తెలంగాణలో డబుల్ డిజిట్ దిశగా బిజెపి, ఓటమి దిశగా కాంగ్రెస్, వాషౌట్ దిశగా బీఆర్ఎస్
2024 లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వీస్తున్న మోదీ గాలితో తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో బిజెపి 12 స్థానాలకు పైగా గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ముందు నుంచే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. రాష్ట్ర రాజకీయాల్లో మూడు పార్టీలు పోటీ పడుతున్న పరిస్థితుల్లో ఇటు అధికార ఎన్డీఏలోనూ, అటు ప్రతిపక్ష ఇండీ కూటమిలోనూ చేరలేని బీఆర్ఎస్ ప్రజల దగ్గరకు వెళ్లి ఏమని ఓట్లు అడగాలో తెలీని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇది గమనించి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు కేసీఆర్ టికెట్ హామీ ఇచ్చినప్పటికీ, కొన్ని ప్రకటించినప్పటికీ, నాకు మీ టికెటొద్దు, మేం బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలవలేం… అని ఇతర పార్టీలను వెతుక్కున్నారు. మాజీ మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్ కొడుకులు బీఆర్ఎస్ లోనే ఉండి పోటీ నుంచి తప్పుకోవడం గులాబీ పార్టీ ఓటమి ఖాయమనడానికి నిదర్శనం. బీఆర్ఎస్ కు ఒక్క ఓటు వేసినా వేస్టు, ఒక్క సీటు వచ్చినా దండగే అని మొదట్లోనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. దమ్ముంటే ఒక సీట్ గెలిపించుకో అంటూ రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ కు చాలెంజ్ చేశారు. ఇవి బీఆర్ఎస్ కు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఉంది.
గత నవంబర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మీదున్న తీవ్ర వ్యతిరేకతకు తోడు, బూటకపు హామీలతో, గారడీ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ హామీలు అమలు అసాధ్యమనే విషయాన్ని 4 నెలలు దాచిపెట్టడంలో కూడా వైఫల్యం చెందింది. మహిళలకు ఉచిత బస్సు మినహా 400కు పైగా ఇచ్చిన హామీల్లో రేవంత్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయింది. మహిళలకు ఉచిత బస్సు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, సాగు నీరు, విద్యుత్ కొరతతో ఎండిన పొలాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడం, రైతు భరోసా పోగా రైతు బంధు కూడా సకాలంలో ఇవ్వలేక, పంటలు కూడా సకాలంలో కొనలేక, అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతుంటే క్వింటాల్ కు రూ.500 బోనస్ కూడా గాలికి వదిలేసిన కాంగ్రెస్ రాష్ట్రంలో అన్ని వర్గాలను పూర్తిగా నిరాశపర్చింది. వీటికి తోడు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాష్ట్ర నాయకుడు అద్దంకి దయాకర్, స్వయాన రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేక ప్రకటనలు, ఉపన్యాసాలు, ఇంకనూ కాంగ్రెస్ ఓవర్సీస్ అధ్యక్షుడు సామ్ పిట్రోడా దేశవిచ్ఛిన్నకర, జాత్యహంకార వ్యాఖ్యలతో తెలంగాణ సహా యావత్ దేశంలో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను ఏమాత్రం నమ్మలేక, ఆ పార్టీకి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ కు మూణ్నాలుగు స్థానాలు రావడం కూడా కష్టమే. 2004-14 పది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో దేశవ్యాప్తంగా జరిగిన అనేక బాంబ్ బ్లాస్టులు, కుంభకోణాలు, మహిళలపై అసంఖ్యాక దాడులతో అధికారంతో పాటు ప్రతిపక్ష స్థానాన్ని కూడా కాంగ్రెస్ కోల్పోయింది. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అఖండ విజయం సాధించి, తదుపరి 2019 ఎన్నికల్లో బలాన్ని మరింత పెంచుకొని, దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, శతాబ్దాల కల అయోధ్య రామ మందిర నిర్మాణంలను సాధించింది. దేశంలో శాంతిభద్రతల పరిస్థితిని అద్భుతంగా మెరుగుపర్చింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11 నుంచి 5వ స్థానానికి ఎగబాకింది. రక్షణ రంగంలో పని చేస్తున్న త్రివిధ దళాలకు ఓఆర్ఓపి నుంచి రఫెల్ యుద్ధ విమానాల వరకు సమకూరుస్తూ ఆత్మ నిర్భర్ భారత్ తో దేశీయంగా రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను పెంచుతూ, దిగుమతులు తగ్గించుకుంది. మేకిన్ ఇండియాతో అన్ని రకాల వాహనాలతో పాటు మొబైల్ ఫోన్ ల ఉత్పత్తిలో ప్రపంచంలో ఎన్నో స్థానాలు ఎగబాకింది.
హిందూ వ్యతిరేక మైనార్టీ బుజ్జగింపు పార్టీల వికృత క్రీడలను బిజెపి, ఇతర దేశభక్త సంస్థలు బహిరంగపర్చగా, యావత్ హిందూ సమాజంలో మునుపెన్నడూ లేని చైతన్యం, ఐక్యమత్యం వెల్లివిరుస్తోంది. గత 23 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా, రోజుకు 18 గంటలు అవిశ్రాంతంగా శ్రమిస్తూ దేశంలో అన్ని వర్గాలకు, ముఖ్యంగా కింది స్థాయి వర్గాలకు గౌరవం కల్పిస్తున్న మోదీతో ఈ ఎన్నికల్లో ఎన్డీఏకి ‘అబ్కీ బార్ 400 పార్’ స్థితికి చేర్చింది. లోక్ సభ ఎన్నికల్లో మిగతా పార్టీల కన్నా ముందుగానే బిజెపి అభ్యర్థులను ప్రకటించి, సంకల్ప పత్రం ప్రజల ముందుంచింది. మోదీ గాలితో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఘోర వైఫల్యాలను ఆసరాగా చేసుకొని, తెలంగాణలో ఎవరూ ఊహించని స్థాయిలో లోక్ సభ స్థానాలు గెలిచే దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. మే 9న రాహుల్ గాంధీ సరూర్ నగర్ బహిరంగ సభలో 30వేల కుర్చీలు వేసినా 3వేల మంది కూడా రాకుంటే స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డుపై జనాలను లోపలికి తీసుకుపోయే పరిస్థితి ఏర్పడింది. వేములవాడలో ఉదయం 10 గంటలకు సభ పెట్టినా, వరంగల్ లో మధ్యాహ్నం పెట్టినా, హైదరాబాద్ లో సాయంత్రం పెట్టినా బిజెపి సభలకు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. తెలంగాణలో బిజెపికి డబుల్ డిజిట్, కాంగ్రెస్ కు ఓటమి, బీఆర్ఎస్ వాషౌట్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.