greate nicobar

గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై సోనియా అర్థరహిత విమర్శలు

సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో రాసిన వ్యాసంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న గ్రేట్ నికోబార్ ద్వీపం అభివృద్ధి ప్రాజెక్టును విమర్శించారు. ఆధునిక అభివృద్ధి ప్రాజెక్టులన్నింటికీ పర్యావరణపరమైన సమస్యలు ఉంటాయి. స్థానికులను తరలించడం, జంతుజాలం, వృక్షజాలానికి హాని వంటివి జరుగుతుంటాయి. నీతి ఆయోగ్ రూపొందించగా, అండమాన్, నికోబార్ దీవుల సమీకృత అభివృద్ధి సంస్థ (ఏఎన్‌ఐఐడీసీఓ) అమలు చేస్తున్న రూ.81,000 కోట్ల భారీ ప్రాజెక్టు కూడా దీనికి మినహాయింపు కాదు.

నికోబార్ దీవుల్లో అతిపెద్దది గ్రేట్ నికోబార్ ద్వీపం. క్యాంప్‌బెల్ బే, ఇందిరా పాయింట్ ఇక్కడ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు. ఇందిరా పాయింట్ అసలు పేరు పిగ్మాలియన్ పాయింట్. 1984లో ఆ ప్రాంతాన్ని సందర్శించిన అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పేరు మీద దీనికి ఆ పేరు పెట్టారు. ఇది భారతదేశానికి దక్షిణ కొసన ఉంది. ఇది ఇండోనేషియాలోని ఆచె రాష్ట్రానికి కేవలం 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భారీ అభివృద్ధి ప్రాజెక్టు గ్రేట్ నికోబార్ దక్షిణ భాగంలో రానుంది. ఇందులో అంతర్జాతీయ కంటైనర్ టెర్మినల్, గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, సౌర విద్యుత్ కేంద్రం, రెండు గ్రీన్‌ఫీల్డ్ నగరాలు ఉంటాయి. పూర్తయిన తర్వాత ఇది సింగపూర్ వంటి నౌకాశ్రయ నగరాలతో పోటీ పడగలదు. చెట్లు, తాబేళ్లకు తీవ్ర పర్యావరణ హాని కలిగించడంతోపాటు, నికోబారీస్, షొంపెన్ అనే రెండు తెగలకు చెందిన దాదాపు 1,200 మంది గిరిజనుల ఆవాసాలను ఈ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం నాశనం చేస్తోందని సోనియా గాంధీ ఆరోపించారు.

ఎందుకీ ప్రాజెక్ట్?

ప్రభుత్వం ఇలాంటి భారీ ప్రాజెక్టును ఎందుకు చేపడుతోందో అర్థం చేసుకోవడం ముఖ్యం. భారతదేశం అభివృద్ధి, భద్రతా అవసరాల కోసం హిందూ మహాసముద్రంపై ఆధారపడటం ఎంత ముఖ్యమో చెప్పనవసరం లేదు. భారతదేశ విదేశీ వాణిజ్యం, ఇంధన వనరుల దిగుమతులు దాదాపుగా 80 శాతం ఈ ప్రాంతం నుంచే జరుగుతాయి. అంతేకాకుండా, ప్రపంచ వాణిజ్యానికి, రవాణా అనుసంధానానికి హిందూ మహాసముద్ర ప్రాంతం అత్యంత కీలకమైన సముద్ర మార్గంగా అవతరించింది. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాలకు, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు, భారీ సైనిక బలగాలకు నిలయమైన ఈ ప్రాంతం ’21వ శతాబ్దపు ప్రపంచ శక్తి అక్షం’ గా మారింది.

శతాబ్దం క్రితం అమెరికన్ నౌకాదళ అధికారి, చరిత్రకారుడు అడ్మిరల్ ఆల్ఫ్రెడ్ టి మహాన్ “హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం సాధించిన వారే అంతర్జాతీయ వేదికపై ప్రముఖ పాత్ర పోషిస్తారు” అని నొక్కి చెప్పారు. దౌత్యవేత్త, చరిత్రకారుడు కే ఎం పణిక్కర్ కూడా “దేశం ద్వీపకల్ప స్వభావం, దాని వాణిజ్యం సముద్ర యానం పై ఆధారపడి ఉండటం వలన దాని భవిష్యత్తుపై సముద్రం నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపిస్తుంది” అని హెచ్చరించారు. అయితే, స్వాతంత్ర్యం తర్వాత దేశంలో పాలన సాగించిన ప్రభుత్వాలు భారతదేశ సముద్ర సామర్థ్యాన్ని పెంచడంపై నిర్లక్ష్యం చేశాయి. పణిక్కర్ భారతదేశ ‘ద్వీపకల్ప స్వభావాన్ని’ అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చినా, ప్రభుత్వాలు ‘ఖండాంతర మనస్తత్వానికి’ బందీలుగా ఉండిపోయాయి. దశాబ్దాలపాటు భారత నౌకాదళం కేవలం తీరప్రాంత సవాళ్లను ఎదుర్కోగలిగే నౌకాదళంగానే మిగిలిపోయింది. 2000ల ప్రారంభంలో, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శక్తిని ప్రదర్శించడం మన భవిష్యత్తుకు, ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి చాలా కీలకమని చివరికి గ్రహించారు.

భారత సముద్ర భద్రత, సవాళ్ళు

ఈరోజు హిందూ మహాసముద్ర పరిసరాలు ప్రధాన దేశాల నౌకలతో కిక్కిరిసి ఉన్నాయి. తదుపరి తరం సముద్ర గర్భ కేబుల్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు విస్తరిస్తున్నాయి. ఇతర నౌకాదళాల నుంచే కాకుండా, సముద్ర దొంగలు, సముద్ర ఆధారిత తీవ్రవాదం, వాతావరణ సవాళ్లు, మనుషులు, నిషేధిత వస్తువుల అక్రమ రవాణా, అక్రమ, అనియంత్రిత చేపల వేట, ఆయుధాల రవాణా, విపత్తు నిర్వహణ వంటి మానవతావాద సవాళ్లను కూడా భారతదేశం ఎదుర్కొనే అవకాశం ఉంది. సమీపంలో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వంటి సున్నితమైన భద్రతా ప్రాంతాలు, హార్ముజ్ జలసంధి, మలక్కా జలసంధి, సుండా జలసంధి వంటి ఇరుకైన జలమార్గాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో నికోబార్ దీవులు ఒక ముఖ్యమైన కేంద్రం. భారతదేశ భద్రత, అభివృద్ధికి సముద్ర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం చాలా కీలకం. కాంగ్రెస్ నాయకత్వం ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి నిరాకరిస్తోంది. 2009లో సోనియా గాంధీ ఇందిరా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఇందిరా పాయింట్‌కు వెళ్లారు. అప్పుడు ఆ విగ్రహ ప్రాజెక్టు వలన పర్యావరణానికి కలిగే ప్రభావం గురించి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ అభ్యంతరాలను పట్టించుకోలేదు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టును అదే కారణాలతో విమర్శించడం ఆమె చిత్తశుద్ధి లేమిని సూచిస్తుంది. విగ్రహం కంటే భారతదేశ భద్రత, అభివృద్ధికి ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యం.

పర్యావరణ సమస్యలు, ప్రభుత్వ చర్యలు

ఆమె లేవనెత్తిన పర్యావరణ సమస్యలు అప్రస్తుతం అని దీని అర్థం కాదు. అయితే, ఈ ప్రాజెక్టును ప్రకటించడానికి ముందు ప్రభుత్వం ఆ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంది. పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయడానికి, నివారణ చర్యలను సూచించడానికి ప్రభుత్వ సంస్థలు మాత్రమే కాకుండా, ఐఐటీ, ఎన్‌ఐఓటి, ఎన్‌సీసీఆర్, ఎన్‌ఐఓ వంటి విద్యా, పరిశోధన సంస్థలను కూడా ఇందులో భాగస్వాములను చేశారు. ఈ ప్రాజెక్టు కోసం కేవలం 166 చదరపు కిలోమీటర్లు మాత్రమే కేటాయించారు. కొన్ని గ్రామాలను మాత్రమే తరలిస్తారు, గిరిజన నివాసాల జోలికి కూడా వెళ్లరు. మిగిలిన భూమి కోసం ‘పరిహార అటవీకరణ’ను అవలంబిస్తున్నారు. అంటే ఎంత విస్తీర్ణంలో అడవిని ఇతర అవసరాలకు ఉపయోగిస్తారో అంతే విస్తీర్ణంలో వేరే చోట అడవులను అభివృద్ధి చేస్తారు. భారతదేశంలో అత్యంత పురాతనమైన, కానీ క్షీణించిన పర్యావరణ వ్యవస్థల్లో ఒకటైన ఆరావళి పర్వత శ్రేణిలో ఈ పరిహార అటవీకరణను చేపడుతున్నారు. నికోబార్ మెగాపోడ్‌లు (ఒక స్థానిక పక్షి జాతి), మొసళ్లు, పగడపు దిబ్బల కోసం కొత్త సంరక్షణ ప్రణాళికలను రూపొందించారు.

గ్రేట్ నికోబార్ ద్వీపం అభివృద్ధి ప్రాజెక్ట్ మన వికసిత్ భారత్ దార్శనికతలో ఒక ముఖ్యమైన భాగం. ఇది అండమాన్, నికోబార్ దీవులలోని, బయటి ప్రజలకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రధాన సముద్ర శక్తుల సరసన భారత్ ను చేరుస్తుంది. ఇదంతా పర్యావరణ పరిరక్షణకు అవసరమైన ముందస్తు, భవిష్యత్ చర్యలను తీసుకుంటూ జరుగుతుంది. కేవలం పర్యావరణ సమస్యలే కాకుండా, ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పని చేయడంలో ఏదైనా దురుద్దేశం ఉందా?

రాం మాధవ్,
బిజెపి నాయకుడు