Vijaya Sankalpa Yatra G. Kishan Reddy, D.K. Aruna, Palamuru, PM Modi, BJP

మహాలక్ష్మీ లేదు.. మహారాజు లేదు.. వాళ్లు మాత్రం కుర్చీలో…

విజయ సంకల్ప యాత్రలో కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి ఫైర్

Kishan Reddy at Vijaya Sankalpa Sabha

తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అలవి కానీ హామీలు ఇచ్చిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. ‘‘నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కరెంటు బిల్లులు కట్టొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు… ఇంతవరకు అతీ గతీ లేదు. నేను రాగానే రైతులకు రుణమాఫీ, ఎకరానికి రూ.15,000, మహిళలకు రూ.2500 అని చెప్పారు. మహాలక్ష్మీ లేదు.. మహారాజు లేదు..వాళ్లు మాత్రం కుర్చీలో కూర్చున్నారు.’’ అంటూ విరుచుకుపడ్డారు. దేశంలో ప్రతి ఒక్కరూ నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. బిజెపి శ్రేణుల ఆనందోత్సాహాల మధ్య ఫిబ్రవరి 20న ఆయన కృష్ణమ్మ క్లస్టర్ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించారు. కార్యకర్తల జయజయధ్వానాలు, ప్రజల ఆశీస్సులతో యాత్ర ఉత్సాహంగా ముందుకు సాగింది.

విజయ సంకల్ప యాత్రకు బయలుదేరే ముందు హైదరాబాద్ కాచిగూడలోని తన నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా బషీర్ బాగ్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా కృష్ణ గ్రామం చేరుకున్న కిషన్ రెడ్డికి కృష్ణ నది వరకు బిజెపి నాయకులు, శ్రేణులు ర్యాలీగా వెళ్ళారు. కృష్ణ నదికి చేరుకున్న కిషన్ రెడ్డికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. నది ఒడ్డున కొలువై ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. కృష్ణమ్మ తల్లికి వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం యాత్రకు సమరశంకం పూరించారు. కృష్ణ గ్రామం నుంచి విజయ సంకల్ప యాత్ర ప్రారంభమైంది. కృష్ణ గ్రామం నుంచి ప్రారంభమైన యాత్ర.. కొత్తపల్లి, టై రోడ్, గూడె బల్లూరు, నల్లగుట్ట  గ్రామాల మీదుగా మగనూరు పట్టణానికి చేరుకుంది. ఉట్కూరులో రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. మక్తల్ రోడ్ షోలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మక్తల్ చౌరస్తాలో కిషన్ రెడ్డి, పురోషోత్తం రూపాల ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘2013లో తెలంగాణ  సాధన కోసం ఇక్కడ నుండే ప్రారంభించిన పోరు యాత్ర తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది. అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణలో కూడా మార్పు రావడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేస్తున్నాం. మోదీ దేశంలోని అనేక రకాల సమస్యలను పరిష్కరించారు. ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదు. మోదీ దేశంలోని పేద మహిళలకు కోట్లాది గ్యాస్ కనెక్షన్లు అందించారు. పేదలకు, మహిళలకు మోదీ షూరిటీ పెట్టి బ్యాంకు అకౌంట్లు తెరిపించారు. ప్రతీ పేదవాడికి ఉచితంగా 5 కేజీల బియ్యం… రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి అందిస్తున్నారు. యూరియా బస్తా మీద కేంద్రం రూ.1,300 సబ్సీడి ఇస్తుంది. పొదుపు సంఘాల మహిళలకు రూ.20 లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో పేదలకు వైద్యం అందిస్తున్నారు. జాతీయ రహదారులు వేస్తున్నారు. పేద ప్రజల కష్టాల తీర్చడానికి నరేంద్ర మోదీ పని చేస్తున్నారు. పేద కుటుంబంలో మోదీ పుట్టారు కాబట్టే పేద ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్నారు.

తొమ్మిదేళ్లు కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటే… ఇప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణను దోచుకొని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి వాడుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీకి ట్యాక్స్ కడుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ, అవినీతి, ప్రజలను మోసం చేసే పార్టీలు. యూపీఏ పాలనలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు.  హైదరాబాద్ లో బాంబు పేలుళ్లు, మత కలహాలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం అణచి వేసింది.

గత యూపీఏ హయాంలో దేశంలో కరెంటు కొరత ఉండేది. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దేశంలో కరెంటు కోతలు లేవు, ఎరువుల కొరత లేదు. వచ్చే పార్లమెంటు ఎన్నికలు తెలంగాణకు సంబంధించినవి కావు. దేశానికి సంబంధించిన ఎన్నికలు. ప్రజలంతా నరేంద్ర మోదీని ఆశీర్వదించాలి. మోదీకి అండగా నిలబడాలి. కాంగ్రెస్ డబ్బులకు ఓట్లు కొనే ప్రయత్నం చేస్తుంది. మన పిల్లల కోసం, దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం మోదీని ఎన్నుకోవాలి.’’ అని అన్నారు.

Vijaya Sankalpa Yatra G. Kishan Reddy, D.K. Aruna, Palamuru, PM Modi, BJP

భారత్ అగ్రగామి కావాలంటే మోదీ గెలవాలి : డి.కె. అరుణ

బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ మాట్లాడుతూ ‘‘భారతదేశం అగ్రగామిగా నిలవాలంటే నరేంద్ర మోదీ మళ్లీ గెలవాలి. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు. అలవి కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 100 రోజుల్లో 6 హామీలు అమలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు అమలు కాలేదు. మహిళలకు ఆర్టీసి బస్సులో ఉచితం ప్రయాణం అమలు చేసి ఆరు గ్యారెంటీలు అమలు చేశాం అంటున్నారు. ఆర్టీసి బస్సుతో గ్రామాల్లోని మహిళలకు ప్రయోజనం లేదు. ప్రజలకు ఏం చేస్తమో చెప్పి మాట మీద నిలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ. అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే పార్టీ కాదు. పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే వ్యక్తి నరేంద్ర మోదీ. పేద కుటుంబంలో పుట్టి ప్రధానిగా ఎదిగారు. నరేంద్ర మోదీ గారి ముందు రాహుల్ గాంధీ సరిపోతడా…? నరేంద్ర మోదీ ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. దేశంలోని పేద రైతులకు సబ్సీడి ఎరువులు, కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో  భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓట్లు వేసి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలను వేడుకుంటున్నా..’’ అని అన్నారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బలం అందించాలి : జితేందర్ రెడ్డి

ఈ యాత్రలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలోని ఏ గ్రామంలోకి వెళ్లినా మోదీ నామమే వినిపిస్తుంది. ప్రపంచ దేశాల ముందు 140 కోట్ల భారత ప్రజల గొప్పతనాన్ని చాటారు. ప్రతి పేదవాడికి 5కేజీల ఉచిత బియ్యం, గ్రామాల్లో వీధి లైట్లు, రోడ్లు కేంద్ర ప్రభుత్వ నిధులే. దేశంలో 140 ఎయిర్ పోర్టులు నిర్మించారు. ఉగ్రవాద పాకిస్తాన్ ని అణచి వేశారు.  ప్రతీ ఒక్కరు కమలం పువ్వు గుర్తుకు ఓట్లు వేసి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బలం అందించాలి.’’ అని అన్నారు.

ఈ యాత్రలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, రాష్ట్ర కోశాధికారి బి. శాంతి కుమార్, నాయకులు నాగూరావు నామోజీ తదితరులు పాల్గొన్నారు.