gkr charges

ఉపాధి సృష్టిస్తాం… ప్రగతికి బాటలు వేస్తాం..

gkrకేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి జూన్ 13న దిల్లీలోని శాస్త్రి భవన్‌లోని బొగ్గు, గనుల కార్యాలయంలో క్యాబినెట్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు కార్యాలయంలో వేదపండితుల సమక్షంలో పూజలు చేశారు. కార్యక్రమంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి సతీశ్‌చంద్ర దూబే, కిషన్‌రెడ్డి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశంలోని ఖనిజాల తవ్వకాలను పెంచడం ద్వారా విస్తృత ఉపాధి అవకాశాలకు, ఎగుమతులు పెంచడం ద్వారా ప్రగతికి బాటలు వేస్తామని అన్నారు. బొగ్గుతో విద్యుత్తు, రైల్వే, గనులు, పర్యావరణశాఖలు ముడిపడి ఉన్నాయని, వాటన్నింటితో సమన్వయం చేసుకుంటూ ప్రధానమంత్రి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేస్తానని తెలిపారు. ‘ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద అయిదో ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం మూడో స్థానానికి చేరాలంటే విద్యుత్తు రంగం చాలా ముఖ్యం. పదేళ్ల క్రితం దేశంలో తీవ్ర విద్యుత్తు కొరత ఉండేది. ఆ సమయంలో పరిశ్రమలకు కేటాయించిన దాని కంటే ఎక్కువ విద్యుత్తు ఉపయోగిస్తే జరిమానా విధించేవారు. విద్యుత్తు కోసం పారిశ్రామికవేత్తలు రోడ్లమీదికి వచ్చిన సందర్భాలున్నాయి. విద్యుత్తు కొరత కారణంగా పంటలు ఎండిపోయి పెద్దసంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యుత్తు కోతలు లేని నూతన భారతాన్ని ఆవిష్కరించారు. అన్ని రాష్ట్రాలకూ అవసరమైన విద్యుత్తు అందుబాటులో ఉంటోంది. అందుకు ప్రధాన కారణం బొగ్గు ఉత్పత్తిని పెంచడమే. రానున్న రోజుల్లో విద్యుదుత్పత్తిని మరింత పెంచడం కోసం మోదీ ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోంది. ప్రస్తుతం దేశీయ అవసరాల కోసం.. ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో మన అవసరాలకు సరిపోయేంతగా బొగ్గును ఉత్పత్తి చేస్తాం’ అని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ‘‘దేశంలో ఉన్న ఖనిజాలను బయటకు తీయడం, ఉపాధి అవకాశాలను పెంచడం, భారత్​ ఖనిజాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తాం. శక్తివంతమైన భారత్​ ను రూపొందించడంలో బొగ్గు, మైనింగ్​ శాఖల పాత్ర కీలకం. దాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తాను. ఈ శాఖల్లో చాలా సీనియర్​, ఉత్తమ అధికారులు ఉన్నారు. వారందరితో కలిసి టీమ్​ వర్క్​ తో  పనిచేసి భారత్​ ను అగ్రపథంలో నడిపించేందుకు క్రమశిక్షణతో, చిత్తశుద్ధితో పని చేస్తాను.’’ అని ఆయన అన్నారు. bsk

నిరాడంబరంగా బండి బాధ్యతలు

కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బండి సంజయ్‌ కుమార్ జూన్ 13న దిల్లీ నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. భద్రతా కారణాల రీత్యా అత్యంత నిరాడంబరంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ సమక్షంలో ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్, కార్యదర్శి అజయ్‌భల్లా కూడా పాల్గొన్నారు. తర్వాత సంజయ్‌.. కిషన్‌రెడ్డి దగ్గరకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన బిజెపి కార్యకర్తలు, నాయకులు ఇద్దరు మంత్రులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.