Amit Shah Boora Narsiah

కుటుంబ సంక్షేమమా.. దేశ ప్రగతా…

Amit Shah at Bhongirప్రస్తుత ఎన్నికలు ఓట్‌ ఫర్‌ జిహాద్‌, ఓట్‌ ఫర్‌ వికాస్‌లకు మధ్య.. కాంగ్రెస్‌ కుటుంబ సంక్షేమానికి, దేశ ప్రగతికి మధ్య.. రాహుల్‌ గాంధీ పిల్ల చేష్టలకు, మోదీ అభివృద్ధి గ్యారంటీలకు మధ్య జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. దేశంలో ఎక్కడ చూసినా మోదీ నినాదమే కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్, మజ్లిస్‌ పార్టీలు ముస్లింల బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని.. షరియత్‌, ఖురాన్‌ ఆధారంగానే తెలంగాణలో పాలన సాగుతోందని ఆరోపించారు. భువనగిరి బిజెపి అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు మద్దతుగా మే 9న భువనగిరి పురపాలిక పరిధిలోని రాయగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్‌షా ప్రసంగించారు.

‘‘ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్‌ ఎన్నటికీ నెరవేర్చదు. మోదీ అయితే ఏం చెబితే అది తప్పకుండా చేస్తారు. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్‌ గాంధీ అన్నారు. చేయలేదు. ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. 70 ఏళ్లుగా కాంగ్రెస్‌ అయోధ్య రామమందిరాన్ని ఓట్ల కోసం వినియోగించుకుంది. మోదీ మాత్రం రామమందిర నిర్మాణం వాగ్దానాన్ని నెరవేర్చారు. అక్కడ 370 ఆర్టికల్‌ను తొలగించి.. 24 గంటలూ జాతీయ పతాకం ఎగిరేలా ప్రధాని మోదీ సంకల్పం చేశారు.

ముస్లిం బుజ్జగింపు రాజకీయాల్లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్, మజ్లిస్‌ ఒక్కటే. మైనార్టీల సంతుష్టీకరణలో అవి ఏబీసీల్లా పనిచేస్తున్నాయి. ఏ అంటే అసదుద్దీన్‌, బీ-బీఆర్ఎస్, సీ-కాంగ్రెస్‌. మజ్లిస్‌ను నిలువరించడం బీఆర్ఎస్, కాంగ్రెస్‌ వల్ల కాదు. అది కేవలం బిజెపితోనే సాధ్యం. హైదరాబాద్‌లో శ్రీరామనవమి ఊరేగింపును అడ్డుకున్నారు. తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించడం లేదు. ఇండీ కూటమి నేతలు సీఏఏని వ్యతిరేకిస్తున్నారు. ట్రిపుల్‌ తలాక్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రామమందిర ప్రతిష్ఠాపన ఆహ్వానాన్ని సైతం తిరస్కరించారు. వీరికి ఎందుకు ఓటేయాలి?

ప్రధాని మోదీ భువనగిరికి చాలా చేశారు. ఇక్కడి జౌళి పరిశ్రమ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. రూ.14 వేల కోట్లతో పోచంపల్లిలో టెక్స్‌టైల్‌ పార్కు, చేనేత పార్కులను ఏర్పాటు చేయబోతున్నాం. దీని ద్వారా రైతు కూలీలకు, రైతులకు లబ్ధి చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లతో తీసుకువచ్చిన జాతీయ టెక్స్‌టైల్‌ విధానం ద్వారా 8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బీబీనగర్‌లో ఎయిమ్స్‌ ఏర్పాటు ద్వారా నల్గొండ, భువనగిరి, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోని పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. జనగామ, భువనగిరి రైల్వేస్టేషన్‌లను పూర్తిస్థాయిలో ఆధునికీకరించనున్నాం. కొమురవెల్లిలో రైల్వేస్టేషన్‌ నిర్మిస్తాం. రాయగిరి నుంచి వరంగల్‌ వరకు ఇప్పటికే నాలుగు లైన్ల రైల్వే ట్రాక్‌ పూర్తయింది. సూర్యాపేట నుంచి సిద్దిపేట వరకు జాతీయ రహదారి నిర్మాణం వేగంగా సాగుతోంది’’ అని అమిత్‌షా అన్నారు.