Revanth Reddy

కాంగ్రెస్‌కు కొరకరాని కొయ్యగా రేవంత్ రెడ్డి!

రాష్ట్రాలలో ఆధిపత్యం వహించే నాయకుల పట్ల కఠినంగా వ్యవహరించడం, కేవలం తమ చెప్పుచేతలలో ఉండే వారినే ప్రోత్సహించడం కాంగ్రెస్ అధిష్టానానికి పరిపాటిగా వస్తున్నది. సొంతబలంపై నాయకుడిగా వ్యవహరించాలనుకొనే వారికి, ప్రజలలో సొంతంగా ఇమేజ్ పెంచుకునే నాయకులను సహించలేరు. అందుకనే పార్టీ అధిష్టానం ప్రోత్సహించే నాయకులు అందరూ దాదాపుగా సొంతరాష్ట్రాలలో ఏమాత్రం పలుకుబడి లేనివారే. అయితే, తెలంగాణలో శిథిలావస్థలో ఉన్న కాంగ్రెస్ ను గెలిపించి ముఖ్యమంత్రి కాగలిగిన రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానానికి కొరకరాని కొయ్యగా మారారు. అందుకే రాహుల్, ప్రియాంక వంటివారు వ్యక్తిగతంగా కలిసేందుకు ఇష్టపడటం లేదు. తెలంగాణలో పార్టీ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్నా ఒక్కసారి కూడా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు.

మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ప్రకటన వంటి విషయాలలో ఎన్నిసార్లు దిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పటికీ ప్రయోజనం ఉండటం లేదు. మిగిలిన నాయకుల్లా రేవంత్ రెడ్డి తమ చెప్పుచేతలలో ఉండకపోవచ్చనే అనుమానాలే కారణంగా పలువురు భావిస్తున్నారు. ఇటీవల వాక్ స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా ఆయన చేసిన దారుణమైన వ్యాఖ్యలు, అహంకారపూరిత చర్యలు, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తోసిపుచ్చడం వంటి అంశాలను అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించడం కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడవేసింది. కోర్టులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పలు సందర్భాలలో మందలించాయి. రేవంత్ రెడ్డి, ఆయన సోదరులపై పార్టీ కార్యకర్తల నుండి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలోని 400 ఎకరాల పర్యావరణ అటవీ ప్రాంతాన్ని ఐటీ పార్క్ కోసం బదిలీ చేయడానికి ప్రతిపాదించడం పెద్ద దుమారం రేపింది. ఈ విషయాలపై ఒంటెత్తు పోకడలకు పోతూ రేవంత్ మొత్తం పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేస్తున్నారనే విమర్శలు అంతర్గతంగానే చెలరేగుతున్నాయి. ఇక ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు చూసుకునే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో రేవంత్‌కు పొసగటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారునిగా నిలబడటంతో, ముఖ్యమంత్రిని మార్చాల్సి వస్తే ఆయనే ముఖ్యమంత్రి కావచ్చనే అనుమానాలు రేవంత్‌ను వెంటాడుతున్నాయి. అందుకే దిల్లీలో కేంద్ర మంత్రులు, పార్టీ అధినేతలను కలిసే సమయంలో ఎప్పుడూ విక్రమార్కను తీసుకువెళ్లే రేవంత్ రెడ్డి ఈ మధ్య ఇతర మంత్రులను తీసుకెళ్తున్నారు. ఇటీవల కాంట్రాక్టర్లు సచివాలయంలో విక్రమార్క ఛాంబర్ ముందు బిల్లుల చెల్లింపుల కోసం నిరసనలు చేపట్టడం వెనుక ముఖ్యమంత్రి మద్దతుదారులు ఉన్నారనే అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి.

తెలంగాణ ఇంచార్జ్‌గా వ్యవహరించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దీపా దాస్‌మున్షి రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యారనే ఫిర్యాదులు రావడంతో ఆమెను మార్చేసి, నేరుగా రాహుల్ గాంధీ బృందంలోని కీలక నేత  మీనాక్షి నటరాజన్‌ను తీసుకువచ్చారు. అయినా పరిస్థితులలో ఎటువంటి మార్పులు కనిపించడం లేదు. తెలంగాణలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ రేవంత్‌ను తమ పార్టీ నేతగా భావించడం లేదు. తెలుగుదేశం ఏజెంట్ గానే భావిస్తున్నారు. పైగా, ప్రభుత్వంలో పలు నియామకాలలో ‘మాజీ టీడీపీ’ వారికి ప్రాధాన్యత లభిస్తున్నదని, పార్టీలో సీనియర్లను పక్కన పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఎమ్యెల్సీ అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి సిఫార్సులను పార్టీ అధిష్టానం పక్కన పెట్టినదనే ప్రచారం జరిగింది. కేసీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలపై గతంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం కాంగ్రెస్ వర్గాలనే విస్మయానికి గురిచేస్తున్నది. పైగా, కేసీఆర్ హయాంలో అక్రమాలకు బాధ్యులుగా భావించే కాంట్రాక్టర్లకు రాచబాట వేస్తున్నారు. మరోవంక, తరచూ దిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలుస్తూ వారితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానానికి ఓ విధమైన హెచ్చరికలు పంపే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ తనను ఇబ్బంది పెడితే తనకు వేరే మార్గాలు ఉన్నట్లు సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొద్దికాలంలోనే తీవ్రమైన ప్రజావ్యతిరేకత ఎదురవుతూ ఉండడంతో పార్టీ అధిష్టానం ఓ విధంగా దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు కనిపిస్తుంది. రేవంత్ తమ అదుపు తప్పుతున్నారని ఆందోళన వారిలో వ్యక్తం అవుతున్నది. అయితే కఠినంగా వ్యవహరిస్తే రాష్ట్రంలో ప్రభుత్వమే కోల్పోవలసి వస్తుందనే భయం కూడా వారిని వెంటాడుతున్నది.

ప్రవీణ్