ఎన్డీయేకు నిస్సందేహంగా 400కి పైగా సీట్లు
అన్ని దశల్లోను బిజెపికి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చారని, కచ్చితంగా ఎన్డీయే 400 సీట్లు దాటుతుందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. యూపీ, బెంగాల్, ఒడిశా, తెలంగాణలలో సీట్ల సంఖ్యను పెంచుకుంటామన్నారు. ఆంధ్ర, కేరళ, తమిళనాడులలో ఖాతా తెరుస్తామని, కొత్తగా సీట్లు గెలుచుకుంటామని తెలిపారు. భాష, భావజాలంతో నిమిత్తం లేకుండా దక్షిణ భారత ప్రజలు మోదీని అభిమానిస్తున్నారని తెలిపారు. దక్షిణ భారతంలో అతిపెద్ద పార్టీగా అవతరించబోతున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. తన వీడియోను వక్రీకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు తనకుందని స్పష్టం చేశారు. 75 ఏళ్ళ వయో పరిమితి బిజెపి నియమావళిలో ఎక్కడా లేదని, మోదీ మూడో పదవీకాలం పూర్తి చేసుకోవడమే కాకుండా, ఆ తర్వాత కూడా మమ్మల్ని నడిపిస్తారని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు అమలు చేసే వారు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేస్తున్నారని పునరుద్ఘాటించారు. ఒక జాతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు:
ప్ర: ఎన్నికల పర్వంలో సగానికి పైగా ముగిసింది. కానీ ఎలాంటి పవనాలు కనిపించడం లేదు. ఓటింగ్ కూడా తక్కువ నమోదైందని భావిస్తున్నారు. ఎన్డీయే 400 సీట్లను దాటుతుందని మీరు ఇప్పటికీ విశ్వసిస్తున్నారా లేదా అది అత్యంత భారీ లక్ష్యం అనుకుంటున్నారా ?
జ: కచ్చితంగా ఎన్డీయే 400 సీట్లు దాటబోతోంది. ఇందులో ఎటువంటి సందేహాలకూ తావులేదు. తక్కువ ఓటింగ్ శాతం గురించి ఆందోళన చెందాల్సింది ప్రతిపక్షాలు, మేం కాదు. బిజెపి కార్యకర్తలతో నేను జరిపిన సంభాషణల ఆధారంగా ఈ మాట చెబుతున్నాను. అత్యధిక సంఖ్యలో బిజెపి మద్దతుదారులు తమ ఓట్లను వేశారు… ప్రజలు ప్రతిపక్షం గురించి ఆలోచించడం లేదు, మా గురించే ఆలోచిస్తున్నారు. మాకు మెజారిటీ, సీట్లు పెరుగుతాయి.
అనుకూల పవనాలు లేకపోవడం విషయానికొస్తే, నేను 1975 నుంచి ఎన్నికలను గమనిస్తున్నాను. నేను చాలా చిన్న వయస్సు నుంచి రాజకీయ ప్రక్రియలను అధ్యయనం చేస్తున్నా. ఈ స్థాయిలో సానుకూల ఓటింగ్‌ను చూడడం ఇదే మొదటిసారి. ఇది అభివృద్ధికి ప్రజల ఆమోద ముద్ర. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, షేర్ మార్కెట్ వృద్ధి వంటి వాటిపై యువత ఎక్కడికక్కడ చర్చిస్తున్నారు. సంక్షేమం, సాధికారత పథకాలపై రైతుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. మరీ ముఖ్యంగా 60 కోట్ల మంది లబ్ధిదారుల సేన ప్రధాని నరేంద్ర మోదీకి అండగా నిలుస్తోంది. ఇది బిజెపి గెలుపునకు భరోసా ఇస్తుంది.
ప్ర: మీరు ఇప్పటికే మీ కంచుకోటల్లో గరిష్ట స్థాయిలో సీట్లు సంపాదించినప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయని అంత నమ్మకంగా ఎలా చెబుతారు? మీకు అక్కడ సీట్లు తగ్గుతాయేగాని పెరగవు. మీరు 400కి పైగా సీట్ల లక్ష్యాన్ని ఎలా చేరుకోగలరు?
జ: 2019 మార్చిలో బిజెపికి 300 సీట్లు వస్తాయని నేను చెప్పినప్పుడు మీరు నన్ను ఇదే ప్రశ్న అడిగారు. మరి మాకు నిజంగానే 300 వచ్చాయి. మేం యూపీ, బెంగాల్, ఒడిశా, తెలంగాణలలో మా సంఖ్యను పెంచుకోబోతున్నాం. ఆంధ్ర, కేరళ, తమిళనాడులలో కొత్తగా సీట్లు గెలుచుకోవడం, ఖాతా తెరవడం చేయబోతున్నాం. మేం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించబోతున్నాం. తూర్పు భారతంలోను, మొత్తం కోరమాండల్ ప్రాంతంలోను అద్భుతమైన విజయాలు సాధించబోతున్నాం.
ప్ర: అభివృద్ధి ఎజెండాతో ప్రారంభించిన బిజెపి ఎందుకు విభజనాత్మక రాజకీయాల వైపు మళ్లింది? మీరు ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి), వారసత్వ పన్ను గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఎక్కువ దృష్టి పెట్టారు. వివాదాస్పదమైన ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ ప్రతిపాదనకు కూడా చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు.
జ:ఎన్నికలు ఎప్పుడూ ఒకే అంశంపై ఉండవు. నేను ఒక దేశం-ఒకే ఎన్నిక ప్రజలను విభజించే విషయమని అనుకోవడం లేదు. ఇది ఎన్నికల సంస్కరణల దిశగా ఒక పెద్ద అడుగు. పదేపదే ఎన్నికలు అంటే ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు కూడా ఖరీదైన వ్యవహారం. అభివృద్ధి పనులకు తరచుగా అంతరాయం కలుగుతూ ఉంటుంది. ఇది దేశానికి మంచిది కాదు. యుసిసి 1950ల నుంచి మా మేనిఫెస్టోలో భాగం. పైగా ఇది బిజెపికి మాత్రమే సంబంధించిన అంశం కాదు. దీన్ని గురించి రాజ్యాంగ సభలో చర్చించారు. రాజ్యాంగం ఆదేశిక సూత్రాల్లో కూడా రాష్ట్రాలు, పార్లమెంట్ ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయాలని సూచించారు. విభిన్న విశ్వాసాలను పాటించే వారికి విభిన్న చట్టాలు ఉండడం లౌకికవాదానికి విరుద్ధం. కనుక యుసిసిని వ్యతిరేకించడం మతతత్వమే. మీరు వారసత్వపు పన్ను గురించి మాట్లాడుతున్నారు, అది కాంగ్రెస్ ఎజెండాలో భాగం. ఎన్నికల సమయంలో పార్టీలు పరస్పరం మేనిఫెస్టోలు, ఎజెండాలపై చర్చ జరపాల్సి ఉంటుంది. ఎన్నికలంటే ఆలోచనల మధ్య పోటీ. కనుక ఒక పార్టీ ఆలోచనలను, ఎజెండాల మంచి చెడ్డలను ఎన్నికల సమయంలో చర్చించడం అవసరం. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయి కాబట్టి మనం ఆక్రమిత కాశ్మీర్ గురించి మాట్లాడకూడదని ఇండీ కూటమి సభ్యులు చెప్పకపోతే, మేం దాని గురించి చర్చించే వాళ్ళం కాదు. ఇలాంటి ప్రమాదకరమైన ఆలోచనలను బిజెపి వ్యతిరేకిస్తోంది. మా వైఖరి ఏమిటో ప్రజలకు చెప్పాల్సి ఉంది.
ప్ర: కానీ మీరు ప్రభుత్వ విభాగాలకు వస్తువులు, సేవల సేకరణ (పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్) టెండర్లలో ముస్లింలకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని గురించి కూడా మాట్లాడుతున్నారు. మరోవైపు మతం-ఆధారిత రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్నారు.
జ: మత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనం కారణంగా ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు మాత్రమే రాజ్యాంగం రిజర్వేషన్లు అనుమతిస్తుంది. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసే వారు మతతత్వానికి, బుజ్జగింపులకు పాల్పడుతున్నట్టే. మేం రాజ్యాంగం ఏం చెబుతోంది అనే విషయాన్ని, ఈ తప్పులను సరిదిద్దేందుకు మా సంకల్పం గురించి మాత్రమే మేం వివరిస్తున్నాం.
ప్ర: రామమందిర నిర్మాణం వల్ల మీకు లభించాల్సిన మద్దతు చాలా వేగంగా కరిగిపోయిందనే అభిప్రాయం ఉంది?
జ: రామ మందిరం మాకు ఎప్పుడూ రాజకీయ అంశం కాదు, అది మా విశ్వాసాన్ని సూచిస్తుంది. దీనిని రాజకీయ కోణంలో చూడకూడదు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, అధికరణం 370 రద్దు ద్వారా కాంగ్రెస్ చేసిన భారీ తప్పిదాలను మేం సరిదిద్దాం. ప్రజలు దానిని అభినందిస్తున్నారు.
ప్ర: మీరు దక్షిణ భారతదేశం లో భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. దక్షిణ భారత రాష్ట్రాలలో బిజెపి అత్యధిక సీట్లు సాధిస్తుందని మీరు అంటున్నారు.
జ: కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో బిజెపి అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని నేను పునరుద్ఘాటిస్తున్నాను. బిజెపి దక్షిణ భారతదేశంలో బాగా విస్తరిస్తోంది, ఎందుకంటే భాషతో, భావజాలంతో సంబంధం లేకుండా అక్కడి ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు.
ప్ర: ఈ నమ్మకానికి ఆధారం ఏమిటి? మిమ్మల్ని ఇప్పటికీ ‘హిందీ, హిందూ, హిందుస్థాన్’ పార్టీగా ప్రజలు చూస్తున్నారు. దక్షిణ భారత ప్రజల మనోభావాలను, అక్కడి రాజకీయాల్లో సంక్లిష్టతలను మీరు అర్థం చేసుకున్నట్లు లేదు.
జ: బిజెపికి దక్షిణాది అర్థం కాదనే వారు బహుశా మమల్ని అర్థం చేసుకోలేదు. మేం భారత్ కోసం జీవించే వ్యక్తులం. మేం భారత్ గురించి మాట్లాడేటప్పుడు దక్షిణం కూడా దానిలో భాగం కాదా? మేం భారతీయ సంస్కృతి గురించి మాట్లాడేటప్పుడు, దక్షిణాది, అన్ని ఇతర ప్రాంతాల సంస్కృతీసంప్రదాయాల పట్ల మాకున్న గౌరవాన్ని కూడా వ్యక్తీకరిస్తాం.
ప్ర: గత ఐదేళ్లలో పార్లమెంట్‌లో వైఎస్ఆర్సీపి, బీజేడీలు మీకు మద్దతు ఇచ్చాయి, అయితే మీరు ప్రచారంలో వారిపై దూకుడుగా ఉన్నారు?
జ: వైఎస్సార్సీపీ, బీజేడీలు ఎప్పుడూ మా మిత్రపక్షాలు కాదు. వారు కొన్ని బిల్లుల విషయంలో మాకు మద్దతు ఇచ్చారు, కానీ వారు ఇతర బిల్లుల విషయంలో మమ్మల్ని వ్యతిరేకించారు కూడా. దేశ ప్రయోజనాల విషయంలో పార్టీలు ఒకదానికొకటి ఎందుకు మద్దతు ఇవ్వకూడదు? ప్రజల సమస్యల కోసం పార్టీలు కలిసి రాని పార్లమెంటు ఉపయోగం ఏమిటి? జాతీయ ప్రయోజనాల విషయంలో మేం కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాం, అంతమాత్రాన కాంగ్రెస్‌కు మేం మిత్రపక్షమా?
ప్ర: మీరు సందేశ్‌ఖలీ (పశ్చిమ బెంగాల్) గురించి మాట్లాడారు. కానీ చాలా మంది లైంగిక వేధింపుల బాధితులు తమ ఆరోపణలపై వెనక్కి తగ్గారు. తాము అబద్ధాలు చెప్పామని అన్నారు…
జ: ఇది బెంగాల్‌లో సంప్రదాయంగా మారింది. అఘాయిత్యాలకు పాల్పడటం, ఆపై బాధితుల చేత బలవంతంగా ఆరోపణలు ఉపసంహరింపజేయడం మామూలైపోయింది. దీనివల్ల బాధితులు రెండుసార్లు అఘాయిత్యాలకు, అన్యాయానికి గురవుతున్నారు. నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, భోజనం చేయడానికి ఒక ఇంటికి వెళ్లాను . దానికి ఆ కుటుంబం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. కుటుంబంలోని ఒక వ్యక్తిని ఉరివేసి చంపారు. ఇది ప్రజాస్వామ్య రాజకీయమా? కానీ ప్రజలు సహనం కోల్పోయినప్పుడు వారు తిరగబడతారు. ఈరోజు బిజెపి ఒక్కటే వారి పోరాటానికి అండగా నిలుస్తోంది.
ప్ర: కొన్ని రోజుల క్రితం దిల్లీ ముఖ్యమంతి కేజ్రీవాల్ 2025 సెప్టెంబరులో మీరు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారని, అప్పటికి మోదీకి 75 ఏళ్లు నిండుతాయని చెప్పారు ?
జ: ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే తెంపరి ప్రయత్నం… మోదీజీ తన మూడో పదవీకాలాన్ని పూర్తి చేయడమే కాదు, ఆ తరువాత కూడా మమ్మల్ని నడిపిస్తూనే ఉంటారని నేను, మా పార్టీ అధ్యక్షుడు (జేపీ నడ్డా), రాజ్‌నాథ్ సింగ్ జీ స్పష్టం చేశాం.
ప్ర: అయితే పార్టీ 75 ఏళ్లను పదవీ విరమణ వయస్సుగా నిర్ణయించలేదా?
జ: దీన్ని ఒక నిర్దిష్ట పరిస్థితిలో వర్తింపజేశారు. మా పార్టీ నియమావళిలో అలాంటిదేమీ లేదు. ఈ ఎన్నికల్లో మా పార్టీ 75 ఏళ్లు పైబడిన అభ్యర్థులను కనీసం 10 మందిని నిలబెట్టింది. అంతే కాకుండా, మోదీ తన పదవీకాలాన్ని పూర్తి చేస్తారని, ఆ తర్వాత కూడా కొనసాగుతారని నేను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను.
ప్ర: మీరు శామ్ పిట్రోడా, మణిశంకర్ అయ్యర్‌లను కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి ఆయుధంగా ఉపయోగించారు. ఇది అన్యాయమని, వారిద్దరూ తమ వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే వ్యక్తం చేశారని, వారు పార్టీకి ప్రాతినిధ్యం వహించరని కాంగ్రెస్ అంటోంది?
జ: ఈ ఇద్దరు పెద్దమనుషులను కాంగ్రెస్ ఇన్నాళ్ళు గ్యారేజీలో ఉంచి ఇప్పుడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు బయటికి తెచ్చింది. ఎంత వివాదాస్పదమైనా తమ సొంత అభిప్రాయాలను కలిగి ఉండే హక్కు రాజకీయ పార్టీలకు ఉంది. కానీ వాటిని స్పష్టంగా బయటికి చెప్పే ధైర్యం వాటికి ఉండాలి. మేం మా వైఖరిని స్వేచ్ఛగా, ధైర్యంగా వ్యక్తపరుస్తాం. కాని వారు దొంగతనంగా ఆ పని చేస్తున్నారు . అయ్యర్, పిట్రోడా వారి రహస్య క్షిపణులు. వారి వంచనాత్మక రాజకీయాలకు ఆ ఇద్దరూ ఉపయోగపడుతున్నారు. కాంగ్రెస్ తమకు అనుకూలమైనప్పుడల్లా వారి వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చెప్పి వారిపై చర్యలు తీసుకున్నట్టు నాటకం ఆడుతుంది. అయ్యర్ ను ఎన్నిసార్లు ఇలా సస్పెండ్ చేసి మళ్ళీ ఎంతో ప్రేమగా పార్టీలోకి తీసుకున్నారో లెక్కేలేదు.
ప్రజల రూపురేఖల ఆధారంగా వారిని విభజించే పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. భారతదేశం కేవలం వివిధ జాతుల సముదాయం అని, ఏదో కారణం వల్ల వారంతా ఒక దేశంగా ఉన్నారని కాంగ్రెస్ నమ్ముతుంది. వేల సంవత్సరాలుగా మనల్ని ఒకటి చేసిన భావోద్వేగ, సాంస్కృతిక బంధాలను వారు గుర్తించరు, విలువనివ్వరు. మేం వైవిధ్యాన్ని గౌరవిస్తాం. ఈ దేశ నాగరికతాపరమైన ఐక్యత గురించి కూడా మాకు తెలుసు. అలాగే ఆక్రమిత కాశ్మీర్ పాకిస్థాన్‌లో భాగమన్న కాంగ్రెస్ అభిప్రాయాన్ని మాత్రమే అయ్యర్ స్పష్టం వ్యక్తీకరించారు. వారికి పాకిస్థాన్ అంటే భయం.
ప్ర: రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్‌లను రద్దు చేసేందుకు భారీ (సూపర్) మెజారిటీ సాధించడమే ఈ ‘400 కి పైగా సీట్ల’ లక్ష్యం వెనుక రహస్య ఎజెండా అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి?
జ: ఇంతకంటే హాస్యాస్పదమైనది మరొకటి లేదు. గత 10 సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని మార్చడానికి మాకు అవసరమైన బలం ఉంది. మేం మా హామీలైన అధికరణం 370 రద్దు, సిఏఏ, యుసిసి, ట్రిపుల్ తలాక్ అమలు చేశాం. ఆర్థిక సంస్కరణలు, సమూల మార్పుల కోసం చట్టాలను తెచ్చాం. రిజర్వేషన్ల రద్దు మా ఎజెండాలో ఉంటే, మేం ఇప్పుడు అదే బలాన్ని ఉపయోగించి ఆ పని చేసి ఉండేవాళ్లం. రాజ్యాంగ సవరణకు 400 సీట్లు అవసరం లేదు. మాది రహస్య ఎజెండా ఉన్న పార్టీ కాదు. ప్రతిపక్షం అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టిస్తోంది. దీనికి భిన్నంగా మత ఆధారిత రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారు తద్వారా ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలకు అన్యాయం చేస్తూ వారి సదుపాయాన్ని ముస్లింలకు మళ్లిస్తున్నారు.
ప్ర: మీరు బిజెపికి నిధులు సేకరించేందుకు ఎన్నికల బాండ్‌లను దుర్వినియోగం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తం పథకం మీ పార్టీకి డబ్బు వసూలు చేయడానికి రూపొందించారంటున్నారు. సుప్రీంకోర్టు బాండ్ల పథకాన్ని రద్దు చేసిన తర్వాత, ఎన్నికల్లో నల్లధనం వాడకాన్ని అరికట్టేందుకు ఇది తొలి అడుగు అని మీరు చెప్పారు. మీ మూడవ పదవీకాలంలో మెరుగైన ఎన్నికల బాండ్ల పథకాన్ని ఆశించవచ్చా?
జ: మీరు సగం ఆరోపణలను మాత్రమే ఇక్కడ ప్రస్తావించారు. నిజానికి బాండ్లను ‘ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం’ అని రాహుల్ గాంధీ వర్ణించారు. నేను దీనికి సమాధానం ఇస్తాను. బాండ్ల ద్వారా మాకు రూ 6,000 కోట్లు, కాంగ్రెస్‌కు రూ 1,400 కోట్లు వచ్చాయి. అంటే కాంగ్రెస్ 1,400 కోట్లు దోచుకున్నట్టు ఒప్పుకొంటుందా? ఇందీ కూటమి పార్టీలు ఈ పథకం ద్వారా రూ.6,400 కోట్లు పొందాయి. ఇది బిజెపికి వచ్చిన దానికంటే ఎక్కువ. వారు కూడా దోపిడీకి పాల్పడినట్టే కాదా? ఇప్పుడు శాతం పరంగా చూస్తే… 383 ఎంపీలు ఉన్న బిజెపికి 78 ఎంపీలున్న కాంగ్రెస్ కంటే తక్కువ వచ్చింది. ఆ లెక్కన చూస్తే వారికి రూ.9,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.
రాహుల్ గాంధీ తర్కాన్ని మనం అంగీకరిస్తే, పెద్ద ‘దోపిడీదారు’ ఎవరు? అయన ఉపయోగించే భాష చూడండి, ఎంతైనా ఈ పథకాన్ని పార్లమెంటు ఆమోదించింది. ఇప్పుడు రెండవ భాగానికి వద్దాం. సుప్రీంకోర్టు తన విజ్ఞతతో దానిని రద్దు చేసింది. అయితే ఎన్నికలలో నల్లధనం పాత్రను అరికట్టడానికి మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. బిజెపి విషయమే తీసుకోండి. బాండ్‌లకు ముందు మాకు 80 శాతానికి పైగా విరాళాలు నగదు రూపంలో అందేవి. బాండ్ల పథకం ప్రారంభించిన తర్వాత నగదు విరాళాలు 4 శాతానికి తగ్గాయి. రాజకీయ విరాళాల్లో 90 శాతం నగదు రూపంలోనే ఉంటాయనేది బహిరంగ రహస్యం. ఈ విషయంలో బాండ్లు చాలా కీలకమైన సంస్కరణ. నిజమే, ఎవరు ఎవరికి విరాళం ఇచ్చారో ఎవరికీ తెలియదు. కానీ ఈ గోప్యత ఎందుకంటే మనకు వేర్వేరు రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఒక పార్టీకి సహాయం చేస్తే వేరే పార్టీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తలు అవసరం. ఇలా ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలో తెలుసుకోడానికే ప్రతిపక్షాలు నగదు రూపంలో విరాళాలు ఉండాలని పట్టుబడుతున్నాయి.
ప్ర: మీరు మీ మూడోసారి అధికారంలోకి వస్తే కొత్త పథకం తీసుకొస్తామని సూచిస్తున్నారా?
జ: నేను చెప్పేదేమిటంటే ఇది రాజకీయ పార్టీలు, పౌర సమాజం వంటి భాగస్వాములందరూ సుదీర్ఘంగా చర్చించాల్సిన సున్నితమైన అంశం. మన రాజకీయ ప్రక్రియ లో నల్లధనం ప్రవేశించకుండా ఒక మార్గాన్ని కనుక్కోవాలి.
ప్ర: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ వీడియోను మర్చి పెద్ద తప్పు చేశారని మీరు అన్నారు. మీరు ‘నన్ను కదిపి చాలా తప్పు చేశావ్’ అని బహిరంగ ర్యాలీలో హెచ్చరించారు?
జ: నేను చట్టపరంగా తీసుకోవలసిన చర్యలు తీసుకుంటానని మాత్రమే చెప్పాను. నా వీడియోను, నా ప్రసంగాన్ని మార్చేసి, లేనిపోనివి ఆపాదిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు నాకు లేదా…? ఉందనే నేను అనుకుంటున్నాను.
ప్ర: డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి భారీ కార్యక్రమాలను ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు గాని అవి పెద్దగా ఏమీ సాధించలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి ?
జ: వారి పక్షపాత దృష్టి, అబద్ధాలు వారి కళ్ళకు గంతలై వాస్తవాలను చూడనివ్వడం లేదు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల విజయాన్ని ప్రపంచమంతా గుర్తించింది. 2023లో దేశంలో రూ.166 లక్షల కోట్ల విలువైన 10,300 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. ప్రపంచంలోని మొత్తం డిజిటల్ లావాదేవీలలో 46 శాతానికి పైగా భారతదేశంలోనే జరుగుతున్నాయి. యుపిఐని ఇప్పుడు ప్రపంచంలోని ఏడు దేశాలు ఆమోదించాయి. అవి ఫ్రాన్స్, భూటాన్, ఒమన్, యూఏఈ, సింగపూర్, శ్రీలంక, మారిషస్. అదేవిధంగా, భారత్ నెట్ కార్యక్రమంలో భాగంగా 2,74,246 కిమీ పొడవైన ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ 1.15 లక్షల గ్రామ పంచాయతీలను అనుసంధానించింది. 2014లో భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చేందుకు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రెట్టింపయ్యాయి. మేం 14 రంగాలలో ఉత్పత్తి-అనుసంధానిత ప్రోత్సాహకాల (పిఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టాం. ఫలితంగా కొత్త ఉద్యోగాలు, భారతదేశం తుది ఉత్పత్తుల ఎగుమతిదారుగా మారింది.
నాగార్జున