భాగ్యనగరంలో మరో టూరిస్ట్ అట్రాక్షన్
హైదరాబాద్ సిగలో మరో టూరిస్ట్ అట్రాక్షన్ కొలువు దీరింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో ‘‘కోహినూర్ కథ’’ భాగ్యనగరవాసులను, పర్యాటకులను విశేషంగా అలరిస్తుంది. హుస్సేన్‌సాగర్ అలలపై పడే ప్రతిబంబంతో రూపొందించిన ఈ షో అందరినీ కనువిందు చేస్తోంది. మనదేశంలో అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. మార్చ్ 12న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో ‘‘కోహినూర్ కథ’’ను ప్రారంభించి, ప్రజలకు అంకితం చేశారు. తెలంగాణ నుంచి మొదలైన కోహినూర్ కథ భిన్న సంస్కృతులు, వివిధ ఖండాలను దాటిన ప్రయాణాన్ని వాటర్ స్క్రీన్ పై రంగు రంగుల లేజర్ వెలుతురులో అందంగా వివరిస్తున్నారు. ఈ కథను రాజ్యసభ సభ్యుడు, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో ప్రముఖ రచయిత ఎస్.ఎస్. కంచి రాశారు. ప్రముఖ నేపథ్య గాయని సునీత గాత్రాన్ని అందించగా, ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించారు. ఈ షో ద్వారా ఈ ప్రాంత చరిత్రను ఆడియో, విజువల్ మీడియా ద్వారా ఆక్వా స్క్రీన్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ తో అందంగా చూపిస్తున్నారు. దీనికి ఫౌంటేన్ షో సింక్రనైజ్ చేసి, చక్కటి మ్యూజిక్ కూడా జోడించడంతో షో చాలా ఆకర్షణీయంగా ఉంది. కేంద్ర పర్యాటక శాఖ సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ లో భాగంగా రూ.50 కోట్లతో ఈ షోను ఏర్పాటు చేసింది.
ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘హైదరాబాద్ భారతదేశంలోని అత్యుత్తమ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. అందుకే భాగ్యనగరాన్ని చూడటానికి వచ్చే పర్యాటకులకు అపూర్వమైన అనుభూతిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో నగరవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాం. ఇందులో ఇప్పుడు ప్రారంభించుకుంటున్న లేజర్ షో ఒకటి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అక్కడి చారిత్రక ప్రాధాన్యతను వివరిస్తూ సౌండ్ అండ్ లైట్ షోస్ ఉన్నాయి. కానీ.. ఓ చెరువు అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి. కోహినూర్ కథతో పాటు తెలంగాణ కథ, సంస్కృతి, దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఈ షోను డిజైన్ చేశారు. ఈ షో పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది.’’ అని అన్నారు. ఈ ప్రాజెక్టులో మ్యూజికల్ ఫౌంటేన్ సిస్టమ్ (ఇంటెలిజెంట్ లైటింగ్), ప్రొజెక్షన్ సిస్టమ్, ఆడియా సిస్టమ్, షో కంట్రోల్ సిస్టమ్, ఆర్టిస్టిక్ డైరెక్షన్, కంటెంట్, ఆర్ట్ ప్రొడక్షన్, 500 మంది కూర్చునే ఏర్పాట్లు, ఫౌంటేన్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్, ఫౌంటేన్ ఇన్ స్టలేషన్, ఫ్లోటింగ్ స్ట్రక్చర్, అడ్వయిర్టయిజ్ మెంట్, సైనేజ్, ప్రచార సామాగ్రి, రూఫ్ టాప్ ఓపెన్ గ్లాస్ రెస్టారెంట్, ఇతర వసతులున్నాయి.