ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తాం: అమిత్ షా
బిజెపిని గెలిపిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ముస్లింలకు అమలు చేసిన 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈ వాటాను రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తక్కువ సమయంలోనే తెలంగాణను దిల్లీకి ఏటీఎంగా మార్చిందని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసిపోయాయని ఆరోపించారు. బీఆర్ఎస్ అనేక కుంభకోణాలకు పాల్పడిందన్నారు. ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్, భూ కుంభకోణాలపై కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏప్రిల్ 25న నిర్వహించిన విశాల జనసభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. మెదక్ నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుకు వేసే ఓటు మోదీని తిరిగి ప్రధానిగా చేసేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంటేనే తెలంగాణలో సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా చేస్తే తెలంగాణలో అవినీతిని అంతం చేస్తారని ప్రకటించారు. ‘‘రాష్ట్రంలో 12 స్థానాల్లో బిజెపిని గెలిపించండి. మజ్లిస్ పార్టీకి భయపడి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించలేదు. కానీ బిజెపికి మజ్లిస్ అంటే భయం లేదు. అందుకే సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా మోదీకి 400 సీట్లను ఇవ్వండి. పదేళ్లలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపింది. ఐదేళ్లలో రామమందిరం కేసు గెలవడమే కాకుండా అయోధ్యలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన.. విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి అందరూ జై శ్రీరాం అనేలా చేశాం. మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్‌ను శాశ్వతంగా భారతదేశంలో అంతర్భాగం చేసింది’’ అని అమిత్‌షా వివరించారు.
బిజెపి అభ్యర్థి ఎం.రఘునందన్‌రావు మాట్లాడుతూ మోసానికి పర్యాయపదమే కాంగ్రెస్ అని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, పింఛనుదారులకు రూ.4 వేలు, మహిళలకు నెలకు రూ.2,500 సాయం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ప్రజలను ఆ పార్టీ వంచించిందని అన్నారు. బీసీలకు అది అన్యాయం చేసిందని జిల్లా నుంచి బీసీ ఎమ్మెల్యేకు క్యాబినెట్లో స్థానం కల్పించలేదన్నారు. దుబ్బాక, ఇతర ప్రాంతాల్లో బిజెపి చేపట్టిన అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుగులో రాసిన పుస్తకం పోస్టు చేశానని చెప్పారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ హయాంలో కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు ప్రాజెక్టులు నిర్మించారన్నారు. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయానని తనను విమర్శించే నాయకులు.. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయిన విషయాన్ని గుర్తించాలన్నారు. రిజర్వేషన్లను తొలగిస్తారంటూ బిజెపిపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమకే దక్కిందన్నారు. సిద్దిపేట, గజ్వేల్‌కు రైలు తెచ్చిన ఘనత కూడా తమదేనని అన్నారు. బిజెపిని ఓడించేందుకు సీఎం, మాజీ మంత్రి రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి కేసీఆర్ కాళ్లు మొక్కి 2021లో ఎమ్మెల్సీ అయ్యారని, అప్పటి నుంచి జిల్లా ప్రజల కోసం ఒక్క రూపాయి వెచ్చించలేదని, ఎంపీగా గెలిచిన తరువాత రూ.100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తానని చెబుతున్నారని విమర్శించారు. ఈ సభలో బిజెపి రాష్ట్ర నేత ఈటల రాజేందర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు జి.మోహన్‌రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు.