Bhupen Hazarika

భూపేన్‌ హజారికా : ప్రజల గుండె చప్పుడు

modi hazarika‘‘భారతీయ సంస్కృతీ సంగీతాలపై ప్రగాఢ అనురక్తి కలిగినవారికి సెప్టెంబరు 8 చాలా ప్రత్యేకమైనది. నా అస్సాం సోదరసోదరీమణులకైతే ఇది మరీ విశేషమైన తేదీ. దేశంలోని అసాధారణ సుస్వర చక్రవర్తుల్లో ఒకరైన డాక్టర్‌ భూపేన్‌ హజారికా పుట్టిన రోజు నేడు. ఈ సంవత్సరం ఆయన శతజయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. భారతీయ సంగీత కళాభివ్యక్తికి ప్రతినిధి అయిన భూపేన్‌ దా అందరికీ గానామృతాన్ని పంచుతూ జాతికి నిరుపమాన సేవలందించారు. శ్రావ్యమైన ఆయన స్వరంలో అపురూపమైన భావోద్వేగాలు పలుకుతాయి. భూపేన్‌ గానం ప్రజల గుండెచప్పుడైంది. ఆయన పాటలు కారుణ్యం, సామాజిక న్యాయం, సమైక్యత, సంబంధ బాంధవ్యాలను ప్రతిధ్వనింపజేస్తాయి.

భూపేన్‌ దా స్వరమాధుర్యం అస్సాంలో ఉద్భవించి మానవతా స్ఫూర్తిని ఇముడ్చుకుని ఒక ఝరిలా సరిహద్దులను దాటి ప్రవహించింది. ఆయన ప్రపంచమంతటా పర్యటించి మహామహులతో కలిసిమెలసి తిరిగినా తన అస్సామీ మూలాలను మాత్రం ఏనాడూ మరచిపోలేదు. అస్సాం సంగీత సంప్రదాయాలు, జానపద గీతాలు, స్థానిక కథాకథనాలు భూపేన్‌ దాపై బాల్యం నుంచే ప్రగాఢ ముద్ర వేశాయి. ఆ అనుభవాలు ఆయన సంగీత కళాభినివేశానికి పునాది అయ్యాయి. అస్సాం ప్రజల ప్రవృత్తి, విశిష్ట అస్తిత్వం భూపేన్‌ దాలో మూర్తీభవించాయి. అయిదేళ్ల వయసులోనే ఒక కార్యక్రమంలో బాల భూపేన్‌ పాడిన తీరు అస్సామీ సాహితీ దిగ్గజం లక్ష్మీనాథ్‌ బెజ్‌ బారువాను ఆకట్టుకుంది. కౌమార ప్రాయంలోకి వచ్చేసరికి తన తొలిపాట రికార్డును విడుదల చేశారు భూపేన్‌. సంగీతం ఆయన బహుముఖ వ్యక్తిత్వంలో ఒక పార్శ్వం మాత్రమే. భూపేన్‌ దా సంగీత కళాకారుడు మాత్రమే కాదు- మేధావి, ప్రపంచ గమనాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసువు కూడా. ధారాళమైన వాక్పటిమ ఆయన సొంతం. అస్సాం సాంస్కృతిక ప్రముఖులైన జ్యోతిప్రసాద్‌ అగర్వాలా, బిష్ణు ప్రసాద్‌ రభాలు ఆయనపై చెరగని ముద్ర వేశారు. కుతూహలాన్ని రగిలించారు. 

విద్యార్థి దశలోనే ఏ అంశాన్నయినా సూక్ష్మంగా శోధించేతత్వం ఉండటం వల్ల భూపేన్‌ దా కాటన్‌ కాలేజ్, బెనారస్‌ హిందూ యూనివర్సిటీల్లో మెరికలాంటి విద్యార్థిగా రాణించారు. ఉన్నత చదువులకు అమెరికా వెళ్లి అక్కడి ప్రముఖ మేధావులు, సంగీతకారులతో సాంగత్యం, సాన్నిహిత్యం ఏర్పరచుకున్నారు. అమెరికాలో విఖ్యాత పౌరహక్కుల ఉద్యమ నాయకుడు పాల్‌ రోబ్సన్‌ను కలుసుకున్నారు. రోబ్సన్‌ పాడిన ‘ఓల్‌ మ్యాన్‌ రివర్‌’ పాటే భూపేన్‌ దా ‘బిస్తిర్నో పరోరే’ పాటకి స్ఫూర్తినిచ్చింది. భూపేన్‌ పాడిన జానపద గీతాలకు మెచ్చి నాటి అమెరికా ప్రథమ మహిళ ఎలియనార్‌ రూజ్‌వెల్ట్‌ ఆయనను స్వర్ణ పతకంతో సత్కరించారు. అమెరికాలోనే ఉండిపోయే అవకాశమున్నా, దాన్ని కాదనుకుని స్వదేశానికి తిరిగివచ్చి సంగీత సాగరంలో మునిగితేలారు భూపేన్‌. రేడియో నుంచి రంగస్థలం వరకు, సినిమాల నుంచి బోధనాత్మక డాక్యుమెంటరీల వరకు అన్నింటా తన విశిష్ట ముద్రను కనబరిచారు. ఆయన యువ ప్రతిభను ప్రోత్సహించేవారు. భూపేన్‌ దా పాటల్లో శ్రావ్యతతోపాటు సామాజిక సందేశమూ ఉంటుంది. పేదలకు న్యాయం, పల్లెల అభివృద్ధి జరగాలనీ, సామాన్యుల్లో నిబిడీకృతమైన శక్తి వెలుగులోకి రావాలనే ఆకాంక్ష ఆయన గీతాల్లో వినపడుతుంది.

‘ఏక్‌ భారత్‌-శ్రేష్ఠ్‌ భారత్‌’ స్ఫూర్తిని భూపేన్‌ హజారికా జీవిత గమనం ప్రతిఫలించింది. ఆయన కృతులు ప్రాంతీయ, భాషా భేదాలను అధిగమించి దేశ ప్రజలను ఏకం చేశాయి. అస్సామీ, బెంగాలీ, హిందీ సినిమాలకు ఆయన పాటలు కూర్చారు. తన సంగీతం ద్వారా అస్సాంను దేశ ప్రజలకు వినిపించేలా కనిపించేలా చేశారు. భూపేన్‌ దా ఆధునిక అస్సాం సాంస్కృతిక వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దారంటే అతిశయోక్తి కాదు. 

భూపేన్‌ దా రాజకీయవాది కాకపోయినా ప్రజాసేవకు అంకితమైన వ్యక్తి. 1967లో అస్సాంలోని నావ్‌బోయిచా నుంచి శాసనసభకు ఎన్నికై ఎంతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఆయన రాజకీయాలను వృత్తిగా ఎంచుకోకపోయినా ప్రజలకు సేవ చేయాలనే భావావేశం అపార ప్రభావం చూపింది. భూపేన్‌ దా సమాజానికి చేసిన సేవలను ప్రజానీకంతో పాటు భారత ప్రభుత్వమూ గుర్తించింది. ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్‌ ఫాల్కే వంటి ఎన్నో అవార్డులు వరించాయి. 2019లో భూపేన్‌ హజారికాకు ‘భారతరత్న’ను ప్రదానం చేయడం ఎన్డీయే ప్రభుత్వంతోపాటు నాకు కూడా ఎంతో గౌరవప్రదం. భూపేన్‌ దాను ఇలా సత్కరించడం అస్సాం, ఈశాన్య భారతీయులతో పాటు ప్రపంచమంతటికీ మహదానందం కలిగించింది. సత్యసాధనకు, సత్యశోధనకు గానమే సోపానమై అన్ని అడ్డంకులనూ ఛేదిస్తుందని భూపేన్‌ దా చాటారు. అదే ఆయనకు భారతదేశ అత్యున్నత గౌరవాన్ని కట్టబెట్టింది. 2011లో ఆయన కీర్తిశేషులైనప్పుడు లక్షలాదిమంది అశ్రు నయనాలతో ఆయనకు వీడ్కోలు చెప్పడం టీవీలో వీక్షించాను. జీవించి ఉన్నప్పుడే కాదు, మరణంలోనూ ఆయన ఖ్యాతి ఎంతటిదో ఈ మహాభినిష్క్రమణ వెల్లడించింది.

భూపేన్‌ దా సంగీతం, జ్ఞాపకాలు బ్రహ్మపుత్ర నదితో పెనవేసుకుపోయాయి. ఆయన అంత్యక్రియలు బ్రహ్మపుత్ర తీరంలోని జలుక్‌బారీ కొండపై జరగడం పేగుబంధాన్ని చాటిచెప్పింది. ఆయన జీవనయాత్రను యువతరానికి స్ఫూర్తిదాయకంగా మలచడానికి కృషి చేస్తున్న భూపేన్‌ హజారికా సాంస్కృతిక ట్రస్టుకు అస్సాం ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవడం హర్షణీయం. మూలాలను మరవకుండా ప్రజావాణిని ఆలకించడం సహానుభూతి వ్యక్తీకరణకు దారితీస్తుందని భూపేన్‌ హజారికా జీవనయానం మనకు గుర్తుచేస్తోంది. ఆయన సంగీతం ధైర్యస్థైర్యాలనూ కారుణ్యాన్నీ ఉద్బోధిస్తోంది. నదులను, శ్రామికులను, తేయాకు కార్మికులను, యువశక్తినీ, నారీశక్తినీ సదా గుర్తుంచుకోవాలని చెబుతూ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రబోధిస్తోంది. భూపేన్‌ దా వంటి గానగంధర్వుడినీ, లబ్ధప్రతిష్ఠుడికి జన్మనిచ్చినందుకు భరతమాత గర్విస్తోంది. ఆయన శతజయంత్యుత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా భూపేన్‌ దా సందేశాన్ని దిగంతాలకు వ్యాపింపజేయడానికి అంకితమవుదాం. సంగీతం, కళలతో పాటు సాంస్కృతిక వికాస యజ్ఞాన్ని కొనసాగిద్దాం. యువతరాన్ని ఉత్తేజితులను చేసి భారతదేశాన్ని సృజనాత్మకత, కళాప్రతిభలు వెల్లివిరిసే ఉత్కృష్ట భూమిగా మలచడానికి నిరంతరం ప్రయత్నిద్దాం! 

నరేంద్ర మోదీ, భారత ప్రధాని