Amit Shah at Bhopal

నిరంతరం ప్రజల కోసం పాటుపడేవారికే పట్టం

 

Amit Shah Bhopal Intellectual Meet

మహాభారతంలో పాండవులు, కౌరవులు అనే రెండు శిబిరాలు ఉన్నట్టుగా దేశంలో రెండు శిబిరాలు ఉన్నాయని, ఒకవైపు నరేంద్ర మోదీ నేతృత్వంలోని దేశభక్తుల సమూహం బిజెపి, మరోవైపు ఏడు ‘అనువంశిక పార్టీల దురహంకార కూటమి అని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ‘ఇండి’ కూటమి తన అనువంశిక లేదా కుటుంబ రాజకీయాల గురించి గర్విస్తోందని, టీ అమ్మే ఒక పేద తల్లి బిడ్డ దేశానికి ప్రధాని అవుతాడని అది విశ్వసించదని అన్నారు. పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాల్లో పుట్టిన దురహంకార కూటమి నేతలు ప్రధాని పదవిని తమ ఆస్తిగా భావిస్తారన్నారు. ఫిబ్రవరి 25న భోపాల్ లో జరిగిన మేధావుల సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ విష్ణుదత్ శర్మ, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి జగదీష్ దేవరా, రాజేంద్ర శుక్లా తదితరులు పాల్గొన్నారు.

ఈ సదస్సులో అమిత్ షా ప్రసంగిస్తూ ‘‘ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా ‘ప్రజాస్వామ్యం పండుగ’ జరుగుతోంది. ప్రపంచ జనాభాలో 40 శాతం మంది ఎన్నికలలో పాల్గొనబోతున్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లలో ఎన్నికలు పూర్తయ్యాయి, ఇంకా చాలా దేశాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. భారత్‌లో కూడా ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోని 100 కోట్ల మంది ఓటర్లు రానున్న ఐదేళ్లలో ఏ వ్యక్తి, ఏ పార్టీ, ఏ సిద్ధాంతం దేశ పాలనకు వెన్నెముకగా నిలుస్తుందో నిర్ణయిస్తారు.1950లలో ఏర్పడిన జన్ సంఘ్, నేటి భారతీయ జనతా పార్టీ ఎన్నికలను అధికారం అనుభవించేందుకు సాధనంగా ఎన్నడూ భావించలేదు. భారతీయ జనసంఘ్, బిజెపి ఎన్నికలను ప్రజాస్వామ్య ఉత్సవంగా భావించి అలాగే జరుపుకొన్నాయి.పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేయడానికి, ప్రజా సంబంధాల సాధనంగా, అధికారంలో ఉన్నప్పుడు సాధించిన విజయాలను ప్రదర్శించడానికి, బిజెపి ప్రభుత్వ పనితీరు నివేదికను చూపించడానికి బిజెపి ఎన్నికలను ఒక మాధ్యమంగా పరిగణించింది. ఇందులో భాగంగా బిజెపి నాయకులు దేశంలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి వెళ్లి ప్రజలను, కార్యకర్తలను, మేధావులను కలుసుకుంటున్నారు. 

భారత పౌరులుగా, ఓటు వేసే బాధ్యతతో పాటు, ప్రజాభిప్రాయాన్ని పెంపొందించే బాధ్యత కూడా దేశంలోని మేధావులపై ఉంది. వివేకం, వివేచన గల వ్యక్తులు వారి రంగాల్లో కొంత నైపుణ్యం కారణంగా సమాజంలోను, ప్రజలలో విలువ, ప్రభావం కలిగి ఉన్నారు. ప్రజలు మేధావుల అభిప్రాయాలను, మాటలను శ్రద్ధగా వింటారు. వాటి ఆధారంగా వారి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయం ఏర్పడే ప్రక్రియ ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిది. దురదృష్టవశాత్తూ, 60వ దశకం తర్వాత మన దేశంలో జరిగిన అన్ని ఎన్నికలలో కులతత్వం, బంధుప్రీతి, సంతుష్టీకరణ, అవినీతి ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మన దేశ ప్రజాస్వామ్యానికి ఈ నాలుగు రుగ్మతలు రాచపుళ్లుగా మారాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేవలం 10 సంవత్సరాలలో ఈ రాచపుళ్లను అంతం చేసి ‘పనితీరు ఆధారిత రాజకీయాల’ను బలోపేతం చేశారు. ఫలితంగానే నేడు దేశం నిజమైన ప్రజాస్వామ్యం వైపు పయనిస్తోంది. ఎన్నికలలో ప్రజల తీర్పు కులతత్వం, బుజ్జగింపుల ద్వారా ప్రభావితం కాకూడదు. బంధుప్రీతి, అవినీతితో కలుషితం కాకూడదు. సోనియాగాంధీ తన కుమారుడిని ప్రధానిని చేయాలని, శరద్‌పవార్‌ తన కుమార్తెను ముఖ్యమంత్రిని చేయాలని, మమతా బెనర్జీ తన మేనల్లుడిని ముఖ్యమంత్రిని చేయాలని, లాలూ ప్రసాద్ యాదవ్‌ తన కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారు. ఎంకె స్టాలిన్ కూడా తన కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నాడు. ములాయం సింగ్ జీ కొడుకు మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఈ పార్టీలన్నీ తమ కుటుంబాల ప్రయోజనాల కోసం పని చేస్తున్న పార్టీలు. తమ కుటుంబాల ప్రయోజనాల గురించి మాట్లాడే పార్టీలు, తమ బంధువులను ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చేయాలనుకునే పార్టీలు భారతదేశంలోని పేదలను పట్టించుకోలేవు, భారతదేశాన్ని పట్టించుకోలేవు, భారతదేశాన్ని ప్రపంచంలో ఒక ప్రతిష్టాత్మక దేశంగా చేయలేవు. తన జీవితంలోని ప్రతి క్షణం, తన శరీరంలోని ప్రతి కణాన్ని భరతమాతకు అంకితం చేసిన వ్యక్తి మాత్రమే భారతదేశానికి ప్రపంచ వ్యాప్తంగా గౌరవాన్ని తీసుకురాగలడు. 

రాబోయే రోజుల్లో దేశం రెండు శక్తులలో ఒకదాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. కుటుంబం కోసం జీవించే వారిని కాక దేశం కోసం జీవించే వారినే ప్రజలు ఎంచుకుంటారు. పదేళ్ళ యుపిఎ పాలన, పదేళ్ళ ఎన్డీయే పాలనకు సంబంధించిన గణాంకాలలో రహస్యం ఏమీలేదు. ఇది పారదర్శకత యుగం. ఆన్‌లైన్‌లో మొత్తం సమాచారం అందుబాటులో ఉంది. ఈ రెండు ప్రభుత్వాల మధ్య తేడాను మీరే అర్థం చేసుకోవచ్చు. యుపిఎ పదేళ్ళ పాలనలో రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలు, క్రీడల్లో అవినీతి, సైన్యం, విమాన స్థావరం, జలాంతర్గాములు, హెలికాప్టర్లు కొనుగోళ్లు, అంతరిక్షంలో అవినీతి, భూగర్భంలో బొగ్గు గనుల్లో అవినీతి ఇలా ఇదీ అదీ అని లేకుండా అన్ని చోట్లా కుంభకోణాలు నిత్యం వెలుగులోకి వచ్చాయి. ఆకాశం, పాతాళం, సముద్రం, అంతరిక్షం ఇలా అన్ని చోట్లా అవినీతి చేస్తూ కాంగ్రెస్‌ పాలన సాగించింది. కానీ గత 10 ఏళ్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నాలుగు పైసలు అవినీతి చేశారని కూడా ఎవరూ ఆరోపించలేదు.

కాంగ్రెస్ హయాంలో దేశం అభద్రతలో ఉండేది. దేశంలోని తల్లులు, సోదరీమణులు అభద్రతా భావంతో ఉండేవారు. రోజూ పాకిస్థాన్‌ ప్రేరిత బాంబు పేలుళ్లు జరిగేవి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నాయకులు మౌనం వహించేవాళ్లు. యూపీఏ జరిగిన విచ్చలవిడి అవినీతి కుంభకోణాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ పాతాళానికి చేరుకుంది. దేశం పరువు గంగలో కలిసిపోయింది. అయితే ఈ 10 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారత్ వైపు చూసే ధైర్యం ఇప్పుడు ఎవరికీ లేదు. మనజోలికి వచ్చే సాహసం చేసిన ఉగ్రవాదులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మనం మెరుపు దాడుల ద్వారా తగిన సమాధానం చెప్పాము. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందింది. అటల్ బిహారీ వాజపేయి కాలంలో ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండేది, కాంగ్రెస్ హయాంలో ఎటువంటి మార్పు లేదు. కానీ నేడు నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ఆర్ధిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 5వ స్థానానికి చేరుకుంది.

ప్రజలు మూడోసారి బిజెపిని ఎన్నుకుంటే ఈ దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ఇదే ‘మోదీ హామీ’. న‌రేంద్ర మోదీ దేశాన్ని సురక్షితంగా చేసేందుకు, అవినీతిని అంతం చేసేందుకు, అభివృద్ధి పథంలో వేగంగా పయనింపజేస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేశారు. లడఖ్ నుంచి లక్షద్వీప్ వరకు, ఈశాన్యం నుంచి పంజాబ్ వరకు, సాగు నుంచి సైన్స్ వరకు, స్వయం సహాయక సంఘాల నుంచి స్టార్టప్‌ల వరకు సహకారం నుంచి అంతరిక్షం వరకు ప్రతి రంగంలోనూ కొత్త కోణాలను ఆవిష్కరించాం. కొత్త విధానాలు కూడా రూపొందించాం.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 40 రకాల విధానాలను రూపొందించారు. అనేక సంవత్సరాల తర్వాత నూతన విద్యా విధానాన్ని మోదీ తీసుకొచ్చారు. ఇదొక్కటే కాదు, భారతదేశ భూమి, గాలి, వర్ణాలు, శైలిని ఈ పథకాల్లో పొందుపరిచి వలసవాద బానిసత్వం ఆనవాళ్ళను చెరిపివేశారు. నరేంద్ర మోదీ ఈ దేశాన్ని బానిసత్వ అవశేషాల నుంచి విముక్తం చేయడానికి కృషి చేశారు. నాసిరకం వ్యవస్థలను తొలగించేందుకు కృషి చేశారు. భారతదేశం దేన్నైనా సాధించగలదు. ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండే హక్కు, అర్హత ఏ దేశానికైనా ఉన్నాయంటే అది భారత్ మాత్రమే. ప్రజల్లో ఈ విశ్వాసం కలిగించేందుకే ప్రధాన మంత్రి మోదీ కృషి చేస్తున్నారు.

భారత్ ప్రపంచంలోనే అతి పురాతనమైన, అతి పెద్ద ప్రజాస్వామ్యం. ఈ గొప్ప ప్రజాస్వామ్య పండుగను పూర్తి అవగాహనతో జరుపుకోవడం మన బాధ్యత. మనం ఏ పార్టీ లేదా నాయకుడి శుష్క వాగ్దానాలను నమ్మకూడదు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీని ఎన్నుకోండి, ఆ పార్టీ సుదూర భవిష్యత్తును చూసేది, ఊహించగల సామర్థ్యం కలిగినది అయి ఉండాలి. బిజెపికి ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. మా పార్టీ చెప్పినవన్నీ చేసింది. బిజెపి విధానాలలో మానవత్వం, సున్నితత్వం, అందరినీ కలుపుకొని పోయే అభివృద్ధి దార్శనికత, ఉన్నతమైన భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పం, అవినీతి, సంతుష్టీకరణలను అంతం చేయాలనే పట్టుదల, అందరికీ రక్షణ కలిగిన గొప్ప భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పం మా విధానాలలో ఉన్నాయి. 

గత 10 ఏళ్ల కాలంలో భారత్ లో వచ్చిన మార్పును చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ఇంతకుముందు భారత్ నుంచి విదేశాలకు వెళ్లినప్పుడు స్పందన అంతగా ఉండేదికాదు. కానీ నేడు భారత్ పాస్‌పోర్ట్ చూసి విదేశీయలు “మీరు మోదీ ఇండియా నుంచి వచ్చారు కదా?’ అని అడుగుతున్నారు. ఈ మార్పు గత పదేళ్లలో వచ్చింది. ఈ దశాబ్ద కాలంలో మోదీ దేశాన్ని అవినీతి, కులతత్వం, బంధుప్రీతి, సంతుష్టీకరణల నుండి విముక్తి చేశారు. ఈ రోజు మనం మన మాతృభాషలో గర్వంగా మాట్లాడుతున్నాము. ప్రధానమంత్రి మోదీ అంతర్జాతీయ సమావేశాలకు వెళ్లినప్పుడల్లా హిందీలో ఎంతో ఉత్సాహంగా మాట్లాడడం, ప్రపంచం మొత్తం ఆయన మాటలను అంతే శ్రద్ధతో వినడమే భారత్ పట్ల పెరిగిన గౌరవప్రతిష్టలకు నిదర్శనం. 

 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని ఉగ్రవాదం నుంచి, బానిసత్వ చిహ్నాల నుండి విముక్తి చేశారు. కానీ అది కొత్త పార్లమెంటు భవనం కానివ్వడి, కర్తవ్య మార్గ్ కానివ్వండి వాటిని వ్యతిరేకించడానికి కాంగ్రెస్ ఎదో ఒక సాకును కనుక్కుంటుంది. 2014 నుంచి 2024 వరకు ఈ దశాబ్దం సాహసోపేతమైన నిర్ణయాలు, దూరదృష్టి నిర్ణయాలు, ఉజ్వల భవిష్యత్తు కోసం సంకల్పంతో కూడిన దశాబ్దం. ఇచ్చిన మాట ప్రకారమే 2019 ఆగస్టు 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగంలోని అధికరణం 370ని రద్దు చేసింది. ప్రపంచంలో ఏ దేశంలోనూ రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు జెండాలు ఉండవు. కానీ కాదు కాంగ్రెస్ మాత్రం బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ 70 ఏళ్లుగా దాన్ని కొనసాగించింది. అయితే ప్రధాన మంత్రి మోదీ దృఢ సంకల్పంతో దాన్ని పెకిలించి విసిరేశారు.

నేడు కాశ్మీర్ భరతమాతకు మకుటంగా మారింది. యావత్ ప్రపంచం ముందు గర్వంగా నిలిచింది. 30 ఏళ్ల తర్వాత అక్కడ థియేటర్లు ప్రారంభమయ్యాయి, లాల్ చౌక్‌లో జన్మాష్టమి జరుపుకొంటున్నారు. మొహర్రం ఊరేగింపులు జరుగుతున్నాయి. దేశంలోని నలుమూలల నుంచి లక్షల మంది కాశ్మీర్‌ను సందర్శించడానికి వస్తున్నారు.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ల నుండి శరణార్థులుగా భారత్ కు వచ్చిన హిందూ పౌరులకు తమ మతాన్ని విడిచిపెట్టడం లేదా వారి కుటుంబాల్లోని మహిళలను అవమానాలకు గురిచేయడం అనే రెండే మార్గాలు ఉండేవి. కానీ నేడు ఈ ప్రజలు భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధ లేదా మరే ఇతర మతమైనా ఏకరూప పౌరసత్వ చట్టాన్ని తీసుకురావడం ద్వారా కోట్ల మందికి పౌరసత్వం కల్పించేందుకు మార్గం సుగమం చేశారు. 

ట్రిపుల్ తలాక్ ఈ దేశానికి కళంకం. ఈ దేశంలోని ముస్లిం తల్లులు, సోదరీమణులు తమ హక్కులకు నోచుకోలేదు. అయితే ప్రధాన మంత్రి ట్రిపుల్ తలాక్‌ను కూడా రద్దు చేసి వారికి న్యాయం చేశారు. నేడు భారతీయ బ్యాంకుల షేర్లు ప్రపంచంలోని అన్ని బ్యాంకుల కంటే అగ్రస్థానంలో ఉన్నాయి. గత పదేళ్లలో బ్యాంకింగ్ రంగంలో జరిగిన కృషికి నిదర్శనం ఇది. రైతుల కోసం స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను మేము ఆమోదించాం. ఉత్పత్తి వ్యయంపై 150 శాతం లెక్కన కనీస మద్దతు ధర నిర్ణయిస్తున్నాం. మాజీ సైనికులకు ఒకే ర్యాంక్, ఒకే పెన్షన్ డిమాండును కూడా పరిష్కరించాం. కాశ్మీర్ లోను, ఈశాన్య రాష్ట్రాల్లోనూ, మధ్య ప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాలో వామపక్ష తీవ్రవాదం సమస్య ఉండేది. కానీ ఇప్పుడు ఈ మూడు చోట్లా తీవ్రవాద సంఘటనలు 70 శాతం, మరణాలు 72 శాతం తగ్గిపోయాయి.

ఒకప్పుడు దేశంలో దాదాపు 60 కోట్ల మందికి ఒక్క బ్యాంకు ఖాతా ఉండేది కాదు, కానీ నేడు దేశంలో బ్యాంకు ఖాతా లేని ఒక్క కుటుంబం కూడా లేదు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద దాదాపు 60 కోట్ల మందికి రూ 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. దేశంలోని 80 కోట్ల మందికి పైగా పేదలకు ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలను మోదీ ప్రభుత్వం అందిస్తోంది. 14 కోట్ల మందికి కుళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించింది. దశాబ్దాలుగా దేశంలోని పేదలు కనీస సౌకర్యాల కోసం ఎదురుచూస్తున్నారు, పోరాడుతున్నారు. దేశ అభివృద్ధి ప్రక్రియలో తాము పాలుపంచుకోలేక పోతున్నామని నిరాశ చెందారు. కేవలం పదేళ్ళలో నరేంద్ర మోదీ ఒకేసారి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేశారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రస్థానంలో దేశంలోని 60 కోట్ల మంది ప్రజలను భాగస్వాములను చేశారు.

కరోనా సమయంలో భారత్ ఈ విపత్తును ఎలా అధిగమిస్తుందో అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందాయి. ఆ సమయంలో దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలు అంత ఆధునికంగాను, సిద్ధంగాను లేవు. కానీ అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా దేశాలు కరోనాతో పోరాడుతున్న సమయంలో భారతదేశం ఈ విపత్తు నుంచి అతి తక్కువ వేదనతో బయటపడింది. ప్రపంచంలోని అన్ని దేశాలలో ప్రభుత్వాలు ఒంటరిగా ఈ విపత్తుతో పోరాడాయి, కానీ భారతదేశంలో మోదీ ప్రభుత్వంతో పాటు, దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు కూడా సమష్టిగా పోరాడారు.

భారత్ ప్రపంచంలోనే పురాతన సాంస్కృతిక వారసత్వం కలిగిన దేశం, సంస్కృతి లేకుండా మన దేశాన్ని ఊహించలేం. కాంగ్రెస్ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని చెద పురుగులా ధ్వంసం చేసేందుకు కృషి చేసింది. 500 ఏళ్లు స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా దేశంలో రామ మందిర నిర్మాణం గురించి చర్చ జరుగుతుండగా, కాంగ్రెస్‌ ఈ అంశాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. ప్రధానమంత్రి మోదీ పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో రామాలయ భూమి పూజను నిర్వహించారు. జనవరి 22, 2024 న రామాలయంలో రాంలాలాను ప్రతిష్ఠించారు. రాబోయే 10 వేల సంవత్సరాలకు కూడా ఇది చారిత్రాత్మకమైన రోజు.

దేశాన్ని ఉత్తరాది, దక్షిణాది అని వేరుచేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నా పార్టీ నాయకత్వం మౌనంగా ఉంది. సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్, గాంధీజీ నాయకత్వంలోని పార్టీకి ఈ రోజు ఏమైంది? ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని కూడా వారు ప్రకటించడం లేదు. నరేంద్ర మోదీ పాలనలో ఈ దేశాన్ని ఎవరూ ముక్కలు చేయలేరు. ఒక పార్టీ కార్యక్రమాలే ప్రజల్లో ఆ పార్టీకి గుర్తింపు తెస్తాయి. అధికరణం 370 నుంచి కాశ్మీర్‌ను విముక్తి చేయడం, కచ్ సత్యాగ్రహం చేయడం, గోవా, హైదరాబాద్ కోసం పోరాడడం, రామజన్మభూమి ఉద్యమం ప్రారంభించడం, ద్రవ్యోల్బణం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడడం బిజెపి కార్యక్రమం. బిజెపి చేసే ప్రతి కార్యక్రమం లక్ష్యం దేశాన్ని బలోపేతం చేయడమే. రాహుల్ గాంధీ పేరుతో కాంగ్రెస్ రాకెట్‌ను చాలాసార్లు ప్రయోగించారు. కానీ ఈ రాకెట్ ఎప్పుడూ విఫలమవుతూనే ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 23 ఏళ్ల ప్రజా జీవితంలో ఒక్క అవినీతి మచ్చ కూడా లేదు.’’ అని అన్నారు.