Tiranga Rally Srinagar

కశ్మీరీల మద్దతుతో పాక్ ఉగ్రవాదంపై పోరు

నకు నష్టం జరిగినా భారత్‌పై ప్రాణాంతక యుద్ధానికి, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌ను ఎలా ఎదుర్కోవాలి? దీనికి సులువైన సమాధానాలు లేవు. భారత ప్రభుత్వం అనేక వ్యూహాలను ప్రయత్నించింది. పదేపదే పాక్‌తో స్నేహం చేయాలని ప్రయత్నించాం. మనం పాకిస్తాన్‌తో 1965, 1971, 1999లో మూడు పెద్ద యుద్ధాలు చేసాం. ఈ మూడింటిలోనూ మనం దేశాన్ని ఓడించాం, 1971 యుద్ధంలో పాకిస్తాన్ ముక్కలైంది. 2001 డిసెంబరులో పార్లమెంటుతో సహా భారత నగరాల్లో దాడులకు ఉగ్రవాదులను ఉపయోగించి పరోక్ష యుద్ధానికి దిగినప్పుడు, మనం మరో యుద్ధానికి మన దళాలను సిద్ధం చేసాం, ఆ దేశ వికృత ఉగ్రవాదాన్ని బహిర్గతం చేయడానికి అంతర్జాతీయ ప్రచారాన్ని ప్రారంభించాం. ఇటీవలి సంవత్సరాలలో పరిమితస్థాయిలో నియంత్రణ రేఖ, సీమాంతర దాడులను కూడా నిర్వహించాం.

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపింది. బుర్హాన్ వనీని హతమార్చడం వంటి కొన్ని సందర్భాల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు కొంత కాలం అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించాయి. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. 2019లో అధికరణం 370 రద్దు, రాష్ట్రాన్ని కేంద్ర పాలనలోకి తీసుకురావడం వంటి చర్యలతో ముందుకు వెళ్లింది. గత 10 సంవత్సరాలలో ఉగ్రవాదులకు మద్దతునిస్తున్న అనేక సంస్థలు నిషేధించడం వాటి ఆర్థిక వనరులను, పౌర సమాజ సంస్థల మద్దతును నిర్వీర్యం చేయడంతో సహా అనేక చర్యలు తీసుకున్నప్పటికీ పాకిస్తాన్-ప్రాయోజిత ఉగ్రవాదులు అప్పుడప్పుడు తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. 

ఓ వైపు భద్రతా బలగాలు భారీగా మోహరించడం, మరోవైపు సుపరిపాలన చర్యలు చేపట్టడంతో ఉగ్రవాద సంస్థలకు స్థానికంగా మద్దతు తగ్గుముఖం పట్టింది. ఒకప్పుడు ప్రతి ఏటా వందలాది యువకులు టెర్రరిస్టుల గూటికి చేరేవారు. 2024లో కేవలం నలుగురు స్థానికులు మాత్రమే చేరారని వార్తలు సూచిస్తున్నాయి. కశ్మీరు ప్రజల నుంచి మద్దతు సన్నగిల్లడంతో పాకిస్తాన్ ఉగ్రవాద సమన్వయకర్తలు వ్యూహాలను మార్చవలసి వచ్చింది. లష్కరే తోయిబా ముసుగు సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్), జైషే మహ్మద్‌కు ప్రతినిధి అయిన పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఏఎఫ్ఎఫ్) వంటి కొత్త సంస్థలను మోసపూరితంగా లౌకిక భావాలు కలిగిన పేర్లతో సృష్టించారు. ఇవి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ పరిశీలన నుంచి తప్పించుకోవడానికి పాకిస్తాన్‌కు సహాయపడ్డాయి.

2019 ఫిబ్రవరిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన పుల్వామా ఆత్మాహుతి దాడి జైషే మహ్మద్, దాని సహచరుల చివరి భారీ దాడి. ఆ తర్వాత కొత్త సంస్థలు రంగంలోకి దిగి భద్రతా దళాలు, పౌరులపై ఎవరికి వారే దాడులకు పాల్పడటం ప్రారంభించాయి. కోవిడ్ కాలంలో ఈ దాడులు అడపాదడపా జరిగాయి. కానీ 2023-2024లో ఈ సంస్థలు ప్రధానంగా జమ్మూ ప్రాంతంలో పలు దాడులకు దిగాయి. టీఆర్ఎఫ్ ఈ ఏడాది తాను చేసినట్టుగా చెబుతున్న దాడుల్లో పహల్గాం అతి పెద్ద దాడి. పహల్గాం దాడి అమానుషత్వం, క్రూరత్వం అందరినీ కదిలించి వేశాయి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మన గొప్ప గూఢచారుల్లో ఒకరైన బి రామన్ మాట్లాడుతూ ఉగ్రవాదులకు ఎప్పుడో ఒక్కసారి మాత్రమే కాలం కలిసి రావాలని, భద్రతా సంస్థలు మాత్రం ఎల్లవేళలా విజయవంతం కావాలని చెప్పేవారు. ఉగ్రవాదులకు పహల్గాం అలాంటి రోజు. మన వ్యవస్థలోని లోపాలు, లొసుగుల గురించి మనల్ని ఇది మేల్కొల్పాలి. పహల్గాంలో పర్యాటకులను కాపాడేందుకు పలువురు స్థానికులు ముందుకు వచ్చిన మాట వాస్తవమే అయినా, స్థానికుల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద సంఘటన ఏదీ సాధ్యం కాదన్నది వాస్తవం. మన భద్రతా సంస్థల మానవ, సాంకేతిక ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. అసిమ్ మునీర్ వంటి కరడుగట్టిన ఇస్లామిస్ట్ పాక్ సైన్యంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో మన భద్రతా వ్యవస్థకు మరింత అప్రమత్తత, జాగరూకత అవసరం.

కశ్మీర్‌లో ఉగ్రవాదం పెచ్చరిల్లిన సందర్భాలు, అలాగే స్తబ్దంగా మారిన సందర్భాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా మన భద్రతా వ్యవస్థలు తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది. గత దశాబ్దంలో 400 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టగా, 2023లో 72 మందిని మట్టుబెట్టారు. ఉగ్రవాద ఘటనలు కూడా 2018లో 228 ఉండగా, 2024 నాటికి 20 కంటే తక్కువకు తగ్గాయి. పౌరుల మరణాలు 2018లో 55 నుండి 2023లో 13కు తగ్గాయి. స్థానిక నియామకాలు జరగకపోవడంతో ప్రస్తుత అంచనాల ప్రకారం 76 మంది క్రియాశీల ఉగ్రవాదుల్లో దాదాపు 60 మంది పాకిస్తానీయులే ఉన్నారు. ప్రజల మద్దతు లేకుండా ఉగ్రవాదంపై పోరాటం విజయవంతం కాదు. కశ్మీరీలు ఇప్పుడు లోయలో ఇంకా మిగిలిఉన్న ఉగ్రవాద మహమ్మారి ఆనవాళ్లను తుడిచి పెట్టడంలో ప్రభుత్వానికి పూర్తిగా అండగా నిలవాలని నిశ్చయించుకోవాలి. 

కశ్మీర్ శ్రామిక శక్తిలో 30 శాతానికి పైగా పర్యాటక రంగంపై ఆధారపడి ఉంది, ఇది కేంద్రపాలిత ప్రాంత జీడీపీలో 10 శాతం. కశ్మీరీల ఉపాధి, ఉద్యోగాలు, బతుకుతెరువు గురించి తమకు పట్టింపు లేదని పహల్గాం ఘటన ద్వారా ఉగ్రవాదులు నిరూపించారు. ఈ ఘటనను నిరసిస్తూ పెద్ద ఎత్తున తరలివచ్చిన చాలా మంది కశ్మీరీల మనస్సాక్షిని ఇది కదిలించినట్లు తెలుస్తోంది. పలువురు మితవాద వేర్పాటువాదులు కూడా కొవ్వొత్తుల ర్యాలీల్లో పాల్గొనడం హర్షణీయం. వాస్తవానికి ఈ ఘటన రాష్ట్రంలో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే ఈ నిరసనలు పర్యాటకులకు భరోసా ఇవ్వడానికి మాత్రమే పరిమితం కాకూడదు. కశ్మీరీ సమాజంలో అప్పుడప్పుడూ బాధ్యతారహితంగా నిర్లక్ష్యపూరితమైన ప్రకటనలు చేస్తూ ఉగ్రవాదులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే మిగిలిన శక్తులన్నింటినీ ఏకాకిని చేసి, తిరస్కరించే చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం జరగాలి. ఉదాహరణకు, పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య కశ్మీర్‌పై “సాంస్కృతిక దండయాత్ర” అని యూటీ అధికార పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు ఈ సంవత్సరం ప్రారంభంలో అన్నారు. పర్యాటకుల వల్ల కశ్మీర్‌కు ముప్పు పొంచి ఉందనే తప్పుడు వాదనతో టీఆర్ఎఫ్ కూడా పహల్గాం దాడిని సమర్థించుకుంది.

కశ్మీరీలను ప్రైంటైం టీవీ షోలలో రోజువారీ దేశభక్తి పరీక్షలకు గురిచేయడం, దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో వారిని వేధించడం వంటివి చేయకూడదు. అందుకు బదులుగా, వేర్పాటువాదం నుంచి ఎక్కువ మంది కశ్మీరీలను ప్రభుత్వం ఎలా దూరం చేయగలిగిందో అర్థం చేసుకోవడం, ఆ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలి అన్నదానిపై దృష్టి పెట్టాలి. ప్రపంచంలోని మొత్తం నాయకత్వం తన వెనుక నిలబడటంతో “ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను భూమి చివరి వరకు” వెంటాడి శిక్షిస్తామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మోదీ కేవలం మాటల మనిషి మాత్రమే కాదు, చేతల మనిషి. వ్యాసం ప్రారంభంలో నేను లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం అందులోనే ఉంది.

రాంమాధవ్,
ఇండియా ఫౌండేషన్ అధ్యక్షుడు, బిజెపి నాయకుడు