ఆ ఊరికి మొదటిసారిగా బస్సు
మే 25న ప్రసారమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) ప్రసంగంలోని ముఖ్యాంశాలు
ఒక గ్రామం, అక్కడికి మొదటిసారిగా ఒక బస్సు చేరుకుంది. ఈ రోజు కోసం అక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఊళ్ళోకి మొదటిసారి బస్సు చేరుకున్నప్పుడు డప్పులతో స్వాగతం పలికారు. బస్సును చూసిన ప్రజల ఆనందానికి అవధులు లేవు. గ్రామంలో పక్కా రోడ్డు ఉంది. కానీ ఇంతకుముందు అక్కడ బస్సు ఎప్పుడూ నడవలేదు. ఎందుకంటే ఈ గ్రామం మావోయిస్టు హింసతో ప్రభావితమైంది. అది మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఉంది. ఆ గ్రామం పేరు కాటేఝరి. ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు వేగంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. మావోయిజానికి వ్యతిరేకంగా సామూహిక పోరాటం ద్వారా ఇప్పుడు ఇలాంటి ప్రాంతాలకు కూడా ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. బస్సు రాకతో తమ జీవితం చాలా సులభతరం అవుతుందని గ్రామస్థులు చెప్తున్నారు.
కేవలం గత ఐదు సంవత్సరాలలో గుజరాత్ లోని గిర్‌లో సింహాల సంఖ్య 674 నుండి 891కి పెరిగింది. గిర్‌లో సింహాల జనాభా లెక్క 11 జిల్లాల్లో 35 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో జరిగింది. జనాభా లెక్కల కోసం బృందాలు ఇరవై నాలుగు గంటలూ ఈ ప్రాంతాలను పర్యవేక్షించాయి. ఈ మొత్తం ఆపరేషన్‌లో ధృవీకరణ, క్రాస్ వెరిఫికేషన్ రెండూ జరిగాయి. దీని ద్వారా సింహాల లెక్కింపు పని పూర్తయింది. కొన్ని దశాబ్దాల క్రితం గిర్‌లో పరిస్థితులు చాలా సవాళ్ళతో ఉండేవి. కానీ అక్కడి ప్రజలు సామూహికంగా మార్పును తీసుకురావడానికి కృషి చేశారు. అక్కడ నూతన సాంకేతికత, ప్రపంచ స్థాయి అత్యుత్తమ ఆచరణలు రెండూ అమలయ్యాయి.
క్రాఫ్టెడ్ ఫైబర్స్ కేవలం ఒక బ్రాండ్ కాదు, అది సిక్కిం సంప్రదాయం, నేత కళ, నేటి ఫ్యాషన్ ఆలోచన – మూడింటి కలయిక. దీన్ని డాక్టర్ చెవాంగ్ నోర్బు భూటియా ప్రారంభించారు. సిక్కిం సంస్కృతికి నిజమైన బ్రాండ్ అంబాసిడర్. సంప్రదాయ నేతను ఆధునిక ఫ్యాషన్‌తో కలిపి దీనిని ఒక సామాజిక సంస్థగా మార్చారు. వారు స్థానిక ప్రజలకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. స్వయం సమృద్ధి పొందేలా చేస్తారు. క్రాఫ్టెడ్ ఫైబర్స్ తో చేసే శాలువలు, స్కార్ఫ్, చేతి తొడుగులు, సాక్సులు- అన్నీ స్థానిక హస్తకళతో తయారవుతాయి. ఇందులో ఉపయోగించే ఉన్ని సిక్కింలోని కుందేళ్ళు, గొర్రెల నుండి వస్తుంది. రంగులు కూడా పూర్తిగా సహజమైనవి. డాక్టర్ భూటియా సిక్కిం సంప్రదాయ నేతకు, సంస్కృతికి ఒక కొత్త గుర్తింపును ఇచ్చారు.
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో కొంతకాలం కిందటి వరకు ఇతరులపై ఆధారపడ్డ మహిళలు ఇప్పుడు స్వయంగా డ్రోన్ ద్వారా 50 ఎకరాల భూమిలో మందుల పిచికారీ పనిని పూర్తి చేస్తున్నారు. ఉదయం మూడు గంటలు, సాయంత్రం రెండు గంటలు పని చేస్తున్నారు. అంతే.. పని పూర్తయి పోతుంది. ఎండ వేడి లేదు, విషపూరిత రసాయనాల ప్రమాదం లేదు. గ్రామస్తులు కూడా ఈ మార్పును మనస్ఫూర్తిగా అంగీకరించారు. ఇప్పుడు ఈ మహిళలు ‘డ్రోన్ ఆపరేటర్లు’గా కాదు, ‘స్కై వారియర్స్’గా గుర్తింపు పొందారు. సాంకేతికత, సంకల్పం కలిసి నడిచినప్పుడు మార్పు వస్తుందని ఈ మహిళలు నిరూపిస్తున్నారు.
ఇప్పుడు కొన్ని పాఠశాలల్లో ‘చక్కెర బోర్డులు’ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక ప్రత్యేకమైన ప్రయత్నం. ఎంత చక్కెర తీసుకోవాలి, ఎంత చక్కెర తింటున్నారు అనే విషయాలు తెలుసుకుని పిల్లలు స్వయంగా ఆరోగ్యకరమైన ఎంపికలను ఎంచుకోవడం ప్రారంభించారు. బాల్యం నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను అలవర్చుకోవడంలో ఇది చాలా సహాయకరంగా ఉంటుంది. ఇలాంటి చొరవ కార్యాలయాలు, క్యాంటీన్లు, సంస్థలలో కూడా ఉండాలని నా అభిప్రాయం. ఆరోగ్యం బాగుంటే అన్నీ ఉంటాయి.
గత 11 సంవత్సరాలలో తేనెటీగల పెంపకంలో భారతదేశంలో ఒక తీపి విప్లవం జరిగింది. నేటి నుండి 10-11 సంవత్సరాల కిందట భారతదేశంలో తేనె ఉత్పత్తి సంవత్సరానికి దాదాపు 70-75 వేల మెట్రిక్ టన్నులు ఉండేది. నేడు ఇది దాదాపు లక్షంబావు మెట్రిక్ టన్నులకు పెరిగింది. అంటే తేనె ఉత్పత్తిలో దాదాపు 60% పెరుగుదల ఉంది. తేనె ఉత్పత్తి, ఎగుమతిలో మనం ప్రపంచంలోని ప్రముఖ దేశాల్లో ఒకటిగా నిలిచాం.

