Tejasvi Surya

చారిత్రాత్మక ప్రజాతీర్పు ఇవ్వనున్న దక్షిణ భారతదేశం

Tejasvi Suryaదక్షిణాదిలో బిజెపి ఈ సారి ఇంతకుముందు ఎన్నడూ గెలుచుకోనన్ని స్థానాలు గెలుచుకోనుందని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య స్పష్టం చేశారు. ఈసారి దక్షిణ భారతదేశం నుండి చారిత్రాత్మక ప్రజాతీర్పు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ డీఎన్‌ఏలో బుజ్జగింపు రాజకీయాలు భాగమని, భారత వ్యతిరేక డిఎన్ఏ అని అన్నారు. కాబట్టి కాంగ్రెస్ కార్యక్రమంలో భారత వ్యతిరేక లేదా పాకిస్థాన్ అనుకూల నినాదాలు వినిపించడంలో ఆశ్చర్యం లేదని తెలిపారు. ఇక రాహుల్ గాంధీ విజిటింగ్ ఎంపీ అంటూ చురకలంటించారు. ఆయన అమేథీలో ఎలా విజిటింగ్ ఎంపీగా ఉన్నాడో వాయనాడ్ లో కూడా అంతేనని ఎద్దేవా చేశారు. ఒక ఆంగ్ల టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు.

ప్ర: కర్నాటక రాజ్యసభ ఎన్నికల ఫలితాలు బిజెపికి నిరాశ కలిగించాయా?

జ: జరిగిన క్రాస్ ఓటింగ్‌కు సంబంధించి చెప్పాల్సివస్తే ఒకరిద్దరు సభ్యులు, ముఖ్యంగా సోమశేఖర్ లాంటి వారు ఏం చేస్తారని అనుకున్నామో అదే చేశారు. కొంత మంది దృఢమైన సిద్ధాంతాలతో రాజకీయాల్లోకి వస్తే మరికొందరికి అటువంటివి ఏమీ ఉండవు. ఇది ప్రక్రియలో ఒక భాగం. నమ్మకాలూ, సిద్ధాంతాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే కొంతమందికి ముఖ్యం. అలాంటి వారితో కలిసి పని చేస్తే ఇదే జరుగుతుంది. బిజెపిని మరింత కలవరపెడుతున్నది రాజ్యసభ ఎన్నికల ఫలితం కాదు, ఫలితాల ప్రకటన అనంతరం ఏమి జరిగిందనేది. కాంగ్రెస్ కార్యకర్తలు, కొంతమంది నసీర్ హుస్సేన్ మద్దతుదారులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడం ప్రారంభించారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేశాము. మేము ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ స్థాయి ఇప్పటికే అధ్వాన్నం. రాజ్యసభలో కాంగ్రెస్ విజయం సందర్భంగా పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడం కాంగ్రెస్ స్థాయిని అధఃపాతాళానికి చేర్చింది. కర్ణాటక ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు, ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతారు.

ప్ర: ఈ సంఘటనకు సంబంధించిన వీడియో-ఆడియోలో ‘నసీర్ సాబ్ జిందాబాద్’ అనే నినాదం ఉందని బెంగుళూరు పోలీసులు చెబుతున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కూడా దీన్ని విశ్లేషిస్తోందని, పాక్ అనుకూల నినాదాలు నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సభాముఖంగా చెప్పారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ బిజెపి మరింత ఒత్తిడి తెస్తుందా?

జ: ఇది వైరల్ వీడియోలో స్పష్టంగా ఉంది, నినాదాలు ఏమిటో చాలా స్పష్టంగా ఉన్నాయి. వారికీ క్లీన్ చిట్ ఇవ్వాలని కాంగ్రెస్ స్థానిక పోలీసులపై ఒత్తిడి తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాంగ్రెస్ డీఎన్‌ఏలో బుజ్జగింపు రాజకీయాలు భాగం. ఇది భారత వ్యతిరేక డిఎన్ఏ. దేశ విభజనకు మూల కారణం కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ కార్యక్రమంలో భారత వ్యతిరేక లేదా పాకిస్థాన్ అనుకూల నినాదాలు వినిపించడంలో ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ నైజమే అది.

ప్ర: రాజ్యసభ ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి మళ్లీ ఎలా పుంజుకుంటుంది? లోక్‌సభ ఎన్నికలకు ముందు శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా విజయం సాధించగలిగింది?

జ: లోక్‌సభ ఎన్నికలు పూర్తిగా భిన్నమైనవి. లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి, జాతీయ స్థాయిలో బిజెపికి, దేశంలో రాబోయే 25 ఏళ్ల పాలనకు ప్రజలు ఓటు వేస్తారు. కర్నాటకలోని అన్ని ప్రాంతాలలో ప్రధానమంత్రికి అత్యంత ప్రజాదరణ ఉంది. ఆయనను రాష్ట్రం మొత్తం నిష్కళంక నాయకుడిగా అభిమానించి ఆరాధిస్తుంది. కర్ణాటకలో బిజెపి కనీసం 25 సీట్లను దాటుతుందని నేను చాలా నమ్మకంగా చెప్పగలను.

ప్ర: దక్షిణ భారతదేశంలో బిజెపికి 50 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రధాని మోదీ. దీనికి చిట్కా ఏమిటి?

జ: కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లేదా మధ్యప్రదేశ్‌లో బిజెపి చిట్కా కార్యకర్తల కృషి, స్పష్టమైన నాయకత్వం, నాయకుల చిత్తశుద్ధి. ఇంతకు ముంచి చిట్కాలు, మంత్రాలు ఏమీ లేవు. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బిజెపి కార్యకర్తలు కష్టపడి పని చేస్తున్నారు. కర్నాటకలో పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అదే ఫలితాన్ని ఇస్తుంది. ప్రధానమంత్రి ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తెచ్చారు. ప్రజలు దానిని ప్రత్యక్షంగా చూస్తున్నారు, అనుభూతి చెందుతున్నారు. ప్రజలు గత ప్రభుత్వాలకు, ఈ ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని అనుభవిస్తున్నారు. దానిని ప్రదర్శించడానికి ప్రకటనలు అవసరం లేదు.

ప్ర: ఎన్ మన్, ఎన్ మక్కళ్ వంటి దక్షిణ భారతదేశంలో ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులు దక్షిణాదిలో బిజెపికి ఎలా సహాయపడ్డాయి?

జ: ఎన్ మన్, ఎన్ మక్కళ్ యాత్ర అనేది ప్రధానమంత్రి సందేశాన్ని స్థానికంగా అట్టడుగు స్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లే కార్యక్రమం. తమిళనాడులో అన్నామలై నాయకత్వంలో బిజెపి మళ్లీ పుంజుకుంది. ప్రధాని మోదీ హయాంలో తమిళనాడు చూసిన అభివృద్ధి ప్రజలను మళ్లీ ఉత్తేజపరుస్తుంది. కేరళ సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలతో ఇదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ బిజెపి తన ఓట్ల శాతాన్ని పెంచుకుంటుంది. ఇది బిజెపికి ఓట్లు, సీట్లుగా మారనుంది.

ప్ర: వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయకపోవడంపై ప్రధాని మోదీ ఓ ప్రకటన చేశారు. కేరళలో ప్రత్యర్థులైన కాంగ్రెస్‌, వామపక్షాలు బయట ఎలా మిత్రులవుతారని ఆయన ప్రశ్నించారు. వాయనాడ్‌లో వ్యతిరేకత కారణంగా రాహుల్ మరో స్థానం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారని మీరు భావిస్తున్నారా?

జ: కాలేజీల్లో విజిటింగ్ ప్రొఫెసర్ల గురించి మనం విన్నాం. అలాగే రాహుల్ గాంధీ విజిటింగ్ ఎంపీ. ఆయన అమేథీలో ఎలా విజిటింగ్ ఎంపీగా ఉన్నాడో వాయనాడ్ లో కూడా అంతే. ప్రజలు తమ నియోజకవర్గాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించే, ప్రజల సంక్షేమం కోసం సమయాన్ని, శక్తిని వెచ్చించే ఎంపీలను కోరుకుంటున్నారు. అది లేనప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్లు ఎప్పటికప్పుడు కొత్త నియోజకవర్గాలను వెతుక్కుంటూ పోతారు. దక్షిణ భారతదేశం ఈసారి బిజెపికి కోటగా మారబోతోంది. రాహుల్ గాంధీకి మరో వయనాడ్ ఉండదు

ప్ర: దక్షిణ భారతదేశంలో బిజెపి ఎన్ని సీట్లు గెలుస్తుంది?

జ: దక్షిణాదిలో బిజెపి ఈ సారి ఇంతకు ముందు ఎన్నడూ గెలుచుకోనన్ని స్థానాలు గెలుచుకోనుంది.

ప్ర: చాలా లౌక్యంతో కూడిన సమాధానం…

జ: దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఎన్నికలకు వెళ్లేందుకు, మళ్లీ ప్రధానిపై విశ్వాసం వ్యక్తం చేసేందుకు ఎదురుచూస్తున్నారని మాకు చాలా స్పష్టంగా తెలుసు. మీరు ఈసారి దక్షిణ భారతదేశం నుండి ఒక చారిత్రాత్మక ప్రజాతీర్పును చూస్తారు.