నీటి దగాతో తెలంగాణను ముంచిన కాంగ్రెస్, బీఆర్ఎస్!
మొదటి నుంచి కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేస్తూనే వచ్చింది. తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణను బలవంతంగా సమైక్య రాష్ట్రంలో కలపడం మొదలు, పెద్దమనుషుల ఒప్పందానికి బొంద పెట్టడం, తొలిదశ ఉద్యమంలో 365 మంది విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం, హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ భూమిని దారుస్సలాం బోర్డు పేరుతో మతోన్మాద రజాకార్లకు ధారాదత్తం చేసి, ప్రజల మధ్య చిచ్చు పెట్టడం వరకు కాంగ్రెస్ దుర్మార్గాలు అన్నీఇన్నీ కావు.
ఆంధ్రా ప్రాంత ప్రజలు కూడా ‘జై ఆంధ్ర’ నినాదంతో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించినా బలవంతంగా ఇరు ప్రాంతాలను కలిపి ఉంచి, దాదాపు 5 దశాబ్దాలు తెలంగాణను ముంచిన పార్టీ కాంగ్రెస్. సమైక్య రాష్ట్రంలో సుదీర్ఘంగా పాలించిన కాంగ్రెస్ కృష్ణ జలాల విషయంలో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు ఆంధ్రాకు కట్టబెట్టి, తెలంగాణకు తీరని దగా చేసింది. ఇప్పటికీ తెలంగాణలో కృష్ణా నదిపై 10 టీఎంసీల నీటి నిల్వ ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదంటే యాభై ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్, దశాబ్దం పాటు ఏలిన బీఆర్ఎస్ చేసిన ద్రోహానికి అద్దం పడుతుంది.
2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని, తెలంగాణ సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేంద్రంలోను, రాష్ట్రంలోను ఇరు పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, తొమ్మిదేళ్లూ తెలంగాణ ఇస్తామంటూ నానబెట్టి, నాయకులను రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చుపెట్టి, చివరకు ప్రజా ఉద్యమం ఒత్తిడితో రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసినప్పటికీ, తదనంతరం జరిగిన పరిణామాలతో ఆ ప్రకటనను వెనక్కి తీసుకుని, 1,200 మందికి పైగా తెలంగాణ యువత బలవన్మరణాలకు కారణమైంది. బిజెపి ఒత్తిడితో పెట్టిన తెలంగాణ బిల్లుకు పీటముడుల మీద పీటముడులు వేసి, తెలంగాణకు నీటి దగాలో మరో బలమైన కుట్ర చేసింది.
2014లో తెలంగాణ సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆర్థిక ప్రయోజనాల కోసం మొదటి నుంచే తెలంగాణ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కయ్యారు. కృష్ణా నది నీటి పంపకాల విషయంలో తాత్కాలిక ఒప్పందం పేరుతో 299 టీఎంసీల కేటాయింపునకు కేసీఆర్ సంతకం చేసి కాంగ్రెస్ ద్రోహాన్ని పూర్తిగా సమర్థించారు. 2004-14 మధ్య సమైక్య రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, చెన్నై తాగునీటి విషయాన్ని ఆసరాగా చేసుకొని, 1100 క్యూసెక్కుల సామర్థ్యంతో మొదలుపెట్టిన పోతిరెడ్డిపాడు కాల్వను 11,500 కు, ఆ తర్వాత 44,000 వరకు తీసుకెళ్లి.. మిగులు జలాల పేరుతో నికర జలాలను దోపిడీ చేయడానికి శ్రీశైలం ప్రాజెక్టులో 834 అడుగుల వరకు జలవిద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంటే, ఆ కనీస నీటిమట్టాన్ని 854 అడుగులకు పెంచుతూ జీవో జారీ చేసి, దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చడంలో పెద్ద కుట్ర అమలు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల ఆకాంక్ష అయిన ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను తక్కువ దూరంలో, అనువుగా ఉన్న అక్కమహాదేవి గుహల ప్రాంతం నుంచి కాకుండా, ఎక్కువ దూరం, నిర్మాణపరంగా ఇబ్బందికరమైన దోమలపెంట వైపు మళ్లించింది. టన్నెల్ పొడవును మరో 11 కి.మీ. పెంచి 2 దశాబ్దాలయినా పూర్తికాకుండా ఉండేవిధంగా కాంగ్రెస్ ద్రోహం చేసింది. దశాబ్ద కాలం అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఈ 11 కి.మీ. టన్నెల్ ను ఉద్దేశ్యపూర్వకంగా పూర్తి చేయకుండా, తెలంగాణను దగా చేయడంలో కాంగ్రెస్ అడుగులకు మడుగులొత్తింది.
కాంగ్రెస్ ద్రోహపూరితంగా పోతిరెడ్డిపాడు కాలువ సామర్థ్యాన్ని క్రమంగా 44,000 క్యూసెక్కులకు పెంచడమే కాకుండా, అదనంగా శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచే నీళ్లు తీసుకునేవిధంగా సంగమేశ్వరం వద్ద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం కేసీఆర్‌తో కుమ్మక్కై నాటి ఏపీ సీఎం జగన్ ప్రణాళికలు రచించారు. నాటి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ రాసిన లేఖతో కేంద్ర జలశక్తి మంత్రి ఆగస్టు 5న అపెక్స్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, తెలంగాణకు ద్రోహం చేయడానికి నిర్ణయించుకున్న కేసీఆర్, టెండర్లు పూర్తి కావడానికి ఆగస్టు 20 వరకు వాయిదా వేయించారు. 20 ఏళ్ల కిందటే శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన కనీస నీటి మట్టాన్ని 834 నుంచి 854 అడుగులకు తీసుకుపోయిన ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ జీవోను సవరించడానికి పదేళ్లు పాలించిన కేసీఆర్ కానీ, మూడేళ్ల నుంచి అధికారంలో ఉన్న రేవంత్ ప్రభుత్వం కానీ ఏ చర్య కూడా తీసుకోలేదంటే వారికి తెలంగాణ ప్రయోజనాల పట్ల ఎంత పట్టింపు ఉందనేది అర్థం చేసుకోవచ్చు.
నీటి లభ్యత ఎక్కువగా ఉన్న గోదావరి నదిలో ముఖ్యంగా ప్రాణహిత దిగువన ఒక్క ప్రాజెక్టు కూడా కట్టని కాంగ్రెస్ తెలంగాణ అతిపెద్ద ద్రోహి. నీటి లభ్యత ఉన్న ప్రాంతంలో కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదించినప్పటికీ, దోపిడే ఎజెండాగా ఇంజనీరింగ్ నిపుణుల సూచనలను పూర్తిగా విస్మరించారు. ఇచ్చంపల్లి, కాంతాలపల్లి మాదిరిగా పటిష్టమైన నదీ గర్భం ఉండేలా చూసుకోకుండా, అటు బ్యారేజీలా ఐదారు మీటర్ల ఎత్తులో కాకుండా, ఇటు డ్యామ్లాగా గట్టి నిర్మాణం లేకుండా, కేసీఆర్ మూర్ఖంగా, మొండింగా వ్యవహరించారు. చారిత్రాత్మకమైన ధవళేశ్వరం, ప్రకాశం, కావేరీ గ్రాండ్ ఆయకట్టు (3 నుంచి 5 మీటర్ల ఎత్తు)లా కాకుండా సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డలను నదీ గర్భం నుంచి 11 మీటర్ల ఎత్తులో నిర్మించినప్పటికీ, అందుకు అనుగుణంగా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోలేదు. కేసీఆర్ రాజకీయ, ఆర్థిక స్వార్థం కోసం ప్రణాళిక, డిజైన్, నిర్మాణం, ఆపరేషన్స్, మెయింటనెన్స్‌లో తీవ్ర లోపాలు చేసి, ఆ మూడు బ్యారేజీల్లో ఏ ఒక్కదానినీ పటిష్టంగా నిర్మించకుండా వేల కోట్ల ప్రజాధనాన్ని మట్టిపాలు చేశారు.
నీటి విషయంలో నువ్వే తెలంగాణను ముంచావంటూ కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ నిందిస్తుంటే.. కాదు, నువ్వే ముంచావంటూ బీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. ఇలా ‘నువ్వు దొంగంటే.. నువ్వు దొంగ’ అంటూ రెండు పార్టీలు పరస్పరం నిందించుకుంటుంటే.. మీరిద్దరూ దోషులే.. మీ ఇద్దరి పాలనలోనూ తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందంటూ మేధావులు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ చేసిన దగా, ద్రోహం.. కేసీఆర్ పాలనలో జరిగిన దోపిడీ.. నేటి తెలంగాణ దౌర్భాగ్య పరిస్థితులకు మూలకారణాలు. తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకేలతో విసిగి వేసారిన ప్రజలు మూడో ప్రత్యామ్నాయానికి అవకాశం ఇచ్చినట్టు తెలంగాణలో ఈ రెండు పార్టీలను బొంద పెట్టి, డబుల్ ఇంజిన్ సర్కార్‌ను ఎన్నుకుంటేనే నీటి కష్టాలతో పాటు అన్ని సమస్యల నుంచి బయటపడగలమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.

