హరియాణాలో హ్యాట్రిక్, జమ్మూ కాశ్మీర్ లో అపూర్వం
లోక్ సభ ఎన్నికల తర్వాత తొలిసారి జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి అఖండ విజయం సాధించింది. ముఖ్యంగా హరియాణాలో గత 6 నెలలుగా మీడియాలో వస్తోన్న వార్తలను, ఒపీనియన్ పోల్స్ ను, ఎగ్జిట్ పోల్స్ ను పూర్తిగా తారుమారు చేస్తూ బిజెపి అనూహ్యంగా హ్యాట్రిక్ విజయం సాధించింది. ఇది కాంగ్రెస్ కు చెంపపెట్టు లాంటి తీర్పు. 2019లో జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370, 35 ఏ రద్దు తర్వాత రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టి, జరిపిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గతంలో ఎన్నడూ లేనివిధంగా 25 శాతం ఓట్లతో 29 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. దేశంలోనే ఏకైక ముస్లిం మెజారిటీ ప్రాంతం (యూటీ)లో ముఖ్యంగా దశాబ్దాల తీవ్రవాద ప్రభావాన్ని నిర్మూలిస్తూ శాంతిభద్రతలను అద్భుతంగా నెలకొల్పుతూ జరిగిన ఈ ఎన్నికలను ఎన్నో దేశాల ప్రతినిధులు స్వయంగా పరీక్షించారు. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య అద్భుత విజయంగా దేశమే కాకుండా యావత్ ప్రపంచం స్వాగతించింది.
లోక్ సభ ఎన్నికల సమయం నుంచి కాంగ్రెస్ చేస్తున్న కుల కుట్ర రాజకీయాలకు హరియాణా రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి మంచి జ్ఞానోదయం లాంటివి. కులాల లెక్కలతో వివిధ పార్టీలను వివిధ రకాలుగా వాడుకుంటూ ఎన్నికల్లో గెలవాలని చూసిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఓటమి ఏమాత్రం జీర్ణించుకోలేనిది. హరియాణా రాష్ట్ర ఎన్నికల చరిత్రలో వరుసగా రెండోసారి ఓడిపోని కాంగ్రెస్ హ్యాట్రిక్ ఓటమితో మరింత కుంగిపోయింది. గత మార్చిలోనే హరియాణా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన నయాబ్ సింగ్ సైనీ అంతకుముందు తొమ్మిదిన్నర సంవత్సరాల మనోహర్ లాల్ ఖట్టర్ పాలనలోని పథకాలు, విధానాలు కొనసాగిస్తూనే తన సౌమ్య, నిశ్శబ్ద, సమర్థ పరిపాలనతో ఈ విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. మోదీ, అమిత్ షా, నడ్డా లాంటి నాయకుల మద్దతు, ఎన్నికల్లో పక్కా వ్యూహాలు రూపొందించడం, వాటిని సమర్థం అమలు చేయడం రికార్డు ఓట్లు, సీట్లు దక్కేలా చేసింది. దేశంలోని మిగతా రాష్ట్రాల్లాగానే హరియాణా కాంగ్రెస్ లోనూ ఉన్న గ్రూపు తగాదాలు కూడా ఆ పార్టీ ఓటమికి మరో కారణం. కాంగ్రెస్ కు దేశంలో ఎక్కడా పాజిటివ్ ఓటు లేదని ఈ హరియాణా ఫలితాలు మరోసారి రుజువు చేశాయి.
జమ్ము కాశ్మీర్ రాష్ట్రాన్ని విడివిడిగానూ, కలిసి పరిపాలించిన కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఈ ఎన్నికల్లో సాంకేతికంగా మెజారిటీ సాధించినప్పటికీ, నైతికంగా ఓడిపోయినట్లేనని ఓట్ల శాతం, కాంగ్రెస్ కు వచ్చిన సీట్లు కూడా చూపిస్తున్నాయి. 1996లో 35 శాతం ఓట్లు సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్ ఈ ఎన్నికల్లో 23.4 శాతానికి దిగజారడం ఆ పార్టీ బలహీనతను తెలియజేస్తుంది. 2002లో 24 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 12 శాతానికి పడిపోవడం, అందులో బలమైన ప్రాంతీయ పార్టీ పొత్తుతో 38 స్థానాలు పోటీ చేసినప్పటికీ కేవలం 6 స్థానాల్లో విజయం సాధించడం రోజురోజుకు ఆ పార్టీ మరింత బలహీన పడుతుందనడానికి నిదర్శనం. పైగా గెలిచిన 6 అభ్యర్థుల్లో ఒక్క హిందువు లేకపోవడం కాంగ్రెస్ పార్టీని హిందువులు నమ్మడం లేదని స్పష్టమవుతోంది. జమ్మూ కాశ్మీర్ ను ఒంటరిగా పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు తోక పార్టీగా మారి, కనీసం 10 శాతం సీట్లు కూడా గెలుచుకోలేని దౌర్భాగ్య స్థితికి దిగజారింది. 2002 రాష్ట్ర ఎన్నికల్లో 8.5 శాతం ఓట్లే సాధించినప్పటికీ ఈ ఎన్నికల్లో 25.6 శాతం ఓట్లు సాధించడం జమ్మూ కాశ్మీర్ లో బిజెపి బాగా బలపడిందనడానికి నిదర్శనం.
లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను గ్రహించి, ఎన్నికల వ్యూహంలో తగు జాగ్రత్తలు తీసుకున్న బిజెపి ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధించడం, పీడీపీ, ఐఎన్ఎల్డీ, జేజేపీ లాంటి ప్రాంతీయ పార్టీలు అడ్రస్ లేకుండా పోవడం, కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లోనూ రికార్డు అథమ స్థాయి ప్రదర్శన చూపించడం, త్వరలో వచ్చే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో తదనంతరం ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఘన విజయాలకు, కాంగ్రెస్ పరాజయాలకు సంకేతం. ముఖ్యంగా జమ్మూలో కాంగ్రెస్ ఘోర పరాభవం, హరియాణాలో ముస్లిం ఆధిక్యత గల నుహ్ జిల్లాలోనే విజయాలు సాధించడం, కాంగ్రెస్ ముస్లిం పార్టీగా ప్రజలు భావిస్తున్నారని అర్థమవుతోంది. దేశంలోని యావత్ హిందువులు బిజెపి ఘనవిజయాలను స్వాగతిస్తున్నారు, కాంగ్రెస్ హిందూ వ్యతిరేక కుల కుట్ర రాజకీయాలను తిరస్కరిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో బిజెపి అపూర్వ విజయంలో మన కిషన్ రెడ్డి పాత్ర ఉండడం మరో విశేషం.