Sunkishala visit

పునర్నిర్మాణ వ్యయం కాంట్రాక్టు కంపెనీ నుంచే రాబట్టాలి

Sunkishala Visitసుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్‌వాల్‌ కూలిన ఘటనలో కాంట్రాక్టు కంపెనీని బ్లాక్‌ లిస్టులో పెట్టి.. క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని బిజెపి శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు పునర్నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కాంట్రాక్టు కంపెనీ నుంచే రాబట్టాలన్నారు. రిటైనింగ్‌వాల్‌ కూలిన ప్రాంతాన్ని ఆగస్ట్ 13న బిజెపి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం పరిశీలించింది. అనంతరం మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 2న ఘటన జరిగితే సోషల్‌ మీడియాలో వచ్చే వరకు ఎందుకు గోప్యంగా ఉంచారో చెప్పాలన్నారు. కాంట్రాక్టర్‌ను కాపాడుకోవడానికా.. తప్పిదాలను వెనుకేసుకోవడానికా అని ప్రశ్నించారు. మంత్రులు వచ్చి సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి చిన్న ప్రమాదమని, చాలా తక్కువ నష్టమని అంటున్నారని, ఇప్పటివరకు త్రిసభ్య విచారణ కమిటీ ఎంత నష్టం జరిగిందో అంచనానే వేయలేదని చెప్పారు. రూ.2 వేల కోట్ల ప్రాజెక్టు వారికి చిన్నదిగా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. 

రిటైనింగ్‌వాల్‌ కూలిన ఘటనలో ఏదో లోపాయికారీ ఒప్పందం ఉందని, పనుల్లో నాణ్యత లోపమా, మరేదైనా కారణం ఉందా అనేది బహిర్గతం కావాలంటే సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని సిర్పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్‌ బాబు డిమాండ్‌ చేశారు. అధికారుల అనుమతి లేకుండా మధ్య టన్నెల్ తెరవడంతో కృష్ణానది నుంచి వచ్చిన వరద వల్ల సైడ్ వాల్ కూలి పెద్ద ఎత్తున నష్టం జరిగిందని, ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలని ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌ తప్పిదం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, లైసెన్సు రద్దు చేయాలని ముథోల్‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌ అన్నారు. ఎమ్మెల్సీ ఏవీఎన్‌.రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా విజిలెన్స్‌ కమిటీచే విచారణ చేపట్టి నాణ్యత ప్రమాణాలు పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షుడు డా. నాగం వర్షిత్ రెడ్డి, నాయకులు కంకణాల నివేదిత రెడ్డి, మాధగోని శ్రీనివాస్ గౌడ్, పిల్లి రామరాజు తదితర నాయకులు పాల్గొన్నారు.