రాబోయే ఎన్నికలు అభివృద్ధి సంకల్పం, కుటుంబ పాలనల మధ్య యుద్ధం
ఫిబ్రవరి 17, 18 తేదీలలో దిల్లీలో జరిగిన బిజెపి జాతీయ సదస్సులో రెండవ రోజున కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 10 సంవత్సరాల పాలనలో జరిగిన పరివర్తనాత్మక మార్పుల సమగ్ర సారాంశాన్ని వివరించారు. మోదీ రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారని, ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే ఐదో స్థానానికి తీసుకెళ్లి నక్సలిజం, తీవ్రవాదం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమర్థమైన చర్యలు తీసుకున్నారని అన్నారు
గత 75 ఏళ్లలో భారత్ 17 లోక్‌సభ ఎన్నికలను, 22 ప్రభుత్వాలను, 15 మంది ప్రధాన మంత్రులను చూసింది. ప్రతి ప్రభుత్వం తన హయాంలో అభివృద్ధి కోసం కృషి చేసింది, కానీ ఈ రోజు దేశం సమగ్ర అభివృద్ధి, ప్రతి రంగం అభివృద్ధి, ప్రతి వ్యక్తి అభివృద్ధి మోదీ పనితీరు, సమర్థత వల్లనే సాధ్యమయ్యాయని చెప్పడంలో అతిశయోక్తి లేదని ఆయన అన్నారు. అనువంశిక పార్టీల ‘దురహంకార కూటమి’ ని తీవ్రంగా విమర్శిస్తూ ప్రతిభ, పనితీరు ఆధారంగా రాజకీయ వ్యవస్థ నిర్మాణానికి బిజెపి నిబద్ధమై ఉందని ఉద్ఘాటించారు. బిజెపిలో శ్రేష్ఠ కుటుంబాలేవీ ఉండవని, సాధారణ కార్యకర్తలకే అందలాలు దక్కుతాయని గుర్తుచేశారు.
కొన్ని కుటుంబ పార్టీలు తమ సభ్యులను ముఖ్యమంత్రులు చేయాలనే ఏకైక లక్ష్యంతో పని చేస్తున్నాయని అమిత్ షా పేర్కొన్నారు. దీనికి భిన్నంగా బిజెపిలో బూత్ స్థాయి కార్యకర్త కూడా రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రి కాగలరని అన్నారు. కీలక సంస్కరణలను వ్యతిరేకించే ప్రతిపక్షాల తీరును అమిత్ షా తప్పుబడుతూ ‘అనువంశిక సంకీర్ణ పాలిత’ రాష్ట్రాల్లో బిజెపి కార్యకర్తలపై జరుగుతున్న హింసాత్మక సంఘటనలను ఈ సందర్భగా ప్రస్తావించారు. ఎన్డీయే, ‘అనువంశిక దురహంకార కూటమి’ మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ షా ఎన్డీయేను ఉత్తమ ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాధించిన విజయాలను హోం మంత్రి వివరిస్తూ, 2024లో మోదీ 3.0 ప్రభుత్వం రాబోతోందని, మొదటిసారిగా భారత్ ప్రపంచమే గర్వించే స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ లో టిఎంసి పాలనలో సాగుతున్న అర్థరహితమైన హింస వల్ల మహిళల హక్కులు కాలరాయబడుతున్నాయని అయన ఆవేదన వ్యక్తం చేస్తూ ‘ఇండి’ కూటమి దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందన్నారు. బిజెపి సిద్ధాంతాలు, విలువలు పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధమైనవని, ఈ ప్రజాస్వామ్య సూత్రాల పునాదిపై బిజెపి సంస్థాగత నిర్మాణం దృఢంగా ఉందని, పార్టీలో వ్యక్తుల స్థానం వారి అర్హత, పనితీరు ఆధారంగా నిర్ణయించబడుతుందని అమిత్ షా చెప్పారు. “గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజన కుటుంబం నుంచి వచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవికి ద్రౌపది ముర్ముని నియమించడం ద్వారా మొత్తం దేశంలోని ప్రతి ఆదివాసీ తెగను గౌరవించారు. రాష్ట్రపతి తర్వాత రెండవ అత్యున్నత పదవి అయిన ఉప రాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్ ఖడ్ దేశంలోని జాట్ వర్గం నుంచి వచ్చిన, దేశానికి ఆహారాన్ని అందించే రైతు కుమారుడు. ఒక రైతు కుమారుడిని ఉపరాష్ట్రపతిని చేయడం ద్వారా, ప్రధాన మంత్రి దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరినీ సత్కరించి, సాధికారీకరించారు,” అని ఆయన పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వ హయాంలో గత దశాబ్ద కాలంలో దేశం మొత్తం అభివృద్ధి చెందిందని, ప్రతి రంగానికి అపూర్వమైన పునర్వైభవం వచ్చిందని అమిత్ షా అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించారని, దీని కింద ప్రతి రైతుకు ఏటా రూ.6 వేలు అందజేస్తున్నారని, బిజెపి రైతు అనుకూల ప్రభుత్వ విధానాలకు ఒక నిదర్శనమని అన్నారు. “రైతులు, పేదలు, పల్లెవాసుల అభివృద్ధి, సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అనేక కీలక చర్యలు తీసుకుంది. ఆర్థిక సంస్కరణలకు అంకితమైన విధానాలను అమలు చేసింది. ఫలితంగా నేడు భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుండి ఐదవ స్థానానికి చేరుకుంది. పదేళ్ల బిజెపి ప్రభుత్వ హయాంలో దేశంలోని ప్రతి వర్గం వేగంగా అభివృద్ధి చెందింది. ఈ పదేళ్లలో సాధించిన అభివృద్ధితో పాటు 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా చేయాలన్న ప్రధానమంత్రి దృఢసంకల్ప సందేశంతో ఈ సదస్సు తర్వాత ప్రతి కార్యకర్త ప్రజల ముందుకు వెళతారు,” అని అమిత్ షా ప్రకటించారు.
బిజెపి కార్యకర్తలందరినీ ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రెండు శిబిరాలు ఒకదానితో ఒకటి తలపడుతున్నాయని అన్నారు. ఒకవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం, మరోవైపు కాంగ్రెస్ నాయకత్వంలోని అన్ని ‘అనువంశిక పార్టీల అహంకారపూరిత కూటమి’ ఉన్నాయని అన్నారు. ‘దురహంకార కూటమి’ అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలను పెంచి పోషిస్తోందని, అయితే ఎన్డీయే కూటమి మాత్రం ‘దేశం ముందు’ అనే సూత్రంపై నడుస్తున్న ప్రభుత్వమని అన్నారు. 2014 నుండి 2024 వరకు నరేంద్ర మోదీ హయాంలో దేశంలో నక్సలిజం, తీవ్రవాదం చరమ దశకు చేరుకున్నాయని అన్నారు. మోదీ దేశాన్ని అవినీతి, సంతుష్టీకరణ, కులతత్వం, కుటుంబపాలన మొదలైన రుగ్మతల నుంచి విముక్తం చేశారని పేర్కొన్నారు. “మోదీజీ పనితీరు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. బ్రిటిష్ పాలనతో ముడిపడి ఉన్న జాతీయ చిహ్నాలను తొలగించడం ద్వారా క్రమంగా మనల్ని వలస మనస్తత్వం నుండి విముక్తం చేస్తున్నారు,” అని హోంమంత్రి పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ ను స్వయంసమృద్ద, అభివృద్ధి చెందిన దేశంగా చేయడం ప్రధానమంత్రి మోదీ లక్ష్యం అయితే తమ కొడుకు లేదా కూతురిని సింహాసనం మీద కూర్చోబెట్టడమే ప్రతిపక్ష కూటముల ఉద్దేశమని షా వ్యాఖ్యానించారు.. “రాహుల్‌ను ప్రధాని చేయడం, శరద్‌పవార్ కుమార్తెను ముఖ్యమంత్రి చేయడం, మమతా బెనర్జీ మేనల్లుడు, స్టాలిన్, లాలూ, ఉద్ధవ్‌లను సీఎం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ సోనియా గాంధీ రాజకీయాలు చేస్తున్నారు,” అని అమిత్ షా దుయ్యబట్టారు. తమ కుటుంబాల కోసం అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేసే నాయకులు ఎన్నటికీ పేదల సంక్షేమం, ప్రజల అభ్యున్నతి, దేశ అభివృద్ధిని సాధించలేరని అన్నారు. కుటుంబ రాజకీయాలపై విరుచుకుపడుతూ “దేశంలో 2జీ, 3జీ, 4జీ పార్టీలు ఉన్నాయి. 2జి అంటే స్కామ్ కాదు. 2జి అంటే 2వ తరం పార్టీ. 4వ తరం వరకు వారి నాయకుడు మారడు. ఇప్పుడు దేశంలో అభివృద్ధి కూటమి (ఎన్డీయే) వర్సెస్ అనువంశిక కూటమి (ఇండి కూటమి) మోహరించి ఉన్నాయి,” అని అన్నారు.
దేశ పగ్గాలు చేపట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కంటే మంచి నాయకుడు లేడని అమిత్ షా అన్నారు. బిజెపి ప్రజాస్వామ్య పార్టీ కాకపోతే టీ అమ్మేవ్యక్తి ప్రధాని కాలేడు. ‘ఇండి’ కూటమి ఏడు కుటుంబ పార్టీల కూటమి. ఈ పార్టీలలోని నాయకులు గత నాలుగు తరాలుగా మారలేదు, ఈ పార్టీల ప్రధాన లక్ష్యం వారి రాబోయే తరాల భవిష్యత్తు, కొడుకుల సంక్షేమమే అయినప్పుడు దేశానికి మేలు ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. నేటి రాజకీయ పరిస్థితులలో ‘దురహంకార’ కూటమికి అధికారం దక్కే అవకాశం లేనివిధంగా ప్రజలు ప్రతిపక్ష పార్టీలను తిరస్కరించారని, అందుకే ఈ ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇప్పుడు ప్రతిదాన్నీ వ్యతిరేకించడం ప్రారంభించారని అన్నారు. అధికరణం 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, ఓబీసీ కమిషన్‌ను వ్యతిరేకించడమే కాకుండా, నారీ శక్తి వందన్ చట్టం అమలులో కూడా ప్రతిపక్షాలు చాలా ఆటంకాలు సృష్టించాయన్నారు. రామ్ లల్లా పవిత్రోత్సవ ఆహ్వానాన్ని తిరస్కరించడం ద్వారా, కాంగ్రెస్ ఈ చరిత్రాత్మక ఘట్టంలో భాగమయ్యే అవకాశాన్ని కోల్పోవడంతో పాటు దేశాన్ని సర్వోన్నతంగా మలిచే ప్రక్రియ నుంచి తనను తాను దూరం చేసుకుందన్నారు. రామ్ లల్లా దీక్షకు సంబంధించిన ఆహ్వానాన్ని ప్రతిపక్షాలు తిరస్కరించడం, దాని వెనుక వారి ఉద్దేశాలను దేశ ప్రజలు చూస్తున్నారని, వారు దాన్ని గుర్తుంచుకుంటున్నారని అన్నారు. ఈ అనువంశిక పార్టీలన్నీ కలిసి దేశంలో స్వతంత్ర ప్రజాభిప్రాయం ఎన్నటికీ ఉద్భవించని పరిస్థితులను సృష్టించే పనిలో నిమగ్నమై ఉన్నాయని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన పదేళ్ల సమర్థ పరిపాలనలో అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులు, కులతత్వాన్ని నిర్మూలించడం ద్వారా దేశంలో అపూర్వమైన అభివృద్ధి కొత్త కోణాలను ఆవిష్కరించారని పేర్కొంటూ, 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ‘మోదీ 3.0’ ప్రారంభమవుతుందని, 2047లో అభివృద్ధి చెందిన భారత్ కల నెరవేరుతుందని ఉద్ఘాటించారు.