ప్రతి బిజెపి కార్యకర్తా లక్షల అభినందనలకు అర్హుడు
ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4న బిజెపి కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోది చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు
వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వానికి స్పష్టమైన మద్దతు లభించిన సందర్భంగా, దేశ ప్రజలందరికీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నా అభినందననాలు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, బిజెపిలను భారీ మెజారిటీతో గెలిపించినందుకు, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు ఘనవిజయాన్ని అందించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు. దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజలు తమ తీర్పు ఇచ్చారు.
ప్రజల ఈ ఆప్యాయత, ప్రేమ, ఆశీర్వాదాలకు నేను దేశ ప్రజలందరికీ రుణపడి ఉంటాను. ఈరోజు చాలా ప్రాధాన్యం గల మంగళవారం. ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. దేశ ప్రజలు బిజెపి, ఎన్డీయేలపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నేటి విజయం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య విజయం. ఈ విజయం భారత రాజ్యాంగం పట్ల అచంచలమైన విధేయత, అభివృద్ధి చెందిన భారతదేశం సంకల్పం, సబ్కా సాథ్ సబ్కా వికాస్ మంత్రం, 140 కోట్ల భారతీయుల విజయం.
దాదాపు 100 కోట్ల మంది ఓటర్లు, 11 లక్షల పోలింగ్ స్టేషన్లు, 1.5 కోట్ల మంది పోలింగ్ సిబ్బంది, 55 లక్షల ఓటింగ్ యంత్రాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సంఘం సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించింది. భారతదేశ ఎన్నికల ప్రక్రియ, ఈ ఎన్నికల సాధికారత గురించి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు. భారత్ లోని ప్రభావశీలులైన వ్యక్తులు, అభిప్రాయ రూపకర్తలు భారతదేశ ప్రజాస్వామ్యపు ఈ పాటవాన్ని ప్రపంచం మొత్తానికి గర్వంగా తెలియజేయాలి. జమ్మూ కాశ్మీర్ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటింగ్ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా అమిత ఉత్సాహాన్ని కనబరిచారు. ప్రపంచంలో భారతదేశ ఎన్నికల ప్రక్రియ పరువు తీస్తున్న వారికి గుణపాఠం నేర్పారు.
ఈ పవిత్ర విజయోత్సవం సందర్భంగా దేశంలోని ఓటర్లకు, ప్రజలకు గౌరవపూర్వకంగా వందనం చేస్తున్నాను. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు, అభ్యర్థులకు అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొననిదే ప్రజాస్వామ్యం సాధించిన ఈ భారీ విజయం సాధ్యం కాదు. బిజెపి, ఎన్డీయేలోని ప్రతి కార్యకర్తకు, మిత్రపక్షానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి సొంతంగా గెలిచినన్ని సీట్లను బిజెపి ప్రత్యర్థులు ఏకమైనా గెలవలేదు. 1962 తర్వాత తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం రెండు పదవీకాలాలు పూర్తి చేసుకుని మూడోసారి అధికారంలోకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించి కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఒడిశాలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మహాప్రభువు జగన్నాథుడి నేలపై బిజెపి అధికారం చేపట్టడం ఇదే మొదటిసారి. కేరళలోనూ బిజెపి సీట్లు గెలుచుకుంది. కేరళ బిజెపి కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారు. అనేక తరాలుగా పోరాటం కొనసాగించారు. సామాన్య ప్రజలకు కూడా సేవ చేశారు. తరతరాలుగా వారు ఎదురుచూస్తున్న తరుణం నేడు వచ్చింది. తెలంగాణలో బిజెపి సీట్ల సంఖ్య రెట్టింపు అయింది.
మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, దిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ వంటి పలు రాష్ట్రాల్లో బిజెపి దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ఈ రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీల ఓటర్లకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో, నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్‌లో ఎన్డీయే అద్భుత విజయాలు సాధించింది. ఈ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది.
పదేళ్ళ క్రితం దేశం మార్పు కోసం తీర్పు ఇచ్చినప్పుడు, దేశం నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయి ఉంది. ప్రతి రోజు వార్తాపత్రికల్లో మోసాలు, కుంభకోణాల వార్తలు పతాక శీర్షికలుగా ఉండేవి. దేశంలోని యువతరం దాని భవిష్యత్తు గురించి భయపడుతూ ఉండింది. అలాంటి సమయంలో నిరాశ అనే లోతైన సముద్రం నుంచి ఆశల ముత్యాన్ని బయటకు తీసే బాధ్యతను దేశం మాకు అప్పగించింది. మేమంతా పూర్తి నిజాయితీతో పని చేశాం.
2019లో ఈ ప్రయత్నంపైనా, మా పనిపైనా విశ్వాసం వ్యక్తం చేస్తూ దేశం మళ్లీ ఎన్డీయేకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఎన్డీయే రెండోసారి అభివృద్ధికి, విధానాల కొనసాగింపునకు భరోసాగా నిలిచింది. 2024లో ఈ హామీతో దేశంలోని ప్రతి మూలకు వెళ్లి ప్రజల మన్ననలు పొందాం. ఈరోజు మూడోసారి ఎన్డీయేకు అందించిన ఆశీర్వాదాలకు గాను నేను ప్రజల ముందు వినమ్రంగా నమస్కరిస్తున్నాను.
ఈ రోజు నాకు కూడా ఒక భావోద్వేగభరిత క్షణం. మా అమ్మ మరణం తర్వాత ఇవి నా మొదటి ఎన్నికలు, కానీ దేశంలోని లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు నాకు నా తల్లిలేని లోటు తెలియనివ్వలేదు. దేశ చరిత్రలో మహిళల ఓటింగ్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఈ ప్రేమను మాటల్లో చెప్పలేను. గత పదేళ్లలో దేశం చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంది. దేశం స్ఫూర్తి మొదట మనకు అసాధారణ లక్ష్యాలను సాధించడానికి ధైర్యాన్ని ఇస్తుంది. ఏదైనా చేయాలనే సంకల్పాన్ని మనలో కల్పిస్తుంది.
మనం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేశాం. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తర్వాత 12 కోట్ల మందికి నల్లా నీరు, 4 కోట్ల మంది పేదలకు శాశ్వత ఇళ్లు, 80 కోట్ల మంది నిరుపేదలకు ఉచిత రేషన్, కోట్ల మంది పేదలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్యం కల్పించాం. జమ్మూ కాశ్మీర్ కు అధికరణం 370 నుంచి విముక్తి కల్పించాం. జీఎస్టీ వంటి సంస్కరణలు చేశాం.
కరోనా సంక్షోభ సమయంలో కూడా బిజెపి జాతీయ ప్రయోజనం, ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంది. అన్ని ఒత్తిళ్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంది. ఫలితంగా నేడు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారింది. ‘దేశం ముందు’ అనే ఈ సూత్రం భారతదేశాన్ని స్వయం సమృద్ధం చేస్తుంది. దేశ ప్రజల శ్రమ, స్వేదం నిరంతరం పని చేసేందుకు నాకు స్ఫూర్తినిచ్చాయి. . ప్రజాప్రతినిధులు 10 గంటలు పని చేస్తే నేను 18 గంటలు పని చేస్తాను, ప్రజాప్రతినిధులు 2 అడుగులు పని చేస్తే నేను 4 అడుగులు వేస్తాను. భారతీయులమైన మనం కలిసి దేశాన్ని ముందుకు తీసుకువెళ్తాం.
సమాజంలోని ప్రతి రంగం మరియు ప్రతి వర్గాల అభివృద్ధికి ఎన్‌డిఎ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. గత 10 సంవత్సరాలలో ప్రభుత్వం 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి విముక్తం చేసింది. వారిలో అత్యధిక సంఖ్యాకులు వెనుకబడిన వర్గాల ప్రజలు, దళితులు, గిరిజనులు ఉన్నారు. పేదరికం అనేది గతంగా మారే వరకు మనం నిద్రపోం. ఎన్డీయే ప్రభుత్వ పాలనా నమూనాలో మహిళాకేంద్రిత అభివృద్ధి ప్రధాన అంశం. క్రీడల నుంచి అంతరిక్షం, వ్యాపార స్ఫూర్తి, ప్రతి రంగంలో తల్లులు, సోదరీమణులు, కుమార్తెలకు కొత్త అవకాశాలను అందించడానికి మేం కృషి చేస్తాం. గత 10 సంవత్సరాలలో వైద్య కళాశాలల సంఖ్య రెట్టింపయ్యింది. ఎయిమ్స్ ల సంఖ్య మూడింతలైంది. స్వయం ఉపాధి, స్టార్టప్‌లలో చారిత్రాత్మక పెరుగుదల నమోదైంది. భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఉత్పత్తిదారుగా అవతరించింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, ఇతర కొత్త రంగాలలో పని మరింత వేగంగా జరుగుతోంది.
దేశ రక్షణ ఉత్పత్తులను, ఎగుమతులను పెంచేందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నించింది. రక్షణ రంగంలో దేశం స్వావలంబన సాధించే వరకు విశ్రమించం. విద్య, ఉపాధి, స్వయం ఉపాధి ఇలా ప్రతి రంగంలో యువతకు సాధికారత కల్పిస్తాం. విత్తనం నుంచి మార్కెట్ వరకు వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించేందుకు ప్రాధాన్యం ఇస్తాం. పప్పు దినుసుల నుంచి వంట నూనెల వరకు అన్ని రంగాల్లో రైతులను స్వావలంబన కల్పించేందుకు కృషి చేస్తూనే ఉంటాం. రాబోయే కాలం హరిత యుగం. మన ప్రభుత్వ విధానాలు ప్రగతి, ప్రకృతి, సంస్కృతుల సమ్మేళనం. హరిత పారిశ్రామికీకరణపై పెట్టుబడులు పెంచుతాం. స్వచ్ఛ ఇంధనం, వాహనాలకు కాలుష్య రహిత ఇంధనం రంగాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా చేస్తాం. భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పని చేస్తుంది.
నేటి భారతదేశం కూడా ప్రపంచం గతిని నిర్దేశించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ప్రపంచాన్ని సంక్షోభం నుంచి రక్షించడంలో భారత్ వ్యాక్సిన్ సామర్థ్యం ఎలా సహాయపడిందో మనం కరోనా సమయంలో చూశాం. మన చంద్రయాన్ చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగడం ద్వారా అంతరిక్ష పరిశోధనలో కొత్త మార్గాలను ఆవిష్కరించింది. వాతావరణ మార్పు మొదలుకుని ఆహార భద్రత వరకు ప్రపంచంలోని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేయడాన్ని భారతదేశం తన బాధ్యతగా భావిస్తుంది.
ప్రపంచ సరఫరా వ్యవస్థకు స్థిరత్వాన్ని, వైవిధ్యాన్ని అందించడాన్ని కూడా భారత్ తన బాధ్యతగా కూడా భావిస్తుంది. అందుకే భారతదేశం అందరినీ విశ్వబంధువుగా ఆలింగనం చేసుకుంటోంది. బలమైన భారత్ బలమైన ప్రపంచానికి ఒక బలమైన స్తంభంగా నిలుస్తుంది. 21వ శతాబ్దంలో భారతదేశం ముందుకు సాగాలంటే అవినీతిపై భారత్ నిరంతరం దాడి చేయాల్సి ఉంటుంది. డిజిటల్ ఇండియా, టెక్నాలజీ అవినీతికి అనేక మార్గాలను మూసివేసాయి, అయితే అవినీతిపై పోరాటం రోజురోజుకు కఠినంగా మారుతోంది.
రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతిని కీర్తించడం ప్రారంభించి, నిస్సిగ్గు అన్ని హద్దులు దాటినప్పుడు అవినీతి చాలా బలోపేతం అవుతుంది. అందుకే ఎన్డీయే ప్రభుత్వం అన్నిరకాల అవినీతిని నిర్మూలించడంపై దృష్టి పెడుతుంది. ప్రతి బిజెపి కార్యకర్తకు పార్టీ కంటే దేశమే గొప్పది. బిజెపి కార్యకర్తలు ప్రజల ఆకాంక్షలు, మనోభావాలు, ప్రజల అంచనాలకు ప్రాతినిథ్యం వహిస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం మన లక్ష్యసాధనలో దృఢంగా ఉండేందుకు ఒక ప్రేరణ. మన లక్ష్యసాధనలో ముందుకెళ్తున్నప్పుడు, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తేనే లక్ష్యాన్ని సాధించగలుగుతాం. మన రాజ్యాంగం మనకు మార్గదర్శకం, ఈ ఏడాది రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో కలిసి పని చేసి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంగా కృషి ముందుకు సాగుతుంది. అభివృద్ధి చెందిన భారత్ కోసం, దేశ ఉజ్జ్వల భవిష్యత్తు కోసం మేం నిరంతరం అవసరమైన నిర్ణయాలు తీసుకుంటాం.
జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా నాయకత్వంలో కేంద్రం నుంచి బూత్ స్థాయి వరకు బిజెపి పార్టీ యంత్రాంగం అనేక సవాళ్ల మధ్య ధైర్యంగా, అంకితభావంతో ‘దేశం ముందు’ అనే ఆశయాన్ని గెలిపించి ఈ ఎన్నికల సమరంలో ఎన్డీయేకు విజయాన్ని అందించింది. పార్టీ కార్యకర్తల్లో ప్రతి ఒక్కరూ లక్షల అభినందనలకు అర్హులు. ఈ రోజు దేశ ప్రజలు నా పట్ల బిజెపి పట్ల, ఎన్డీయే పట్ల ఎంతో అభిమానాన్ని ప్రదర్శించారు. 140 కోట్ల మంది దేశ ప్రజలకు మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా ఎన్డీయే సహచరులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ దేశంలోని గొప్ప ప్రజాస్వామ్యానికి, గొప్ప రాజ్యాంగానికి గౌరవపూర్వకంగా అభివందనం చేస్తున్నాను.