మేడారం జాతరకు రూ. 3.14 కోట్ల కేంద్ర నిధులు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ “సమ్మక సారక్క జాతర” నిర్వహణకు కేంద్ర నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. రూ. 3.14 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర పర్యాటక, గిరిజన మంత్రిత్వ శాఖలు ఆమోదం తెలిపాయి. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూ.2.30 కోట్లు, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ రూ. 0.84 కోట్లు విడదల చేయనున్నాయి. ఇప్పటికే మేడారంలో మౌలిక సదుపాయాల కల్పనకు, జాతర నిర్వహణకు కేంద్ర పర్యాటక, గిరిజన మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా రూ.18.50 కోట్లను ఖర్చు చేశాయి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేడారం చుట్టుపక్కల ఉన్న ములుగు, లక్నవరం, మేడవరం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత వాటర్ ఫాల్స్ వంటి ప్రాంతాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు “గిరిజన సర్క్యూట్” పేరిట రూ. 80 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించింది, ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేసింది. అమ్మవార్లకు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకోవడానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం జాతర జరిగే నాలుగు రోజుల పాటు, దక్షిణ మధ్య రైల్వే 30 ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది.