Finance Minister Nirmala Sitaraman

నిధులలో దక్షిణాదికి అన్యాయం అనే వాదన అసంబద్ధం

FM Nirmala Sitaraman

నరేంద్ర మోదీ రెండవ ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్‌ వరుసగా 6వ బడ్జెట్‌ను సమర్పించారు. ఈ మధ్యంతర లేదా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో వివిధ ఆర్థిక అంశాలపై పాక్షికమైన చర్యలేమీ తీసుకోలేదని, జూలైలో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు సమగ్రమైన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉందని, ద్రవ్యోల్బణాన్ని సమర్థంగా నియంత్రించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:

ప్ర: కోవిడ్ మహమ్మారి, ఇతర సమస్యల కారణంగా మీరు ఆర్థిక మంత్రిగా సంక్షోభాల కాలంలో పని చేశారు. ఇన్నేళ్ళలో మీ పనితీరుపై మీ అంచనా ఎలా ఉంది? మీ పదవీకాలంలో ఇది ఉత్తమ సంవత్సరంగా భావిస్తున్నారా?

జ: కోవిడ్ తర్వాత, ఆర్థిక వ్యవస్థ దాని స్వతసిద్ధమైన బలాన్ని చూపుతోంది. దాని ఫలితమే పెట్టుబడులు, విలీనాలు, కొనుగోళ్లు, చిన్న వ్యాపారాల పునరుద్ధరణ. సూక్ష్మ, చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇలు) తమకు ప్రభుత్వం కల్పించిన ద్రవత్వ (లిక్విడిటీ) సదుపాయాన్ని చాలా తెలివిగా, పొదుపుగా ఉపయోగించుకున్నందుకు వారిని అభినందించాలి. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సమస్యల నుంచి బయటపడి తన నిజమైన సామర్థ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసింది. ఈ ఘనత పూర్తిగా ప్రజలదీ, వారు కనబరిచిన ఉత్సాహానిదే. అదే లేకపోతే, వేగంగా ఎదుగుతూ ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో నిలవడం సాధ్యం కాదు.

ప్ర: ఐదేళ్ల క్రితం పీఎం-కిసాన్, పన్ను రాయితీలు మధ్యంతర బడ్జెట్‌లో భాగంగా ఉన్నాయి. ఈసారి చాలా సంయమనం పాటించి మీరు ఓట్ ఆన్ అకౌంట్‌ను సరళంగా ఉంచారు. ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందన్న గట్టి నమ్మకంతోనేనా?

జ: మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కోణంలో చూసినట్లయితే ఆయన ఎప్పుడూ సంయమనంతో కూడిన ఆర్థిక నిర్వహణను అనుసరించారు. అది ఆయన శైలి. ప్రపంచ పెట్టుబడిదారులను ఆహ్వానించినా, వెళ్లి రైతులతో కూర్చుని, పశుపోషణ మొదలుకొని నీటి సమస్యల వరకు ప్రతి విభాగానికి హాజరైనా నిధులను అభిలషణీయమైన స్థాయిలో ఎలా ఖర్చు చేయాలన్నదానిపై స్పష్టంగా ఉండేవారు. కాబట్టి, సామాజిక సంక్షేమం, సమ్మిళిత వృద్ధికి కీలకమైన ప్రాజెక్ట్‌లను త్యాగం చేయకుండా ప్రభుత్వ ఖాతాలను పారదర్శకంగా ఉంచే, వివేకంతో వ్యవహరించే ధోరణిని ఎల్లప్పుడూ బిజెపి ప్రభుత్వాలు అనుసరిస్తాయి. ప్రారంభంలోనే నాకు ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి, పారదర్శకతను కొనసాగించండి, ప్రతి విషయాన్ని పుస్తకాలలో ఉంచండి అని. పైగా ఇది కేవలం మధ్యంతర బడ్జెట్ మాత్రమే.

ప్ర: రెవెన్యూ వ్యయాన్ని మెరుగుపర్చుకొని కూడా ద్రవ్యలోటు విషయంలో చట్టం నిర్దేశించిన పరిమితిలోనే ఉండే అవకాశం ఉన్నా ఎందుకు దాన్ని ఉపయోగించుకోలేదు?

జ: దానికి ఈ బడ్జెట్ సరైన సమయం కాదు, జూలైలో వచ్చే సమగ్ర బడ్జెట్ లో దీని గురించి ఆలోచిస్తాం. ఇక్కడ అసమగ్రంగా ఏదైనా చేస్తే జూలైలో చేయవలసిన పని చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు కాకుండా జూలైలో సమగ్ర చర్యలు తీసుకుంటాం. 

ప్ర: ఫైనాన్స్ కమిషన్ అధికారాలను రాజ్యాంగంలో నిర్దేశించిన వాటికి మాత్రమే పరిమితం చేయడానికి కారణం ఏమిటి?

జ: విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక సంఘం తన ముందున్న బాధ్యత ఏమిటో పరిశీలించి, నిర్ణయాలు తీసుకుని, సిఫార్సులు చేయాలని మేం భావించాం. మనం ఎవరి పరిమితులను మార్చాల్సిన అవసరం లేదు. కోవిడ్ అనంతర కాలంలో ప్రపంచం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సమయంలో దేశ ప్రయోజనాలకు ఏది అనుకూలంగా ఉంటుందో వారు నిర్ణయించుకోవాలి.

ప్ర: మీరు భారీ నవకల్పన నిధిని ప్రకటించారు. ఇది ఎలా పని చేస్తుంది? దీని కింద ప్రధాన రంగాలు ఏవి?

జ: సంబంధిత శాఖలు పూర్తి వివరాలను రూపొందిస్తాయి. రాబోయే కొన్నేళ్లలో రూ.1 లక్ష కోట్లను కార్పస్‌గా ఉంచాలన్నది ఆలోచన. ఈ మొత్తాన్ని 50 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా అందిస్తాం. ఒక ఏజెన్సీ దానిని సమర్థంగా నిర్వహిస్తుంది. ప్రైవేట్ రంగంలో నవకల్పన, సంబంధిత కార్యకలాపాలను గుర్తిస్తుంది.

ప్ర: పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణపై ఇప్పుడు మీ వ్యూహంలో మార్పు కనిపిస్తోంది. మీరు ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల స్టాక్‌ విలువ పెంచడంపై ఎక్కువ దృష్టి సారిస్తున్నట్టు ఉంది?

జ: అది వ్యూహం మార్చుకోవడం కాదు. ఇది చేయడం మా కర్తవ్యం, కనుక చేస్తాం. మేం మా కంపెనీలను ప్రైవేటీకరించనందున అవి నష్టాలతో కునారిల్లాలని మేం అనుకోం. ఈలోగా అవి విలువ కోల్పోతే అది వాటికీ మంచిది కాదు, ప్రభుత్వానికీ మంచిది కాదు. 

ప్ర: జనాభా సంబంధిత సమస్యలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇది మొత్తం సమస్యల స్వరూపాన్ని పరిశీలిస్తుందని మీరు చెప్పారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆ తర్వాత ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ముసాయిదాను విడుదల చేసింది. ఇందులో జనాభా నియంత్రణ ఒక ప్రధాన అంశంగా ఉంది. మీరు ఏర్పాటు చేసే కమిటీ పరిశీలించే అంశాల్లో కూడా జనాభా నియంత్రణ ఒకటిగా ఉంటుందా?

జ: ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూసీసీ అమలుకు చర్యలు తీసుకోవడంపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నియమ నిబంధనలలో నేను చెప్పిన కమిటీ వివరాలు ఉంటాయి. హోం శాఖ న్యాయ మంత్రిత్వ శాఖతో కలిసి పని చేస్తోంది. మన జనాభా బలాన్ని మనం ఎలా ఉపయోగించుకోబోతున్నాం, సవాళ్లు ఎక్కడ ఉన్నాయి, వాటిని పరిష్కరించే వ్యూహం వంటి వాటి గురించి దీర్ఘకాలిక ప్రణాళికను పరిశీలించి ఆలోచించాలి. .

ప్ర: గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో అక్రమాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగ్ కూడా కొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ఈ పథకం స్వరూపంలో ఏదైనా మార్పులను పరిశీలిస్తున్నారా?

జ: రాష్ట్ర స్థాయిలో కొందరువ్యవస్థతో ఆడుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా ఏం సరిదిద్దగలరు? దానివల్ల ఫలితం శూన్యం. కొన్ని రాష్ట్రాలు దిద్దుబాట్లు చేయడానికి ఇష్టపడవు. మేమే లోపాలపై చూసీచూడనట్టు పోవాలని అంటున్నాయి. ఇది ఒక నైతిక అంశం. ఈ పథకాన్ని నిజాయితీగా ఉపయోగిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి, దీన్ని అవి ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాయి.

ప్ర: మీ బడ్జెట్ ప్రసంగంలో మీరు తూర్పు భారతదేశం గురించి మాట్లాడారు. తూర్పు భారతదేశం, దేశంలోని మిగిలిన ప్రాంతాల మధ్య అంతరం పెరిగింది, ఇది ఏ స్థాయికి చేరిందంటే తూర్పు భారతంలోని రాష్ట్రాలు తమ జనాభాను అదుపు చేసుకోలేక పోవడం వల్ల కేంద్రం వాటికి అంతకంతకు ఎక్కువగా రాయితీలు, నిధులు ఇస్తోందని, దీనివల్ల తమకు అన్యాయం జరుగుతోందని దక్షిణ భారతదేశంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీరు దీన్ని ఎలా చూస్తారు?

జ: ఇది అనారోగ్యకరమైన చర్చ. భారతదేశం అభివృద్ధి చెందాలి, దేశంలోని ప్రతి ప్రాంతం ఎదగాలి. మనం ఈ విభజన వాదనను ఆమోదించకూడదు. తాము సమకూర్చుతున్న సంపదతో సమానమైన వాటాను ఎవరూ డిమాండ్ చేయలేరు. ఈ వాదన స్వతహాగా వైరుధ్యంతో కూడుకొని ఉంది. రాష్ట్రాలలో కూడా ఎక్కువ సంపద సృష్టించే ప్రాంతాలు ఉంటాయి. వారు తమకు అధిక వాటా కావాలని అడగలేరు. ఈ వాదనను మరింత ముందుకు తీసుకువెళ్లి ఇలాగే కొనసాగితే మేం వేరుకుంపటి పెట్టుకుంటాం అనడం ఆమోదయోగ్యం కాదు. రెండవది, ఎంపీలుగా, ప్రజలు రాజ్యాంగంపై ప్రమాణం చేయలేదా? ఈ స్వరంలో మాట్లాడే ప్రతి రాష్ట్రం ఆత్మావలోకనం చేసుకోవాలి. కొన్ని నెలల క్రితం తమిళనాడు ఇలాగే మాట్లాడింది. తాము ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తున్నామని కోయంబత్తూరు ప్రాంతం స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటే తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలకు ఏం జరుగుతుంది? లేదా కర్ణాటకకు తాను ఇస్తున్న ఆదాయంతో సమానంగా తనకు నిధులు ఇవ్వాలని బెంగళూరు డిమాండ్ చేస్తే మిగతా రాష్ట్రం పరిస్థితి ఏమవుతుంది?