Kishan Reddy VSY

కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా రావు

 

GKR VSY

మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దివాళా తీయించి తన కుటుంబాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకొన్నారని… ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి 40 సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే దుయ్యబట్టారు. కాకతీయ భద్రకాళి క్లస్టర్ విజయ సంకల్ప యాత్రలో ఆయన ముఖ్యమంత్రిగా పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర 8వ రోజు ఫిబ్రవరి 27న దిగ్విజయంగా సాగింది. తెలంగాణకు జాతీయ నాయకుల రాకతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరుగుతోంది. బిజెపి రాష్ట్ర రథ సారథి కిషన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలోని ఐదు క్లస్టర్లలో సాగుతున్న విజయ సంకల్ప యాత్రతో రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ మరింత పెరిగింది. కేంద్రంలో మళ్లీ బిజెపి సర్కార్ కొలువు తీరేలా.. మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేసుకునే సంకల్పం తెలంగాణ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. యాత్రకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న జన సందోహంతో పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

బీఆర్ఎస్ గత పదేండ్ల పాలన.. గతంలో 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనతో తెలంగాణకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని పేర్కొంటూ 8వ రోజు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న సందర్భంగా బిజెపి తెలంగాణ అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రెండు పార్టీల వైఖరిపై తీవ్రంగా మండి పడ్డారు. కాంగ్రెస్ శ్రేణులు గాంధీ కుటుంబానికి సేవ చేయటమే సరిపోతుందని ఎద్దేవా చేశారు. మన దేశాన్ని ఆర్థిక రంగంలో, శాంతిభద్రతలు , మౌలిక వసతుల కల్పనలో వేగం పెంచడం బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా చేస్తుందన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవం పెరుగుతోందని, అందుకే ప్రతి ఒక్కరు రాజకీయాలకు అతీతంగా మూడోసారి ప్రధానిగా గెలిపించి ఆశీర్వదించాలని కిషన్ రెడ్డి ప్రజలను కోరారు. భాగ్యలక్ష్మి క్లస్టర్ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో సనత్ నగర్, జూబ్లీహిల్స్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామంచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

DrKLaxman VSY

 

కాకతీయ భద్రకాళి క్లస్టర్ ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో కొనసాగిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా.. కూసుమంచి మండల కేంద్రంలో జరిగిన సభలో మహేంద్రనాథ్ పాండే మాట్లాడుతూ.. ప్రధాని మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపారని, మూడోసారి ప్రధానిగా చేసుకుంటే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుపుతారని తెలిపారు. ఖమ్మంతో పాటుగా రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో పార్లమెంట్ సీట్లను గెలిపించి మోదీని ఆశీర్వదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మొత్తంగా మధిర, పాలేరు, ఖమ్మం, వైరా అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ కొనసాగిన ఈ యాత్రలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొమురం భీం క్లస్టర్ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని బాల్కొండలో బిజెపి విజయ సంకల్ప యాత్రలో మాజీమంత్రి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ యాత్రలో ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తీరును ప్రజా క్షేత్రంలో డీకే అరుణ ఎండగట్టారు. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మోదీ మరోసారి ప్రధాని కావాలని దేశవ్యాప్తంగా ఆకాంక్ష వ్యక్తమవుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన ఆరు గ్యారంటీలు అంటూ ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లే.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోను అదే మోసపూరిత హామీలతో గెలవాలని చూస్తోందని దుయ్యబట్టారు. ఈ యాత్రలో శాసనసభ్యులు పైడి రాకేశ్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

రాజరాజేశ్వరి క్లస్టర్ లో భాగంగా బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, బిజెపి శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధర్వంలో జరిగిన విజయ సంకల్ప యాత్రకు జనం పోటెత్తారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ యాత్ర పొడవునా నినాదాలతో హోరెత్తించారు. ఈ యాత్రలో శాసనసభ్యుడు పాల్వాయి హరీష్ బాబు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఆరెపల్లి మోహన్, తదితరులు పాల్గొన్నారు. ఈ యాత్రలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తు్న్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అఖండ మెజారిటీ అందించే ఆవశ్యకతను బిజెపి నాయకులు వివరించారు.

కృష్ణమ్మ క్లస్టర్ లో భాగంగా నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర కొనసాగింది. కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాలను చుట్టేస్తూ కొనసాగిన ఈ యాత్రలో ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగ్ లో డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడారు. అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి ఏళ్ల నాటి హిందువుల కల నెరవేర్చడంతోపాటు… ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసి ముస్లిం మహిళల గోస తీర్చింది కూడా మోదీ ప్రభుత్వమేనని లక్ష్మణ్ కొనియాడారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న సందర్భంగా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. రాముడే లేడు.. లేని రామునికి గుడెందుకు అని మాట్లాడిన కాంగ్రెస్ నేతలు… ఇప్పుడు మాట మార్చి ఓట్ల కోసం దేవుడు పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బిజెపికి ఓటు వేసి మూడోసారి మోదీని ప్రధాని చేసి కాంగ్రెస్ కి కర్రు కాల్చి వాత పెట్టడానికి నాగర్ కర్నూల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.