పోలింగ్ బూత్ కేంద్రంగా సభ్యత్వ నమోదు
పోలింగ్ బూత్ కేంద్రంగానే సభ్యత్వ నమోదు కార్యాచరణ జరగాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు బిజెపిని ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని, వారందరినీ కలుపుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 8న జి. కిషన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”దేశంలో క్రమం తప్పకుండా నియమబద్ధంగా సభ్యత్వ నమోదు చేసుకుంటున్న ఏకైక పార్టీ బిజెపి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయాధ్యక్షులు నడ్డా నుంచి పోలింగ్ బూత్ కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ మరోసారి సభ్యత్వం తీసుకోవాలని నిర్ణయించారు. ప్రతి మూడేళ్లకోసారి ప్రజాస్వామ్యబద్ధంగా కమిటీల పునర్నిర్మాణం జరుపుకొనే పార్టీ బిజెపి మాత్రమే. సిద్ధాంతం కోసం పని చేసే పార్టీ బిజెపి. పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్న వారంతా స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నవాళ్లే. మిగిలిన పార్టీలు సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సూరెస్ ఇస్తున్నారు కదా.. దీనిపై చర్చించాలని అన్నప్పుడు.. పార్టీ సభ్యత్వం కోసం ఎవరికీ ఎలాంటి విధంగా మభ్య పెట్టాల్సిన పని లేదని పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. అనేక త్యాగాలు చేసిన పార్టీ బిజెపి. ఉగ్రవాదులు, తీవ్రవాదుల చేతిలో బలైన నాయకులు మన పార్టీ నాయకులే. బిజెపిలో చేరిన కార్యకర్తలకు అన్నింటి కంటే ముందు దేశం మాత్రమే. 1975లో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు.. నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధిస్తే.. దేశం కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం జనసంఘ్ నాయకులు, కార్యకర్తలు జనతా పార్టీలో స్వచ్ఛందంగా విలీనమైన చరిత్ర మనది. నాడు రెండు సీట్లు గెలిచిన పార్టీ.. ఇవాళ దేశంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. ఇది కార్యకర్తల త్యాగం, ప్రజల ఆశీర్వాదం వల్ల మాత్రమే సాధ్యమైంది. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా సంబంధం లేకుండా.. సిద్ధాంతం కోసం పని చేస్తున్నాం. భారతదేశానికి చెందిన పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం ప్రతి భారతీయుడూ గర్వించాల్సిన విషయం. మనం పార్టీలో చేరడంతో పాటుగా పార్టీలో వంద మందిని చేర్చాల్సిన అవసరం ఉంది. పార్టీ క్రియాశీల సభ్యత్వం కోసం కనీసం 100 మందితో సభ్యత్వం చేయించాలి. సభ్యత్వ సేకరణను నిర్దేశిత షెడ్యూల్ లోపు పూర్తి చేయాలి. పార్లమెంటు ఎన్నికల్లో 36 శాతాన్ని మించి ఓట్లు బిజెపి పొందింది. తెలంగాణ ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వానికి అండగా నిలిచారు.” అని అన్నారు.
దేశ హితం కోసం పని చేసే పార్టీ బిజెపి: డి.కె. అరుణ
బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ”కేవలం అధికారం కోసం ఆరాటపడకుండా దేశ హితం కోసం, అభివృద్ధి కోసం పని చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో బిజెపి సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రారంభించుకున్నాం. రాష్ట్రంలో రేపటి నుంచి జిల్లాలు, ఆ తర్వాత గ్రామగ్రామాన సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతాం. బిజెపి నాయకులు, కార్యకర్తలు వారి కుటుంబ సభ్యలు, స్నేహితులు అందరితో కలిసి పార్టీలో సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సాహం అందించాలని కోరుతున్నాం. తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో పాటు నేటి కాంగ్రెస్ సర్కారు అభివృద్ధిని పూర్తిగా కుంటుపడేసి, ఖజానాను ఖాళీ చేశాయి. 2047 కల్లా ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ పాలన అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా అవినీతికి దూరంగా, అభివృద్ధికి చేరువగా కావాలంటే రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలి. పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీని మరింత విస్తరింపజేసేలా కృషి చేయాలి. అందుకే, బిజెపి చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియలో పెద్దఎత్తున భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం.” అని అన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా సభ్యత్వ నమోదు: డా. కె.లక్ష్మణ్
బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అన్ని ప్రాంతాల్లో మరింత విస్తరించేలా, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చేలా బిజెపి సభ్యత్వ నమోదు ప్రక్రియను రెండు విడతలుగా చేపడతామన్నారు. ”బిజెపి ఆవిర్భావం దేశంలో ఒక ప్రత్యేక పరిణామం. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు విదేశీ సిద్ధాంతాలు, విదేశీ నాయకత్వంతో ఏర్పడినవి. ఆనాడు స్వదేశీ ఆలోచనలు, విధానాలతో 1951 అక్టోబర్ 21న శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించారు. 1951 అక్టోబర్ 21న దిల్లీలో జనసంఘ్ ఏర్పాటైతే, 1980 ఏప్రిల్ 6న బిజెపి ఏర్పాటైంది. ఈ రోజు అత్యున్నత స్థాయికి చేరుకుంది. సిద్ధాంతాల పునాదుల మీద ఏర్పడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. విలువలతో కూడిన రాజకీయాలు నడిపే పార్టీ బిజెపి మాత్రమే. నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ సిద్ధాంతంలో పని చేసే క్యాడర్ బేస్డ్ పార్టీ బిజెపి. దేశం కోసం పని చే సే పార్టీ బిజెపి మాత్రమే.. తమ కుటుంబం కోసం, వారి బాగు కోసం పని చేసే పార్టీ కాంగ్రెస్. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ గా దేశాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పం తీసుకున్నారు. ప్రధాని మోదీ సంకల్పానికి చేయూత అందించేలా బిజెపిలో సభ్యత్వం తీసుకోవాలని దేశ ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. ఆనాడు ఒక్క సీటు తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వచ్చినా, సిద్ధాంతాలకు అనుగుణంగా నిజాయితీగా వ్యవహరించిన గొప్ప నాయకుడు వాజ్ పేయి. ఆ తర్వాత మళ్లీ ప్రజాస్వామ్యయుతంగా ప్రజలచే గెలిచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన నాయకుడు వాజ్ పేయి. మచ్చలేని రాజకీయ నాయకుడిగా, ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిగా అటల్ జీ చరిత్రలో నిలిచిపోతారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ చట్టం రద్దు, అయోధ్యలో రామమందిరం నిర్మాణం వంటి అనేక దేశ ప్రజల కలలను సాకారం చేస్తున్న గొప్ప నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ. భవిష్యత్తులో దేశం ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే దేశం కోసం బిజెపి సభ్యత్వం తీసుకోవాలని కోరుతున్నాం. దేశ సమగ్రత, దేశ సమైక్యతను మరింత చాటిచెప్పేలా బిజెపి సభ్యత్వాన్ని స్వీకరించాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం.
రెండు సీట్ల నుంచి మూడోసారి అధికారంలోకి: అర్వింద్ మీనన్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ మాట్లాడుతూ దేశంలో క్రమం తప్పకుండా, పార్టీ నియమావళి ప్రకారం సభ్యత్వ సేకరణ చేసుకుంటూ, పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని అన్నారు. ”ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నుంచి సాధారణ కార్యకర్త వరకు సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలి. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంతగా నియమ నిబంధనలకు అనుగుణంగా ముందుకెళ్లే పార్టీ బిజెపి మాత్రమే. సభ్యత్వ నమోదు అనంతరం పార్టీ కమిటీలను పునర్నిర్మాణం చేసుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా, కార్యకర్త ఆధారిత సంస్థాగత వ్యవస్థతో పని చేసే పార్టీ. పార్టీకి దేశమే ప్రథమం. ఏ ఒక్క వ్యక్తిని కూడా మభ్యపెట్టే ప్రసక్తే లేదు. బిజెపిలో సభ్యులుగా చేరేందుకు ఏ ఒక్కరికి కూడా ఆశపెట్టే ఆలోచన లేదు. బిజెపి కార్యకర్తలు ఉగ్రవాదులు, తీవ్రవాదులకు తలొగ్గకుండా, అనేక త్యాగాలతో ముందుకెళ్తున్నారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు దేశం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 1977లో జనసంఘ్ ను జనతా పార్టీలో విలీనం చేసుకున్నాం. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ అవతరించింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి కేవలం రెండే సీట్లు గెలిచింది. నాడు హనుమకొండ నుంచి చందుపట్ల జంగారెడ్డి, గుజరాత్ నుంచి ఏకే పటేల్ మాత్రమే గెలిచారు. నాడు కేవలం రెండు సీట్లే వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీని కొందరు అవహేళన చేసి మాట్లాడారు. అయితే నాడు రెండు సీట్ల నుంచి ఇవాళ దేశంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాం.” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బిజెపి తమిళనాడు, కర్నాటక సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బంగారు శృతి, డా. కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, మాజీ ఎంపీలు బీబీ పాటిల్, పోతుగంటి రాములు, మాజీ ఎమ్మెల్యే విజయ రామారావు తదితరులు పాల్గొన్నారు.