September 17th Parade grounds

తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియకుండా కుట్ర

September 17th Parade Groundsనిజాం దురాగతాలు, రజాకార్ల అకృత్యాల నుంచి విముక్తి పొందిన 17 సెప్టెంబర్ ముమ్మాటికీ ‘విమోచన దినోత్సవమే’ అని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో మరో వాదనకు తావు లేదని తేల్చి చెప్పారు. నిజాం సైన్యంపై యుద్ధట్యాంకులతో, విమానాలతో భారత సైన్యం యుద్ధం చేసి ఈ గడ్డపై మూడు రంగుల జాతీయ జెండా ఎగురవేసిన ఈ రోజు విమోచన దినం, విజయ దినం, స్వాతంత్ర్య దినమే తప్పితే మరొకటి కాదని అన్నారు. 17 సెప్టెంబర్ ను బీఆర్ఎస్ ‘జాతీయ సమైక్య దినం’ అనడం.. కాంగ్రెస్ ‘ప్రజా పాలన దినోత్సవం’ అనడం ముమ్మాటికి ఇక్కడి చరిత్రను తొక్కిపెట్టడమే అని విమర్శించారు. నిజాం నియంతృత్వం నుంచి హైదరాబాద్ విముక్తి పొందిన రోజు ‘జాతీయ సమైక్యతా దినం’ ఎలా అవుతుందని ప్రశ్నించారు. విమోచనకు, ప్రజా పాలనకు ఏం సంబంధం అని, ఇది ముమ్మాటికి తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియకుండా చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. ఇది స్వాతంత్ర్య ఉద్యమకారులు, అమరవీరుల త్యాగాలను, బలిదానాలను అవమానించడమే అని, రాజకీయ దివాళాకోరుతనం, ఓటుబ్యాంకు రాజకీయాలకు, కుహనా లౌకిక వాదానికి పరాకాష్ట అని అభివర్ణించారు.

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఏడాదీ ‘తెలంగాణ విమోచన దినోత్సవ’ వేడుకలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ వేడుకల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి జాతీయ జెండా ఎగరేశారు.  అంతకుముందు పారామిలిటరీ దళాల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ విమోచనంలో కీలక పాత్ర పోషించిన భారత తొలి హోంమంత్రి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన, పారామిలిటరీ బలగాల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 1948 మందు తెలంగాణ పరిస్థితులను వివరిస్తూ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. పలువురు పద్మా అవార్డు గ్రహీతలు, స్వాతంత్ర్య సమర యోధులను సత్కరించారు. పరేడ్ గ్రౌండ్స్ లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చం ఉంచి పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘తెలంగాణ విమోచన పోరాటం ప్రపంచ పోరాటాల్లోనే మహోన్నతం. నిజాంకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు సాగించిన పోరాటం దేశ చరిత్రలోనే కాదు.. ప్రపంచ చరిత్రలోనే అపురూపమైన ఘట్టం. ప్రజలు ఎవరికి వారే స్వచ్ఛందంగా కత్తుళ్లు, గొడ్డళ్లు, ఒడిసెళ్లు, రోకలి బండలు, కారం ముద్దలు వంటి పనిముట్లనే ఆయుధాలుగా చేసుకొని నిజాంపై, రజకార్లపై స్వాతంత్ర్యం కోసం పోరాడారు. స్వాతంత్ర్యం తర్వాత మన దేశ విభజన అనివార్యమయ్యాక.. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో 565 సంస్థానాలు భారతదేశంలో సంపూర్ణంగా విలీనమయ్యాయి. అందులో నాలుగు సంస్థానాలు హైదరాబాద్, జోధ్ పూర్, జునాఘడ్, కాశ్మీర్ విలీనం మాత్రం సంక్లిష్టంగా మారాయి. ఈ నాలుగింటిలో నిజాం, రజాకార్ల నుంచి విమోచన పొంది భారతదేశంలో హైదరాబాద్ విలీనమైన ఘట్టం అతిముఖ్యమైనది.

రజాకార్ల అకృత్యాలు

స్వాతంత్ర్యానికి ముందు భారతదేశంలోని ఇతర ప్రాంతాలు బ్రిటిషర్ల పాలనలో మగ్గిపోతే… హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం నియంతృత్వం, రజాకార్ల అకృత్యాల మధ్య నలిగిపోయింది. ఇక్కడి ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించారు. నిజాం సైన్యంతోపాటు 1940 నుంచి రజాకార్ల దురాగతాలు సాగాయి. కరడుకట్టిన మతోన్మాది ఖాసిం రజ్వీ రజాకార్లకు ఆయుధాలిచ్చి హిందువులపైకి ఉసిగొల్పాడు. రజాకార్లు ఇక్కడి ప్రజలపై, ముఖ్యంగా హిందువులపై తీవ్రమైన దాడులు కొనసాగించారు. ఇక 1946-48 కాలంలో వారి అకృత్యాలు, దారుణాలు పరాకాష్టకు చేరాయి. హిందువులను వరసలో నిలబెట్టి తుపాకీతో కాల్చి చంపడాలు, చెట్టుకు కట్టి సామూహికంగా ఉరితీయడాలు, సజీవ దహనాలు, మహిళలచే నగ్నంగా బతుకమ్మలు ఆడించడాలు, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, దోపిడీలు, దొమ్మీలు.. వంటి రజాకార్ల అకృత్యాలతో అడ్డు అదుపూ లేకుండా నరమేధం జరిగింది. నిజాం తమ జల్సాలకు, విలాస జీవితానికి ఖర్చు పెట్టేందుకు ప్రజలపై 90 రకాల పన్నులు విధించాడు. పన్ను కట్టకున్నా, కట్టలేని పరిస్థితిలో ఉన్నా గోళ్ళూడగొట్టారు. ఛాతీపై పెద్దపెద్ద బండరాళ్లు పెట్టారు. ఊరి మీద పడి రైతులు తినడానికి ఉంచుకున్న ధాన్యాన్ని దోచుకెళ్లేవారు.

తెలుగు భాషపై ఆంక్షలు

నిజాం హయాంలో తెలుగు భాషపై లెక్కలేనన్ని ఆంక్షలు, నిర్బంధాలు పెట్టారు. స్థానిక భాషల్ని, సంస్కృతులను అన్ని దశల్లోనూ నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. తెలుగు మీడియం స్కూళ్లకు బదులుగా ఉర్దూ మీడియం స్కూళ్లు తెరిచారు. ప్రజలపై బలవంతాన ఉర్దూను రుద్దారు. తెలుగును పరిరక్షించుకునేందుకు నాడు ఆంధ్ర మహాసభ, వివిధ సంస్థల ఆధ్వర్యంలో గ్రంథాలయోద్యమాలు సాగాయి. మాడపాటి హనుమంతరావు వంటి వారు ఎందరో తెలుగు భాష పరిరక్షణకు పాటుపడ్డారు. తెలుగు మీడియం స్కూళ్లు స్థాపించారు.

 హిందువులపై అరాచకాలు

నిజాం రాజ్యంలో బలవంతంగా హిందువులను ఇస్లాం మతంలోకి మార్పిడి చేసేవారు. మతం మారేందుకు నిరాకరించిన వారి పట్ల రజాకార్లు అరాచకంగా ప్రవర్తించేవారు. హిందూ మహిళలను చెరిచేవారు. వివస్త్రులుగా చేసి వేధించేవారు. అమ్మాయిలను బలవంతంగా ఎత్తుకెళ్లేవారు. నిజాం ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలపైనా దాడికి పాల్పడ్డాడు. ముఖ్యంగా హిందూ పండగలపై తీవ్రమైన నిర్బంధాలు విధించేవాడు. తెలంగాణలో దసరా, దాని ముందు 9 రోజులు నిర్వహించే బతుకమ్మ లాంటి పండగలపై దాడులు, మహిళలతో నగ్నంగా బతుకమ్మలు ఆడించి రజాకార్లు వికృతానందం పొందేవారు. పీరీల వంటి ముస్లింల పండుగలను మాత్రం అందరూ జరుపుకోవాలని హిందువులు, ముస్లిమేతరులపైనా ఫత్వాలు జారీ చేసేవారు. కొండకండ్ల – రంగాపూర్ లో 5గురు పురోహితులను చిత్రహింసలు పెట్టి తలకిందులుగా చెట్టుకు వేళ్లాడదీసి, కింద మంటబెట్టారు. ఆ మంటలకు తాళలేక ఐదుగురు పురోహితులు అక్కడే చనిపోయారు.

1857 నుంచే నిజాంపై పోరాటాలు

భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం నాటి నుండే ఇక్కడ కూడా నిజాంకు వ్యతిరేకంగా పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. నిర్మల్ కేంద్రంగా పోరాటాలు చేసిన రాంజీ గోండును, ఆయనతో పాటు వెయ్యి మంది అనుచరులను నిర్మల్‌లోని మర్రిచెట్టుకు సామూహికంగా ఉరితీశారు. ఆ చెట్టు ఇవాళ ‘వెయ్యి ఉరుల మర్రి’గా మనకు తెలుసు. బ్రిటిష్ రెసిడెన్సీలో తుర్రెబాజ్ ఖాన్ వీరోచిత సాహసగాథల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 1940కు ముందు నుంచే వందేమాతరం ఉద్యమం ప్రారంభమైంది. వందేమాతరం రామచంద్రరావు వంటి వారు ఎంతో మంది జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. జైలుశిక్షలను కూడా అనుభవించారు. జైలులో శిక్షను అనుభవిస్తున్న సమయంలో అధికారులు కొట్టిన ప్రతి కొరడా దెబ్బకు ‘వందేమాతరం’ అని నినదించిన వావిలాల రామచంద్రరావు. ‘వందేమాతరం రామచంద్రరావు’ అయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వందేమాతరం ఉద్యమంలో పాల్గొని సస్పెన్షన్ కు గురయ్యారు.

60వేల కుటుంబాలు బలి

రజాకార్ల దౌర్జన్యాలకు 1947-48 కాలంలో హైదరాబాద్ సంస్థానంలో 60వేల కుటుంబాలు బలయ్యాయి… హిందువులకు చెందిన వందలకోట్ల సొత్తు కొల్లగొట్టారు. బత్తిన మొగిలయ్య గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వంటి ఎందరో సమరయోధులు నిజాంకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలు చరిత్ర కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ పోరాటంలో నిజాం సైన్యం చేతిలో అమరుడైన తొలివ్యక్తిగా దొడ్డి కొమురయ్య చరిత్రలో నిలిచాడు. చాకలి ఐలమ్మ ప్రదర్శించిన ధీరత్వం ఎంతోమందికి ఆదర్శమైంది. నిజాంకు వ్యతిరేకంగా వార్తలు రాసిన షోయబుల్లా ఖాన్ ను చెట్టుకు కట్టేసి చేతి వేళ్లు విరిచారు. తర్వాత అత్యంత క్రూరంగా హతమార్చిన పత్రికా విలేకరి చరిత్ర,  నిజాంపై బాంబు విసిరిన నారాయణ రావు పవార్ వంటి వీరుల వీరగాథలు ఈ తరానికి తెలియాలి.

నిజాం కల.. స్వతంత్ర ఇస్లామిక్ దేశం

దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర్య ఇస్లామిక్ దేశంగా.. లేకుంటే పాకిస్తాన్ దేశంతో కలవాలని నిజాం భావించారు. తీర ప్రాంతం లేకపోవడంతో అంతర్జాతీయ వాణిజ్యానికి మచిలీపట్నం పోర్టును వాడుకోవాలనుకున్నాడు… పోర్చుగీసు ఆధీనంలో ఉన్న గోవా పోర్టును వినియోగించుకునేలా పోర్చుగీసు వారితో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నించాడు. దేశ నడిబొడ్డున మరో స్వతంత్ర దేశం ఉంటే దేశ భద్రతకు పెనుముప్పు అని నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆందోళన చెందారు. నియంతృత్వ నిజాం పాలనలో… రజాకార్ల దారుణాలు, అరాచకాలు, అకృత్యాలకు ఇక్కడి ప్రజలు నలిగిపోతూ చేసిన ఆక్రందనలపై కలత చెందారు. మంచిమాటతో నిజాంను దారికి తెచ్చేందుకు ప్రయత్నించారు. పటేల్ ప్రతిపాదనలను నిజాం తిరస్కరించాడు. మా జోలికొస్తే సంస్థానంలో ఉన్న కోటిన్నర హిందువులను ఊచకోత కోస్తామని ఖాసిం రజ్వీ బహిరంగంగానే బెదిరించారు. 7వ నిజాం 1947 జూన్ 4వ తేదీన ఓసారి, జూలై 14న మరోసారి తాను స్వతంత్ర ప్రభువునని.. హైదరాబాద్ సంస్థానం ‘స్వతంత్ర ఉస్మానిస్థాన్’ అని ప్రకటించారు. 1928న ప్రారంభమైన ఎంఐఎం మరో అడుగు ముందుకేసి హైదరాబాద్ సంస్థానానికే కాదు.. యావద్దేశానికి 7వ నిజాంను రాజును చేస్తామని ప్రకటించారు. అహంకారంతో కన్నుమిన్ను మూసుకుపోయిన నిజాం, ఖాసిం రజ్వీలకు బుద్ధి చెప్పి హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలను ముఖ్యంగా కోటిన్నర హిందువులను కాపాడేందుకు పటేల్ ‘ఆపరేషన్ పోలో’ పేరుతో నిజాం రాజ్యంపై భారత ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. నిజాం సైన్యం, రజాకార్లు సహా నిజాం భారత సైన్యం ముందు 17 సెప్టెంబర్ 1948న లొంగిపోయారు.

చరిత్రకు ఓటుబ్యాంకు గ్రహణం

ఈ ప్రాంతానికి ఇంతటి గొప్ప పోరాట చరిత్ర ఉంటే.. ఇంతటి మహత్తర సాహస చరిత్రను నేటి తరానికి తెలియకుండా తొక్కిపెట్టారు. ఇందుకు కారణం ఓటుబ్యాంకు రాజకీయాలు, సంతుష్టీకరణ. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో.. తర్వాత తెలంగాణ వచ్చాక ఇక్కడి ప్రభుత్వాలు కూడా ఓటుబ్యాంకు రాజకీయాలు, సంతుష్టీకరణకు పట్టం కట్టి సెప్టెంబర్ 17న ‘విమోచన’ దినోత్సవం అధికారికంగా నిర్వహించేందుకు నిరాకరించాయి. ఇంతటి త్యాగాలు, బలిదానాలు, పోరాటాలతో వచ్చిన స్వాతంత్ర్యం గురించి ఎవరికి తెలియకూడదా? స్వార్థ రాజకీయాల కోసం, ఓట్ల కోసం, అధికారం కోసం మజ్లిస్ కు సలాం కొడుతూ ఇన్నాళ్లుగా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ‘విమోచన దినోత్సవం’ అధికారికంగా నిర్వహించాలని ఆనాటి పాలకులను నిలదీసిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాక స్వరం మార్చారు. తన మిత్రపక్షమైన ఎంఐఎం ఆదేశాలతో ‘విమోచన దినోత్సవం’పై వక్రభాష్యాలు చెప్పారు. విమోచన దినంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ వక్రభాష్యాలు చెప్పి మోసం చేశాయి. హైదరాబాద్ సంస్థానంలో భాగమై.. ఇప్పుడు కర్నాటక, మహారాష్ట్రలో కలిసిన జిల్లాల్లో ఆయా ప్రభుత్వాలు అధికారికంగా విమోచన దినోత్సవాలు జరుపుతుంటే.. ఇక్కడి ప్రభుత్వాలు మాత్రం అధికారికంగా నిర్వహించేందుకు నిరాకరించాయి.

ప్రజల దృష్టిలో ‘విమోచన ఉత్సవాలే’

విమోచనకు వక్రభాష్యాలు చెప్తోన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కు  ప్రజలే బుద్ధి చెప్తారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం, సంతుష్టీకరణ కోసం చరిత్రను తప్పుదోవ పట్టిస్తే భవిష్యత్ తరాలు క్షమించవు. వీళ్లు ఏం పేరు పెట్టుకున్నా ప్రజలు మాత్రం ‘విమోచన ఉత్సవాలు’గానే జరుపుకొంటారు, జరుపుకోవాలి కూడా. 17 సెప్టెంబర్ ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ జరపాలని 1998 నుంచి బిజెపి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశాం. వాటి ఫలితమే ఇప్పుడు అధికారిక వేడుకలు. అయితే ఈ వక్రభాష్యాలకు, మారుపేర్లకు.. పుల్ స్టాప్ పెట్టి ‘విమోచన ఉత్సవాలు’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వరకు ఒత్తిడి తీసుకొస్తాం. ఇందుకు ప్రజలు కూడా మాకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రపంచ చరిత్రలోనే అరుదైన హైదరాబాద్ విముక్తి పోరాటం గురించి నేటి తరానికి తెలియజేయాలి. ఆనాటి సమరయోధుల వీరగాథలను స్మరించుకుందాం. వారికి నివాళులు అర్పిస్తున్నాం. నిజాం వ్యతిరేకంగా పోరాడి అమరులైన వీరులందరికీ శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాం. మన ప్రాంతానికి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు కల్పించి.. ఇక్కడి ప్రజలకు అండగా నిలిచిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం.’’ అని అన్నారు.

నిజాలను భూస్థాపితం చేసిండ్రు: బండి సంజయ్

ఈ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రసంగిస్తూ ‘‘చిన్నపుడు స్కూల్ ల స్వాతంత్ర దినోత్సవం అంటే ఆగస్ట్ 15, గణతంత్ర దినోత్సవం అంటే జనవరి 26. అంతేకానీ అసలు తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చింది సెప్టెంబర్ 17. అందుకే ఇయ్యాల మనందరికీ పండుగ రోజు. గత ప్రభుత్వాలు చరిత్రను వక్రీకరించకపోతే సెప్టెంబర్ 17 కూడా మనం పండుగ చేసుకునేటోల్లం, కానీ అసలు నిజాలను భూస్థాపితం చేసిండ్రు. అబద్ధపు కల్పితాలను చరిత్ర చేసిండ్రు. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభిస్తే, 399 రోజుల తరువాత అంటే 1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు. 1947 పంద్రాగస్టున దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణకు ఎందుకు రాలేదు…?  నిజాం పాలనలో తెలంగాణ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండేదని ఎవలన్న చెప్పిండ్రా..? రజాకార్ల రాక్షస పాలన నుండి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు జరిగిన పోరాటాలేందో మనకు తెలుసా…? ప్రాణాలొడ్డి తెచ్చుకున్న నాటి స్వాతంత్ర పోరాట ఫలాలు నేటికి అందుతున్నాయా?

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ పోరాటం ఏ వర్గానికో, ఏ పార్టీకో వ్యతిరేకం కానే కాదు. ఇది ప్రజా పోరాటం. దేశభక్తులకు, దేశ విభజన ద్రోహులకు మధ్య జరిగిన పోరాటం. భూమి కోసం, భుక్తి కోసమే కాదు తెలంగాణ ప్రజల బానిస సంకెళ్లను తెంచి స్వేచ్ఛా వాయువుల పీల్చుకునేందుకు జరిగిన పోరాటం. కుల, మత, వర్గాలకు అతీతంగా నిజాం నిరంకుశ పాలనపై ప్రజలంతా ఒక్కటై తిరగబడ్డ పోరాటం. వేలాది మంది బలిదానమైన పోరాటం. మా ఆడబిడ్డలు రోకలిబండలు కారంపొడులు పట్టుకొని రజాకార్లను తరిమి కొట్టిన పోరాటం. అసొంటి ఆనాటి పోరాటాలను, త్యాగాలను, తెలంగాణ తెగువను నేటి తరానికి తెలియజేసేందుకే ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ జరుపుకుంటున్నం.

నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల అకృత్యాలను తలుచుకుంటే ఇప్పటికి నా రక్తం మరుగుతుంది. నా తెలంగాణ ఆడబిడ్డలపై జరిగిన మానభంగాలు,  బట్టలిప్పించి మా అక్క చెల్లెళ్లను నగ్నంగా బతుకమ్మ ఆడించిన ఘటనలు గుర్తొస్తే ఈ తెలంగాణల పుట్టిన బిడ్డగా నిద్ర పట్టదు. పరకాలలో 1500 మంది జాతీయ జెండాను ఎగరేసినందుకు జలియన్‌ వాలాబాగ్‌ తరహాలో కాల్పులు జరిపి చంపిన ఘటనను మర్చిపోతమా? బైరాన్ పల్లి, గుండ్రాంపల్లి, వెయ్యి ఊడల మర్రిలో రజాకార్ల దురాగతాలను మర్చిపోతమా?  కొమరం భీం, రాంజీ గోండు, బూర్గుల రామక్రిష్ణారావు, కొండా లక్ష్మణ్ బాపూజీ, చాకలి ఐలమ్మ, నారాయణరావు పవార్, ఆరుట్ల దళిత మహిళ ముత్తమ్మ చేసిన పోరాటాలను మర్చిపోగలమా?… ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ప్రతి గ్రామానికి రజాకార్లపై పోరాడిన చరిత్ర ఉంది.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని ఈ గడ్డపై కొన్నేళ్లుగా ప్రజలంతా కోరుతున్నరు. పోరాడుతున్నరు. లాఠీ దెబ్బలు తిన్నరు. కేసులు భరించిండ్రు. జైళ్ల పాలయ్యిండ్రు. అయినా సరే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ రాష్ట్రాన్ని పాలించిన ఏ ప్రభుత్వమూ విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని మొట్టమెదట తెరపైకి తీసుకొచ్చిన వ్యక్తి సీహెచ్.విద్యాసాగర్ రావు ఉద్యమ స్పూర్తిని ఈ సందర్భంగా మరువలేం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడమంటే నాటి సమర యోధుల త్యాగాలను, బలిదానాలను అవమానించడమే. తెలంగాణ ప్రజలంతా రజకార్లను తరిమికొడితే… నేడు కొన్ని పార్టీలు ఆ రజాకార్ల వారసుల మెప్పు పొందేందుకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా చరిత్రను తెరమరుగు చేస్తున్నరు.  ముస్లింలంతా రజాకార్లు కారు. తెలంగాణ విముక్తి కోసం షేక్ బందగీ, షోయబుల్లాఖాన్ వంటి ముస్లింలు ఎందరో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలొదిలిన సంగతిని యాదికి తెచ్చుకోవాలె.

హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ నుండి విడదీసి ప్రత్యేక దేశంగా మార్చాలని, సాధ్యంకాని పక్షంలో పాకిస్తాన్ లో విలీనం చేయాలని నిజాం రాజు కుట్ర చేయడమే కాకుండా ఒకవేళ ఓటింగ్ నిర్వహిస్తే అనుకూలంగా ఓట్లు రావాలనే  ఉద్దేశంతో రజకార్ల సహకారంతో లక్షలాది మంది ముస్లింలను ఇతర ప్రాంతాల నుండి తెలంగాణకు తీసుకురావడంతోపాటు దాదాపు అదే సంఖ్యలో హిందువులు హైదరాబాద్ సంస్థానాన్ని వదిలి వెళ్లేలా చేసిన సంగతిని మర్చిపోవద్దు. ఇది నేను చెబుతున్న మాట కాదు… ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ యూనియన్ అనే పుస్తకంలో బీసీ మీనన్ చెప్పిన మాట… అట్లాంటి దేశ విచ్చిన్నకర శక్తుల వారసుల పార్టీతో అధికార పార్టీలు అంటకాగడం సిగ్గుచేటు. 

ప్రజా పాలన దినోత్సవం అంటే ఏమిటి? ఒక్క రోజే పాలన చేసి మిగిలిన రోజులు దోసుక తినడమా? ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 6 గ్యారంటీలను అటకెక్కించి ప్రజలను ఏమార్చడమే ‘ప్రజా పాలనా దినోత్సవానికి గీటురాయి’ అనుకోవాల్నా…? ఓట్ల కోసం కులాలు, వర్గాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందాలనుకోవడమే ‘తెలంగాణ సమైక్యతా దినోత్సవానికి గీటురాయి’ అనుకోవాలా? పిడికెడు మంది రజకార్ల వారసుల కోసం బానిసలుగా మారి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం ఎంత వరకు న్యాయమో ఆలోచించండి.’’ అని అన్నారు. September 17th State Office ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జెండావందనం

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేసి, అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత రెండేండ్లుగా భారత ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా, ఘనంగా నిర్వహిస్తోందన్నారు. వేలాది మంది ప్రజలు వీరోచిత పోరాటం చేసి అనేక త్యాగాలు, ఆత్మబలిదానాలతో తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందని, నియంతృత్వ నిజాం నుంచి విమోచనం లభించిందన్నారు. ‘‘దేశమంతా 1947 ఆగస్టు 15కి స్వాతంత్ర్యం సిద్ధిస్తే.. మన తెలంగాణ రాష్ట్రానికి 13 నెలలు ఆలస్యంగా 1948 సెప్టెంబరు 17న స్వాతంత్ర్యం వచ్చింది. నిజాం సైన్యం, రజాకార్లు గ్రామాల్లోకి వెళ్లి మహిళల మీద అత్యాచారాలు, లూటీలు చేసి అరాచకాలకు పాల్పడ్డారు. అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో హైదరాబాద్ పై సైనిక చర్యతో నిజాం సైన్యాన్ని ఓడించి, తెలంగాణలో మూడు రంగుల జెండాను ఎగురవేశారన్నారు.’’ అని అన్నారు. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ రజాకార్ల వారసత్వంగా ఉన్న, మతోన్మాద మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తున్నాయన్నారు. మజ్లిస్ అడుగులకు మడుగులొత్తుతూ, దివాళాకోరు రాజకీయాలతో తెలంగాణకు స్వాతంత్య్రం లభించిన సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాలను నిర్వహించకుండా తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ చర్యలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సెప్టెంబరు 17 చాలా ప్రత్యేకమైనదని, విశ్వకర్మ జయంతి, వినాయక నిమజ్జన మహోత్సవం, భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం అన్నీ ఒకే రోజు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బంగారు శృతి, డా. కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భువన