జమ్మూ కాశ్మీర్‌కు సువర్ణావకాశం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ ఓటర్లు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ)ను అధికారంలోకి తెచ్చారు. మొత్తం 90 మంది సభ్యుల అసెంబ్లీలో నేషనల్ కాన్ఫరెన్స్ 42 సీట్లు సంపాదించింది. దాని సంకీర్ణ భాగస్వామి అయిన కాంగ్రెస్ కేవలం 6 సీట్లు గెలుచుకుంది. జనాభా పరంగా, భౌగోళికంగా కూడా జమ్మూ కాశ్మీరు వైవిధ్యభరితమైన ప్రాంతం. 47 మంది శాసనసభ్యులను కేంద్ర పాలిత ప్రాంత శాసనసభకు ఎన్నుకునే కాశ్మీర్ లోయలోని 10 జిల్లాలలో ముస్లిం జనాభానే అధికం. వీరిలో సున్నీలు, షియాలు కూడా ఉన్నారు. జమ్మూలోని 10 జిల్లాలలో భిన్న వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారు. వీటిలో 6 జిల్లాల్లో హిందువులైన డోగ్రాల జనాభా ఎక్కువగా ఉంది. మిగిలిన 4 జిల్లాల్లో 2 పీర్ పంజల్ లోను, రెండు చీనాబ్ లోయలో ఉన్నాయి. వీటిలో గుజ్జర్లు, బకర్ వాల్ లు, పహారీలతో సహా ముస్లిం జనాభా మెజారిటీగా ఉంది. కాశ్మీరీ పండితులు, సిక్కులు జనాభాలో గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. జనాభాలో ఈ వైవిధ్యం జమ్మూ కాశ్మీర్ రాజకీయాలను సంక్లిష్టం చేస్తుంది.
1996 అసెంబ్లీ ఎన్నికల వరకు రెండు ప్రాంతాల రాజకీయాల్లోనూ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రాబల్యం వహించింది. కానీ 2000లో ముఫ్తీ మహమ్మద్ సయీద్ నేతృత్వంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) రూపంలో ఎన్‌సీకి గట్టి పోటీ ఎదురైంది. రాష్ట్ర శాసనసభకు 2003, 2008, 2014లో జరిగిన మూడు ఎన్నికల్లో ఏ పార్టీకీ తగిన మెజారిటీ రాక సంకీర్ణ ప్రభుత్వాలు నడిచాయి. తిరిగి ఒకే పార్టీ ఆధిపత్యం ఏర్పడటం ఈ ఎన్నికల విశిష్ట లక్షణం. రాజ్యాంగ అధికరణం 370ని పునరుద్ధరించాలని డిమాండ్ ఎన్‌సీ ఘన విజయానికి కారణం అని పలువురు రాజకీయ పండితులు విశ్లేషించారు. ప్రజలు తమకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం (అధికరణం 370ని రద్దు చేస్తూ) తీసుకున్న నిర్ణయాన్ని కాశ్మీర్ ప్రజలు గట్టిగా తిరస్కరించడమేనని పార్టీ నాయకుడు ఒమర్ అబ్దుల్లా భాష్యం చెప్పారు. అయితే ఎన్‌సీ కాశ్మీరు లోయలో భారీగా సీట్లు సంపాదించినప్పటికీ దాన్ని ఓట్ల శాతం 2008లో ఎంత ఉందో (23 శాతం) ఇప్పుడు కూడా దాదాపు అలాగే ఉన్నట్టు ఓటింగ్ సమాచారం వెల్లడిస్తోంది. అంతేగాక అనేక సీట్లలో ఎన్‌సీ గెలుపునకు కారణం పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్ని పార్టీ, ఏఐపీ వంటి పార్టీల మధ్య ఓట్ల చీలికే కారణమని తేలింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పార్టీలను ఎన్నికలకు ముందు ‘కేంద్ర ప్రభుత్వం అనుకూల పార్టీలు’గా ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి. ఎన్నికల ఫలితాలు రోజున ఒమర్ అబ్దుల్లా అధికరణం 370 పునరుద్ధరణ తమ ప్రాధాన్యం కాదని స్వయంగా ప్రకటించారు. ప్రజలు ఇచ్చిన తీర్పు అధికరణం విషయంలో తమ వైఖరికి మద్దతుగా కాదని ఈ ప్రకటన ద్వారా ఆయన పరోక్షంగా అంగీకరించినట్లు అయింది. విచిత్రం ఏమిటంటే అధికరణం 370 తమకు ముఖ్యం కాదని ఆయన చేసిన ప్రకటన మీద కాశ్మీర్ లోయలో ఎక్కడా నిరసన ప్రదర్శనలు జరగలేదు. అంటే ప్రజలు అసలు అధికరణం 370 గురించి పట్టించుకోవడం లేదన్నమాట. బిజెపికి సంబంధించినంత వరకు జమ్మూ కాశ్మీర్ రాజకీయాలలో దినదిన ప్రవర్ధమానం అవుతున్న పార్టీకి ఈ ఎన్నికలు ఒక కీలకమైన మైలురాయి. 2003లో ఒకే ఒక స్థానం సంపాదించుకున్న పార్టీ ప్రతి ఎన్నికల్లోను నిరంతరం అభివృద్ధి చెందుతూ ఈ ఎన్నికల్లో 29 సీట్లు గెలుచుకుని 26 శాతం ఓట్లతో అతి ఎక్కువ ఓట్లు సంపాదించుకున్న పార్టీగా నిలిచింది. 6 హిందూ మెజారిటీ జిల్లాలోని సీట్లన్నీ గెలుచుకుని కీలకమైన జమ్మూ ప్రాంతంలో ఎన్‌సీకి ఎటువంటి ప్రాతినిధ్యం లేకుండా చేసింది. ఈ ఎన్నికల ఫలితాలను ఒమర్ అబ్దుల్లా బిజెపికి ప్రజల తిరస్కరణగా అభివర్ణించారు. కానీ ఆయన అర్థం చేసుకోని విషయం ఏమిటంటే యావత్ జమ్మూ ప్రాంతం ఎన్‌సీని తిరస్కరించింది. కొందరు పరిశీలకులు ఈ ఎన్నికలకు పూర్తిగా మతపరమైన దృష్టితో భాష్యాలు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి.
నిజానికి పీర్ పంజల్ ప్రాంతంలోని రెండు జిల్లాలు, పూంచ్, రాజౌరిలు ఈ ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించాయి. ఈ జిల్లాల పరిధిలోని 8 సీట్లలో బిజెపి ఒకే ఒక సీటు గెలుచుకోగలిగింది. మిగిలిన 7 సీట్లు ఎన్‌సీ కి, దాని మిత్రపక్షాలకు వెళ్లాయి. దీనివల్ల కొందరు దీన్ని మతపరమైన దృష్టితో చూశారు. కానీ గుజ్జర్లు, పహారీల ప్రాబల్యం కలిగిన ఈ ప్రాంతంలో బిజెపి అనేకమంది ప్రముఖ ముస్లిం వ్యక్తులను అభ్యర్థులుగా నిలబెట్టి సీట్లు గెలుచుకోలేకపోయినా గణనీయమైన సంఖ్యలో ఓట్లను సంపాదించింది. భవిష్యత్తులో జమ్మూ అంతటా బలం కలిగిన పార్టీగా మారేందుకు ఈ 2 జిల్లాల్లో పార్టీ మరింత బలోపేతం కావలసి ఉంది. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా బలం కలిగిన పార్టీగా ఎదగడానికి బిజెపికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మించిన అవకాశం మరొకటి లేదు. బిజెపికి జమ్మూలోనే తప్ప కాశ్మీర్లో ఎటువంటి బలం లేదన్న భ్రమను ఈ ఎన్నికలు పటాపంచలు చేశాయి. గురెజ్ స్థానంలో బిజెపి అభ్యర్థి పెద్ద సంఖ్యలో ఓట్లు గెలుచుకున్నారు. కేవలం 1,000 ఓట్ల తేడాతో ఎన్‌సీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికలకు భిన్నంగా కాశ్మీర్ లోయలో ఈసారి బిజెపి అభ్యర్థులు వేల సంఖ్యలో ఓట్లు సంపాదించుకున్నారు. కాశ్మీర్ ఓటర్లలో కూడా బిజెపి పట్ల పెరుగుతున్న ఆదరణకు ఇది సంకేతం.
జమ్మూలోను, కాశ్మీర్‌లోను కూడా మోదీ అత్యంత ప్రజాదరణ గల నాయకుడు. లోయలో ప్రజలు బిజెపికి ఓటు వేయడానికి వెనుకాడుతూ ఉండవచ్చు. కానీ కేంద్రపాలిత ప్రాంతంలో గత ఐదేళ్లలో మోదీ సుపరిపాలన కారణంగా తమకు లభించిన ప్రయోజనాలను మాత్రం బహిరంగంగానే మెచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్ రాజకీయాలలో 1950లలో ప్రవేశించింది. కానీ 60 ఏళ్ల తర్వాత కాశ్మీర్ లోయలో 2 సీట్లు సంపాదించుకోవడానికి ఇప్పటికీ నానా తంటాలు పడుతోంది. మంచి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తే లోయలో బలం పుంజుకోవడానికి బిజెపికి అంత సమయం అవసరం లేదు. వేర్పాటువాద రాజకీయాలు చరమ దశలో ఉన్నాయి. గతంలో ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన వేర్పాటువాదులు ఈసారి తమ రాజకీయ లక్ష్యాల సాధన కోసం ఎన్నికల పథాన్ని ఎంచుకున్నారు. ఇది మోదీ ప్రభుత్వం సాధించిన ఘనవిజయం. జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో కొత్త ధోరణులకు ఇది ద్వారాలు తెలుస్తుంది. ప్రజలను నిరంతరం దేశభక్తి పరీక్షలకు గురి చేయకుండా విభిన్న రాజకీయ అభిప్రాయాలు కలిగిన వారికి రాజకీయాల్లో స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రధాన ప్రతిపక్షంగా బిజెపి శాంతి, అభివృద్ధితో కూడిన రాజకీయాలను నిర్మించేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త ద్విపక్ష రాజకీయాలు ఒమర్ అబ్దుల్లాకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన కేంద్రంతో ఘర్షణ వైఖరిని అనుసరించలేదు. కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌పై ద్వేషంతో కాక కాశ్మీర్‌పై ప్రేమతోనే ఇప్పటివరకు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తించాలి. ప్రజలకు సుపరిపాలన అందించడానికి కేంద్రం శాయశక్తులా కృషి చేస్తుంది. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించడం కూడా అందులో ఒకటి. అయితే రాష్ట్రాన్ని 2019కి ముందు నాటి పరిస్థితికి కాకుండా 2047 దిశగా తీసుకువెళ్లడానికి ఎన్‌సీ నాయకత్వం సుముఖంగా ఉండాలి.
రామ్ మాధవ్