మనం రాజకీయాల కోసం రాలేదు, దేశం కోసం వచ్చాం
Posted On February 27, 2024
ఫిబ్రవరి 17, 18న రెండు రోజుల పాటు దిల్లీలోని భారత్ మండపం వేదికగా బిజెపి జాతీయ సదస్సు జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా సహా కేంద్రమంత్రులు, బిజెపి జాతీయ పదాధికారులు, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు, బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సదస్సులో నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాశాలు:
- ఇక్కడ జాతీయ మహాసభలకు హాజరైన, దేశంలోని ప్రతి మూలన ఉన్న ప్రతి బిజెపి కార్యకర్తను నేను అభినందిస్తున్నాను. ఒక బిజెపి కార్యకర్త సంవత్సరంలో ప్రతి రోజు 24 గంటలూ దేశానికి సేవ చేయడానికి ఏదో ఒకటి చేస్తాడు. అయితే ఇప్పుడు రాబోయే 100 రోజులు కొత్త శక్తితో, కొత్త ఉత్సాహంతో, కొత్త విశ్వాసంతో పని చేయాలి.
- రాబోయే 100 రోజుల్లో మనమంతా ఏకం కావాలి, ప్రతి కొత్త ఓటరును, ప్రతి లబ్ధిదారుడిని, ప్రతి వర్గాన్ని, ప్రతి సమూహాన్ని, ప్రతి వర్గాన్ని చేరుకోవాలి, అందరి విశ్వాసాన్ని పొందాలి. అందరి సమష్టి కృషితో దేశానికి సేవ చేయడానికి బిజెపికి గరిష్ట సంఖ్యలో సీట్లు వస్తాయి.
- నేను నడ్డాజీని, ఆయన మొత్తం బృందాన్ని, మీ అందరినీ అభినందిస్తున్నాను. పదాధికారుల సమావేశంలో సంవత్సరంలో చేసిన పని గురించి నివేదిక వింటున్నప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ బిజెపి కార్యకర్తలు సమాజం కోసం చాలా కష్టపడుతున్నట్టు స్పష్టమైంది. పగలు, రాత్రి పరుగెత్తండి. సంక్షోభాల మధ్య కూడా పని చేయండి. అది భారతమాత వైభవం కోసం మాత్రమే చేయండి. ఈ రెండు రోజులు జరిగిన చర్చలు దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం మన సంకల్పాన్ని దృఢపరిచాయి.
- ఈ రోజు, దేశ ప్రజలందరి తరఫున సద్గురు శిరోమణి ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహారాజ్‌కి నివాళులు అర్పిస్తున్నాను. ఆయన మరణవార్త తెలియగానే ఆయన అనుచరులం శోకసంద్రంలో మునిగితేలుతున్నాం. నాకు అది వ్యక్తిగత నష్టంలా అనిపిస్తుంది. చాలా సంవత్సరాలుగా, నేను చాలా సార్లు ఆయనను వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశం కలిగింది. ఆయన దర్శనం, మార్గదర్శకత్వం పొందడం నా అదృష్టం. 50 ఏళ్లకు పైగా దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక దిగ్గజాలకు దగ్గరగా ఉండి వారి ఆశీస్సులు పొందే అవకాశం లభించడం నా అదృష్టం. అందుకే ఆ ఆధ్యాత్మిక ప్రపంచం శక్తి నాకు బాగా తెలుసు, నేను దాన్ని అర్థం చేసుకున్నాను, అనుభూతి చెందాను. ఆయన దిగంబర సంప్రదాయానికి చెందినవాడు అని వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన జీవితం ఎలా ఉండేదో మనకు తెలుసు.
- కానీ ఏదైనా ముఖ్యమైన సంఘటన జరిగినప్పుడు లేదా నేను ఏదైనా ముఖ్యమైన పనిలో నిమగ్నమైనప్పుడు 24 గంటల్లోనే నేను దానిని విశ్లేషించి ఆయన నుంచి సందేశాన్ని పొందుతాను. ఆయన తన పరమోన్నత ఆధ్యాత్మిక ప్రస్థానం తర్వాత కూడా ఎల్లప్పుడూ మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. ఆయన తన జీవితాంతం అటువంటి సౌమ్యతతో ప్రజలను కలవడం కొనసాగించారు. మన యువతకు సంప్రదాయాలతో అనుబంధాన్ని ఏర్పరిచి పేదలకు విద్య, వైద్య సదుపాయాలు కల్పించారు. పేదలు, అణగారిన వర్గాల కోసం పని చేయాలని సంకల్పించిన ప్రతి వ్యక్తికి అతని జీవితమంతా ఒక ప్రేరణ. నేడు, భారతదేశం ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నప్పుడు, ఆయన సూత్రాలు, ఆశీస్సులు భారతభూమికి స్ఫూర్తినిస్తాయని విశ్వసిస్తున్నాను.
- గత పదేళ్లలో భారతదేశం సాధించిన ప్రగతి, భారీ లక్ష్యాలను సాధించగల ధైర్యం అపూర్వమైనవి. ఇది నేను చెప్పే మాట కాదు, ప్రపంచమే గట్టిగా చెబుతోంది. నేడు ప్రతి రంగంలోను భారత్ అధిరోహించిన శిఖరాలు ప్రతి పౌరుడికి ఒక కొత్త సంకల్పాన్ని నిర్దేశిస్తాయి. ఇప్పుడు దేశం చిన్నచిన్న కలలు కనదు, చిన్న చిన్న తీర్మానాలు చేయదు. స్వప్నాలు, తీర్మానాలు కూడా భారీగా ఉంటాయి. భారత్ అభివృద్ధి మనందరి సంకల్పం కూడా. ఈ సంకల్పాల సాకారానికి రాబోయే ఐదేళ్ల కాలం చాలా కీలకం. రాబోయే ఐదేళ్ళలో భారతదేశం మునుపటి కంటే చాలా రెట్లు వేగంగా పని చేయాలి. ఈ కాలంలో మనం అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం దిశగా పెద్ద ముందడుగు వేయాలి. కానీ అన్ని లక్ష్యాలను సాధించడానికి మొదటి షరతు ఏమిటంటే బిజెపి మరింత బలోపేతమై తిరిగి అధికారంలోకి రావడం. ఈరోజు విపక్ష నాయకులు ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎన్డీయే 400 సీట్లు దాటాలంటే బిజెపి 370 మైలురాయిని దాటాలి.
- చాలామంది తరచుగా నాతో అంటూ ఉంటారు, “మోదీజీ, మీరు చాలా చేశారు. మీరు ఏ పెద్ద తీర్మానాలు తీసుకున్నా వాటిని నెరవేర్చారు. ఇప్పుడెందుకు ఇంత పరుగు” అని. పదేళ్ల మచ్చ లేని పాలన, 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి విముక్తం చేయడం మామూలు విజయం కాదని దేశం మొత్తం విశ్వసిస్తోంది. మనం దేశాన్ని మెగా కుంభకోణాలు, ఉగ్రవదాడుల భయం నుంచి విముక్తం చేశాం. పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేశామని దేశం మొత్తం విశ్వసిస్తుంది. అయితే ఇక చాలు అనుకునే వారికి ఓ పాత సంఘటన చెప్పాలనుకుంటున్నాను. రెండోసారి ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఒక నాయకుడిని కలిశాను. మోదీజీ, ప్రధాని కావడం చాలా పెద్ద విషయం, మీరు అయ్యారు. మీరు చాలా దశాబ్దాలుగా పార్టీలో పని చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పని చేశారు. మీరు మళ్లీ ప్రధానిగా వచ్చారు. ఇప్పుడు ఇక కూర్చోండి, విశ్రాంతి తీసుకోండి, మీరు చేసింది సరిపోయింది అన్నారు. ఆయన తన రాజకీయ అనుభవం ఆధారంగా ఆ నిర్ధారణకు వచ్చారు.
- కానీ మనం రాజకీయాల కోసం రాలేదు, దేశం కోసం వచ్చాం. మనం ఛత్రపతి శివాజీ మహారాజ్‌ని నమ్మేవాళ్లం. శివాజీ మహారాజ్ కి పట్టాభిషేకం చేసినప్పుడు అయన ‘నేనిప్పుడు ఛత్రపతిని అయ్యాను, అధికారం వచ్చింది. దీన్ని అనుభవిస్తాను,” అనలేదు. ఆయన తన కర్తవ్యాన్ని కొనసాగించాడు. ఆయనే నాకు స్ఫూర్తి. నేను నా సుఖసంతోషాల కోసం జీవించే వ్యక్తిని కాదు. అధికారాన్ని అనుభవించడం కోసం బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదు. నేను దేశం కోసం ఒక సంకల్పంతో పని చేస్తున్న వ్యక్తిని. నేను కేవలం నా సొంత ఇంటి గురించి మాత్రమే ఆందోళన చెంది ఉంటే ఈ రోజు కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఉండేవాడిని కాదు. దేశంలోని కోట్ల మంది పిల్లల భవిష్యత్తు కోసమే నేను జీవిస్తున్నాను, జాగృతమై ఉంటూ పోరాడుతున్నాను. కోట్ల మంది యువత, సోదరీమణులు, కోట్లాది పేద ప్రజల కల మోదీ సంకల్పం. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మనమంతా సేవా స్ఫూర్తితో రేయింబవళ్ళు పని చేస్తున్నాం. ఈ పదేళ్ళలో మనం సాధించింది కేవలం ఒక మైలురాయి. గమ్యాన్ని చేరుకోవడానికి ఒక కొత్త ఆత్మవిశ్వాసం, మన దేశం కోసం, కోట్ల మంది మంది భారతీయుల కోసం, ప్రతి భారతీయుడి జీవితాన్నీ మార్చడం కోసం మనం ఇంకా చాలా చేయాల్సి ఉంది. కలలు ఉన్నాయి. వాటిని సాధించాలన్న సంకల్పం ఉంది. దీని కోసం అనేక నిర్ణయాలు తీసుకోవడమే తరువాయి.
- అభివృద్ధి చెందిన భారత్ ను నిర్మించే శక్తిగా నేడు బిజెపి యువశక్తిని, మహిళాశక్తిని, పేదలను, రైతు శక్తిని తయారు చేస్తోంది. గతంలో ప్రభుత్వాలు మారుతాయి కానీ వ్యవస్థ మారదు అని భావించేవారు. సామాజిక న్యాయం నిజమైన అర్థంలో మనం పాత ఆలోచన, పాత విధానం నుంచి ప్రతి వ్యవస్థను విముక్తం చేశాం. గతంలో ఎవరికీ పట్టని వారి పట్ల మనం శ్రద్ధ తీసుకున్నాం. ఇది మాత్రమే కాదు, వారిని పూజించాం. గిరిజనుల్లో అత్యంత వెనుకబడిన గిరిజనులల కోసం ప్రధానమంత్రి జన్ మన్ యోజనను రూపొందించాం. లక్షలాది విశ్వకర్మ కుటుంబాల గురించి ఎవరూ పట్టించుకోలేదు. వారి కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని రూపొందించాం. వీధి వ్యాపారులు, ఫుట్‌పాత్‌లపై పని చేస్తున్న లక్షల మంది గురించి ఎవరూ ఆలోచించలేదు. వారి కోసం ప్రధాన మంత్రి స్వనిధి పథకాన్ని తెచ్చాం.
- గత ప్రభుత్వాలు మహిళల ప్రయోజనాలను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదు. ఆడపిల్లలను కడుపులోనే చంపడం మన దేశంలో చాలా పెద్ద సమస్య. దీని కోసం మనం సామాజిక స్పృహ కలిగించడంతో పాటు కఠినమైన చట్టాలను తీసుకువచ్చాం. దేశంలో మొదటిసారిగా బేటీ బచావో, బేటీ పఢావో వంటి ప్రజాఉద్యమం ప్రారంభమైంది. ఇది చాలా విస్తృత ప్రభావాన్ని చూపింది. బాలికలు, మహిళల పోషకాహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. గర్భిణీ స్త్రీలకు సరైన సహాయం అందేలా మనం పోషకాహార ప్రచారాన్ని నిర్వహించాం. ఆరోగ్యకరమైన స్త్రీ మాత్రమే ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తుంది. గర్భధారణ సమయంలో మహిళలకు సరైన పోషకాహారం అందించడానికి, మాతృ వందన యోజన కింద 3.25 కోట్ల మందికి పైగా సోదరీమణులకు ప్రత్యక్ష సహాయం అందించాం. సురక్షిత మాతృత్వ ప్రచారం కింద సుమారు ఐదు కోట్ల మంది గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు చేశాం. తల్లి, బిడ్డ ఇద్దరి జీవితాలకు ముప్పు తగ్గించడానికి ఈ ప్రయత్నం జరిగింది. 2014కి ముందు మహిళల భద్రతపై చాలా ఆందోళనలు ఉండేవి. మేం అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు మరణశిక్ష పడేలా చట్టాలు మార్చాం. ఇలాంటి కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశాం.
- ఎర్రకోట నుంచి మరుగుదొడ్డి అంశాన్ని ప్రస్తావించిన తొలి ప్రధానిని నేనే. మహిళల పట్ల అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంపై ఎర్రకోట నుంచి అసంతృప్తిని వ్యక్తం చేసిన తొలి ప్రధానిని కూడా నేనే. మహిళల గౌరవం, వారి పట్ల మర్యాద మనకు చాలా ముఖ్యం. గత పదేళ్ళలో బిజెపి ప్రభుత్వం మహిళల జీవితాలను సులభతరం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నందుకు నేను గర్వపడుతున్నాను. పది కోట్ల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. నాలుగు కోట్ల ఇళ్లు కట్టిస్తే వాటిలో మూడు కోట్లకు పైగా ఇళ్లు మహిళల పేర్లతో నమోదై ఉన్నాయి. మరో 3 కోట్ల ఇళ్లను మహిళల పేర్లతో రిజిస్టర్ చేశాం. పది కోట్ల కుటుంబాలలోని అక్కాచెల్లెళ్లకు తొలిసారిగా నల్లా నీటిని అందించాం. పన్నెండు కోట్ల కుటుంబాలలోని అక్కాచెల్లెళ్లకు మరుగుదొడ్లు ఇచ్చాం. శానిటరీ ప్యాడ్ల ను రూ.1 కి ఇచ్చే సువిధ పథకాన్ని ప్రారంభించాం. 25 కోట్ల మందికి పైగా మహిళలకు బ్యాంకు ఖాతాలు తెరిచాం. మహిళా లబ్ధిదారులకు రూ.30 కోట్లకు పైగా ముద్రా రుణాలు ఇచ్చాం.
- మేం మన సోదరీమణులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి, ఆడబిడ్డలు ఉద్యోగాలు పొందేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. పది కోట్ల మంది మహిళలను స్వయం సహాయక బృందాలతో అనుసంధానం చేశాం. కోటి మంది సోదరీమణులను ‘‘లఖ్ పతి దీదీ’’లను చేసాం. ఖాదీకి లభించిన కొత్త వైభవం నుంచి గ్రామీణ సోదరీమణులు ఎక్కువ ప్రయోజనం పొందారు. మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవు 26 వారాలకు పెంచాం. ఇంతకు ముందు ఫ్యాక్టరీలు లేదా ఇతర ప్రదేశాలలో మహిళలు రాత్రి షిఫ్టులలో పని చేయడానికి అనేక అడ్డంకులు ఉండేవి. కార్మిక చట్టాలను సంస్కరించడం ద్వారా వీటిని కూడా తొలగించాం. పారామిలటరీ బలగాల్లో మహిళల నియామకాన్ని రెట్టింపు చేశాం. సైనిక దళాల్లో ముందు వరుసలో మహిళల మోహరింపునకు వీలు కల్పించాం. మేం ఆడపిల్లల కోసం సైనిక్ స్కూల్స్ మిలిటరీ అకాడమీల తలుపులు తెరిచాం.
- ఈ 10 సంవత్సరాల్లో సాహసోపేతమైన, దూరదృష్టి గల నిర్ణయాలలు తీసుకున్నాం. శతాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసే సాహసం చేశాం. అయోధ్యలో రామమందిరం నిర్మించడం ద్వారా ఐదు శతాబ్దాల నిరీక్షణకు తెరపడింది. గుజరాత్‌లోని పావగఢ్‌లో 500 ఏళ్ల తర్వాత ధార్మిక పతాకాన్ని ఎగురవేశారు. ఏడు దశాబ్దాల తర్వాత మేం కర్తార్‌పూర్ సాహెబ్ హైవేని ప్రారంభించాం. 70 ఏళ్ళ నిరీక్షణ తర్వాత దేశానికి అధికరణం 370 నుంచి స్వేచ్ఛ లభించింది. సుమారు ఆరు దశాబ్దాల తర్వాత, రాజ్‌పథ్ మార్గం కొత్త రూపంలో ఉద్భవించింది. నాలుగు దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు సైనిక దళాల ‘ఒకే ర్యాంక్ ఒకే పెన్షన్’ డిమాండ్ నెరవేరింది. మూడు దశాబ్దాల తర్వాత దేశానికి కొత్త జాతీయ విద్యా విధానం వచ్చింది. 30 ఏళ్ళ తర్వాత ఎట్టకేలకు లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లు లభించాయి. ట్రిపుల్ తలాక్ అనే దుర్మార్గానికి వ్యతిరేకంగా కఠిన చట్టాన్ని రూపొందించే ధైర్యం కూడా చేశాం. కొత్త పార్లమెంటు భవనం అవసరమని దశాబ్దాలుగా భావించినా ఇప్పుడు దానిని మనమే నెరవేర్చాం. ఇలాంటి ఎన్నో విజయాలకు సాధనంగా నిలవడం ప్రతి బిజెపి కార్యకర్త అదృష్టం.
- మన ప్రతిపక్ష పార్టీలకు పథకాలను ఎలా పూర్తి చేయాలో తెలియక పోవచ్చు కానీ తప్పుడు వాగ్దానాలు చేయడంలో దిట్టలు. మనం చేస్తున్న వాగ్దానాన్ని ఉచ్ఛరించదానికి సైతం ప్రతిపక్షాలు భపడుతున్నాయి. అది వికసిత్ భారత్ అనే వాగ్దానం. వీరు భారతదేశాన్ని అభివృద్ధి చేయలేమని అంగీకరించారు. ఇటువంటి కలలు కన్న ఏకైక పార్టీ బిజెపి. దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య సంబరాలు జరుపుకునే 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి మనం ఒక కర్తవ్య దీక్షతో పని చేస్తున్నాం. మూడో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలని సంకల్పించాం. ఇది మోదీ హామీ. భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా మార్చడం గురించి మాట్లాడేటప్పుడు దానికి చాలా లోతైన అర్థం కూడా ఉంది. దీని అర్థం భారతదేశ ఆర్థిక, వ్యూహాత్మక, సాంస్కృతిక సామర్థ్యాన్ని అనేక రెట్లు అన్ని దిశలలో విస్తరించడం.
- దీని కోసం మనం ఎంత వేగంగా పని చేస్తున్నామో కూడా లెక్కించడం అవసరం. భారత్ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి (ఈ సంఖ్యను గుర్తుంచుకోండి) దాదాపు 60 సంవత్సరాలు పట్టింది. 2014లో దేశ ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు రెండు ట్రిలియన్ల స్థాయి కూడా చాలా పెద్దదిగా అనిపించింది. కానీ 10 ఏళ్లలో మన ఆర్థిక వ్యవస్థకు రెండు ట్రిలియన్ డాలర్లు చేర్చాం. ఒకటికి 60 సంవత్సరాలు పట్టగా 10 సంవత్సరాలలో మరో రెండు ట్రిలియన్లు చేర్చాం. భారతదేశం ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పుడు, వారు 10 నుండి 11కి తీసుకువెళ్ళి దేశాన్ని బలహీనం చేశారు. మనం దానిని 11 నుండి ఐదుకి తీసుకువచ్చాం.
- నేడు భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మౌలిక సదుపాయాల బడ్జెట్ రూ.11 లక్షల కోట్లు దాటుతోంది. దీని వల్లే నేడు పేదలకు కోట్ల సంఖ్యలో ఇళ్లు కట్టిస్తున్నాం. నేడు పేదల ఇళ్లకు తాగునీరు అందుతోంది. దేశంలో రికార్డు స్థాయిలో వైద్య కళాశాలలు, ఆస్పత్రులు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు నిర్మిస్తున్నాం. గ్రామాల వరకు రోడ్లు నిర్మిస్తున్నాం. ప్రపంచంలోని మూడు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా చేరితే, అభివృద్ధి పనులకు మన దగ్గర ఇంకా ఎంత మూలధనం ఉంటుందో ఊహించుకోవచ్చు.
- ఈ రోజు దేశంలోని యువత కూడా వికసిత్ భారత్ అభియాన్ పగ్గాలు చేపట్టడం సంతోషంగా ఉంది. గత ఒకటిన్నర సంవత్సరాలలో భారత్ అభివృద్ధి చెందాలనే సంకల్పానికి సూచనలు ఆహ్వానించగా ఇప్పటి వరకు 15 లక్షల మందికి పైగా ప్రజలు అభివృద్ధి చెందిన భారతదేశం ఎలా ఉండాలి, మార్గం ఎలా ఉండాలి, కార్యక్రమాలు, విధానాలు ఎలా ఉండాలి అనే విషయాల గురించి చర్చించారని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. ప్రజలు తమ ఆలోచనలను ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ 15 లక్షల మందిలో సగం మంది 35 ఏళ్ల లోపు వారే. యువతరం ఆలోచనతో మనం ముందుకు సాగుతున్నాం. ఈ లక్షలాది మంది యువత అభివృద్ధి చెందిన భారతదేశం రోడ్‌మ్యాప్‌ను సూచించారు.
- నేడు దేశంలో ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ అనే భావన పట్ల ఇంత అంకితభావంతో ఉన్న ఏకైక పార్టీ బిజెపి మాత్రమే. గత నెలలో (జనవరి 2024) నా అనుభవాలను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సమయంలో శ్రీరామునికి సంబంధించిన అనేక ప్రదేశాలను సందర్శించే అవకాశం నాకు లభించింది. నా 11 రోజుల క్రతువు సమయంలో నేను నాసిక్, లేపాక్షి, త్రిప్రయార్, శ్రీరంగం, రామేశ్వరం ధనుష్కోటి వంటి ప్రాంతాలకు సాధారణ అన్వేషకుడిగా వెళ్లాను. ఈ సమయంలో దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి నాకు లభించిన ప్రేమ, ఆశీర్వాదాలను నేను మాటల్లో చెప్పలేను. నేను వీధుల గుండా వెళుతున్నప్పుడు, ప్రజలు తమ మాటలతో, భావాలతో నాపై వారి ఆశీస్సులను కురిపించారు. ఈ సమయంలో నాకు కంభ రామాయణ పారాయణం వినే అవకాశం లభించింది. 800 సంవత్సరాల క్రితం మహాకవి కంబన్ తన రామాయణాన్ని రచించిన ప్రదేశంలోనే ఇది జరిగింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే భావాన్ని పూర్తిగా మూటగట్టుకున్న అద్భుతమైన క్షణం ఇది. వివిధ మార్గాల్లో మన దేశ ప్రజలను మరింత చేరువ చేసేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం.
- ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి మన పాలనలో కూడా కనిపిస్తుంది. ప్రతి ప్రాంత అభివృద్ధిపైనా మనం పూర్తిగా దృష్టి పెడతాం. ఈశాన్య ప్రాంత ఉదాహరణ మీ ముందు ఉంది. గత ప్రభుత్వాలు ఈశాన్య ప్రాంతాలను పూర్తిగా విస్మరించాయి. పార్లమెంటులో సీట్లు తక్కువగా ఉన్నందున వారికి శ్రద్ద లేకపోయింది. ఓట్లు, సీట్లు చూసి మేం పని చేయం. దేశంలోని ప్రతి మూల సుభిక్షంగా అభివృద్ధి చెందాలి. ఇదే మన భావన. నేడు సియాచిన్ అయినా, దేశంలోని ఆకాంక్షభరిత జిల్లాలైనా మనకు దూరం కావు. ఇంతకు ముందు ‘చివరి గ్రామాలు’ అని పిలిచే గ్రామాలే మనకు దేశంలోని ‘మొదటి గ్రామాలు’గా మారాయి. నా క్యాబినెట్ మంత్రులందరూ ఆ గ్రామాల్లో రాత్రి గడిపారు. కొందరు మైనస్ 15 డిగ్రీలలో ఉండవలసి వచ్చింది. ఎందుకంటే సమ్మిళితం కావాలి. దేశంలోని ప్రతి భాగం మనకు ముఖ్యం, మన దృష్టి ప్రతి భాగంపై ఉంటుంది.
- కాంగ్రెస్ నుండి దేశాన్ని రక్షించడం, దేశంలోని ప్రతి పౌరుడిని రక్షించడం ప్రతి ఒక్క బిజెపి కార్యకర్త బాధ్యత. కాంగ్రెస్ చరిత్ర మనందరి ముందు ఉంది. కాంగ్రెస్ అస్థిరతకు తల్లి. కాంగ్రెస్ కుటుంబ పాలనకు మూలం. కాంగ్రెస్ అవినీతికి, బుజ్జగింపు రాజకీయాలకు తల్లి. 70వ దశకంలో దేశంలో కాంగ్రెస్‌పై కోపం పెరగడం ప్రారంభించినప్పుడు, అది తనను తాను రక్షించుకోవడానికి అస్థిరతను ఆశ్రయించింది. కాంగ్రెస్ ప్రతి నాయకుడి ప్రభుత్వాన్ని అస్థిరపరిచింది. నేటికీ ఈ వ్యక్తులు అస్థిరత సృష్టించేందుకు కొత్త కుట్రలు పన్నుతున్నారు. ఇంతమంది కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమికి అస్తిత్వం కూడా ఇదే. కాంగ్రెస్‌కు అభివృద్ధి ఎజెండా లేదా భవిష్యత్తు కోసం రోడ్‌మ్యాప్ లేదు. ఒక్కోసారి భాషా ప్రాతిపదికన, కొన్నిసార్లు ప్రాంతాల ఆధారంగా దేశాన్ని విభజించే పనిలో నిమగ్నమై ఉంటుంది.