దేశంలో ఇండీ కూటమి, రాష్ట్రంలో బీఆర్ఎస్ అగమ్యగోచరమే

దేశానికి స్వాతంత్ర్యం మేమే తెచ్చామని నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజలను మభ్యపెడుతూ, మోసగిస్తూ, నెహ్రూ కుటుంబ పార్టీగా మారి, మొత్తం ఐదున్నర దశాబ్దాల పాటు దోపిడీ, మైనార్టీ సంతుష్టీకరణ, విచ్ఛిన్నకర శక్తులకు అండగా ఉంటూ సాగించిన పరిపాలనతో ప్రజలు విసిగి వేసారి ప్రత్యామ్నాయంగా ఎదిగిన బిజెపిని ఆదరిస్తూ, బలాన్ని పెంచుతున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీకి అండగా నిలుస్తూ గత దశాబ్ద కాలంగా కేంద్రంలోనే కాకుండా, వివిధ రాష్ట్రాల్లో కూడా బిజెపిని విశేషంగా ఆదరిస్తూ కాంగ్రెస్, తదితర కుటుంబ పార్టీలకు దూరంగా జరుగుతూ వస్తున్నారు. ఫలితంగా గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. ఇప్పుడు రెండు డజన్లకు పైగా చిన్నాచితకా పార్టీలతో చేతులు కలిపి ఒక అవకాశవాద కూటమిగా ఏర్పడ్డా దినదినం విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటూ కాంగ్రెస్  అగమ్యగోచరంగా తయారైంది.

లాలూ కుటుంబం అవినీతిని జీర్ణించుకోలేక, ఇండీ కూటమిలో ముఖ్య భాగస్వామి అయిన జేడీ(యు) నాయకుడు నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీఏతో జత కట్టడంతో ఆ కూటమికి తొలి దెబ్బ తగిలింది. మొదటి నుంచీ ఆ కూటమిలో ఉన్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ల మధ్య పొత్తు కేరళలో అసాధ్యమని అందరికీ అర్థమైంది. ఇండీ కూటమిని మొదటి నుంచీ బలపరుస్తున్న మమతా బెనర్జీ తన స్వరాష్ట్రం పశ్చిమ బెంగాల్ లో మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో అసలు ఇండీ కూటమి ఎందుకన్న ప్రశ్న తలెత్తుతుంది. బిజెపి కంచుకోట అయిన గుజరాత్ లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీల పొత్తు ‘‘జోగి జోగి రాసుకుంటే రాలేది బూడిదే’’ అన్న చందంగా ఉంది. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు వచ్చిన సీట్లు ‘‘సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం’’ అన్న తీరుగా ఉంది. కూటమికి ఒక నాయకత్వం లేదు, ఒక లక్ష్యం లేదు, మోదీని ఎందుకు వ్యతిరేకిస్తున్నామో చెప్పే పరిస్థితి లేదు.

తెలంగాణ రాష్ట్రాన్ని మేమే తెచ్చామని ప్రజలను మాయ మాటలతో నమ్మించి, రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ పరిస్థితి కూడా ఇప్పుడు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. గతంలో దిల్లీలో భూకంపం సృష్టిస్తామన్న కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు గల్లీలో పొత్తులు అడుక్కునే స్థాయికి దిగజారింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ‘‘మీ కారుకు ఓ నమస్కారం’’, ‘‘మాకు టికెట్లు వద్దే వద్దు’’, ‘‘సారీ… మేం పోటీ చేయం’’ అని బీఆర్ఎస్ ప్రముఖ నాయకులు కేసీఆర్ విన్నపాలను తిరస్కరిస్తుంటే, ‘‘పైసలు మావే, ప్రచారం మాదే, అన్నీ మేమే చూసుకుంటాం… మీరు పోటీ చేయాలి’’ అని కేసీఆర్ లాంటి నియంత బతిమిలాడే పరిస్థితి వచ్చిందంటే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు, బిజెపి కాంగ్రెస్ వైపు పయనిస్తుంటే, ఏ కూటమిలో లేని బీఆర్ఎస్ ఈ లోక్ సభ ఎన్నికల్లో ఏం చెప్పి ఓట్లు అడగాలని సతమతమవుతోంది. 70 మందిని అసెంబ్లీకి పంపే దాకా నిద్రపోను అన్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బీఎస్పీ గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకున్నా ఆ పార్టీతో కేసీఆర్ పొత్తుకు తపిస్తున్నాడంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పొత్తుకు మాయవతి తిరస్కరించినా, మళ్లీ బతిమిలాడి ఒప్పించుకున్నారంటే తెలంగాణలో బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను ఎవరూ నమ్మడం లేదని స్పష్టమవుతుంది.

ఇండీ కూటమి, బీఆర్ఎస్ పరిస్థితి ఇలా ఉంటే, పాత ఎన్డీఏ మిత్రులు టీడీపీ, అకాలీలను కూటమిలో కలుపుకొనే గట్టి నిర్ణయాలతో, కొత్తగా ఇతర మిత్రులను అక్కున చేర్చుకుంటూ మోదీ నాయకత్వంలోని బిజెపి సొంతంగా 370 స్థానాలు, ఎన్డీఏ కూటమికి 400పైగా అని సంపూర్ణ విశ్వాసంతో ప్రజల ముందుకు దృఢ నిశ్చయంతో వచ్చింది. దేశవ్యాప్తంగా బలమైన సానుకూల పవనాలతో ప్రపంచ నెంబర్ 1 నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి ప్రత్యామ్నాయ పార్టీ, కూటమి, నాయకుడు అనేదే లేని విధంగా అఖండ విజయం వైపు దూసుకుపోతుంది.