కింది. కాని చివరికి ఆ పార్టీ కుటుంబం నడిపే సంస్థగా మారిపోయింది. 

కొత్తగా స్వాతంత్య్రం పొందిన భారత్ తన కాళ్లపై తాను నిలబడాలని ఆకాంక్షించింది. కానీ అలా ఎప్పుడూ జరగలేదు. లైసెన్స్ రాజ్ వంటి పెడధోరణులకు దారితీసిన తప్పుడు ఆర్థిక విధానాలు, ఆ సమయంలో వ్యవస్థాగత అసమర్థతలు ఆర్థిక వృద్ధిలో స్తబ్దతకు దారితీశాయి. ఈ తక్కువ స్థాయి వృద్ధి రేటుకు ‘హిందూ వృద్ధి రేటు’గా ముద్రవేశారు. ఈ పదం అవమానకరమైనది, తప్పుదారి పట్టించేది. వృద్ధిలో వెనుకబాటుకు కారణం మితిమీరిన ప్రభుత్వ నియంత్రణే కాని సాంస్కృతిక లేదా మతపరమైన అంశాలు కాదు. దురదృష్టవశాత్తూ ఒక్క కాంగ్రెస్ నేత కూడా ఈ అన్యాయమైన ముద్రను ఖండించలేదు. 1966లో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ వారసుడు, భారత రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఆకస్మిక మరణం ఇందిరా గాంధీ రాజకీయ ఎదుగుదలకు దారితీసింది. భారతదేశపు అత్యంత ప్రభావవంతమైన ప్రధానులలో ఒకరిగా ఆమెకు పేరుంది. కానీ ఇందిరాగాంధీ పేరు చెప్పగానే చాలామందికి మొదట గుర్తుకు వచ్చేది ఎమర్జెన్సీ, పౌరహక్కుల అణచివేత, పత్రికలపై సెన్సారు కత్తి, ప్రతిపక్ష నేతలను జైళ్లలో పెట్టడం. ఎమర్జెన్సీ కాలంలో విస్తృతంగా మానవ హక్కుల ఉల్లంఘన, మురికివాడల కూల్చివేతలు, బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరిగాయి. చట్టబద్ధ పాలనకు బదులు అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలతో ఆమె ప్రభుత్వం నియంతృత్వానికి మారుపేరుగా మారింది. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి ఆమె యథేచ్ఛగా మీడియాపై కక్షసాధింపు చర్యలకు దిగారు. ప్రతిపక్షాల నేతృత్వంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేశారు.

అప్పుడు మన దేశం విపరీతమైన వైషమ్యాలను, కుంభకోణాలను, అల్లర్లను చూసింది. 2009 నుంచి 2014 వరకు కొనసాగిన యూపీఏ-2 ప్రభుత్వం విధాన స్తబ్దత, భారీ అవినీతి (2జి, బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ క్రీడలు) ద్రవ్యోల్బణం, నిరుద్యోగాల నియంత్రణలో దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. దాని పదవీకాలం ముగిసే సమయానికి ప్రభుత్వం అవినీతి కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయింది. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తారస్థాయికి చేరింది. అదే సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ సాధించిన విజయాలు, బిజెపి సుసంఘటిత ప్రచారం 2014 సార్వత్రిక ఎన్నికలలో పార్టీకి చరిత్రాత్మక విజయాన్ని అందించాయి. ప్రధాని మోదీ అసాధారణ ఎదుగుదల రాత్రికి రాత్రే సాధించిన విజయం కాదు. ఇది ఆయన పటిష్టమైన పనితీరు, దీర్ఘకాలిక దార్శనికత, పాలన విషయంలో ఆచరణాత్మక విధానాల ఫలితం. ఆయన హయాంలో వివిధ రంగాల్లో చోటుచేసుకున్న పెనుమార్పులు భారత ఆర్థిక వ్యవస్థను, పాలనను, ప్రపంచంలో భారత్ స్థానాన్ని విజయవంతంగా పునర్నిర్మించాయి. 

వస్తువులు, సేవల పన్నును (జీఎస్టీ) ప్రవేశపెట్టడం భారతదేశపు అత్యంత ముఖ్యమైన పన్ను సంస్కరణలలో ఒకటి. సువిశాలమైన మన దేశంలో జీఎస్టీ సజావుగా అమలు కావడం నిజంగా అసాధారణమైన విషయం ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు ఇది ఒక అధ్యయన అంశం కావాలి. 140 కోట్లమంది ప్రజలతో కూడిన బలమైన నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ చిన్నచిన్న మొత్తాలను కూడా డిజిటల్ గా చెల్లించేందుకు అలవాటుపడుతుందని కొన్నేళ్ళ క్రితం అసలు ఎవరైనా ఊహించారా? వాస్తవానికి, భారతదేశ మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం బ్యాంకులు, ఇంటర్నెట్, గ్రామాల్లో విద్యుత్తు లేకపోవడం వంటి కారణాలు చూపి యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆలోచనను సాక్షాత్తూ పార్లమెంటులో ఎగతాళి చేశారు. మన దార్శనిక ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వం కలలు కనగలిగింది, చివరికి అసాధ్యం అనుకున్నదాన్ని సాధించగలిగింది.

దశాబ్దాలుగా హిందుత్వ రాజకీయాలకు రామమందిర ఉద్యమం కేంద్ర బిందువుగా ఉంది. విశ్వాసం, చట్టం, రాజకీయాలను మేళవించిన ప్రధాని సామర్థ్యమే అత్యంత సంక్లిష్టమైన ఈ సమస్యను సజావుగా పరిష్కరించేందుకు దోహదపడింది. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠను సుసాధ్యం చేసింది. ప్రతిష్టాత్మక మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలు బలమైన మౌలిక సదుపాయాల కల్పనకు, దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచడానికి, కోట్ల ఉద్యోగాలను సృష్టించడానికి, ఎగుమతులను పెంచడానికి, భారత్‌ను ప్రధాన ప్రపంచ తయారీ గమ్యస్థానంగా నిలబెట్టడానికి సహాయపడ్డాయి. భారతీయులు ఇంత ఆత్మవిశ్వాసాన్ని, స్వావలంబనను ఎన్నడూ అనుభవించలేదు. 2014 నుంచి కోట్లమంది పేద, దిగువ మధ్యతరగతి భారతీయులను ఆదుకునేందుకు ఉద్దేశించిన వివిధ పథకాల కోసం 40,000 కోట్ల డాలర్లను వెచ్చించడం పేదల సంక్షేమం పట్ల ప్రస్తుత ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. ఎలాంటి లీకేజీలు లేకుండా ఇంత భారీ పరిమాణంలో కార్యక్రమాల అమలు, వనరుల కేటాయింపు ఏ ప్రభుత్వమూ ఇంతవరకు సాధించని గొప్ప విజయం.

కేంద్ర ప్రభుత్వ సానుకూల వైఖరి వల్లే జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి అధికరణం 370 రద్దు ప్రక్రియ సజావుగా సాగేందుకు దోహదపడింది. నిజాయితీతో కూడిన ఉద్దేశం, న్యాయ నైపుణ్యం, భద్రతా నియంత్రణల మేలి కలయిక ఫలితంగానే జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని స్వార్థపూరిత ఉద్దేశాలతో కొందరు రాజకీయ నాయకులు, వేర్పాటువాద బృందాలు వ్యతిరేకించినా అధికరణం 370 రద్దు విజయవంతమైంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడం, విదేశాంగ విధానం, చౌకగా బీమా, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, ఆధునిక విద్య, నైపుణ్య అభివృద్ధి … దేశవ్యాప్తంగా అన్ని రంగాలలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ప్రధాని మోదీ ప్రభుత్వం ‘కుటుంబం ముందు’ నుండి ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ గా ప్రాథమ్యాలను మార్చింది. గణతంత్రంగా అవతరించిన 75 ఏళ్ళ తర్వాత భారత్ ఇప్పుడు అభివృద్ధి పథంలో వేగంగా దూసుకు వెళుతోంది. మనం ఎక్కడా ఆగడం లేదు. చరైవేతి, చరైవేతి (ముందుకు సాగుతూనే ఉందాం, ముందుకు సాగుతూనే ఉందాం)!

దేవేంద్ర ఫడ్నవీస్,
మహారాష్ట్ర ముఖ్యమంత్రి