భారతీయ ఆత్మకు అద్దం పట్టే కొత్త నేర చట్టాలు
దాదాపు 77 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత నేర న్యాయ వ్యవస్థ పూర్తిగా దేశీయంగా మారుతోంది. భారతీయ నైతిక నియమావళికి అనుగుణంగా దీన్ని రూపొందించాం. 75 సంవత్సరాల తరువాత ఈ చట్టాలను లోతుగా పరిశీలించాం, సమీక్షించాం. జూలై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత వలస పాలన చట్టాలు రద్దయ్యి భారత పార్లమెంటులో చేసిన చట్టాలు అమల్లోకి వస్తాయి. ఈ చట్టాలు శిక్షకు బదులుగా న్యాయానికి ప్రాధాన్యమిస్తాయి. వేగంగా విచారణ జరిపి సత్వర న్యాయం అందించేందుకు వీలు కల్పిస్తాయి. విచారణ ఆలస్యం కాకుండా బాధితుల హక్కుల పరిరక్షణకు భరోసా ఉంటుంది. ఇంతకుముందు పోలీసుల హక్కులకు రక్షణ కల్పించగా, ఇప్పుడు బాధితులు, ఫిర్యాదుదారుల హక్కులకు రక్షణ కల్పించాం.
కొత్త దృక్పథంతో ఈ మూడు చట్టాలు జూలై 1 అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు భారతీయ శిక్షాస్మృతి, 1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత వచ్చింది, నేరస్మృతి, 1898 స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత వచ్చింది. భారతీయ సాక్ష్య అధినయం భారతీయ సాక్ష్యాధారాల చటం 1872 స్థానంలో వచ్చింది. కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ ఆత్మను కలిగి ఉంటాయని గట్టిగా చెప్పగలం. బ్రిటిష్ కాలం నుంచి వివాదాస్పదంగా ఉన్న అనేక సెక్షన్లను తొలగించి నేటి కాలానికి తగిన సెక్షన్లను వీటిలో చేర్చారు. భారతీయ పౌరులకు ఇబ్బందులు కలిగించే అనేక అంశాలను తొలగించి కొత్త నిబంధనలు చేర్చారు. అన్నింటిలో మొదటిది, మన రాజ్యాంగ స్ఫూర్తితో సెక్షన్లకు, అధ్యాయాలకు ప్రాధాన్యం ఇచ్చాం. మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలకు ప్రాధాన్యం ఇచ్చారు. దీనితో పాటు, ఆన్లైన్ ఎఫ్ఐఆర్ విధానంతో ఎన్నో వేధింపులను ఎదుర్కొంటున్న మహిళలకు భారీ ఊరట కలుగుతుందని భావిస్తున్నాం.
కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా మూక హత్యలకు (మాబ్ లించింగ్) సంబంధించి చట్టంలో ఎటువంటి నిబంధన లేదు. ఈ నిబంధన నేర చట్టాల్లో చేర్చాలని డిమాండ్ వినిపిస్తోంది. మొదటిసారిగా, మూక హత్యకు చట్టాల్లో నిర్వచనం ఇచ్చారు. ఇది కాకుండా, రాజద్రోహం అనేది బ్రిటిష్ వారి ప్రయోజనాల కోసం చేసిన చట్టం. ఆ సెక్షన్ ను కూకటివేళ్లతో సహా తొలగించేశాం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి కొత్త సెక్షన్లను తీసుకొచ్చాం. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటన చేయడం నేరం. ఇప్పుడు, భారతదేశం ఐక్యత, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలపై చర్య తీసుకోవడానికి చట్టం వీలు కల్పిస్తుంది. స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత చట్టాల్లో మార్పు వచ్చింది, ఇది మన రాజ్యాంగ స్ఫూర్తికి గొప్ప ప్రతీక. కొత్త క్రిమినల్ చట్టాలు ఆధునిక న్యాయ వ్యవస్థను సృష్టిస్తాయి. మూడు కొత్త చట్టాల్లో టెక్నాలజీకి చోటు కల్పించడమే కాక భవిష్యత్తులో అందుబాటులోకి రాగాల అన్ని సాంకేతికతలను ఇందులో పొందుపరిచే విధంగా నిబంధన కూడా రూపొందించారు.
కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తయింది. 99.9 శాతం పోలీస్ స్టేషన్లను కంప్యూటరీకరించారు. 2019లో ఇ-రికార్డ్లను రూపొందించే ప్రక్రియను మొదలుపెట్టాం. జీరో ఎఫ్ఐఆర్, ఇ-ఎఫ్ఐఆర్, ఇ-ఛార్జ్‌షీట్, ఇవన్నీ డిజిటల్ గానే ఉంటాయి. చిన్న పెన్ డ్రైవ్‌లో లక్ష పేజీల చార్జిషీట్ ను సమర్పించవచ్చు. ఈ చట్టాలతో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన బాధితుడి కేసు పురోగతి దానంతట అదే 90 రోజుల్లో ఆన్లైన్లో ఉంచబడుతుంది. కొత్త చట్టాలలో 7 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్షార్హమైన నేరాలలో ఫోరెన్సిక్ విచారణ తప్పనిసరి చేశారు. ఇది త్వరగా న్యాయాన్ని అందిస్తుంది, నేర నిర్ధారణ రేటును 90 శాతానికి తీసుకువెళ్లేందుకు దోహదం చేస్తుంది. ఇ-వాంగ్మూలానికి ఇక చట్టబద్దత ఉంటుంది. ఆడియో-వీడియో ద్వారా కోర్టుకు హాజరు కావడానికి అవకాశం కల్పించాం. దీంతో సాక్షులు, నిందితులు, నిపుణులు, బాధితులు ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా విచారణకు హాజరు కావచ్చు. ఫోరెన్సిక్ సందర్శనలను తప్పనిసరి చేశాం. దీనికి దగినట్టుగా ముందు చూపుతో 2020లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీని ఏర్పాటు చేసాం. దీని కోసం శిక్షణ పొందిన సిబ్బంది అవసరం. మూడేళ్ల తర్వాత ఈ దేశంలో ఏటా 40 వేలకు పైగా శిక్షణ పొందిన ఫోరెన్సిక్ సిబ్బంది అందుబాటులోకి వస్తారు. ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, మా ప్రభుత్వం ఇటీవల తొమ్మిది రాష్ట్రాల్లో ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్‌లను, ఆరు సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీలను ప్రారంభించాలని నిర్ణయించింది.
ఈ కొత్త చట్టాలు బాధితులే కేంద్రకంగా పనిచేస్తాయి. కొత్త చట్టం అన్ని ప్రక్రియలను పూర్తి చేయడానికి కాల పరిమితిని కూడా నిర్దేశిస్తుంది. చట్టం పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత, ఎటువంటి ఆలస్యం ఉండదు. ఏదిఏమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి 3 సంవత్సరాలలోపు సుప్రీంకోర్టులో సైతం న్యాయం లభిస్తుంది. మూడేళ్లలోపు జైలు శిక్ష పడే అభియోగాలు, నిందితులు 60 ఏళ్లు పైబడిన వారు అయితే వారిని అరెస్టు చేయడానికి పోలీసు అధికారి ముందస్తు అనుమతి తప్పనిసరి. అరెస్టయిన వ్యక్తిని 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలనే నిబంధన ఉంది. 20కి పైగా సెక్షన్లలో పోలీసు జవాబుదారీతనం ఉండేలా కొత్తచట్టాలు నిర్దేశించాయి. ఈ మూడు చట్టాలు రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న అన్ని భాషల్లో అందుబాటులో ఉంటాయి. కోర్టు విచారణలు కూడా ఆ భాషల్లోనే జరుగుతాయి.
భారత ప్రభుత్వ హోం శాఖ, ప్రతి రాష్ట్ర హోం శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ ఈ కొత్త చట్టాలను అమలు చేయడానికి చాలా కృషి చేశాయి. కొత్త చట్టాలపై దాదాపు 22.5 లక్షల మంది పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు అధీకృత సంస్థల సహాయంతో 23,000 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నాయి. లోక్‌సభలో ఈ చట్టాలపై మొత్తం 9 గంటల 29 నిమిషాల పాటు చర్చ జరగగా అందులో మొత్తం 34 మంది సభ్యులు పాల్గొన్నారు. రాజ్యసభలో 6 గంటల 17 నిమిషాల పాటు చర్చ జరగగా 40 మంది సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంటు సభ్యులను బహిష్కరించిన తర్వాతే ఈ చట్టాలు చేశారంటూ మరో అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. బహిష్కరించిన సభ్యులు ఇప్పటికీ సభకు వచ్చి చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉంది, కానీ ఒక్క సభ్యుడు కూడా అలా చేయలేదు.
2020లో ఎంపీలు, ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులందరికీ సూచనలు కోరుతూ లేఖలు రాసాం. అధికారులతో సమావేశాలను మినహాయించిన ఈ బిల్లును 158 సార్లు చర్చించి రూపొందించాం. బిల్లును తర్వాత హోం శాఖ కమిటీకి పంపారు. దాదాపు రెండున్నర నుంచి మూడు నెలల పాటు కమిటీలో చర్చలు జరగ్గా, అన్ని పార్టీల ఎంపీలు పాల్గొని తమ సూచనలు అందించారు. రాజకీయ అంశాలైన 4-5 సూచనలను మినహాయించి, 93 మార్పులు చేస్తూ మంత్రివర్గం బిల్లును మళ్లీ ఆమోదించింది. ఈ చట్టం రాజ్యాంగ స్ఫూర్తితో దేశంలోని 140 కోట్ల మంది పౌరులకు సకాలంలో న్యాయాన్ని అందించే, ఆత్మగౌరవాన్ని పరిరక్షించే ప్రక్రియ. ఎవరికి ఏదైనా చెప్పాలని ఉంటే నా కార్యాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నేను అందుబాటులోనే ఉంటాను.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక చట్టాన్ని ఆమోదించే ముందు ఇంత సుదీర్ఘ చర్చా ప్రక్రియ జరగలేదని నా స్పష్టమైన అభిప్రాయం. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మేలు చేసే సూచనలు తీసుకురావాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. వాటిని చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.
అమిత్ షా,
కేంద్ర హోంమంత్రి