తెలంగాణలో మరో 6 స్థానాలు ఖరారు
బిజెపి లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితాలో తెలంగాణ నుంచి మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మార్చ్ 13న విడుదల చేసిన మలి జాబితాలో మహబూబ్‌నగర్‌కు డి.కె. అరుణ, మెదక్‌కు రఘునందన్ రావు, ఆదిలాబాద్‌కు గోడం నగేశ్, నల్గొండకు శానంపూడి సైదిరెడ్డి, మహబూబాబాద్‌కు సీతారాంనాయక్, పెద్దపల్లికి గోమాసె శ్రీనివాస్ లను అభ్యర్థులుగా ప్రకటించారు. తొలి జాబితాలో… సికింద్రాబాద్‌కు కిషన్‌రెడ్డి, కరీంనగర్‌కు బండి సంజయ్ కుమార్, నిజామాబాద్‌కు ధర్మపురి అర్వింద్, చేవెళ్లకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మల్కాజిగిరికి ఈటల రాజేందర్, భువనగిరికి డా. బూర నర్సయ్యగౌడ్, జహీరాబాద్‌కు బీబీ పాటిల్, నాగర్‌కర్నూల్‌కు భరత్ ప్రసాద్, హైదరాబాద్‌కు మాధవీలత పేర్లు ఖరారు చేశారు. ఇప్పటి వరకు 17 స్థానాలకు గాను 15 చోట్ల అభ్యర్థులను ప్రకటించారు. ఖమ్మం, వరంగల్ టికెట్లను ప్రకటించాల్సి ఉంది.
రెండో జాబితాలో 72 మంది అభ్యర్థులు
బిజెపి రెండో జాబితాలో 72 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వారికి ఇందులో స్థానం కల్పించింది. దాద్రానగర్ హవేలి నుంచి 1, దిల్లీ నుంచి 2, గుజరాత్ నుంచి 7, హరియాణా నుంచి 6, హిమాచల్ ప్రదేశ్ నుంచి 2, కర్ణాటక నుంచి 20, మధ్యప్రదేశ్ నుంచి 5, మహారాష్ట్ర నుంచి 20, తెలంగాణ నుంచి 6, త్రిపుర నుంచి 1, ఉత్తరాఖండ్ నుంచి 2 స్థానాలను ప్రకటించారు. దీంతో తొలి జాబితాలో ప్రకటించిన 195 మందితో కలిపి ఇప్పటివరకూ 267 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది.
తాజా జాబితాలో 10మంది మంత్రులకు, ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులకు చోటు దక్కింది. ఇప్పటిదాకా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తొలిసారి లోక్‌సభ బరిలో దిగుతున్నారు. ముంబయి నార్త్ నుంచి పోటీ చేస్తున్నారు. నాగ్‌పుర్‌లో గడ్కరీ పోటీ చేయనున్నారు. బీడ్‌లో పంకజ ముండేకు టికెట్ దక్కింది. కర్ణాటకలోని 28 సీట్లకుగానూ 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. యువ ఎంపీ తేజస్వీ సూర్య బెంగళూరు సౌత్ నుంచే బరిలోకి దిగుతున్నారు. మైసూరులో రాజ కుటుంబానికి చెందిన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్‌ను రంగంలోకి దింపారు. బళ్లారిలో మాజీ మంత్రి బి.శ్రీరాములుకు అవకాశమిచ్చారు. యడియూరప్ప తనయుడు బీవై రాఘవేంద్ర శివమొగ్గ నుంచి బరిలోకి దిగుతున్నారు.
కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి, అనురాగ్ ఠాకుర్, రావ్ ఇంద్రజిత్ సింగ్, కృష్ణపాల్ గుర్జర్, భగవంత్ కూబా, శోభా కరంద్లాజే, భారతీ ప్రవీణ్ పవార్, కపిల్ మోరేశ్వర్ పాటిల్, రావు సాహెబ్ దాన్వేలకు మరోసారి అవకాశం లభించింది. హరియాణా, కర్ణాటక, ఉత్తరాఖండ్ మాజీ సీఎంలు మనోహర్‌లాల్ ఖట్టర్, బసవరాజ్ బొమ్మై, త్రివేంద్రసింగ్ రావత్‌లకు టికెట్లిచ్చారు. ఇప్పటిదాకా బిజెపి ప్రకటించిన 2 జాబితాల్లో కలిపి 34 మంది కేంద్రమంత్రులకు టికెట్లు దక్కాయి. ఐదుగురు మాజీ సీఎంలు బరిలో నిలిచారు.