data security

డీపీడీపీ-2025: వ్యక్తిగత సమాచారానికి రక్షణ

ప్రధాని మోదీ ఇటీవల ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సభలోప్రపంచ భవిష్యత్తు గురించి చెబుతూ మానవ కేంద్రిత దృక్పథానికే అగ్రప్రాధాన్యమివ్వాలి, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన కర్తవ్యం కావాలని ఉద్బోధించారు. ప్రజల బాగోగులను పట్టించుకోవడం ద్వారానే ఉజ్జ్వల భవితను అందుకోగలమని ప్రధాని పేర్కొన్నారు. డిజిటల్‌ వ్యక్తిగత సమాచార రక్షణ నిబంధనల ముసాయిదా రూపకల్పనకు ఈ దృక్పథమే మార్గదర్శి!

వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవడానికి పౌరులకున్న హక్కుకు భరోసా ఇవ్వాలనే నిబద్ధతతో ‘డిజిటల్‌ వ్యక్తిగత సమాచార రక్షణ నిబంధనల ముసాయిదా(డీపీడీపీ-2025)’ను రూపొందించాం. నేడు సమాచారానికి అనుక్షణం ప్రాధాన్యం పెరిగిపోతోంది. పరిపాలనా చట్రానికి పౌరుల వ్యక్తిగత సమాచార రక్షణ కేంద్ర బిందువు కావాలనీ, పౌరుల సమాచారాన్ని వినియోగించుకోవడానికి వారి ముందస్తు అనుమతి తీసుకోవాలనీ ముసాయిదా నిర్దేశిస్తోంది. అలా ఉపయోగించుకోవడంలోని సాధకబాధకాలను వారికి ముందే తెలియజేయాలని సూచిస్తోంది. అంతేకాదు, అవసరమైనప్పుడు తమ సమాచారాన్ని చెరిపేయాలని డిమాండ్‌ చేసే హక్కు పౌరులకు ఉంటుందని, వారు డిజిటల్‌ నామినీలనూ నియమించుకోవచ్చని డీపీడీపీ ఉద్ఘాటిస్తోంది. తమ సమాచారాన్ని ఇతరులు అనుమతి లేకుండా ఉపయోగించినా, ఉల్లంఘనలకు పాల్పడినా చర్యలు తీసుకోవడానికి అది భరోసా ఇస్తోంది. పౌరుల డిజిటల్‌ వ్యక్తిత్వాలను నిర్వహించడానికి, పరిరక్షించడానికి అవసరమైన సాధనాలనూ ముసాయిదా అందిస్తోంది. డీపీడీపీ-2025 నిబంధనలను చాలా సరళంగా, సాంకేతిక పరిజ్ఞానం లేనివారికి కూడా అర్థమయ్యేలా రూపొందించాం. అందువల్ల పౌరులు వాటిని స్వీయ సమాచార రక్షణకు సులభంగా ఉపయోగించుకోగలుగుతారు. పౌర సమాచారాన్ని ఉపయోగించుకోవడానికి ముందస్తు అనుమతి అవసరమని నిర్దేశిస్తూ, ఆ విషయాన్ని ఆంగ్లంతో పాటు రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో తెలియజేసే వెసులుబాటు కల్పించాం.

చిన్నారులకు రక్షణ

డిజిటల్‌ యుగంలో బాలబాలికల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముసాయిదా గుర్తించింది. పిల్లల సమాచారాన్ని ఎవరైనా ఉపయోగించుకోవాలంటే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి తీసుకోవాలని డీపీడీపీ-2025 నిర్దేశిస్తోంది. చిన్నారుల మానసిక, ప్రవర్తనా సంబంధ విషయాలను ఎవరూ రికార్డు చేయకుండా, విశ్లేషించకుండా ఈ నిబంధనావళి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆన్‌లైన్‌లో పిల్లలపై ఎవరూ వల వేయకుండా కూడా చూస్తుంది. భావి తరాలకు భద్రమైన డిజిటల్‌ వాతావరణ ఏర్పాటుకు ఈ ముసాయిదా నిబద్ధత ప్రదర్శిస్తోంది. భారతదేశ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విజయాన్ని ప్రపంచమంతా గుర్తించింది. ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకుపోదలిచాం. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో నవీకరణ సాధన స్ఫూర్తిని పెంచిపోషిస్తూనే, వ్యక్తిగత సమాచార రక్షణకు భంగం కలగకుండా చర్యలు తీసుకున్నాం. ఈ విషయంలో కొన్ని దేశాలు అతి నియంత్రణ బాటపట్టినా, భారత్‌ మాత్రం అభివృద్ధిని ప్రోత్సహించే ఆచరణీయ పంథాను చేపట్టింది. ఈ సమతుల వైఖరి అంకుర సంస్థలకూ, నవీకరణ ద్వారా నడిచే వ్యాపారాలకూ ప్రోత్సాహకరంగా ఉంటుందే తప్ప వారి ముందరికాళ్లకు బంధాలు వేయదు. డీపీడీపీ-2025 నిబంధనావళి చిన్న వ్యాపారాలకు, అంకుర సంస్థలకు భారం కాకుండా జాగ్రత్తపడ్డాం. ఈ నిబంధనలను పాటించే విషయంలో పెద్ద కంపెనీలపై ఎక్కువ బాధ్యత మోపాం. వాటిని ఎక్కువ జవాబుదారీ చేశాం.

డిజిటల్‌కే అగ్రాసనం

డీపీడీపీ-2025 నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూసే బాధ్యతను డేటా సంరక్షణ బోర్డు తీసుకుంటుంది. పౌరుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంది. ఈ బోర్డు డిజిటల్‌ కార్యాలయం మాదిరిగా పనిచేస్తుంది. అధునాతన సాంకేతికతను ఉపయోగించి పారదర్శకంగా, సమర్థంగా, వేగంగా విధులు నిర్వహిస్తుంది. పౌరులు ఈ కార్యాలయ సిబ్బందిని ప్రత్యక్షంగా కలవనక్కర్లేదు. ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసి, దాని పురోగతిని ట్రాక్‌ చేయవచ్చు. తద్వారా పరిష్కారం పొందవచ్చు. ‘డిజిటల్‌ ఫస్ట్‌’ విధానం కింద ఓ అధికారిని లేదా సంస్థను ఫిడూషియరీగా నియమిస్తాం. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ఎలా విశ్లేషిస్తున్నారు? దాని వినియోగానికి పౌరుల సమ్మతి తీసుకుంటున్నారా లేదా? వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరిచేటప్పుడు చౌర్యం, ఉల్లంఘన జరగకుండా జాగ్రత్త పడుతున్నారా? ఆ సమాచారాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నారు?… వంటి అంశాలపై నిఘా వేసి, నిర్ణయాలు తీసుకునే అధికారం ఫిడూషియరీకి ఉంటుంది. పౌరులకూ, ఫిడూషియరీకీ ఉభయతారకంగా ఉండే విధానాన్ని ‘డిజిటల్‌ ఫస్ట్‌’ కింద చేపడుతున్నాం.

అన్ని వర్గాలనూ కలుపుకొనిపోయే విధంగా డీపీడీపీ-2025 నిబంధనలను రూపొందించాం. 2023నాటి డిజిటల్‌ వ్యక్తిగత సమాచార రక్షణ చట్టం ఆధారంగా వీటికి రూపకల్పన చేశాం. అంతర్జాతీయ నిబంధనలను అధ్యయనం చేసి, స్వదేశంలో వివిధ వర్గాల అభిప్రాయాలు, సూచనలను స్వీకరించి ఈ నిబంధనావళిని సిద్ధం చేశాం. దీనిపై పౌరులు, మేధావులు, వ్యాపారవేత్తల అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాం. ఫిబ్రవరి 18లోగా ‘మైగవ్‌’ పోర్టల్‌ ద్వారా అందరూ ప్రభుత్వానికి తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. డీపీడీపీ-2025 నిబంధనలు పకడ్బందీగా రూపొందినప్పటికీ… సామాజిక, ఆర్థిక పరిస్థితులను బట్టి వాటిలో మార్పుచేర్పులు చేసేందుకు వెసులుబాటు కల్పించాం. వ్యక్తిగత సమాచార రక్షణకు సంబంధించి తమ హక్కుల గురించి ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమాలను చేపడతాం.

భవిష్యత్తు కార్యాచరణ

ప్రస్తుత అవసరాలను తీర్చి, నేటి సవాళ్లను ఎదుర్కోవడమే కాదు… నవీకరణకు పట్టంకట్టే భద్రమైన డిజిటల్‌ భవిష్యత్తును సాధించడమూ ముఖ్యమే. డీపీడీపీ-2025 ముసాయిదా- అంతర్జాతీయ డేటా నిర్వహణ ప్రమాణాలను తీర్చిదిద్దడంలో భారత్‌ నాయక స్థానంలో ఉందని చాటుతోంది. తాను చేపట్టిన పౌర కేంద్రిత వ్యవస్థ మిగతా ప్రపంచానికీ మార్గదర్శకంగా ఉంటుందని భారత్‌ ఆశిస్తోంది. డిజిటల్‌ యుగంలో ప్రతి పౌరుడికీ సాధికారతను, డేటా రక్షణను కల్పించడానికి భారత్‌ కట్టుబడి ఉంది. డీపీడీపీ-2025 నిబంధనల ముసాయిదాపై పౌరులు, మేధావులు, వ్యాపార సంస్థలు తమ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ నిబంధనలను మరింత సునిశితం చేసి భద్రమైన, సమ్మిళితమైన, ఉజ్జ్వల డిజిటల్‌ భారత్‌ను నిర్మించుకుందాం.

అశ్విని వైష్ణవ్,
కేంద్ర సమాచారం, ప్రసారాలు, ఐటీ, రైల్వే శాఖ మంత్రి