bsk nrr

కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతికి కవల పిల్లలు

bsk nrrకాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతికి కవల పిల్లలని.. కాళేశ్వరం పేరిట నాటకాలాడుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కేసీఆర్ కుమార్తె చెబుతున్నారని, అవినీతి సొమ్మును పంచుకోవడంలో విభేదాలు తలెత్తడం వల్లనే ఈ విషయాలు బయటపడుతున్నాయన్నారు. సీఏం 50 సార్లు దిల్లీకి వెళ్లి వచ్చారని.. ఆయన రాష్ట్రంలో పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. కరీంనగర్ లో సెప్టెంబర్ 3న లోక్ సభ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో పాటు ఆయన పాల్గొన్నారు. 

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ “గత 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సుమారు రూ.12 లక్షల కోట్లు నిధులు ఇచ్చింది. కానీ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కేంద్రం ఏం ఇస్తోందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు 73, 74వ సవరణల ప్రకారం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు అందిస్తోంది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో జాతీయ రహదారులు అభివృద్ధి చెందాయి. కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ దాదాపు రూ.2 వేల కోట్లతో జరుగుతోంది. రాష్ట్రంలో రైల్వేలు, రోడ్ల నిర్మాణాల అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి. కోట్లాది రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ ప్రకటించినా, ఎక్కడా నోటిఫికేషన్లు లేవు. యువ, రైతు, బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు చేశామని కాంగ్రెస్ చెబుతోంది. కానీ అమలు చేయడం లేదు.” అని రాంచందర్ రావు అన్నారు.

పలు కేసుల నుంచి బీఆర్ఎస్ ను కాంగ్రెస్ కాపాడుతోందని.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలోనూ రెండేళ్లు కాలయాపన చేసిందని బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. “రెండేళ్ల క్రితమే నేను కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశాను. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కు అడుగడుగునా సహకరించింది. ఫోన్ ట్యా పింగ్, ఫార్ములా ఈ-రేస్, గొర్రెల కుంభకోణం.. ఇలా అన్నింటా వెనుకేసుకొచ్చింది. సీబీఐ విచారణకు లేఖ రాసి.. హైకోర్టులో బలమైన వాదనలు వినిపించకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సహకరిస్తోంది. కాళేశ్వరం విషయంలో కేవలం జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను ఇచ్చి చేతులు దులిపేసుకోకుండా.. కాంగ్రెస్ సీబీఐకి అన్ని ఆధారాలను అందించాలి. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచులకు బిల్లులివ్వకుండా మోసగించారు. ఇప్పటి కాంగ్రెస్ సర్కారు రెండేళ్లుగా పంచాయతీలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఊళ్లలో అభివృద్ధి జరుగుతోంది. కామారెడ్డిలో కాంగ్రెస్ చేసిన బీసీ డిక్లరేషన్ ను కూడా వరదపాలు చేసింది. బీఆర్ఎస్ పేరెత్తితేనే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కాంగ్రెస్ అనతికాలంలోనే ప్రజాదరణను కోల్పోయింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో బిజెపి అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో బిజెపికి ఎక్కువ స్థానాలను గెలిపించి రాష్ట్ర అధ్యక్షుడికి కానుక ఇస్తా. గత ప్రభుత్వాలు ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు పారితోషికం ఇస్తామని మోసం చేశాయి. కరీంనగర్ లోకసభ నియోజకవర్గ పరిధిలో కమలం గుర్తుపై గెలిచే ప్రతి ఎంపీటీసీ స్థానానికి రూ.5 లక్షలు, జడ్పీటీసీ స్థానానికి రూ.10 లక్షలను అభివృద్ధి కోసం సొంతంగా అందిస్తా.” అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.