Republic day

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నవరి 26న దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దిల్లీ ఎర్రకోటపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక బిజెపి సైతం ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంది. దిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జె.పి. నడ్డా జాతీయ జెండా ఎగరేశారు. ఇక హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ జాతీయ జెండాను ఎగరేశారు. రాష్ట్రవ్యాప్తంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా జెండా వందనంలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. 

ఈ సందర్భంగా జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నరేంద్ర మోదీ గత పది సంవత్సరాలుగా అంబేద్కర్ స్ఫూర్తితో పాలన అందిస్తూ దేశ ప్రజలకు సేవలందిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతారు. కానీ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ నెహ్రూ హయాం నుంచీ రాజ్యాంగాన్ని అవహేళన చేసి, పౌరహక్కులను అణచివేసిన విషయం రాహుల్ గాంధీకి అర్థం కాదు. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నికను చెల్లనిదిగా ప్రకటించి, పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతో రాజ్యాంగాన్ని కాలరాసి, అధికార దుర్వినియోగం చేసి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. మీసా చట్టం కింద అనేక మంది రాజకీయ నేతలను అన్యాయంగా అరెస్టు చేశారు. అటల్ బిహారీ వాజ్ పేయి, లాల్ కృష్ణ అద్వానీ, వెంకయ్య నాయుడు, ఆచార్య కృపలానీ లాంటి అనేక మంది నాయకులను జైలులో పెట్టారు. మీసా చట్టం కింద దేశాన్ని జైలుగా మార్చి పౌర హక్కులను కాలరాసి, పత్రికాస్వేచ్ఛను హరించి రాష్ట్రీయ స్వయంసేవక్ లాంటి సంస్థలను నిషేధించారు.

తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది. అనేక రకాలుగా రాజ్యాంగాన్ని అవమానిస్తోంది. కాంగ్రెస్ జమ్ముకశ్శీర్ లో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనేక సంవత్సరాలు అమలు చేయలేదు. జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి, ఆర్టికల్ 370ని తొలగించి, భారత రాజ్యాంగాన్ని అమలు చేసిన చరిత్ర నరేంద్ర మోదీ ప్రభుత్వానిది. బాబాసాహెబ్ ప్రసాదించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ సంవిధాన్ గౌరవ అభియాన్ గా నిర్వహించుకుంటున్నాం. మన చుట్టపక్కల అనేక దేశాలు పౌర హక్కులను అమలు చేసే విషయంలో విఫలమయ్యాయి. అదేవిధంగా ఇందిరాగాంధీ కూడా ఆ దిశలో ప్రయాణం చేసి ప్రజాస్వామ్యాన్ని, పౌరహక్కులను రద్దు చేసే ప్రయత్నం చేశారు. 1977లో దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పి, జనతా పార్టీని గెలిపించి, రాజ్యాంగానికి మద్దతు పలికారు. హమారా సంవిధాన్.. హమారా స్వాభిమాన్ అనే ఆలోచనతో ప్రతి భారతీయుడు, ప్రతి బిజెపి కార్యకర్త ముందుకెళ్లాలి. మనసావాచా భారత రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా కట్టుబడి ఉన్నాం. అంబేద్కర్ స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని ఇంటింటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి.’’ అని అన్నారు.