శక్తి స్వరూపిణిల రక్షణకు ప్రాణాలు అడ్డుపెడతా: మోదీ
శక్తిని పూజించేవారికి.. శక్తిని నాశనం చేస్తామనేవారికి మధ్య రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ జరుగుతోందని, విజేత ఎవరో జూన్ 4న తెలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తనను భరతమాత పూజారిగా అభివర్ణించుకున్న మోదీ శక్తి స్వరూపిణిలను రక్షించుకునేందుకు ప్రాణాలను అడ్డుపెడతానని స్పష్టం చేశారు. ఇండియా కూటమి ర్యాలీ ముగింపు సందర్భంగా ముంబయిలో విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ‘శక్తి’ని అంతం చేస్తామని వారు పేర్కొనడంపై మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంతమంది శక్తి స్వరూపిణిలు అయిన మహిళలు నన్ను ఆశీర్వదించేందుకు వచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. ఇక తెలంగాణను దోచుకున్న వాళ్లను వదిలిపెట్టేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ ఇచ్చే గ్యారంటీ అని తెలిపారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందని.. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించారు. ఇక్కడ దోచుకున్న సొమ్ము దిల్లీ చేరుతోందని ధ్వజమెత్తారు. దోపిడీదారులు.. ఇతర దోపిడీదారుల అవినీతిని ప్రశ్నించలేరని.. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కుంభకోణాలపై మాట్లాడిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిపై నోరుమెదపడం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఒకదానినొకటి కాపాడుకుంటూ.. ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకుంటూ తప్పుల్ని వెనకేసుకు వస్తున్నారని దుయ్యబట్టారు. మార్చ్ 18న జగిత్యాలలో జరిగిన బిజెపి విజయ సంకల్ప సభలో ప్రధాని ప్రసంగించారు.
‘‘మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర రాయాలి. ఈ ఎన్నికలు దిల్లీలో మోదీ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు జరుగుతున్నవి. తెలంగాణలో బిజెపికు మద్దతు పెరుగుతోంది. దీనికి జగిత్యాల సభే నిదర్శనం. ఇటీవల తక్కువ కాలంలోనే రెండుసార్లు తెలంగాణకు వచ్చాను. ఈ సందర్భంగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడంతోపాటు పలు శంకుస్థాపనలు చేశాం. తెలంగాణ అంతటా అభివృద్ధి జరగాలి. అందుకోసమే రాష్ట్రం నలుమూలల నుంచీ బిజెపికు మద్దతు పెరుగుతోంది. ఓటింగ్ తేదీ దగ్గరకు వస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చాప చుట్టేస్తున్నాయి. అభివృద్ధి భారత్ కోసం, ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థ కోసం, పేదల అభ్యున్నతికి, రైతుల సంక్షేమానికి, యువత, మహిళా సాధికారతకు, ఆత్మనిర్భర్ భారత్ కోసం బిజెపికు 400 సీట్లు దాటాలి. అందుకే అంతా బిజెపికు ఓటేయాలి.
తెలంగాణ భూమి ఆంగ్లేయులతో పోరాడింది. రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా ఉద్యమించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్లను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల బంధాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాళేశ్వరం కుంభకోణంలో కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలియదు? మరోవైపు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలూ మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి. పగలూరాత్రీ మోదీ నామస్మరణే చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కలలను చిదిమేసింది.. బీఆర్ఎస్ విశ్వాస ఘాతుకానికి పాల్పడింది. బిజెపికు తెలంగాణలో ఎన్ని ఎక్కువ సీట్లు వస్తే నేను అంత శక్తిమంతుడిని అవుతా. సేవ చేయడంలో నేను తక్కువ చేశానా? పదేళ్లలో దేశ అభివృద్దికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశాం. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం. ఉపాధి అవకాశాలు పెంపొందించాం. 4 కోట్ల ఇళ్లను నిర్మించాం. 12 కోట్లకుపైగా కుటుంబాలకు రక్షిత మంచినీరు ఇచ్చాం. 25 కోట్ల మందిని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తెచ్చాం. తెలంగాణలో కూడా 11 లక్షల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. 30 లక్షల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రూ.6 వేల చొప్పున ఇస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా అమలు చేస్తున్నాం. 2015లో ధాన్యం ధర క్వింటాకు రూ.1,300 ఉంటే రూ.2,200కు పెంచాం. తెలంగాణ నుంచి లక్షా 30 వేల టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొన్నది. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేశాం. ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం నిజాం చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించలేదు. కానీ, కేంద్రం రూ.6,500 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించి తెలంగాణకు, దేశానికి ఎరువులను సరఫరా చేస్తోంది. జాతీయ రహదారులు సహా తెలంగాణలో మౌలిక సదుపాయాలను పెంచాం. ప్రపంచ దేశాల్లో భారత్ గురించి చర్చ జరుగుతోంది. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో తెలుగువారు మంచి స్థానాల్లో ఉన్నారు. ప్రపంచ దేశాల్లో మన దేశం గౌరవం పెరిగిందా? లేదా? అని వారిని అడగండి. భవిష్యత్తులో రైల్వే మౌలిక సదుపాయాలు ఇంకా పెరగాలి. డిజిటల్ సాంకేతికత గ్రామగ్రామానికీ చేరాలి. గ్రామీణ ప్రాంతాల్లో గిడ్డంగుల నిర్మాణం పెరగాలి. ఇళ్లపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకుని జీరో విద్యుత్ బిల్లుల దిశగా సాగాలి.
దేశాన్ని దోచుకునేందుకే కుటుంబ పార్టీలు రాజకీయాల్లోకి వచ్చాయి. చరిత్రను చూస్తే అతిపెద్ద కుంభకోణాల వెనుక ఏదో ఒక కుటుంబ పార్టీ ఉంటుంది. లక్షల కోట్ల 2 జీ స్పెక్ట్రమ్ స్కాం వెనుక డీఎంకే కుటుంబం, నేషనల్ హెరాల్డ్ కుంభకోణం వెనుక కాంగ్రెస్ పార్టీని నడిపే కుటుంబం పేర్లు బయటకు వచ్చాయి. బోఫోర్స్ స్కాం వెనుక ఎవరి పేరు బయటకు వచ్చిందో అందరికీ తెలుసు. బిహార్ దాణా కుంభకోణం, ఉద్యోగాల స్కాం, భూ కుంభకోణంలో ఆర్జేడీ పార్టీని నడిపేవారి కుటుంబం పేరు బయటకు వచ్చింది. కుటుంబ పాలనలో అవినీతికి గురైన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. బీఆర్ఎస్.. కాళేశ్వరం కుంభకోణానికి పాల్పడింది.. దిల్లీ మద్యం కుంభకోణంలో కమీషన్లు తీసుకుంది.
సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నా మాటలు తెలుగులోనూ వినొచ్చు. సామాజిక మాధ్యమైన ‘ఎక్స్’లో ‘నమో’ అని తెలుగులో ఎంటర్ చేస్తే మీ సేవకుడు తెలుగులో మాట్లాడతారు. అందులో తప్పులు ఉంటే మీరు చెప్పండి.. మీరే నా గురువులు. ఎవరైనా పొరపాటు చేస్తే.. మోదీ నా జేబులో ఉన్నారని చెప్పండి. బిజెపికు 400కుపైనే సీట్లు వస్తాయని దేశమంతా చెబుతోంది. తెలంగాణలోనూ మెజారిటీ సీట్లు ఇవ్వాలి. జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తవుతుంది. జూన్ 4న కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మరోసారి ఏర్పడుతుంది. వచ్చే దశాబ్దంలో తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్ర అభివృద్ధికి నేను గ్యారంటీ.’’ అని ప్రధాని పేర్కొన్నారు.
ఉజ్వల భవిష్యత్తు కోసం మోదీ ప్రధాని కావాలి: కిషన్ రెడ్డి
ప్రధాని మోదీ రాష్ట్రానికి పదేళ్లు అండగా నిలబడ్డారని.. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి తెలంగాణ సమాజానికి మరింత అభివృద్ధిని అందిస్తారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పారు. విశ్వనాయకుడిగా మోదీ అన్ని దేశాలకు ఆదర్శంగా నిలిచారని.. నీతిమంతమైన పాలనను బిజెపి సర్కారు అందిస్తోందన్నారు. మోదీ సేవల్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారని.. ఆయన్ని మరోసారి పీఎంగా చేయాలనే కాంక్షతో ఈ ఎన్నికల్లో 17కు 17 స్థానాలు గెలిపిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. రాష్ట్రంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందని.. కాళేశ్వరం, గొర్రెల పంపిణీ, దళితబంధు.. ఇలా అన్ని పథకాల్లో అవినీతి కనిపించిందని ఆరోపించారు. ఇది చాలదన్నట్లు లిక్కర్ దందాలో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ అయ్యారని, తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితుల్ని తీసుకొచ్చారని విమర్శించారు. దేశం కోసం.. యువత ఉజ్వల భవిష్యత్తు కోసం మరోసారి మోదీ ప్రధాని కావాలన్నారు.
మోదీ హయాంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: లక్ష్మణ్
రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. మూడోసారి మోదీ ప్రధాని కావాలని దేశం ఎదురు చూస్తోందన్నారు. మోదీ హయాంలోనే భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వంద రోజుల్లో పూర్తి చేస్తామన్న హామీలు నెరవేర్చలేదని.. దీనిపై ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. ప్రజల్ని ముఖ్యమంత్రి మోసం చేశారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ 14 సీట్లు గెలవకపోతే ఆయనే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఈ సభలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్, నిజామాబాద్, పెద్దపల్లి బిజెపి అభ్యర్థులు ధర్మపురి అర్వింద్, గోమాసె శ్రీనివాస్, ఇతర నేతలు పాల్గొన్నారు.