Amit Shah Road Show Hyderabad

అమిత్ షా రోడ్ షో: జనసంద్రంగా పాతనగరం

Amit Shah Madhavilathaకేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో సందర్భంగా పాతనగరం జనసంద్రంగా మారింది. ఎంఐఎం ఇలాకా అని చెప్పుకునే ఆ ప్రాంతమంతా కాషాయమయంగా మారింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన బిజెపి కార్యకర్తలు, నాయకుల భారత్ మాతా కీ జై, మోదీ మోదీ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ ప్రచారంలో పాల్గొన్న  అమిత్ షా మే 1న పాతనగరంలోని రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లాల్‌దర్వాజ అమ్మవారి ఆలయం నుంచి సుధా టాకీస్‌ మీదుగా25 నిమిషాల పాటు సాగింది. మహిళలు బోనాలతో అమిత్ షాకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ రజాకార్ల వారసుల నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పించాలని ప్రజలను కోరారు. గత 40 ఏళ్లుగా రజాకార్ల వారసులు హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఈసారి హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి బిజెపి తరఫున పోటీ చేస్తున్న మాధవీలతకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో బిజెపి గెలిచే 400 ఎంపీ సీట్లలో హైదరాబాద్‌ ఉండాలన్నారు. హైదరాబాద్‌ ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని, ఎవరి మీదా ఎలాంటి దాడులు జరగవని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాన్ని జనజీవన స్రవంతిలో కలపాలన్నారు. హిందువులు, ముస్లింలతో పాటు అందరూ కలిసి కమలం గుర్తుకు ఓటేసి మోదీకి మద్దతుగా నిలబడాలన్నారు. ఉజ్జయిని మహాకాళి, భాగ్యలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో కమలం పువ్వు వికసించేలా చేస్తామని అభ్యర్థి మాధవీలత అన్నారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయని, అవి ఆగాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలన్నారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌ పాల్గొన్నారు.