పదేళ్ళ పాలనలో అసామాన్య, అపూర్వ విజయాలు
ఫిబ్రవరి 17, 18 తేదీలలో దిల్లీలో జరిగిన బిజెపి జాతీయ సదస్సులో ఆమోదం పొందిన ‘వికసిత్ భారత్ – మోదీ హామీ’ తీర్మానంలో ప్రధానాంశాలు:
గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి గల నాయకత్వంలో 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’ గా మారే లక్ష్యంతో భారత్ బలమైన, సమర్థమైన దేశంగా ఉద్భవించింది. మోదీ జీ నేతృత్వంలో గత పదేళ్లుగా రామరాజ్యం ఆదర్శం సాకారమైంది. ఈ కాలంలో దేశం అందరి భద్రత, సంక్షేమం, ఆనందాలు లక్ష్యంగా ముందుకుసాగింది.
ప్రధాన మంత్రి నాయకత్వంలో దేశం బానిస మనస్తత్వం నుంచి విముక్తి పొందడం, మన వారసత్వం గురించి గర్వపడటం నేర్చుకోవడం, అభివృద్ధి చెందిన దేశంగా మారాలని సంకల్పించడం, మన ఐక్యతలో బలాన్ని ప్రదర్శించడం, నిజాయితీ గల పౌరులుగా మన కర్తవ్యాలను నెరవేర్చడం వంటి ‘పంచ ప్రమాణాలను’ చేసుకుంది. ఈ 10 సంవత్సరాలలో భారతదేశం తన గొప్ప ప్రజాస్వామ్య, రాజ్యాంగ సంప్రదాయాలతో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని కూడా గుర్తించింది. గత 10 ఏళ్లలో దేశ ప్రజలు ‘మోదీ హామీ’ ప్రతి ఇంటికి చేరడం చూశారు. ఈ హామీ 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తం చేసింది. ప్రధాని నేతృత్వంలో గత 10 సంవత్సరాలలో ఎన్నికల విజయంలో కొత్త కోణాలు కూడా ఆవిష్కృతమయ్యాయి. కచ్ నుంచి కామరూప్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బిజెపి అందరి హృదయాలను గెలుచుకుంది. తమ నాయకుడు, గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని జాతీయ సదస్సు హృదయపూర్వకంగా అభినందిస్తోంది. బిజెపి ఈ విజయ యాత్రకుగాను ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తోంది.
పదేళ్ళ విజయాలు, మోదీ హామీ
సాధారణంగా ప్రభుత్వాల హయాంలో ఏవో కొన్ని మాత్రమే ప్రముఖమైన విజయాలు ఉంటాయి. కానీ నరేంద్ర మోదీ పదేళ్ళ పాలనలో వందలాది చరిత్రాత్మక విజయాలు దేశంలోని మూడింట రెండు వంతుల మంది పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయి. దేశ ఆర్థిక వ్యవస్థ అన్ని రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, మునుపటి కంటే మరింత సురక్షితమైనదిగా, నిర్ణయాత్మకమైనదిగా మారింది. ఇది ప్రపంచ నాయకత్వానికి కొత్త అధ్యాయాన్ని కూడా జోడించింది.
ఈ రోజు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడితే ప్రపంచం మొత్తం శ్రద్ధగా ఆలకిస్తుంది. గత 10 ఏళ్లలో దేశం లెక్కలేనన్ని విజయాలను సాధించింది. ప్రతి విజయం ఎంత ముఖ్యమైందంటే ఒక్కోదానిపై ఒక పుస్తకం రాయొచ్చు. గతంలో ఊహకు కూడా సాధ్యం కాని సాహసోపేత నిర్ణయాలను దేశం చూసింది. అధికరణం 370 రద్దు, అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, జీఎస్టీ అమలు, పౌరసత్వ సవరణ చట్టం, కొత్త పార్లమెంట్ ప్రారంభం, దానిలో సెంగోల్ ఏర్పాటు చేయడం, నారీ శక్తి వందన్ అధినియం వంటివి గతంలో అసాధ్యమనుకున్న నిర్ణయాలు నేడు సుసాధ్యమయ్యాయి.
భారతీయ న్యాయ సంహిత చట్టం, చంద్రయాన్ మిషన్ వంటి విజయాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. స్వచ్ఛ భారత్ అభియాన్, బేటీ బచావో- బేటీ పఢావో, నమామి గంగే, జి20 దేశంలో ప్రజల భాగస్వామ్యంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాయి. ప్రభుత్వం కోవిడ్‌ని సమర్థంగా ఎదుర్కోవడంలో ప్రజల భాగస్వామ్యం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.
‘మోదీ హామీ’ మన దేశంలో పారిశుద్ధ్య నిర్వహణను 40 శాతం నుంచి 100 శాతానికి పెంచింది. మరో 17 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. పట్టణ పేదల కోసం 4 కోట్ల ఇళ్లు కట్టించాం. ఈరోజు 50 కోట్ల మందికి పైగా బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వీటిలో మొత్తం డిపాజిట్లు రూ.2,08,855 కోట్లు. జన్ ధన్, ఆధార్, మొబైల్ ప్రభుత్వ పథకాల అమలులో లీకేజీని తొలగించడమే కాకుండా, మధ్యవర్తులు లేకుండా అర్హులైన లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోకి వచ్చేలా చేశాయి. వీటిలో సగం బ్యాంకు ఖాతాలు మహిళలవే. 13.91 కోట్ల కుటుంబాలకు నల్లా కనెక్షన్ల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుతోంది. 55 కోట్లకు పైగా పేదలకు ఆయుష్మాన్ భారత్ కార్డులు అందాయి. 11 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించారు. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించారు. దీన్ని ఇప్పుడు మరో 5 సంవత్సరాలు పొడిగించారు. తృణధాన్యాలను ప్రోత్సహించడం వల్ల దేశంలోని 3 కోట్ల మందికి పైగా చిన్న రైతులు కూడా ప్రయోజనం పొందారు. పేదల సంక్షేమం కోసం నరేంద్ర మోదీ అమలు చేస్తున్న పథకాలకుగాను బిజెపి జాతీయ సదస్సు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తోంది.
నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదం అణచివేతకు తీసుకున్న పటిష్టమైన చర్యలతో దేశం మునుపటి కంటే సురక్షితంగా మారింది. ఉగ్రవాదులపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు నిర్వహిస్తే మన సైన్యం ధైర్యసాహసాలను ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఇది కొత్త భారత్. ఇక్కడ మన పైలట్ అభినందన్ పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చారు. ఖతార్‌లో మరణశిక్ష పడిన మాజీ నౌకాదళ అధికారులు కూడా సురక్షితంగా తిరిగి వచ్చారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు సంక్షోభ సమయంలో తమను రక్షించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో, ఇరాక్, సిరియా, యెమెన్ సంక్షోభాల సమయంలో, కోవిడ్ సమయంలో కూడా మనం దీన్ని చూసాం.
40 ఏళ్లుగా ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ గుర్తింపు ఇవ్వకుండా వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్యాయం చేశాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధతను కల్పించి వెనుకబడిన తరగతులను గౌరవించింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు ‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్’ 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉంచాయి. నరేంద్ర మోదీ జీ ఒకే ర్యాంక్, ఒకే పెన్షన్‌ను అమలు చేయడం ద్వారా దేశ రక్షణ కోసం పాటుపడిన మాజీ సైనికులకు న్యాయం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధానమంత్రి షా బానోకు అన్యాయం చేయడాన్ని కూడా మనం చూశాము. ట్రిపుల్ తలాక్‌ను ఆమోదించడం వల్ల దేశంలోని లక్షలాది ముస్లిం మహిళలకు అన్యాయం జరిగింది. నరేంద్ర మోదీ ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయడం ద్వారా ముస్లిం సోదరీమణులకు న్యాయం చేశారు. ఇంతకు ముందు మహిళలకు సైన్యంలో శాశ్వత కమిషన్ లభించేది కాదు. భారత ఆర్మీలో మహిళా అధికారులకు ప్రభుత్వం శాశ్వత కమిషన్‌ను కల్పించింది.
కాంగ్రెస్ ప్రభుత్వాలు మన సరిహద్దులను అభివృద్ధి చేయని వ్యూహాన్ని అనుసరించాయి, ఫలితంగా దేశానికి భారీ నష్టం వాటిల్లింది. గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సరిహద్దులోని మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా దేశంలోని ప్రతి పౌరుడిని సరిహద్దు గ్రామాలలో నివసిస్తున్న తన సోదరులతో చైతన్యవంత సరిహద్దు గ్రామం పథకం ద్వారా అనుసంధానించారు.
ఆర్టికల్ 370 రద్దు
కాంగ్రెస్ ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కారణంగా అధికరణం 370, 35ఏ జమ్మూ కాశ్మీర్‌ను భారత్ కు దూరం చేశాయి. జన్ సంఘ్ ఆవిర్భావం నుంచి దేశంలో ఇద్దరు దేశాధినేతలను, రెండు రాజ్యాంగాలను మనం వ్యతిరేకిస్తూ వచ్చాం. మన పార్టీ వ్యవస్థాపకుడు, భరతమాత ముద్దుబిడ్డ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ దీని కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలో అంతర్భాగంగా మార్చడానికి వేల మంది మన కార్యకర్తలు శ్రమించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్యాయాన్ని అంతం చేసి, కాశ్మీర్ ప్రజలకు న్యాయం చేశారు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం కల సాకారమైంది. నేడు లాల్ చౌక్‌లో త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతోంది.
అయోధ్యలో దివ్య రామ మందిరం
బిజెపి ఆవిర్భావం నుంచి అయోధ్యలోని శ్రీరాముడి జన్మస్థలంలో రామమందిర నిర్మాణానికి కట్టుబడి ఉంది. అయోధ్యలో భవ్య మందిరాన్ని కట్టే, రాంలాలా స్వదేశానికి తిరిగొచ్చే సమయం వస్తుందని మనమెవ్వరూ అనుకోలేదు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి భారతీయుడి కల సాకారమైంది. 22 జనవరి 2024న అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభం, శ్రీరాముని బాల రూపమైన రాంలాలా ప్రతిష్ట మరపురాని ఘట్టంగా నిలిచిపోతాయి.
విజయవంతంగా జి 20 సదస్సు నిర్వహణ
గత ఏడాది ప్రపంచం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న సమయంలో జి20 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించి, దానిని విజయవంతం చేయడం ద్వారా భారత్ భారతదేశం చరిత్ర సృష్టించింది. భారత్ ఆతిథ్యం, దిల్లీ నాయకుల ప్రకటన ఏకగ్రీవ ఆమోదం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. అన్ని అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించడం, అన్ని అభివృద్ధి, భౌగోళిక రాజకీయ సమస్యలపై 100 శాతం ఏకాభిప్రాయాన్ని సాధించడం అంత తేలికైన పని కాదు, కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం దీనిని సాధించింది. మోదీ చొరవతో ఆఫ్రికన్ యూనియన్ కూడా జి20లో భాగమైంది. భారతదేశం వర్ధమాన దేశాల వాణిగా మారింది. ఈ గొప్ప విజయాన్ని దేశానికి అందించినందుకు నరేంద్ర మోదీని బిజెపి జాతీయ సదస్సు హృదయపూర్వకంగా అభినందిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలు, ఉపఎన్నికలు
గత పదేళ్ళలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ‘ప్రభుత్వ వ్యతిరేకత’కి బదులుగా ప్రజలలో ‘ప్రభుత్వ అనుకూలత’ ఏర్పడింది. ప్రభుత్వాధినేతగా మోదీ 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలపై నమ్మకం తగ్గిందని, కానీ భారతదేశంలో భారత ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం మరింత బలపడిందని చాలా మంది నిపుణుల నుండి మనం తరచుగా వింటుంటాం. మన ప్రభుత్వ లక్ష్యాలు, నిబద్ధత రెండింటిపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. అందుకే ప్రజలు నిరంతరం ప్రభుత్వం వెంటే ఉంటున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ ప్రజల అవసరాలకు స్పందిస్తూ వారి కలను నెరవేర్చడంపై దృష్టి సారించింది. దీని ఫలితం ఏమిటంటే, గత 10 సంవత్సరాలలో, దేశంలోని ఎన్నికలలో ప్రజలందరూ, అది అసెంబ్లీ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా పదే పదే బిజెపికి తమ ఆశీస్సులు అందించారు.
గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, ఛత్తీస్‌గఢ్, బీహార్, అస్సాం, త్రిపుర, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ….. దేశ ప్రజలు ప్రతి చోటా ప్రధాన మంత్రి పై అచంచలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు, బిజెపికి ఓటు వేసి సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారు.
దేశంలోని ప్రజలు ఎక్కడ కాంగ్రెస్‌ను ఎన్నుకున్నా, కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వాలపై విసుగు చెంది, అక్కడ కూడా బిజెపి తిరిగి వచ్చింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇందుకు ఉదాహరణ. ఇప్పటి వరకు బిజెపి అధికారంలోకి రాని చోట్ల కూడా ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో బిజెపి తన పనితీరుతో అందరినీ ఆశ్చర్యపరిచింది. పశ్చిమ బెంగాల్లో బిజెపి మూడు నుంచి 77 స్థానాలకు వెళ్లి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది, తెలంగాణలో బిజెపి ఒకటి నుండి 8 స్థానాలకు చేరుకుంది, తమిళనాడు, కేరళ స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి అద్భుతమైన ఫలితాలు సాధించింది. పుదుచ్చేరిలో కూడా బిజెపి ప్రభుత్వం ఏర్పడింది. సిక్కిం, నాగాలాండ్, పుదుచ్చేరి నుంచి బిజెపి ఎంపీలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. గత సంవత్సరం, దేశంలోని 9 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వాటిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఈ 6 రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వం ఏర్పడింది. ‘మోదీ హామీ’పైనే దేశ ప్రజలకు విశ్వాసం ఉందని ఈ ఎన్నికలు తెలియజేశాయి. దురహంకార కూటమి ద్వారా కుల మత విభజన రాజకీయాలకు కూడా ఎన్నికల ఫలితాలు తగిన సమాధానం ఇచ్చాయి.
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర
నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను విజయవంతంగా నిర్వహించాం. గ్రామాల్లో పథకాలు అందని లబ్ధిదారులను గుర్తించేందుకు మోదీ హామీ వాహనం గ్రామ గ్రామానికీ వెళ్లింది. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రభుత్వం లక్షలాది గ్రామాలకు నేరుగా వెళ్లింది. యాత్రలో 50 లక్షలకు పైగా ఆయుష్మాన్ కార్డులు అందించారు. 50 లక్షల మందికి పైగా బీమా పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. పీఎం కిసాన్ యోజన కింద 33 లక్షల మందికి పైగా కొత్త లబ్ధిదారులు చేరారు. 25 లక్షల మందికి పైగా కొత్త లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించారు. 22 లక్షల మందికి పైగా కొత్త లబ్ధిదారులు ఉచిత గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పీఎం స్వనిధి ప్రయోజనాలను పొందేందుకు 10 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ కోట్లు, లక్షల సంఖ్యలు ఎవరికైనా కేవలం అంకెలు మాత్రమే కావచ్చు, కానీ మన ప్రధాన మంత్రి మోదీ జీ ఈ అంకెలు కేవలం ఒక సంఖ్య కాదు, ఇది ఒక జీవితం.
సనాతన సంస్కృతికి పెద్దపీట
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ వేదికపై భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి గౌరవ ప్రతిష్టలను తెచ్చారు. యోగా, ఆయుర్వేదం, భారతీయ భాషల పరిరక్షణతో పాటు, మోదీ కాశీ విశ్వనాథ్ కారిడార్, మహాకాల్ కారిడార్, కర్తార్‌పూర్ కారిడార్, పావగఢ్ శక్తిపీఠ్, కేదార్నాథ్, బద్రీనాథ్, సోమనాథ్ ధామ్ వంటి సాంస్కృతిక కేంద్రాల పునరుద్ధరణ ద్వారా దేశ సనాతన సంస్కృతి, వారసత్వాలను ప్రజలకు, ప్రపంచానికి చేరువ చేశారు. కేవలం మూడు రోజుల క్రితమే ప్రధాన మంత్రి అబుదాబి (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో ఒక పెద్ద ఆలయాన్ని ప్రారంభించారు. ఇది మారుతున్న భారత్ కు ప్రతీక.
భారతరత్న, పద్మ అవార్డులు
దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లేదా పద్మ అవార్డులు కావచ్చు, స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారిగా, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఇవి పలుకుబడి ఉన్న సంపన్న వర్గాలకే కాక సమాజంలోని అట్టడుగు కులాలు, వర్గాలకు చెందిన అజ్ఞాత సామాజిక కార్యకర్తలకు అందుతున్నాయి. ఇప్పుడు ఈ అవార్డులను పార్టీ, భావజాలం లేదా పైరవీల ఆధారంగా ఇవ్వడం లేదు. సమాజం, దేశం ఉద్ధరణకు చేసిన కృషి ఆధారంగా ఇస్తున్నారు.
భరతమాత బిడ్డలైన జననాయక్ కర్పూరీ ఠాకూర్ (మరణానంతరం), రైతుల సంక్షేమం కోసం పాటుపడిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ (మరణానంతరం), దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని పివి నరసింహారావు (మరణానంతరం), ప్రాముఖ్య వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్ (మరణానంతరం), ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పోరాట యోధుడు, దేశ మాజీ ఉప ప్రధానమంత్రి, లాల్ కృష్ణ అద్వానీలను భారత రత్న పురస్కారంతో గౌరవించాలన్న నిర్ణయాన్ని బిజెపి జాతీయ సదస్సు హర్షిస్తోంది. ఈ నిర్ణయానికి గాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని జాతీయ సదస్సు అభినందిస్తోంది.
కొత్త పార్లమెంటు భవనం
గత సంవత్సరం దేశం తన వలసదారుల బానిసత్వం నుంచి విముక్తి పొందడాన్ని సూచించే కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని వీక్షించింది. కొత్త అత్యాధునిక పార్లమెంట్ భవనంలో న్యాయానికి చిహ్నమైన సెంగోల్‌ను ఏర్పాటు చేయడం కూడా మనం చూశాం. కానీ జాతీయ ప్రాముఖ్యత, ప్రజాస్వామ్యానికి చిహ్నమైన ఈ గొప్ప కట్టడం ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్ సహా ‘ఇండియా కూటమి’ కూడా బహిష్కరించింది. ఇది ఖండించదగిన సంఘటన. కాంగ్రెస్ హయాంలోనే కొత్త పార్లమెంట్ భవనం ఆవశ్యకతను నొక్కి చెప్పారు. కొత్త పార్లమెంటు భవనం ‘ఆత్మనిర్భర్ భారత్’ దార్శనికతలో భాగం. స్వాతంత్ర్యం తర్వాత మొట్టమొదటిసారిగా నవభారతం అవసరాలు, ఆకాంక్షలకు దీటైన ప్రజా పార్లమెంట్‌ను రూపొందించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.
నారీ శక్తి వందన్ అధినియం
మోదీ ఆధ్వర్యంలో మహిళా సంక్షేమం, అభ్యున్నతి కోసం అపూర్వమైన కృషి జరిగింది. 27 ఏళ్లుగా లోక్‌సభ, శాసనసభల్లో మహిళా రిజర్వేషన్లను డిమాండు చేస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అమృత్కాల్ సందర్భంగా కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించిన వెంటనే మహిళల సాధికారత సాధించే లక్ష్యంతో నారీ శక్తి వందన్ అధినియం 2023ని ఆమోదించడం ద్వారా చరిత్ర సృష్టించింది. కచ్చితంగా ఇది కొత్త, అభివృద్ధి చెందిన భారతదేశానికి ప్రతీక. భారత్ లో మహిళా శక్తి దేశాన్ని బలపరుస్తుంది. సమాజాన్ని ముందుకు నడుపుతుంది. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మహిళలు తీర్మానిస్తే వారిని ఓడించే శక్తి ప్రపంచంలో ఏదీ లేదు. మహిళా సాధికారత కోసం ఈ చారిత్రాత్మక చట్టాన్ని ఆమోదించినందుకు నరేంద్ర మోదీని బిజెపి జాతీయ సదస్సు హృదయపూర్వకంగా అభినందిస్తోంది.
అంతరిక్ష విజయం
భారత్ కూడా 2023లో అంతరిక్ష రంగంలో ఎన్నో రికార్డులను నెలకొల్పింది. చంద్రయాన్-III చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగి ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అలా చేసిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. నరేంద్ర మోదీ మద్దతు లేకుండా కేవలం నాలుగు సంవత్సరాలలో చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడం సాధ్యం కాదు. ఇది మాత్రమే కాదు, సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఆదిత్య ఎల్-1 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించి లాంగర్ పాయింట్లో ఉంచడం ద్వారా భారత్ మరో రికార్డు సృష్టించింది.
కుల రాజకీయాలు-అన్ని వర్గాల సంక్షేమం
ఒక వైపు ‘ఇండియా కూటమి’ కులాల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలు చేస్తుండగా మరోవైపు దేశంలో పేదలు, రైతులు, యువకులు, మహిళలు అనే నాలుగు కులాలు మాత్రమే ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలోని పేదలు, రైతులు, యువత, మహిళలు మోదీ ప్రభుత్వ ప్రతి పథకానికి కేంద్రబిందువుగా ఉన్నారు. ఇది వారిని సాధికారీకరించడమే కాకుండా దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. వచ్చే ఐదేళ్ల పాటు 81 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రజా సంక్షేమ కార్యక్రమం. కుల రాజకీయాలను నిర్మూలించడం ద్వారా ‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’’ లక్ష్యంతో దేశాన్ని సర్వతోముఖంగా, అందరినీ కలుపుకొని అభివృద్ధి చేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బిజెపి జాతీయ సదస్సు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది
అంతర్జాతీయ తృణధాన్య సంవత్సరం
శతాబ్దాలుగా తృణధాన్యాలు లేదా ముతక ధాన్యాలు (శ్రీ అన్న) భారత్ ప్రధాన ఆహారం. కానీ క్రమంగా ఈ ముతక ధాన్యాలు పూర్తిగా ప్రజాదరణ కోల్పోయాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చొరవతో 2023 ని అంతర్జాతీయ తృణధాన్య సంవత్సరంగా జరుపుకున్నారు. తృణధాన్యాలు ప్రధాని ‘శ్రీ అన్న’ అని పిలిచారు. అంతర్జాతీయ తృణధాన్య (శ్రీ అన్న) సదస్సు కూడా నిర్వహించారు. ఆసియాలో పండే తృణధాన్యాల్లో 80 శాతానికి పైగా భారతదేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. ఇది భారతదేశంలోని చిన్న రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది, ప్రజలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
రైతు సంక్షేమం
కాంగ్రెస్ హయాంలో వ్యవసాయానికి మొత్తం వార్షిక బడ్జెట్ రూ.25 వేల కోట్లు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో వ్యవసాయ సంక్షేమానికి బడ్జెట్ రూ.1.25 లక్షల కోట్లు. కాంగ్రెస్ తన పదేళ్ల హయాంలో రైతుల నుంచి ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల విలువైన వరి, గోధుమలను కొనుగోలు చేయగా మోదీ ప్రభుత్వం పదేళ్ళలో దాదాపు రూ.18 లక్షల కోట్ల విలువైన వరి, గోధుమలను కొనుగోలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పప్పులు, నూనె గింజలను నామమాత్రంగా మాత్రమే కొనగా మన ప్రభుత్వం పప్పుధాన్యాలు, నూనె గింజల సేకరణకు రూ.1.25 లక్షల కోట్లు వెచ్చించింది.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.2.8 లక్షల కోట్లు నేరుగా రైతుల ఖాతాలకు చేరాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు రూ.1.5 లక్షల కోట్లు ఇచ్చారు. దేశంలోనే తొలిసారిగా మత్స్యకారులకు, పశుపోషణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఏర్పడ్డాయి. మొదటిసారిగా, పశువుల పెంపకందారులకు, మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చారు, తద్వారా వారు తక్కువ వడ్డీకి బ్యాంకు నుంచి రుణాలు పొంది వ్యాపారాలు విస్తరించుకోవచ్చు. గాలికుంటు వ్యాధి నుంచి పశువులను రక్షించడానికి బిజెపి ప్రభుత్వం 50 కోట్లకు పైగా వ్యాక్సిన్లను అందించండి. రైతు సంక్షేమంలో కొత్త అధ్యాయాన్ని రచించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని జాతీయ సదస్సు అభినందిస్తోంది.
ఆర్థిక వ్యవస్థ పరుగులు
భారత్ నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ. దశాబ్ద కాలంలో భారత్ సున్నితమైన ఆర్థిక వ్యవస్థల జాబితాలో (ఫ్రాజైల్) 5వ స్థానం నుంచి ప్రపంచంలోనే 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేరుకుంది. భారతదేశం ఇప్పుడు 2027 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే పథంలో ఉంది. అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్) కల 2047లోపే కచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే ఇది ‘మోదీ గ్యారెంటీ’. మన జిడిపి వృద్ధి రేటు ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచంలోనే అత్యధికంగా స్థిరంగా ఉంది. మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. పీఎం గతి శక్తి యోజన, ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహకాలు (పిఎల్ఐ) వంటి పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థను బాగా బలోపేతం చేశాయి.
డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టాండ్-అప్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా, ముద్రా యోజన, రోజ్‌గార్ మేళా, పర్యాటక విధానం, డ్రోన్ విధానం, రక్షణ కారిడార్, సరకు కారిడార్, ఆర్థిక కారిడార్ వంటి అనేక కార్యక్రమాలు అపారమైన ఉపాధి అవకాశాలను సృష్టించాయి. రోజ్‌గార్ మేళా కింద కొన్ని నెలల్లోనే దాదాపు 8 లక్షల మంది యువతకు నియామక పత్రాలు అందించారు.
బ్యాంకింగ్ రంగంలో ప్రశంసనీయమైన పునరుద్ధరణ జరిగింది. మొత్తం ఆర్థిక రంగం ఆరోగ్యం మెరుగుపడింది. 2014లో దాదాపు అన్ని స్మార్ట్ఫోన్లను దిగుమతి చేసుకున్న భారత్ నేడు స్మార్ట్ఫోన్ల దేశీయ ఉత్పత్తిలో 11 రెట్లు పెరుగుదలను చూసింది. నేడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా అవతరించింది, ఒక్క గత ఏడాదిలోనే లక్ష కోట్ల స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేసింది.
యుపిఎ ప్రభుత్వ హయాంలో అంతకుముందు ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రారంభించిన అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నత్తనడకన నడిచాయి. కానీ ఈ పదేళ్ళ కాలంలో అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు శరవేగంతో ముందుకు సాగాయి.
ముద్రా యోజన కింద ప్రభుత్వం 46 కోట్లకు పైగా రుణాలను మంజూరు చేసింది. ఇది పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు దారితీసింది. స్టాండ్‌అప్ ఇండియా కింద సుమారు 2,15,000 మంది మహిళలు, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరికి బ్యాంకులు మొత్తం రూ.49,000 కోట్లు రుణాలు మంజూరు చేశాయి. 63.4 లక్షలకు పైగా వీధి వ్యాపారులకు ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద రూ.10,000 కోట్లు పూచీకత్తు లేని రుణాలు ఇచ్చారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద సాంప్రదాయ కళాకారులు, హస్తకళాకారుల కుటుంబాలకు నైపుణ్య శిక్షణ, విద్య అందిస్తున్నారు. హామీ లేని రుణాలతో సహా అన్ని రకాల మద్దతు ఇస్తున్నారు.
ఉద్యం పోర్టల్‌లో దాదాపు 3.5 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నమోదు అయ్యాయి. దాదాపు రూ 25 లక్షల కోట్ల (2014కి ముందు కంటే 6 రెట్లు ఎక్కువ) రుణ హామీలను గత కొన్ని సంవత్సరాలలో ఇచ్చారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమం భారతదేశం ఆలోచనలకు వేదికగా మారింది. రక్షణ రంగంలో ఇప్పటి వరకు ఉన్న ఎగుమతుల రికార్డులన్నింటినీ భారత్ బద్దలు కొట్టింది. మొదటిసారి రాఫెల్ మన విమాన దళంలో చేరింది. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా దేశంలోని 18 కోట్ల గ్రామాలకు కరెంటు లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని విద్యుత్తుతో అనుసంధానం చేసింది.
2014లో దేశంలో నామమాత్రపు సంఖ్యలో స్టార్టప్‌లు ఉండగా, నేడు 1,20,310 స్టార్టప్‌లు ఉన్నాయి. అంటే, స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాలలో, దేశంలో కొన్ని స్టార్టప్‌లు మాత్రమే ఏర్పడ్డాయి, అయితే నరేంద్ర మోదీ జీ ప్రభుత్వంలో కేవలం 10 సంవత్సరాలలో, దాదాపు 1.2 లక్షల స్టార్టప్‌లు ఏర్పడ్డాయి.
2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి పొలానికి నీరు అందిస్తామని ఎర్రకోట నుండి ప్రకటించారు. 2014లో 36.7 శాతం భూమికి నీటిపారుదల సౌకర్యం ఉండగా అది 51 శాతానికి పైగా చేరుకుంది.
దేశంలోని ప్రతి మూలను 75 వందేభారత్ రైళ్లతో అనుసంధానించే ప్రణాళికలను కూడా ప్రధాని ప్రకటించారు. ఇప్పటి వరకు 41 వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. బాలికల కోసం సైనిక్ స్కూల్‌ను కూడా ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజూ దాదాపు 69 కిమీ రోడ్లు నిర్మాణం జరగగా, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ప్రతిరోజూ 130 కిమీ రోడ్లు నిర్మిస్తున్నారు. 2014లో దేశంలోని మొత్తం రైల్వే లైన్ల పొడవు 22,048 కిమీలు కాగా, అది కేవలం 10 ఏళ్లలో 55,198 కిమీలకు పెరిగింది. 2014లో దేశంలో మొత్తం ఎక్స్‌ప్రెస్ వేల పొడవు 680 కి.మీలు కాగా, నేడు అది 4,067 కి.మీలకు చేరింది. 2014లో దేశ తలసరి ఆదాయం రూ.86,467 నేడు రూ.1,72,000 కు పెరిగింది.
మూడోసారీ మోదీ ప్రభుత్వమే
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బిజెపి మూడో సారీ అఖండ మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో బిజెపి 370 సీట్ల కంటే ఎక్కువ సీట్లు సాధించేందుకు సిద్ధంగా ఉంది. ఎన్‌డిఎ కూటమి 400 సీట్లకు పైగా సాధిస్తుందని అంచనా. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో అభివృద్ధిని మరింత త్వరితం చేసి కొత్త రికార్డులను సాధిస్తుంది.