మహారాజనీతిజ్ఞుడు, పరిపాలనాదక్షుడు
స్వతంత్ర భారతదేశ మహారాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్‌పేయి. వాజ్‌పేయి గొప్ప ద్రష్ట నిజమైన మానవతావాది. ప్రతిభావంతుడైన పాత్రికేయుడు. మధుర కవి కూడా. భిన్న భావజాలాలకు కట్టుబడిన ఇరవైకి పైగా రాజకీయ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని మహా సమర్థతతో నడిపిన అనుభవజ్ఞుడు, వాజ్‌పేయి శాంతి, ప్రేమ, సుహృద్భావాలకు మూర్తీభవించిన చిహ్నం.
వాజ్‌పేయి సామాన్య కుటుంబ నుంచి వచ్చారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. కుమారుడు ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. శతాబ్దాల పార్లమెంటరీ జీవితంలో వాజ్‌పేయి అన్ని రాజకీయ పక్షాల గౌరవాలను పొందారు. ఆయన సాటి లేని మహావక్త. తాను విశ్వసించిన సిద్ధాంతాలు, ప్రజాస్వామిక విలువల పరిరక్షణకు జీవితాంతం అంకితమయ్యారు. గీతాకారుని నిష్కామ కర్మ సందేశానికి వాజ్‌పేయి ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణ. నిజమైన జాతీయవాద ప్రభుత్వాన్ని నెలకొల్పాలన్న స్వప్నాన్ని సాకారం చేసేందుకు లాల్ కృష్ణ ఆడ్వాణీ మొదలైన సహచరులతో వాజ్‌పేయి విశేష కృషి చేశారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శిష్యుడైన వాజ్‌పేయి యువ పార్లమెంటేరియన్‌గా నెహ్రూ ప్రశంసలు పొందారు. ఇందిరాగాంధీ ఆయన్ని అమితంగా గౌరవించేవారు. దేశ పాలనా వ్యవహారాలలో ఆయన్ని సంప్రదించేవారు. కార్మిక నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్ కు ఆయన మంచి మిత్రుడు. ఉదారవాది అయిన వాజ్‌పేయి తాను విశ్వసించిన విలువలు, జాతి ప్రయోజనాల విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు. సుదీర్ఘకాల ప్రతిపక్షనేతగా ఉన్న వాజ్‌పేయి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించారు. అయితే తరచు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఆయన పరిపూర్ణ జాతీయవాది. ‘ఈ దేశం కేవలం ఒక భూభాగం కాదు. ఒక సజీవ జాతి. పుణ్యభూమి భారత్ కోసం నా జీవితాన్ని త్యాగం చేసేందుకు గర్వపడతాను’ అని తరచూ అనేవారు.
అనితర సాధ్యుడు
ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ఆ అప్రజాస్వామిక చర్యను తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పోరాడారు. ఎమర్జెన్సీ అనంతరం మొరార్జీ దేశాయి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వంలో ఆయన విదేశాంగ మంత్రిగా పని చేసినప్పుడు ప్రపంచ నేతల, ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల నాయకుల గౌరవాభిమానాలు వాజ్‌పేయికి విశేషంగా లభించాయి. ఇరుగు పొరుగు దేశాలతో సుహృద్భావ సంబంధాలను సుస్థిరపరచడానికి ఆయన చేసిన కృషి ఇప్పటికీ స్ఫూర్తిదాయకం. తదనంతర కాలంలో ప్రధానమంత్రిగా ఆయన పేరు ప్రఖ్యాతులు అంతర్జాతీయ స్థాయిలో మరింత ఇనుమడించాయి.
వాజ్‌పేయి ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ‘అంటరాని పార్టీ’గా ప్రత్యర్థులు అభివర్ణించేవారు. జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి, ఫరూఖ్ అబ్దుల్లా లాంటి నాయకులతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆయన ఎంతోకాలం నడపలేరని పలువురు భావించారు. అయితే తన అసాధారణ రాజకీయ అనుభవంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. దేశ రాజకీయ రంగంలో ఒక వినూత్న సామరస్యాన్ని సాధించారు.
సవాళ్లను అధిగమించి
1998 మే 11న రాజస్థాన్‌లోని పోఖ్రాన్లో మన దేశం ఐదు అణు పాటవ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. భారత్ ను అణు రాజ్యంగా రూపొందించడం ప్రధానమంత్రిగా ఆయన సాధించిన మహా విజయాలలో ప్రధానమైనది. ‘ఇరుగు పొరుగు దేశాలను గానీ, మరే దేశాన్ని గానీ ఆక్రమించుకునేందుకు గాక ఆత్మ రక్షణకే భారత్ ఈ అణు పాటవ పరీక్షలను నిర్వహించింది. భారత్ ప్రయోజనాలకే నేను తొలి ప్రాధాన్యమిస్తాను’ అన్నారు వాజ్‌పేయి ఆ సందర్భంగా. పోఖ్రాన్ పరీక్షలతో భారత ప్రతిష్ఠ పెరగడమే కాకుండా, అనేక సమస్యలు ఎదారయ్యాయి. అమెరికా, ఇతర సంపన్న దేశాలు భారత్ కు వ్యతిరేకంగా ఆర్థిక, సైనిక ఆంక్షలు విధించాయి. వాజ్‌పేయి అనితర సాధ్యమైన రాజనీతిజ్ఞతతో దేశం ఈ సమస్యలు, సవాళ్ళన్నిటినీ అనతి కాలంలోనే అధిగమించింది.
నిజమైన అర్థంలో మన తొలి కాంగ్రేసేతర ప్రధానమంత్రి వాజ్‌పేయి. 1999లో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణానికి, వాటి అనుసంధానానికి, అధునాతన టెలి కమ్యూనికేషన్ల అభివృద్ధికి ఆయన అగ్ర ప్రాధాన్యమిచ్చారు. నాలుగు వరుసల రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. వాటితోపాటు రైల్, వైమానిక, జల మార్గాల అభివృద్ధిని వేగవంతం చేశారు. ఈ మౌలిక సదుపాయాల మెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తుందని ఆయన సహేతుకంగా విశ్వసించారు. గ్రామీణ ప్రాంతాల అనుసంధానానికి అగ్ర ప్రాధాన్యమిచ్చి ‘ప్రధానమంత్రి సడక్ యోజన’ను ప్రారంభించారు. 2001 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ‘వాల్మీకీ అంబేద్కర్ ఆవాస్ యోజన’ ప్రాజెక్టును ప్రకటించారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు సమకూరుస్తుందని, మిగతా సగం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయని తెలిపారు. ఆ పథకం కింద పేదలకు లక్షలాది గృహాలను నిర్మించడం జరిగింది. పీవీ నరసింహారావు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలను వాజ్‌పేయి మరింత వేగవంతంగా అమలుపరిచారు. అటల్జీ స్వప్నాలను సాకారం చేయడం ద్వారా ఒక నూతన భారతదేశాన్ని నిర్మించవలసిన అవసరమున్నది. ఆయన భావాలను నేటి తరానికి తెలియజేయడం చాలా అవసరం.
బండారు దత్తాత్రేయ,
హర్యానా గవర్నర్